ఇస్లాం స్త్రీని అణచివేస్తుంది, వివక్ష చూపుతుంది, ఇస్లాం ముస్లిం సమాజాన్ని తిరోగమనం వైపునకు తీసుకెళుతుంది, సంకుచితత్వం వైపునకు తీసుకెళుతుంది అని తెగ బాధపడిపోయే సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, అభ్యుదయవాదులకు తెలియని విషయం- ఇస్లాం వాస్తవానికి తిరోగమనం వైపునకు ప్రయాణిస్తున్న సమాజాన్ని పురోగమనం వైపునకు.. అనాగరిక సమాజాన్ని నాగరికత వైపునకు.. స్త్రీ అణచివేతకు, వివక్షకు గురౌతున్న సమాజాన్ని స్త్రీ స్వేచ్ఛను, న్యాయపరమైన హక్కులను ప్రసాదిస్తూ, సంకుచిత మనస్కులను విశాల దృక్పథాల వైపునకూ నడుపుతూ అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా పునః ప్రారంభించబడిందన్నది
ఇస్లాం లక్ష్యమే – వివక్ష, అణచివేతలను ఖండించటం!
ప్రవక్త ముహమ్మద్ (స) అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న సమాజంలో ఇస్లామియా బోధలు చెయ్యటం మొదలు పెట్టలేదు! నిజానికి ప్రవక్త ముహమ్మద్ (స) ఎలాంటి జాతివైపునకు ప్రవక్తగా పంపబడ్డారు.. ఆయన రాక పూర్వం అరేబియా జాతి ఎంతటి హీనమైన ఆటవికత, అనాగరిక ఆచారాలలో మునిగి ఉండేది.. అలాంటి అనాగరిక జాతి ప్రజలను కేవలం 23 ఏళ్ల కాలంలో ఎంతటి ఉత్తమోత్తమ నైతిక విలువలు కల వ్యక్తులుగా ఆయన మార్చగలిగారు.. అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఇస్లాంను విమర్శించేముందు ఒక్కసారి పరిశీలిస్తే ఇస్లాంపై విమర్శలు చేసే సాహసమే చెయ్యరనటం అతిశయోక్తి కాదు.
స్త్రీ అంటే కించిత్తు గౌరవం లేని, అమ్మాయి పుడితే సజీవంగా పూడ్చిపెడుతూ.. వారిని అంగట్లో ఆటవస్తువుగా భావిస్తూ, వారిని నీచంగా చూస్తూ వారికి ఎలాంటి హక్కులు కానీ, ఎలాంటి గౌరవం కానీ కల్పించని ఓ అనాగరిక జాతిలో ప్రవక్తగా ప్రభవింపజేయబడ్డ ముహమ్మద్ (స) ఆ జాతిని అతి కొద్ది కాలంలోనే అమ్మాయి పుట్టుకే అదృష్టంగా భావించేవారిగా.. పరస్త్రీ వైపు చెడు దృష్టితో చూడటమే పాపంగా భావించేవారిగా.. తల్లి, భార్య, తోబొట్టువుల పట్ల, పరాయి స్త్రీల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో మెలిగేవారిగా ప్రపంచానికి నాగరికత నేర్పే ఉత్తమోత్తమ నైతిక ప్రవర్తన గల గురువులుగా మార్చేశారు.
అయితే ఈనాడు కొందరు ముస్లిమేతరుల్లో ఇస్లాం ముస్లిం సమాజాన్ని తిరోగమనం వైపునకు తీసుకువెళుతుందని, ఇస్లాం స్త్రీలను అణచివేతకు గురిచేస్తుందని వగైరా విమర్శలు లేవనెత్తటానికి రెండు మౌలిక కారణాలు ఉన్నాయి.
1. వారు ఇస్లాంను ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ (స) బోధల ఆధారంగా అధ్యయనం చెయ్యకపోవటం
2. ముస్లిం సమాజంలో కొందరు ఖురాన్ సరిగ్గా చదవని అనవగాహనా పరుల చేష్టలను చూసి దానికి కారణం ఇస్లామే అని భావించటం.
నిజానికి ఇస్లాం ముస్లిం సమాజాన్ని తిరోగమనం వైపునకు తీసుకెళ్లటం లేదు. కానీ, ముస్లిం సమాజంలో ఖురాన్ సరిగ్గా అవగాహన పరుచుకోని కొందరు ముస్లిముల ప్రవర్తనను చూసి ఇస్లాం ముస్లిం సమాజాన్ని తిరోగమనం వైపునకు తీసుకెళుతుందని కొందరు ముస్లిమేతరులు భావించటానికి అవకాశమైతే మటుకు కొందరు ముస్లిములే కల్పిస్తున్నారన్న విషయాన్ని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి గ్రంధ అవగాహన లేని కొందరు అనవగాహనా పరులు అన్ని మత వర్గాల్లోనూ ఉంటారు. కాబట్టి కొందరి అతి ప్రవర్తనను బట్టి ఇస్లాంను తప్పు పట్టకూడదు. నిజంగా ఇస్లాంను అధ్యయనం చెయ్యగోరేవారు అధ్యయనం చెయ్యాల్సింది ముస్లిం సమాజాన్ని కాదు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) బోధనలనే
హిజాబ్ – స్త్రీల వివక్షకు అణచివేయ్యటానికి గుర్తా?
తమను తాము అభ్యుదయవాదులుగా భావించుకునే కొందరు నాస్తిక సమాజంలోని కొందరు ఇతర మత వ్యవస్థలోని మూఢ ఆచారాలను అసహ్యించుకుంటూనే.. అదే క్రమంలో ముస్లిం సమాజంలోని స్త్రీలు బలవంతంగా ముసుగు (హిజాబ్) ధరించబడి అణచివేతకు గురికాబడుతున్నారు, వారి ఐడెంటిటీని మరుగుపరచి వారిని వివక్షకు గురిచేస్తున్నారు, ఇస్లాంలో అసమానతలు పెరుకుపోయాయని, ఇస్లాంలో స్త్రీకి స్వేచ్చ లేదు అని గోల పెడుతూ ఉంటారు.
పోనీ వారు అలా గోలపెట్టే ముందు స్వతహాగా కొందరు ముస్లిం సమాజంలో స్త్రీలతో ఈ విషయాలపై చర్చించి, తాము చేసిన సర్వే ఫలితాల ఆధారంగా అలా మాట్లాడుతున్నారా అంటే అదీ కాదు కేవలం గాసిప్ నాలెడ్జ్ మాత్రమే! ఎక్కడో తస్లీమా నస్రీన్ లాంటి వారు ఆరాకొరా జ్ఞానంతో సోషల్ మీడియాలో ఒకరిద్దరు మాట్లాడిన వారి రిఫరెన్సులు పట్టుకుని.. ఇస్లాం హిజాబ్ పేరుతో స్త్రీలను అణచివేస్తుందని.. ఇస్లాం స్త్రీ పురుషుల మధ్య వివక్ష చూపుతుందని జడ్జ్ మెంట్లు పాస్ చేస్తూ ఉంటారు.
వీలైతే పురుషులను స్త్రీలను గౌరవించటం నేర్పాలి తప్పితే ఎవరో చూస్తారని స్త్రీలను హిజాబ్ లో బంధించెయ్యటం న్యాయమా? అని ప్రశ్నించే కొందరు అభ్యుదయవాదులను చూస్తుంటే నవ్వొస్తూ ఉంటుంది.
ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో ఇస్లాం గురించి ఎవరు మాట్లాడినా ఇలాగే మాట్లాడతారు. నిజానికి ఖురాన్ పురుషులు ఇతర స్త్రీల విషయంలో తమ చూపులను కాపాడుకోవాలని.. అలాగే స్త్రీలు ఇతర పురుషుల విషయంలో తమ చూపులను కాపాడుకోవాలని ఆదేశిస్తుందన్న విషయం వీరికి తెలియదు.
సమాజంలో స్త్రీల అందచందాలను చూసి చొంగ కార్చుకుంటూ చెడు చూపులు చూస్తూ తమ పైత్యాన్ని ప్రదర్శించే వారి నుండి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు స్త్రీలకు అదనంగా తలపై నుండి వక్ష స్థలం కప్పబడేలా ఒక అదనపు వస్త్రాన్ని ఖురాన్ ధరించమనే ఆజ్ఞ ఇస్తుంది. అచ్చం ఇదే ఆజ్ఞ బైబిల్లో నూ చూడగలం (1 కోరింధీ 11:4-16). తప్పితే ఇది అణచివేతకో, వివక్షకో గురి చెయ్యటానికి కాదు.
అలాగే UK లో ఈమధ్యే జడ్జ్ గా సెలక్ట్ అయిన ‘రఫీయా అర్షద్’ లేదా… మెంబర్ ఆఫ్ U.S హౌస్ ‘ఇల్హాన్ ఒమర్’ లాంటి ఎందరో ముస్లిం మహిళలు హిజాబ్ ధరిస్తూనే వారు ఉన్నత ఉద్యోగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇస్లాంను లోతైన అధ్యయనం చేసిన ఉన్నత విధ్యావేత్తలైన వీరంతా ఇస్లాం తమను అణచివేతకు గురి చేస్తుందని ఎన్నడూ భావించలేదు అలాంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు
అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సింది- ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను అధ్యయనం చేసి ఇస్లాం పట్ల ఆకర్షితులై పాశ్చాత్య దేశాల్లో ఇస్లాం స్వీకరిస్తున్న వారిలో విధ్యావేత్తలైన స్త్రీలే అధికంగా ఉన్నారు.
ఖురాన్ స్త్రీ పురుషులకు సమాన హక్కులతో పాటు సమ న్యాయం చేస్తుంది నిజానికి ఖురాన్ చెబుతున్నదేమిటంటే-
“పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉంది” – ఖుర్‌ఆన్-2:228
వాస్తవానికి ఇస్లాం స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించింది. అయినప్పటికీ స్త్రీ పురుషులిద్దరూ వారి బాధ్యల పరంగా, సామర్థ్యాలలో, ప్రకృతి పరంగా వారి శారీరక నిర్మాణ పరంగా ఎంతో వ్యత్యాసం కలిగి ఉన్నారు. స్త్రీల బాధ్యతలు వేరు పురుషుల బాధ్యతలు వేరు. స్త్రీలకంటే సమాజంలో పురుషులు నిర్వర్తించే బాధ్యతలే అధికం కాబట్టి “పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉంది” అని చెప్పటం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఒకరికొకరు సరూపాలే కానీ అన్ని విధాలుగా సమానం కాదన్నది నిర్వివాదం. దీనర్థం ఒకరి స్థాయి ఎక్కువ, మరొకరి స్థాయి తక్కువ అని ఎంత మాత్రం కాదు. అలాగే ఖురాన్ లో ఎన్నో వాక్యాల్లో స్త్రీ పురుషులిద్దరికీ సమ న్యాయం చేస్తూ ఎటువంటి వివక్షా చూపకుండా చెప్పబడిన ఎన్నో వాక్యాలు చూడగలం
1). ”మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.” (ఖుర్‌ఆన్-2: 178)
2). ఆయన మిమ్మల్ని (స్త్రీ పురుషులను) ఒకే ప్రాణి నుండి పుట్టించాడు.” – ఖుర్‌ఆన్ 4:1
3). ”తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది.” -ఖుర్‌ఆన్ 4: 7
4). ”మీ స్త్రీలు మీకు దుస్తులు. మీరు వారికై దుస్తులు”. -ఖుర్‌ఆన్ 2:187
స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స)- “ఖచ్చితంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు” [తిర్మిజి 113] అని ప్రకటించారు.
స్త్రీ, పురుషుల సమాన హక్కుల గురించి, సమ న్యాయం గురించి ఎన్నో బోధలు ఇస్లాంలో ఉన్నప్పటికీ నేటి కొందరు సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, అభ్యుదయవాదులు ఇస్లాంను అధ్యయనం చెయ్యకపోవటం, ఇస్లాం అధ్యయనం చెయ్యాల్సిన పని మాకేంటి మాకు మంచి అనిపించేదే న్యాయం అన్న రీతిలో వ్యవహరించటమే వారు ఇస్లాం వివక్ష, అసమానత, అణచివేతను కలిగి ఉందని ఊహించుకుంటూ విమర్శిస్తూ జీవితం గడిపేస్తుంటారు.
కానీ ప్రవక్త ముహమ్మద్ (స) విషయంలో ముస్లిమేర చరిత్ర కారుల అభిప్రాయం ఎలా ఉందంటే..
“స్త్రీ హక్కులను సాధించిన గొప్ప విజేతగా ముహమ్మద్ తప్ప బహుశా ప్రపంచం ఎవరినీ చూడలేదు” – Pierre Crabites (1877-1943)
