ముస్లిం సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలి

మనిషి వ్యక్తిగత, సామాజిక జీవన రంగాలలో అతని మేలు కొరకు, క్రమశిక్షణ (Discipline) కొరకు, అతని ఆరోగ్యం కొరకు ఇస్లాం అనేక విలువైన సూచనలు, సలహాలను, జాగ్రత్తలను నిర్దేశిస్తుంది. వాటిలో నేడు వివాదాస్పదంగా మారిపోయిన హిజాబ్ అన్నది ఒకటి!

కానీ, నేడు ముస్లిమేతరుల్లో ఇస్లాంకు సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల సైతం అవగాహన లేకపోవటానికి కారణం- వారు ఇస్లాంను స్వతహాగా పరిశీలించకపోవటం మొదటిదైతే.. ముఖ్యంగా ముస్లిం సమాజం వారికి ఇస్లాం గురించి అవగాహన కలిగించే విషయంలో నిర్లక్ష్యం వహించటమే ఇస్లాం పట్ల ముస్లిమేతరుల్లో అనేక అపార్థాలు ఏర్పడిపోటానికి ప్రధాన కారణమైందన్న నిజాన్ని కూడా ఇక్కడ ఒప్పుకోక తప్పదు.

ఖురాన్, మనిషి వ్యక్తిగత, సామాజిక జీవన రంగాలలో అతని మేలు కొరకు, క్రమశిక్షణల కొరకు ఎన్నో ఆదేశాలిస్తుంది. ఉదాహరణకు:

పరిశుభ్రమైన ఆహార పదార్థాలు తినండి’, ‘పరిశుభ్రత పాటించండి’,
‘మితాహారం తినండి’,
‘మత్తు పదార్థాలు సేవించకండి’, ‘వ్యభిచారం, అశ్లీల్లాల దరిదాపులకు కూడా వెళ్లకండి’,
‘తలిదండ్రుల పట్ల పొరుగువారి పట్ల ప్రేమా, దయతో మెలగండి’, ‘అహంకారంతో నడవకండి’
‘న్యాయం శత్రువువైపున్నా సరే న్యాయం వైపే నిలబడండి’,
‘స్త్రీ, పురుషులు హుందాతనమైన వస్త్రాలు ధరించండి కానీ హద్దులు మీరకండి’,
‘పరాయి స్త్రీల పట్ల పురుషులు తమ చూపులను కాపాడుకోవాలి…
అలాగే పరాయి పురుషుల విషయంలో స్త్రీలు తమ చూపులను కాపాడుకోవాలి’
‘స్త్రీలు తలపై నుండి ఛాతీ వరకు కప్పబడేలా అదనపు వస్త్రాన్ని ధరించాలి’ వగైరా అనేక ఆదేశాలను ఇస్తుంది.

ఒక మనిషి ఏ మతానికి చెందిన వాడైనప్పటికీ అతని దైనందిన జీవితంలో అతని ఆరోగ్యం, మేలు, క్రమశిక్షణల కొరకు ఈ సూచనలు, సూత్రాలు, జాగ్రత్తలు పాటించటం ఎంతో లాభాన్ని చేకూర్చేవే!
కాకపోతే, ఖురాన్ లాంటి ఒక ధార్మిక గ్రంథంలో ఇలాంటి సూచనలు, సలహాలూ, జాగ్రత్తలు ఉండటం మూలానా వీటన్నిటినీ మతపరమైన ఆదేశాల్లా కూడా కొందరు జమకట్టవచ్చు. దాన్ని ప్రక్కన పెడితే..

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రస్తుతం కేవలం స్త్రీలు తలకు చుట్టుకునే ఒక గుడ్డ విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతం జరిగిపోతుంది. దాని వెనుక పని చేస్తున్నది కొందరు వేర్పాటువాదులు పన్నుతున్న మత విధ్వేష రాజకీయ కుట్రలే కావొచ్చు! కానీ, దాన్ని అడ్డం పెట్టుకుని ఎప్పట్నుంచో కడుపులో దాచుకున్న ఇస్లామోఫోబియాను ఎప్పుడెప్పుడు వెళ్లగక్కుదామా అని ఎదురు చూసే కొందరు ఇస్లాంపై దారుణమైన విమర్శలు చేస్తూ, సామాన్య ప్రజల్లో ఇస్లాం పట్ల అనేక అపార్థాలను సర్వసామాన్యం చెయ్యటం కూడా మొదలెట్టేశారు.

ఇతర మతాచారాలను గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం ఉన్న కొందరు సంస్కారవంతులైన ముస్లిమేతరులు తప్ప మిగతా వారంతా హిజాబ్ అంటే “ముస్లిం స్త్రీలు తలిదండ్రుల బలవంతం మీద ధరిస్తూ ఉంటారని, అది స్త్రీలను అణగద్రోక్కే ముస్లిముల మతాచారమని, పితృస్వామిక అణచివేతని, స్త్రీ వెనుకబాటు తనానికి గుర్తని” ఇలా రకరకాలుగా విమర్శలు, వక్రీకరణలు చేస్తూ స్వంత ఫిలాసఫీలు చెప్పుకోవటంలో బిజీ అయిపోయారు. దాదాపుగా ఈ విమర్శలన్నీ సామాన్య ప్రజలు నిజమేమోనని నమ్మేసేంతగా ఫేమస్సైపోయాయి కూడా.

మొత్తం మీద ఇస్లాంలో హిజాబ్ లాంటి ఒక చిన్న అంశం మీద సామాన్య ముస్లిమేతర ప్రజల్లో అనేక అపార్థాలు ఏర్పడిపోవటానికి కారణం వారికి ఇస్లాం అవగాహన లేకపోవటం అనుకోవచ్చా? లేక ఇన్నాళ్లూ ముస్లిం సమాజం వారికి ఇస్లాం పట్ల అవగాహన కలిగించాల్సినంతగా కలిగించలేకపోయిందని చెప్పవచ్చా?

ఇప్పుడు హిజాబ్ పై జరుగుతున్న విమర్శలు, వివాదాల నేపథ్యంలో చాలా మంది ముస్లిములు దాని వాస్తవికత వివరిస్తూ, ఇస్లాం ఏ విషయంలోనూ బలవంతం చెయ్యదని, హిజాబ్ అన్నది అణచివేతకు గుర్తు కాదని ఎన్నో విధాలుగా వివరణలు ఇస్తూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇస్లాం ఎంతో విశాల దృక్పథాలు కలిగిన ధర్మం అని విశ్వసించేవారు, గొప్పగా మాట్లాడేవారు… ఆ విశాల దృక్పథాలను తమ తోటి ముస్లిమేతర సోదరులకు ఎంతవరకు అందించగలుగుతున్నారు? ఎంత వరకు అవగాహన కలిగించగలుగుతున్నారు? అన్నది ముస్లిములంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అలాగని ముస్లిం సమాజం ముస్లిమేతరులకు అస్సలే ఇస్లాంను గురించి పరిచయం చెయ్యటం లేదన్నది నా ఉద్దేశం కాదు. ముస్లిం సమాజంలో ఎందరో అష్టకష్టాలు పడైనా ఇస్లాం గురించి పరిచయం చేస్తున్నారు. కానీ, వారి సంఖ్య మొత్తం ముస్లిం సమాజంలో అతి స్వల్ప శాతం మాత్రమే!

ఇప్పటికే ఇస్లాం అంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మతమని, ముస్లిములంటే తీవ్రవాదులన్న విధంగా యూరప్, అగ్రరాజ్యాల ద్వారా పెంచిపోషించబడుతున్న అంతర్జాతీయ మీడియా ఇస్లామోఫోబియాను ప్రపంచవ్యాప్తంగా సర్వసామాన్యం చేస్తూ పోతుంది. దానికి తగ్గట్టు ఇస్లాం విమర్శలనే ఆధారంగా చేసుకుని తన ఉనికిని కాపాడుకునే హిందుత్వవాద సంస్థలు, వాటి సభ్యులు ఇస్లాం పట్ల తమ కడుపులో దాచుకున్న పైత్యాన్ని ఎంత కక్కాలో అంతగా వెళ్లగక్కుతూనే ఉన్నారు. అటు క్రైస్తవుల్లో సైతం కొందరు మతతత్వవాదులు తమ క్రైస్తవ్యాన్ని గొప్పగా చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఇస్లాం పట్ల దారుణమైన విమర్శలను చెయ్యటం ఎప్పటినుండో జరుగుతున్న తంతే!

కచ్చితంగా ఈనాడు ఎవరైతే ఇస్లాం పట్ల ఘోరమైన విమర్శలు చేస్తున్నారో వారు ఇస్లాం తాలూకు కించిత్తు జ్ఞానం లేకుండానే విమర్శిస్తున్నారనటంలో సందేహం లేదు. వారిది ఇస్లాం పట్ల ధ్వేషమే కావొచ్చు. హిందువుల దృష్టిలో ముస్లిం సమాజాన్ని ఓ కల్పిత శత్రువుగా మార్చేసి వారిని ఉగ్రవాదులుగా, ప్రమాదకారులుగా చిత్రీకరిస్తూ తమ పైశాచికానందాన్ని తీర్చుకోవచ్చు.

కానీ, ముస్లిం సమాజం సామాన్య ముస్లిమేతర ప్రజలకు ఇస్లాం గురించి అందించాల్సినంత సమాచారం అందించలేకపోవటం వల్ల, వారికి ఇస్లాం అవగాహన లేకపోవటంతో.. చాలా మంది ముస్లిమేతరులు ఈ ఇస్లాం ధ్వేషకులు చెప్పే లేకి మాటలు, పనికిమాలిన విమర్శలను నిజమని నమ్మేసి ఇస్లాం పట్ల, ముస్లిం సమాజం పట్ల కారణం లేని కోపాన్నీ, అవసరం లేని ధ్వేషాన్నీ పెంపొందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

నేడు ఇస్లాం పట్ల ముస్లిమేతరుల్లో ఏర్పడిపోయి ఉన్న అపార్థాలకు లెక్కే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం దృక్పథాలను అర్థం చేసుకుని ఎంతో మంది ఇస్లాం స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఇస్లాం అవగాహన లేని కొందరు ముస్లిములు చేసే పనుల వల్ల ఇస్లాం పట్ల చాలా మంది వెగటును కూడా పెంపొందించు కుంటున్నారు.

బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచ మానవుల సంస్కరణ కొరకు నియమించబడ్డ ముస్లిం సమాజంలోనే అధిక శాతం మందికి ఇస్లాం దృక్పథాల కనీస అవగాహన లేకపోవటం.

కాబట్టి ఇస్లాం విషయంలో ఎవరో ఏదో విమర్శ లేవనెత్తినప్పుడు దాని గురించి హడావిడిగా వివరణలు ఇచ్చుకుంటూ కూర్చునే బదులు ఇస్లాం తాలూకు విశాల దృక్పథాల అవగాహనను ముందే ప్రజలకు కల్పిస్తే.. ఎవరెన్ని విమర్శలు లేవనెత్తినా ప్రజలు వాటిని నమ్మేసే పరిస్థితీ ఉండదు, వారిలో ఇస్లాం పట్ల అపార్థాలు ఏర్పడే దుస్థితీ రాదు.

నేటి మత ఉన్మాదులు చేస్తున్న విధ్వేష రాజకీయ కుట్రల ఫలితంగా సమాజంలో సోదరుల్లా మెలిగే హిందూ-ముస్లిముల మధ్య బీటలు ఏర్పడుతున్న నేపథ్యంలో చెయ్యాల్సింది స్వంతంగా రాజకీయ పార్టీలు పెట్టటమో లేక రాజకీయాల్లో చేరటమో కాదు, చేరితే చేరవచ్చు తప్పు కాదు. కానీ అది అంతిమ పరిష్కారం అయితే కాదు!

ఇప్పటికైనా సామాన్య ముస్లిములంతా మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు అంటూ జీవితాంతం బిజీ అయిపోయి తమ ఇరుగుపొరుగు వారికీ స్నేహితులు, బంధువులకు ఇస్లాం యొక్క కనీస అవగాహనను పెంపొందించే ప్రయత్నాలు చెయ్యకపోతే… రేపన్నరోజున మతోన్మాదులు చేసే దారుణ విమర్శలను, దాడులను, దౌర్జన్యాలను సైతం ఎదుర్కునే దుస్థితి రాకపోదు. అప్పుడు ఎంత హడావిడిగా ఇస్లాం అంటే ముస్లిం సమాజం అంటే మీరనుకుంటున్నది కాదు వాస్తవం ఇదీ అని ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *