డా. మోరిస్ బుకాయిల్ ను ఇస్లాంకు దగ్గర చేసిన “ఫిరౌన్ శవం”

ఆర్కియాలజీలో ప్రత్యేక ఆశక్తి ఉన్న ఫ్రాన్స్ 80 వ దశకంలో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడైన “ఫ్రాంకోయిస్ మిట్టరెండ్” ఈజిప్ట్ ప్రభూత్వాన్ని కొన్ని ప్రయోగాలు, ఆర్కియాలజికల్ రీసెర్చ్ నిర్వహించటానికి “ఫిరౌన్ (రామ్ సెస్ 2)” శవాన్ని తమ దేశానికి పంపాల్సిందిగా కోరింది. దానికి అంగీకరించిన ఈజిప్ట్ ప్రభూత్వం ఫిరౌన్ శవాన్ని ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్ కు పంపటం జరిగింది.

ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్ భూభాగానికి చేరిన అరుదైనా ఆ ప్రాచీన ఫిరౌన్ శవాన్ని ఎంతో సగౌరవంగా స్వీకరించింది ఫ్రాన్స్ ప్రభూత్వం. తరువాత దానిని “ఆర్కియాలజీ సెంటర్ ఆఫ్ ఫ్రాన్స్” కు తరలించటం జరిగింది. ఇక ఆ ఫిరౌన్ శవంపై ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించటాని ఫ్రాన్స్ ప్రత్యేకంగా ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు, డాక్టర్ల బృందాన్ని సైతం నియమించింది. ఆ సైంటిస్టుల బృందానికి నాయకత్వం వహించటానికి నియమించబడ్డ వ్యక్తే డా. మోరిస్ బుకాయిల్

పుట్టుకతో క్రైస్తవుడైన డాక్టర్. మోరిస్ బుకాయిల్ (Dr. Maurice Bucaille) ఫ్రెంచ్ కు చెందిన అత్యంత ప్రఖ్యాత మెడికల్ సర్జన్ మరియు సైంటిస్ట్ మరియు స్కాలర్! అంతేకాదు, “మెంబర్ ఆఫ్ ద ఫ్రెంచ్ సొసైటీ ఆఫ్ ఈజిప్ట్” మరియు రచయిత కూడా! డా. మోరిస్ “ఫ్రెంచ్ అకాడమీ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్” అన్న ప్రముఖ పురస్కారంతో సైతం సత్కరింపబడ్డారు. అసలు ఇస్లాం ప్రపంచంతో గానీ, ఖురాన్ తో గానీ ఏమాత్రం పరిచయం లేని ఆ డా. మోరిస్ జీవితాన్ని కేవలం ఒకే ఒక్క ఊహించరాని సంఘటన మార్చివేసింది.
*****

ఆ తరువాత డా. మోరిస్ తన ఆ సైంటిస్టుల బృందంతో ఫిరౌన్ శవానికి చెందిన రహాస్యాలను ఛేదించటానికి మరింత లోతైన పరిశోధనలు చెయ్యటం ప్రారంభించటం జరిగింది. ఓ ప్రక్క అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికీ డా. మోరిస్ ఆలోచనలు మటుకు అసలు ఆ ఫిరౌన్ ఎలా చనిపోయి ఉంటాడు? పైగా అన్ని సంవత్సరాలు ఆ మనిషి శవం ఎలా సురక్షితంగా ఉంది? అన్న అంశాల చుట్టూ తిరగటం ప్రారంభమయ్యాయి. దానికి కారణం ఏమిటంటే ఫిరౌన్ శవంపై సముద్రపు ఉప్పు పేరుకు పోయి ఉండటమే!

చివరకు డా. మోరిస్ అనేక పరీక్షల అనంతరం తన పరిశోధనలో ఓ ముగింపుకు రావటం జరిగింది. అదేమిటంటే ఆ ఫిరౌన్ సముద్రంలో మునిగి చనిపోయి ఉంటాడు! ఆ తరువాత ఆ మనిషి శవాన్ని ఎవరో పైకి తీసి “మమ్మీఫై (Mummify అంటే- చనిపోయిన వ్యక్తి కుళ్లిపోకుండా ఉండటానికి దేహంలో ప్రేగులు, కాలేయం, గుండె వగైరా అంతర్గత అవయవాలను తొలగించి, కెమికల్స్ ను పూత పోసి “మమ్మీ” గా మార్చటం అన్న ప్రక్రియ)” చేసి భద్రపరచి ఉంటారు అని!

కానీ, డా. మోరిస్ కు ప్రశ్నార్థకంగా మారిన విషయం ఏమిటంటే- ఫిరౌన్ శవం మిగతా మమ్మీల శరీరాలన్నిటి కంటే వేరేగా ఉంది! దానిలో అవయవాలు తొలగించబడి లేదు! దాని శరీరం పై ఎటువంటి కెమికల్స్ కూడా లేవు. ఇతర మమ్మీల వలె ఫిరౌన్ శవం కుళ్లిపోకుండా ఎటువంటి “మమ్మీఫై ప్రక్రియా (Mummify Process)” చెయ్యబడి లేదు. కేవలం దాని శరీరంపై ఉప్పు మాత్రమే పెరుకుపోయి ఉంది.

పైగా ఆ ఫిరౌన్ శవం దొరికింది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కాదు! 1898 లో ఈజిప్ట్ ఆర్కియలాజికల్ బృందం ద్వారా ‘ఎర్ర సముద్రం (Red sea) లో జబలియన్’ అనే ప్రాంతంలో మొట్టమొదట కనుగొనబడింది. సముద్రంలో నుండి బయటకు తీసినా ఫిరౌన్ శవాన్ని అప్పటి నుండి ఇతర మమ్మీలతో పాటుగా ఈజిప్ట్ కు చెందిన “రాయల్ ముమ్మీస్ ఛాంబర్ ఇన్ కైరో మ్యూజియం”లో భద్రపరచటం జరిగింది. అప్పటి నుండి ఆ శవం ఏమాత్రం చెక్కుచెదరకుండా మ్యూజియంలో అలానే పడి ఉంది!

అన్ని వేల సంవత్సరాలు ఏమాత్రం కుళ్లిపోకుండా ఆ మనిషి శవం సముద్ర గర్భంలో భద్రంగా ఎలా ఉంది? అన్నదే డా. మోరిస్ కు ఓ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే సముద్రంలో పడ్డ మనిషి శవం కొద్దిరోజులకే ఉబ్బిపోయి కుళ్ళిపోయి సముద్ర జీవులు తినెయ్యగా ఎప్పుడో ఆ శవం ఉనికే మాయమైపోయి ఉండాలి. చెక్కుచెదరకుండా ఉండటానికి ఏమాత్రం ఆస్కారం లేదు.

ఇక ఆ శవంపై అనేక పరీక్షలు, ప్రయోగాలు నిర్వహించిన తరువాత డా. మోరిస్ “సముద్రంలో ఒకప్పుడు మునిగిపోయి, కుళ్లిపోకుండా అనేక సంవత్సరాలు సురక్షితంగా ఉన్న ఆ ఫిరౌన్ శవం, ఓ సరోక్రొత్త ఆవిష్కరణ” అన్న దిశగా తన ఫైనల్ రిపోర్ట్ తయారు చెయ్యటం మొదలు పెట్టాడు. సరిగ్గా ఆ సమయంలోనే తన బృందంలో ఓ డాక్టర్ డా. మోరిస్ చెవిలో “ఈ ఫిరౌన్ శవం సముద్రంలో మునిగి చనిపోయి, అది భవిష్యత్ తరాలవారికి ఓ సూచనగా కుళ్లిపోకుండా సురక్షితంగా భద్రపరచబడుతుందని ముస్లిములకు ముందే తెలుసు. వారు చదివే ఖురాన్ గ్రంథంలో ముందే ఆ విషయం స్పష్టంగా రాసి ఉంది” అని చెప్పాడు.

ఆ మాట విన్నవెంటనే అతనిపై మండిపడ్డ డా. మోరిస్ అతను చెవిలో చెప్పినా విషయాన్ని కొట్టి పరేశాడు. ఎందుకంటే మత గ్రంథం అంటే ఏవో కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు నేర్పే గ్రంథం తప్ప ఆధునిక సైన్స్ ఆవిష్కరించే విషయాలు అదెందుకు చెబుతుంది? అన్నది డా. మోరిస్ ఆలోచన.

గొప్ప ఆవిష్కరణలన్నవి మోడ్రన్ సైన్సుకే సాధ్యమయ్యే విషయం తప్ప ఖురాన్ లాంటి ఓ ధార్మిక గ్రంథం సైన్స్ చెప్పే విషయాలను గురించి ముందే ప్రస్తావించి ఉండటం ఏమిటీ? పైగా ఆ ఫిరౌన్ శవం ఎప్పుడో దాదాపు మూడు వేల సంవత్సరాల క్రిందటిది. అది 1898 లో మొట్టమొదటిసారి ఈజిప్ట్ పురావస్తు శాఖ ద్వారా కనుగొనబడింది. అలాంటప్పుడు 1400 వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఖురాన్లో అదీ ఎక్కడో అరేబియా ఇసుక దిబ్బల మధ్య ఓ పల్లెటూళ్లో నివసించే ముహమ్మద్ అనే ఓ నిరక్ష్యరాసి ఈ విషయాన్ని పేర్కొనటం ఎలా సాధ్యపడుతుంది? ఆ మనిషికి అలాంటి రహాస్యాలు తెలియటానికి అసలు అవకాశం ఎక్కడ ఉంది? అన్నది డా. మోరిస్ వాదన. ఆ విధంగా ఆలోచించటం న్యాయం కూడా ఎందుకంటే ఆయనో ఆధునిక కాలపు సైంటిస్ట్ కాబట్టి!

అలాంటి అనేక ఆలోచనలతోనే ఓ రోజు రాత్రంతా తన గదిలోనే కలతిరుగుతున్న ఆ డా. మోరిస్ కు నిద్ర పట్టటం లేదు! ఈ మధ్యకాలంలోనే దొరికిన ఫిరౌన్ శవం గురించి అనేక ప్రయోగాలు చేసి కనుగొన్న దానిని “భవిష్యత్తు తరాలకు ఒక సూచనగా ఉంటుందని” అంత కరెక్టుగా ఆ ఎడారి మనిషైన ముహమ్మద్ కు భవిష్యవాణి చెప్పటం ఎలా సాధ్యపడింది? అతనికా రహస్యం 1400 సంవత్సరాలకు పూర్వం ఎవరు చెప్పి ఉంటారు? అంతుచిక్కని ఆ మిస్టరీ తాలూకు అనేక ఆలోచనలు బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. తన బృందంలో ఆ డాక్టర్ తన చెవిలో ఖురాన్ గురించి గుసగుసలాడింది గుర్తుకొస్తా ఉంటే మనసంతా అదేదోలా అయిపోతుంది. చివరకు ఆ ఖురాన్ ను ఓసారి చదివి చూద్దామనే నిర్ణయానికే వచ్చేశాడు.
*****

కానీ, ఖురాన్ కంటే బైబిల్ పాతది కాబట్టి డా. మోరిస్ ముందుగా “తోరా (తౌరాత్)” గ్రంథాన్ని తెప్పించుకుని చదివితే అందులో…

“అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనలను కప్పి వేసెను; వారిలో ఒక్కడైననూ మిగిలి యుండలేదు” – నిర్గమ 14:27-28

అన్నంత వరకే రాసి ఉంది. ఫిరౌన్ శవం గురించి అంతకు మించి సమాచారం లేదు. ఈసారి ఖురాన్ తెప్పించుకుని ఫిరౌన్ శవం గురించి చదవటం మొదలెడితే ఖురాన్ స్పష్టంగా …

“మేము ఇస్రాయీలు సంతతిని సముద్రం దాటించాము. తరువాత ఫిరౌను, అతని సైన్యాలు హింసించే ఉద్దేశంతో, అణచివేసే ఉద్దేశంతో వారిని వెంబడించారు. చివరకు ఫిరౌను మునిగిపోతున్నప్పుడు ఇలా అరవసాగాడు: “ఇస్రాయీలు సంతతి వారు విశ్వసించిన దేవుడే నిజమైన దేవుడు అనీ, ఆయన తప్ప వేరొక దేవుడు లేడూ అని నేనూ విశ్వసించాను నేను కూడా విధేయతతో తల వంచే వాడినే”. ఇలా (జవాబు ఇవ్వబడింది)- “ఇప్పుడు విశ్వసిస్తున్నావా! వాస్తవానికి ఇంతవరకూ నీవు అవిధేయత చూపుతూ ఉండేవాడివి. ఇంకా కల్లోలాన్ని రేకెత్తించే వారిలో ఉన్నావు. ఇప్పుడు మేము కేవలం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము, నీవు వచ్చే తరాల వారికి గుణపాఠంగా ఉండేందుకు” – ఖురాన్ 10:90-92

అని స్పష్టంగా వివరిస్తుంది. “ఇప్పుడు మేము కేవలం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము, నీవు వచ్చే తరాల వారికి గుణపాఠంగా ఉండేందుకు” అన్న అంశం బైబిల్లో లేదు! కానీ ఒక్క ఖురాన్ మాత్రమే చెబుతుంది. బహుశా ఈ పాయింటు బైబిల్ నుండి కాపీ కొట్టి ఖురాన్ రాసేశారని పనికిమాలిన ఫిలాసఫీలు చెప్పే చాలా మంది క్రైస్తవ పాస్టర్లు కూడా గమనించి ఉండరు కాబోలు.

కానీ, ఖురాన్ వివరిస్తున్న ఆ అద్భుతాన్ని గ్రహించినప్పుడు డా. మోరిస్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ తరువాత ఫ్రాన్స్ గవర్నమెంట్ ఆ ఫిరౌన్ శవాన్ని అద్భుతమైన గాజు శవపేటికలో పెట్టి ఈజిప్టుకు తిరిగి పంపింది. ఫిరౌన్ శవం అనేక వందల సంవత్సరాలు అయినా కుళ్లిపోకుండా ఉందని దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ తీసుకుని సౌదీ అరేబియాలో శరీర నిర్మాణ శాస్త్రవేత్తల గెలాక్సీతో “మెడికల్ కాన్ఫెరెన్స్” లో పాల్గొనటం జరిగింది. అక్కడ తన పరిశోధన వారి ముందుంచినప్పుడు- “ఇప్పుడు మేము కేవలం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము, నీవు వచ్చే తరాల వారికి గుణపాఠంగా ఉండేందుకు” అన్న వాక్యం చదివి వినిపించినప్పుడు డా. మోరిస్ అమాంతంగా నిలబడి, “ఖురాన్ ను దైవవాణి అని నేను విశ్వసిస్తున్నాను” అన్న ప్రకటన చేశాడు.

ఫిరౌన్ శవానికి సంబంధించిన అంశం వరకే కాక, ఆ తరువాత డా. మోరిస్ ఈ ఇరవైవ శతాబ్దంలో ఆవిష్కరించబడిన అనేక ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు ఖురాన్ లో ముందే పేర్కొనబడిన ఉండటం చదివి ఆశ్చర్యానికి లోనైపోయాడు. చివరకు ఖురాన్ మూలభాషను మరింత లోతుగా అవగాహన చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చి తన 50 వ ఏట అరబ్బీ భాషను సైతం నేర్చుకోవటం మొదలెట్టాడు.
*****

ఆ తరువాత డా. మోరిస్ ఖురాన్ పై లోతైన పరిశీలన చేస్తూ ఓ పది సంవత్సరాలు ఉండిపోయాడు. పది సంవత్సరాల అతని ఖురాన్ పరిశోధన అనంతరం చివరకు అతను తేల్చి చెప్పిన విషయం:

“ఖుర్ఆన్ లో పేర్కొనబడిన శాస్త్రీయ విషయాలన్నీ ఈనాటి ఆధునిక సైన్స్ చెబుతున్న ఏ ఒక్క అంశానికీ కూడా విరుద్ధంగా లేదు అని”.
తన పది సంవత్సరాల ఖురాన్ పరిశోధన తరువాత డా. మోరిస్ ఖురాన్ లో ప్రస్తావించబడిన శాస్త్రీయ విషయాలను ఆధునిక సైన్స్ వెలుగులో విశ్లేషిస్తూ ‘The, Bible, The Qur’an and Science: the Holy scriptures examined in the Light of Modern knowledge’ అన్న పేరుతో పుస్తకాన్ని రచించటం జరిగింది.

ఈ పుస్తకం పూర్తి యూరప్ ను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచింది. తరువాత అది ఫ్రెంచ్ నుండి ఇంగ్లీష్, అరబ్బీ, పర్షియన్, టర్కిష్, జర్మన్ భాషల్లో అనువాదం జరిగి కొన్ని వేల ప్రతులు అత్యంత వేగంగా అమ్ముడుపోయాయి. తన పుస్తకం ఉపోద్ఘాతంలో డా. మోరిస్ బుకాయీల్ ఏమని పేర్కొన్నాడంటే…

“ఇతర గ్రంథాల కంటే వేరుగా ఖురాన్ ఏ కచ్చితమైన శాస్త్రీయ విషయాలనైతే పేర్కొంటుందో అవి నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. పద్నాలుగు వందల సంవత్సరాల క్రింద అనేక శాస్త్రీయ విషయాలు ఏవైతే ఖురాన్లో పేర్కొనబడ్డాయో అవి ఇటీవలి కాలంలో ఆధునిక సైన్స్ అభివృద్ది చెందిన తరువాత కనుగొనబడ్డ ఆవిష్కరణలకు ప్రతిబింబాలు అని చెప్పవచ్చు”.

చివరిగా డా. మోరిస్ ఖురాన్ లోని ఈ క్రింది వాక్యాన్ని పేర్కొన్నాడు-
“ఇది ఒక శక్తిమంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందు నుండీ రాజాలదు, వెనుక నుండీ రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడు అయిన దేవుడే అవతరింపజేసిన గ్రంథం ఇది” – ఖురాన్ 41: 42

డా. మోరిస్ బుకాయిల్ తాను వ్రాసిన ‘The Bible, The Qur’an and Science: the Holy scriptures examined in the Light of Modern knowledge’ పుస్తకంలో ఖురాన్ పేర్కొంటున్న ఖగోళ శాస్త్రం తాలూకు అంశాల గురించి, సృష్టి-దాని పరిణామం, తల్లి గర్భంలో పిండ దశల గురించి, ఇంకా అనేక శాస్త్రీయ విషయాలను ఆధునిక సైన్స్ వెలుగులో విశ్లేషించాడు. ఈ పుస్తకం 1988 సంవత్సరంలో ఓ అద్భుత రచనగా గుర్తించబడి దానికి “అకాడెమిక్ ఫ్రాంకాయిస్” నుండి ఒక పురస్కారం మరియు “ఫ్రెంచ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్” నుండి మరొక గౌరవ పురస్కారం లభించాయి.

ఈ పుస్తకం తరువాత డా. మోరిస్ బుకాయిల్ ‘What is the Origins of Man? The answers of Science and the Holy Scriptures’ అన్న మరొక పుస్తకాన్ని కూడా రచించటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *