కొన్ని పటిష్టమైన నియమాలు, ఆచారాలను విధించి ఫలానా విధంగా మాత్రమే కచ్చితంగా నడచుకోవాలని ఒక వ్యక్తిని బలవంతంగా ‘నిర్బంధించటం’ ఎంత ప్రమాదకరమో.. నీ ఇష్ట ప్రకారం ఎలా నచ్చితే అలా జీవించమని అసలు ఎటువంటి నియమాలూ లేకుండా పూర్తిగా ఒక వ్యక్తికి సంపూర్ణ ‘స్వేచ్ఛ’నివ్వటం కూడా అంతే ప్రమాదకరం.
ధర్మం, ధార్మిక గ్రంథాల దృక్పథాల పట్ల వెగటును ప్రదర్శించే నాస్తిక అభ్యుదయవాదులు చెప్పేది ఈ ప్రమాదకరమైన దృక్పథాన్నే! నీకంటూ ఆత్మగౌరవం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉన్నప్పుడు నీ స్వంత ఆలోచనల ప్రకారం, స్వంత ఛాయిస్ ప్రకారమే జీవించాలి.
నీకు ఏ బట్టలు ధరించాలనిపిస్తే అవి ధరించగలగాలి, ఏది నీకు తినాలనిపిస్తే అది తినాలి, ఎలా నీకు జీవించాలనిపిస్తే అలా జీవించాలి.. తప్పితే మరొకరి ఆలోచనలు, కొన్ని గుడ్డి నియమాలు, రూల్స్ & రెగ్యులేషన్స్ వగైరా వాటిని పాటిస్తూ నీకు నువ్వు కొన్ని నియమాలూ, కట్టుబాట్లతో నీ వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టుకుని జీవించటం అన్నది నిర్బంధంతో కూడిన జీవితం అవుతుంది.
అలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేని జీవితం బ్రతికినా వ్యర్థమే అన్నది నేటి అభినవ అభ్యుదయవాదుల వాదన.
మతం మనిషి స్వేచ్ఛను పూర్తిగా హరించి అతనిపై కొన్ని నిబంధనలను బలవంతంగా రుద్ది అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది కాబట్టి మతం మత్తు నుండి త్వరగా బయటపడాలన్న విషయాన్ని అంతిమంగా తెలియజేయటమే నాస్తికుల పై వాదన వెనుక అసలు లక్ష్యం.
ఒకరకంగా చెప్పాలంటే మతం మనిషిపై కొన్ని నియమాలను బలవంతంగా రుద్ది అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది అన్న వాదనే నేటి అధికశాతం ఆధునిక యువత, విద్యావేత్తలు ధార్మిక గ్రంథాలకు వాటి విశాల దృక్పథాలకు దూరమవటానికి ప్రధాన కారణమయ్యింది. కొన్ని గుడ్డి నమ్మకాలూ, సాంప్రదాయాలతో తయారు చెయ్యబడిన మత వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే నియమాలు ఉండవచ్చేమో గానీ ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మంలో అలాంటి నియమాలు లేవన్నది గమనార్హం.
ఉదాహరణకు మనిషిని పూర్తిగా ‘నిర్బంధించటం’ పూర్తిగా ‘స్వేచ్ఛనివ్వటం’ అన్న రెండు అతివాదాలకూ మధ్య ఇస్లాం “నిర్బంధంతో కూడిన స్వేచ్ఛ”ను మనిషికి ఇస్తుందన్నది గమనించాల్సిన అతి ప్రధానమైన విషయం. అసలు ఇతర జీవుల కంటే మనిషికి ప్రత్యేకంగా “Free will and freedom of choice” ఇవ్వటం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తుంది.
అదెలాగంటే ఇస్లాం మీకు ఇష్టమైన ప్రతీదీ తినండి, త్రాగండీ అని చెప్పి మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తుంది. దానితో పాటు అతని ఆరోగ్యం కొరకు “మీరు పరిశుద్ధమైన వాటిని తినమని” చెబుతుంది. ఒకవేళ జంతువుల మాంసం తినవలసివస్తే “కోరపళ్లు లేని మేసే చతుష్పాద జంతువుల మాంసం తినమని చెబుతుంది. మనిషి ఆరోగ్యాన్ని హాని కలిగించే చనిపోయిన జంతువుల మాంసాన్ని, రక్తాన్ని, పంది మాంసాన్నీ నిషేధిస్తుంది. మనిషి మత్తు కలిగించే వాటిని నిషేధిస్తుంది. ఈ కనీస నియమాలతో కూడిన నిబంధనలు పాటించటం వలన మనిషికే లాభం కలుగుతుంది తప్పితే ఈ నియమాలు మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే నియమాల కోవకు చెందవు.
ఇక మీకు ఇష్టమైన వస్త్రాలు ధరించండి. అవి మీకు ఎంతో హుందాతనాన్ని, సౌందర్యాన్ని కలుగజేస్తాయని చెప్పి మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తుంది. కాకపోతే వస్త్రాల విషయంలో హద్దులు మీరవద్దని ఇస్లాం చెబుతుంది. పురుషులైతే వారు తొడిగే బట్టల వల్ల హుందాతనం ఉట్టిపడాలి, స్త్రీలకైతే శరీరం మొత్తం కప్పబడేలా కొందరు చూసే కామవికార చూపులకు అవకాశం ఇవ్వకుండా బట్టలు ధరించమని చెబుతుంది.
అంతేకాక, అటు పురుషులకూ, ఇటు స్త్రీలకూ తమ చూపులను కాపాడుకోమని ఆదేశిస్తూ అనవసర ఆలోచనలను, కామకోరికలను కంట్రోల్ చేస్తుంది.
ఈ విధంగా పురుషులకు పర స్త్రీల వైపు వికారంగా చూడటం వారిని వేధింటాన్ని నిషేధిస్తూ.. స్త్రీలకు పురుషులను రెచ్చగొట్టే విధంగా శరీర వంపుసొంపులు ప్రదర్శిస్తూ తిరిగే విధంగా చాలీచాలని బట్టలు ధరించవద్దని చెబుతుంది.
బట్టల విషయంలో ఈ కనీస నియమాలతో కూడిన నిబంధనలు పాటించటం ఆ పాటించేవారికే లాభం తప్పితే ఈ నియమాలు మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే నియమాల కోవకు చెందవు.
ఈ విధంగా మనిషి జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఇస్లాం ఏ నియమాలనైతే విధిస్తుందో అవన్నీ మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవి కావు. మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తూనే అతని ఆరోగ్యం, స్వంత లాభం కొరకు కొన్ని అదనపు నియమాలను విధిస్తుంది.
మనిషిలో విశృంఖలత్వం, అశ్లీల్లతలకు కారణమయ్యే “సంపూర్ణ స్వేచ్చ” నివ్వక, మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తూనే అతని లాభం కొరకు, ఆరోగ్యం కొరకు కొన్ని నియమాలను విధిస్తూ ఇస్లాం మనిషికి “నిర్బంధంతో కూడిన స్వేచ్ఛను” ఇస్తుంది.
పైగా ఇస్లాం మనిషికి ఎన్ని నియమాలు చెప్పినప్పటికీ “ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు అని చెప్పి, ధర్మాన్ని ఇష్టముంటే పాటించటం, తిరస్కరించటం మీ ఇష్టం అని మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తుంది.
స్వేచ్ఛ – నిర్బంధం – ఇస్లాం
