యుద్ధ భూమికి మానవత్వం నేర్పాడాయన

మాయోపాయం పన్న కూడదు…

వంచన, కుట్రలకు పాల్పడకూడదు…

విశ్వాస భంగం చెయ్యకూడదు…

ఊహ తెలియని పిల్లలను చంపకూడదు…

స్త్రీలను, వృద్ధులను చంపకూడదు…

చిత్రవధ చెయ్యకూడదు…

ఖర్జూరపు చెట్లను, ఫలాలనిచ్చే చెట్లను నష్టం చేకూర్చకూడదు…

ఇవీ ప్రవక్త ముహమ్మద్(స) యుద్ధమైదానంలో పాటించాల్సిందిగా తన అనుచరులకు నేర్పిన యుద్ధ నియమాలు. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ యుద్ధమైదానంలో పాల్గొనబోయే తన సైన్యానికి ఇలాంటి యుద్ధ నియమాలను పాటించమని బహుశా చెప్పి ఉండడేమో!

తన ప్రాణ శత్రువులు తనను, తన అనుచరుల్నీ చంపటం కోసం యుద్ధానికి కాలుదువ్విన సందర్భాలలో సైతం వారిని సమాధాన పరచి యుద్ధం జరగకుండా ఆపటానికి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. తమపై యుద్ధం చెయ్యటానికి సిద్ధపడిపోయిన శత్రువుల నుండి ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా యుద్ధం చెయ్యాల్సి వచ్చినప్పుడు సైతం యుద్ధ మైదానంలో పాటించాల్సిన నైతిక నియమాలు నేర్పాడాయన. యుద్ధ మైదానంలో తన శత్రువులు రాక్షసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సైతం యుద్ధ భూమికి మానవత నేర్పాడాయన.

చివరకు యుద్ధాన్ని మానుకున్న శత్రువులను క్షమించి వదిలి పెట్టి వారి పట్ల అమితమైన దయను చూపాడాయన.

“ప్రవక్త ముహమ్మద్ (స) అనేక యుద్ధాలు చేశారు” అని చాలా మంది చెప్పే మాట నిజానికి అవాస్తవం. ఎందుకంటే సాధారణంగా ఏ నాయకుడైనా మరొక రాజ్యాంపై తన తరఫున యుద్ధం ప్రకటించేది రాజకీయ, ఆర్ధిక లబ్ది కోసమే తప్ప మరొక ఉద్దేశం ఉండదు.

కానీ, ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన యుద్ధాలన్నీ కేవలం ఆత్మ రక్షణ కోసం మరియు దౌర్జన్య పరుల ద్వారా అణచబడి, వారి రాజకీయ ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న సామాన్య అమాయక ప్రజలను రక్షించటం కోసం మాత్రమే ఆయనకు యుద్ధం చెయ్యమన్న ఆదేశాలు వచ్చాయి.

తప్పితే ఇస్లాం మిడిమిడి జ్ఞానం కలిగిన కొందరు చెబుతున్నట్లు ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన యుద్ధాలన్నీ ఇస్లాం వ్యాప్తి కోసమో, ఇతర మతాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా మతమార్పిడి చెయ్యటానికో, అన్యాయంగా ముస్లిమేతరులను చంపటానికో కాదు.

ఇస్లామోఫోబియా అనే మానసిక జబ్బు కారణంగా ప్రవక్త ముహమ్మద్ (స) యుద్ధాలు చేశారన్న సమాచారం మాత్రమే కొందరి కళ్లకు కనపడుతుంది. తప్పితే ప్రవక్త ముహమ్మద్ నేర్పిన ధర్మాన్ని అనుసరిస్తున్నారన్న కారణంతో ఆయన శత్రువులు ఆయన యొక్క ఎందరో అనుచరుల శరీరాలు చీల్చి కాలేయాలు బయటకు లాగి, మండుతున్న ఇసుకలో పడుకోబెట్టి బల్లాలతో పొడిచి వారి శరీరాలను ఛిద్రం చేసి దారుణంగా హింసించి చంపిన సంఘటనలు కనపడవు.

అలాంటి దౌర్జన్యపరులను సైతం తాను మక్కాను జయించిన సందర్భంలో వారి పట్ల పగా ప్రతీకారాలు తీర్చుకునే అవకాశం మెండుగా ఉన్నప్పటికీ వారందరినీ క్షమించివేశాడా మనిషి.

అలాగే చరిత్రలో మొట్టమొదటిసారిగా యుద్ధం చేసిన ప్రవక్త ఒక్క ముహమ్మద్ (స) మాత్రమే కాదు! అలాగే ఆయనొక్కరికే మొట్టమొదటిసారిగా యుద్ధాలు చెయ్యమన్న ఆదేశాలు కూడా రాలేదు. చరిత్రలో దౌర్జన్య పరులకు వ్యతిరేకంగా ధర్మ యుద్ధాలు చెయ్యాల్సిందిగా ఆదేశించబడ్డ అనేక మంది మహాత్ములు, మహనీయులు, ప్రవక్తలున్నారు.

అది తెలియాలంటే చరిత్ర చదవాలి, ఇంకా హిందూ శాస్త్రాలను, బైబిల్ గ్రంథాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం వాట్స్ యాప్ మెస్సెజులు మటుకు చదివితే సరిపోదు.

***

“ప్రవక్త గారి సమయంలో ఇవి (ఆధునిక మారణాయుధాలు) లేక కేవలం కత్తులతో సరిపెట్టుకున్నారు. ఈ టెక్నాలజీ వారికి అంది ఉంటే”… అంటూ ఓ గౌరవనీయుడైన ఫెస్బుక్ మిత్రుడు ఒకచోట వ్యంగ్యంగా చేసిన కామెంట్ కు సమాధానమే పై వ్యాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *