“ముస్లిములైన మీరు మా దేవును ప్రసాదాలు ఎందుకు తినరు? అందులో తప్పేముంది? పండగలప్పుడు మీరు ఇచ్చే ఆహారపదార్థాలు మేము తినేటప్పుడు మా దేవుని ప్రసాదం మీకు అపవిత్రం ఎలా అవుతుంది?” సాధారణంగా ఈ ప్రశ్న ఏదో ఒక సందర్భంలో ముస్లిములకు ఎదురయ్యేదే.
హిందూ, ముస్లిముల మధ్య ధ్వేషాన్ని రగిలించటమే పనిగా పెట్టుకునే వేర్పాటు వాదులైతే “చూశారా ఈ ముస్లిములకు మా హిందువులన్నా హిందూ దేవుళ్లన్నా ఎంత చులకనో అపవిత్రమో” అంటూ రెచ్చగొట్టే ధొరణిలో మాట్లడటమే కాక దాన్ని ముస్లిములు హిందువుల పట్ల చూపే వివక్షగా మత పిచ్చిగా రకరకాలుగా అభివర్ణించి హిందూ ముస్లిముల మధ్య విషపు బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తుంటారు.
నిజంగా దేవుని ప్రసాదం తినకపోవటంలో ముస్లిముల ఉద్దేశం హిందువుల పట్ల వివక్ష చూపటమా?
ఉదాహరణకు హిందూ సమాజంలోనే దేవీదేవతల విగ్రహాల ముందు పూజాపునస్కారాలు చేసి జంతు బలులు అర్పించేవారిని, జంతు మాంసాన్ని ఇష్టంగా పవిత్రంగా తినేవారినీ చూస్తాం, హిందూ సమాజంలోనే బ్రాహ్మణులు, వైశ్యులు వగైరా కొన్ని వర్గాల్లో అదే జంతు మాంసాన్ని తినటం అపవిత్రంగా భావిస్తూ అస్సలు తినని వారినీ చూస్తాం.
దానిని బట్టి జంతు మాంసం తినని హిందువులు జంతు మాంసం తినే హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారనో, మత పిచ్చి ప్రదర్శిస్తున్నారనో అనుకోవటం కరెక్టేనా? లేదా వారి విశ్వాసాల పట్ల వారికున్న గౌరవం కొద్దీ తినకపోవటం అనుకోవాలా?
ఇప్పుడు జంతు మాంసం తినే హిందువులు, తినని హిందువులు ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉందా? లేక ఒకరిపట్ల మరొకరు వివక్ష చూపుతున్నట్లు ఊహించుకుని తగువులాడుకుంటూ కూర్చోవటం కరెక్టా? అన్నది గమనించాల్సిన విషయం.
అచ్చం ఈ ప్రసాదం సంగతి సైతం అంతే. ఇక్కడ ముస్లిములు హలాల్ చేయబడిన జంతు మాంసం మాత్రమే తినటం మరియు విగ్రహాలకు అర్పించబడిన ప్రసాదాలను తినకపోవటంలో ఉద్దేశం ఇస్లాం చెప్పే ఒక్క సృష్టికర్త మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన తప్ప సృష్టిలో దేవీదేవతలుగానీ, విగ్రహాలు గానీ, జంతువులు, చెట్లూ పుట్టలు, మహనీయులు వగైరా ఎవరూ ఆరాధనకు, ప్రార్ధనకు అర్హులు కారు అన్న మౌలిక విశ్వాసాన్ని దృఢంగా నమ్ముతూ ఆయన పేరుతో కాక ఇతరుల పేరుతో అర్పించబడిన వాటిని తినకూడదన్న నియమాన్ని అనుసరించటం మాత్రమే!
ఈ నమ్మకం ఎంతవరకూ సరైనదన్నది ఇక్కడ అసలు నా వాదనే కాదు. హలాల్ మాత్రమే తినటం మరియు ప్రసాదాలు తినకపోవటం వెనుక ముస్లిముల అసలు ఉద్దేశం- ముస్లిమేతరుల పట్ల వారి ఇష్ట దైవాల పట్ల చులకన భావన చూపుతూ కావాలని వివక్ష చూపటమా? లేక తమ ఇస్లాం ధర్మం నేర్పుతున్న విశ్వాసాలను గౌరవించటమా? అన్నదే ఇక్కడ అసలు చర్చ. ఒకవేళ రెండవదే అయిదే దానిని ముస్లిమేతరులు సైతం గౌరవించాల్సిందే!
ఎవరి మతవిశ్వాసాలను నమ్మకాలను వారు కలిగి ఉండటం, ప్రచారం చేసుకోవటం అన్నది రాజ్యాంగమే కల్పించిన హక్కు. అదే సమయంలో భిన్న మతాల ప్రజలు ఒక దేశంలో నివసిస్తున్నప్పుడు ఒకరి విశ్వాసాలను, నమ్మకాలను మరొకరు గౌరవించుకోవటం, హేళన, విమర్శ చెయ్యకపోవటం సైతం తప్పనిసరే! పైగా ఇతరుల మత విశ్వాసాలను హేళన చెయ్యటం రాజ్యాంగ విరుద్ధం కూడా.
చివరకు మత ప్రచారం చేసే బోధకులు సైతం కేవలం సత్యాసత్యాలను ధార్మిక గ్రంథాల ప్రకారం ప్రజలకు సుస్పష్టం చెయ్యటం వరకే తప్ప బలవంతం చెయ్యటం గానీ, ఇతర మతాల నమ్మకాలను హేళన చెయ్యటం గానీ విమర్శించటం ధార్మికంగానూ ఘోర పాపం మరియు నేరం అవుతుంది.
కాబట్టి ఒకవేళ తమ తోటి ముస్లిం సోదరులు ప్రసాదం తినటం ఇష్టం లేనప్పుడు తినమని బలవంత పెట్టటం, తమ పట్ల వివక్ష చూపుతున్నట్టు ఊహించుకుని వారిని విమర్శించటం తప్పే అవుతుంది. కచ్చితంగా వారి విశ్వాసాలను, నమ్మకాలను గౌరవించటం తప్పనిసరి అవుతుంది. ఇది ముస్లిమేతరులు ముస్లిములు వ్యవహరించాల్సిన విధానం.
ఇక ముస్లిముల విషయానికొస్తే ఒక్క హలాల్ చెయ్యబడని, చనిపోయిన జంతు మాంసాన్ని మరియు విగ్రహాలకు అర్పించబడిన వాటిని తినకపోవటం అన్నది కేవలం ఇస్లామియా విశ్వాసాల పట్ల నమ్మకం, గౌరవమే తప్ప తమ తోటి హిందువుల పట్ల వివక్ష చూపటమో, చులకన భావం ప్రదర్శించటం అన్న ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఇక్కడ ఉద్దేశాలే ప్రధానం. ఇక తమ విశ్వాసంలో భాగంగా ముస్లిములు కేవలం హలాల్ చెయ్యబడని, చనిపోయిన జంతు మాంసాన్ని మరియు విగ్రహాలకు అర్పించబడిన వాటిని తినకపోవటమే తప్ప ముస్లిమేతరుల ద్వారా ఏది ఇవ్వబడినా ముస్లిములు తినరనేది అభాండమే అవుతుంది. అలాగే ముస్లిములు తమ తోటి హిందూ సోదరులు ప్రసాదం చేతిలో పెట్టినప్పుడు తిరస్కరించటం సైతం సున్నితంగా ఉండాలి. ఒకవేళ అలా తిరస్కరించటం ఎదుటి వారిని బాధ కలిగించే సందర్భం ఏర్పడితే తాము తిననప్పటికీ దానిని గౌరవంగా స్వీకరించి మరొకరి ఇచ్చేయటమో ప్రక్కన పెట్టేయటంలోనో తప్పులేదు. మొత్తానికి ఇక్కడ అవగాహనతో ఒకరినొకరు ఎదుటివారి మనస్సులను నొప్పించకుండా సున్నితంగా వ్యవహరించటం అన్నది అసలు లక్ష్యం.
