ఈ మధ్యకాలంలో వాట్స్ యాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ చెయ్యబడుతున్నదే ఈ క్రింది పోస్టు. చివర్లో “వాళ్ళ చేత వేటు వేయించుకోవటానికి ఎదురు చూస్తున్న సెక్యులర్ గొర్రెల్లారా మీ లాంటి వారి వల్లే దేశం ధర్మమేమవుతుందో కళ్ళు తెరవండ్రా” అని రాయటాన్ని బట్టి ఇదొక మతోన్మాద తీవ్రవాద గ్రూపు ద్వారా సామాన్య హిందూ ప్రజానీకాన్ని ముస్లిములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి సోదరభావాన్ని దెబ్బ తీయటానికి తయారు చెయ్యబడిన చిల్లర రాతలతో నిండిన పోస్టని ఇట్టే అర్థమైపోతుంది. దాని కోసం ఖురాన్ వాక్యాల సందర్భాన్ని తప్పించి వారు ఎంతగా వక్రీకరించారో ఒకసారి ఈ క్రింది గమనించగలరు.
****
ఖురాన్ 2:191 – “అల్లాహ్ ను నమ్మనివారిని కనిపించిన చోటనే నరికి చంపండి”
ఇది మరీ దారుణమైన వక్రీకరణ. నిజానికి ఖురాన్ 2:191 లో అలా రాయబడి లేదు. కేవలం మీతో పోరాడే దౌర్జన్యపరులతో పోరాడమని ఉంది. తప్పితే “అల్లాహ్ ను నమ్మనివారిని కనిపించిన చోటనే నరికి చంపండి” అన్నది కేవలం కల్పితం. గమనించండి.
ఖురాన్ 2:190-91 – “మీతో పోరాడేవారితో మీరూ అల్లాహ్ మార్గంలో పోరాడండి. కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించేవారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరూ వారితో పోరాడండి”
దీని తరువాతి వాక్యంలోనే “మీతో వారు యుద్ధం చెయ్యానంతవరకూ మీరూ వారితో యుద్ధం చెయ్యకండి” అని ఆదేశం కూడా ఉంది.
****
ఖురాన్ 3:28 – “ముస్లిములు ముస్లిములు కానివారితో స్నేహం
చేయరాదు”
ఇది కూడా పూర్తిగా కల్పితం. నిజానికి ఖురాన్ 3:28 లో అలా రాయబడి లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 3:28 – “విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, సహాయకులుగా ఎంత మాత్రం ఎన్నుకోరాదు”
ఆనాడు మక్కాలో కొందరు ధర్మ వ్యతిరేకులు విశ్వాసులకు వ్యతిరేకంగా వెన్నుపోటు పొడవటానికి శత్రువులతో కలిసి కుట్రలు పన్నేవారు. ఇది ఆ నేపథ్యంలో అవతరించిన వాక్యం. తప్పితే “ముస్లిములు ముస్లిములు కానివారితో స్నేహం చేయరాదు” అని ఖురాన్ ఎక్కడా చెప్పటం లేదు.
****
ఖురాన్ 3:85 – “ఇస్లాం తప్ప ఇంకే మతమూ ఒప్పుకొనబడదు”
ఇది కూడా పూర్తిగా వక్రీకరించబడింది. నిజానికి ఖురాన్ 3:85 లో అలా రాయబడి లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 3:85 – “ఎవరైనా ఈ దైవ విధేయతా విధానాన్ని కాక మరొక మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించబడదు”
నిజానికి ఖురాన్ “ముస్లిములైనా, యూదులైనా, క్రైస్తవులైనా లేక ఏ మతానికి చెందిన వారినా సృష్టికర్త అయిన దేవుణ్ణి, అంతిమ దినాన్ని విశ్వసించి, మంచి పనులు చేసే వారికి దేవుని వద్ద గొప్ప ప్రతిఫలముందని” ప్రకటిస్తుంది.
****
ఖురాన్ 5:33 – “ఇస్లాంను విమర్శించేవారిని వికలాంగులను చేసి వేలాడదీయండి”
ఇది సైతం పూర్తిగా కల్పితం. నిజానికి ఖురాన్ 5:33 లో అలా రాయబడి లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 5:33 – “అల్లాహ్ తో, ఆయన ప్రవక్తతో పోరాడేవారికి, ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే వారిని చంపటం లేదా శిలువపై ఎక్కించటం లేదా కాళ్లూ, చేతులను అభిముఖ దిశలో ఖండించటం లేదా దేశం నుండి బహిష్కరించటం”
శాంతి భద్రతలతో నడుపబడుతున్న ‘ప్రజాస్వామ్య ప్రభుత్వం’ పై తిరుగుబాటు చేస్తూ, కల్లోలాన్ని సృష్టిస్తూ ప్రజలపై దౌర్జన్యం చేసే దుర్మార్గులకు విధించబడే శిక్షను ఈ వాక్యం వివరిస్తుంది. అలా చెయ్యటం ఏ దేశం చట్టం ప్రకారమైన ఘోర నేరమే. దానికి విధించే శిక్ష కఠినంగానే ఉంటుంది.
****
ఖురాన్ 8:12 – “ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మేవారిని భయభ్రాంతులను చేసి వారి తలలు తీయండి”
ఇది కూడా పూర్తిగా కల్పితం. నిజానికి ఖురాన్ 8:12 లో అసలు అలా రాయబడి లేనే లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 8:12 – “నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసులకు ధైర్య స్థైర్యాలను కలిగించండి. నేను ఈ దౌర్జన్యపరుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను. కనుక మీరు వారి మెడలపై, కీలులపై కొట్టండి”
ఇది “బద్ర్” అనే సంగ్రామంలో విశ్వాసులపై దౌర్జన్యానికి దిగిన దౌర్జన్యపరుల విషయంలో చెప్పబడిన విషయం.
****
ఖురాన్ 8:60 – “అల్లాహ్ ను నమ్మనివారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లిములు ఉన్న అన్ని ఆయుధాలు వాడాలి”
ఇది కూడా పూర్తిగా కల్పితం. నిజానికి ఖురాన్ 8:60 లో అసలు అలా రాయబడి లేనే లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 8:60 – “మీరు దౌర్జన్యపరులను ఎదుర్కోవటానికి సాయశక్తులా బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టి ఉంచిన గుర్రాల ద్వారా సన్నద్ధులుగా ఉండండి”
ఇది అప్పటి బద్ర్ అనే ప్రాంతంలో దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిని ఎదుర్కోవటానికి విశ్వాసులకు ఇవ్వబడిన ఆదేశం.
****
ఖురాన్ 8:65 – “అల్లాహ్ ను నమ్మనివారు మూర్ఖులు. ముస్లిం లు వారితో పోరాడాలి”
ఇది కూడా పూర్తిగా కల్పితం. నిజానికి ఖురాన్ 8:65 లో అసలు అలా రాయబడి లేనే లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 8:65 – “ఓ ప్రవక్తా! విశ్వాసులను (దౌర్జన్య పరులకు వ్యతిరేకంగా) యుద్ధానికి సిద్ధపరచు”
ఇది సైతం బద్ర్ సంగ్రామంలో దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమన్న ఆదేశమే తప్ప “అల్లాహ్ ను నమ్మని ప్రతీ ఒక్కరితో ముస్లింలు పోరాడాలని” ఖురాన్ ఎక్కడా చెప్పటం లేదు.
****
ఖురాన్ 9:5 – “అవకాశం దొరకగానే అల్లాహ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి”
ఇది మరీ దారుణమైన వక్రీకరణ. నిజానికి ఈ వాక్యం దైవధర్మాన్ని తుడిచిపెట్టి, సామాన్య విశ్వాసులను చంపటానికి, శాంతి భద్రతలతో నడపబడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న అప్పటి దౌర్జన్యపరుల విషయంలో ఇవ్వబడిన ఆదేశం. ఆ విషయం ఖురాన్ 9:4 నుండి 5 వాక్యం వరకు చదివితే తెలుస్తుంది. గమనించండి.
ఖురాన్ 9:4-5 – “అయితే మీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చటం లేక మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయటం వంటి పనులు చేయని బహుదైవోపాసకులను మినహాయించి (దుర్మాగానికి పాల్పడే బహుదైవోపాసకులను) నిషిద్ధ మాసాలు గడచిపోయిన తరువాత ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి, ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి”
అని చెప్పబడింది. ఇది పూర్తిగా శాంతి భద్రతలకు భంగం కలిగించే తిరుగుబాటుదార్ల విషయంలో ఇవ్వబడిన ఆదేశం.
****
ఖురాన్ 9:30 – “యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు. వారితో పోరాడండి”
ఇది కూడా పూర్తిగా కల్పితం. నిజానికి ఖురాన్ 9:30 లో అసలు అలా రాయబడి లేనే లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 9:30 – “గ్రంథ ప్రజలలో అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించనివారును, అల్లాహ్, ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించని వారును, ఇంకా సత్య ధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోని వారునూ అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి”
మెజారిటీ ప్రజల ఆమోదంతో ఏర్పడిన ఒక అధికార వ్యవస్థకు ప్రజలంతా కట్టుబడి శాంతియుతంగా ఉండాల్సిందే. కానీ, అప్పటి యూదులు, క్రైస్తవుల్లో కొందరు దుర్మార్గులు దేన్నైతే చట్టం విధి-నిషేధాలు విధించిందో దాన్ని అతిక్రమించి తిరుగుబాటు చేసేవారు. అలాంటి వారి కోసం చెప్పబడిందే ఈ వాక్యం.
****
ఖురాన్ 9:123 – “మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసులతో యుద్ధం చెయ్యండి”
ఇది మరీ ఘోరమైన వక్రీకరణ. నిజానికి ఖురాన్ 9:123 లో అసలు అలా రాయబడి లేనే లేదు. ఏమని రాయబడి ఉందో గమనించండి.
ఖురాన్ 9:123 – “విశ్వసించిన ప్రజలారా! మీ చెంతనున్న సత్యతిరస్కారులతో పోరాడండి”
ఈ వాక్యం ఆనాటి విశ్వాసులైన వ్యక్తులను చంపటానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న కపటులను ఉద్దేశిస్తూ చెప్పబడింది. తప్పితే ప్రతీ ముస్లిం ఇంటి చుట్టూ నివసించే ముస్లిమేతరులతో యుద్ధాలు చెయ్యమని చెప్పటం లేదు.
****
ఖురాన్ 22:19 – “అల్లాహ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి. వారి చర్మం, శరీరం కరిగి కాలిపోవాలి”
ఇది మరీ దారుణమైన వక్రీకరణ. నిజానికి ఖురాన్ 22:19 లో ఆ విధంగా రాయబడి లేనే లేదు.అందులో చెప్పబడుతున్న విషయం పరలోకంలో విడించబడే నరక శిక్షల గురించి.
ఖురాన్ 22:19 – “వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. వారి శిరస్సుపై మరిగే నీరు పోయబడుతుంది. ఇంకా వారు ఇనుప గదలతో దండించబడతారు”
ఇది పరలోకంలో విధించబడే నరక శిక్షల ప్రస్తావన. తప్పితే అల్లాహ్ ను నమ్మని వారిని శిక్షించమని ఖురాన్ లో ఎక్కడా లేదు.
****
ఖురాన్ 47:4 – “అల్లాహ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం చూడకండి. వారు దొరికినంతనే నరికెయ్యండి”
ఇది సైతం మరీ ఘోరమైన వక్రీకరణ. నిజానికి ఖురాన్ 47:4 వాక్యం విశ్వాసులకు, దౌర్జన్య పరులకు మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇవ్వబడిన వాక్యం. ఆ నేపథ్యంలో…
ఖురాన్ 47:4 – “కనుక మీరు ఈ దౌర్జన్యపరులతో తలపడినప్పుడు వారి మెడలపై కొట్టండి, వారిని బంధించండి”
అని చెప్పబడింది. తప్పితే అల్లాహ్ ను నమ్మని ప్రతీ ఒక్కరినీ దొరికినంతనే నరికెయ్యండి” అని ఎక్కడా చెప్పబడలేదు.
ఒక్క ఖురాన్ వాక్యాలే కాదు, బైబిల్, భగవద్గీతా గ్రంథాలలో ఏ వాక్యం తీసుకుని దాని అర్థాన్ని, సందర్భాన్ని తప్పించేసినా నీతిని సైతం బూతుగా చూపెట్టవచ్చు. స్వయంగా వేదాలు, భాగవద్గీతలో సైతం యుద్ధ సమయాలలో “దుర్మార్గులు, దుష్టులపై యుద్ధం చెయ్యండి, చంపండి” అని రాయబడ్డ అనేక వాక్యాలు ఉన్నాయి. దానర్థం ఆయా గ్రంథాలు ప్రజలను చంపమంటున్నాయని కూడా వక్రీకరించవచ్చు.
కాబట్టి హిందూ-ముస్లిముల మధ్య సోదరభావాన్ని దెబ్బతీయటానికి కొందరు ఖురాన్ వాక్యాలను ఎంతో ఘోరంగా వక్రీకరించి పోస్టులు తయారు చేసి ఇలా వాట్స్ యాపుల్లో ఫార్వర్డ్ చేస్తున్న దాని బట్టి మతోన్మాదం సమాజాన్ని ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ దేశాల్లో యువత భౌతిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో దూసుకెళుతుంటే మన దేశంలో నాయకులు యువతను ఎటువైపుకు తీసుకెళుతున్నారో చెప్పటానికి ఈ రకమైన చిల్లర పోస్టులు చూసి అంచనా వెయ్యవచ్చు.
ఖురాన్ పై విషపూరిత ప్రచారానికి సమాధానం
