ఇస్లాం పట్ల అక్కసుతో విమర్శచేసే చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఇస్లాం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తూ తలుపులను బార్లా తెరచి పెట్టిందన్నది. ఈ అపోహను ఆధారం చేసుకుని “పురుషులకో న్యాయం స్త్రీలకొకటా? ఏ స్త్రీలు నలుగురుని పెళ్లిచేసుకోకూడదా? అంటే ఇస్లాం ప్రకారం స్త్రీ, పురుషులు సమానం కారా? అంటూ అమాయక ప్రశ్నలేస్తుంటారు.
ఇలాంటి వారు ముందు ఇస్లాం నలుగురిని ఏ సందర్భంలో ఎందుకు వివాహం చేసుకోవటానికి అనుమతిచిందన్నది తెలుసుకోవాలి. దానికంటే ముందు ఖురాన్ – “మీరు ఒకామెనే పెళ్లి చేసుకోండి (4:3)” అని చెబుతుందన్నది గమనార్హం. మరి నలుగురేసి స్త్రీలను పెళ్లి చేసుకునే అనుమతి ఖురాన్ ఏ సందర్భంలో ఇచ్చింది? అంటే- “అనాథ పిల్లలకు న్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో ఇద్దరేసి, ముగ్గురేసి, నలుగురేసి స్త్రీలను వివాహం చేసుకోండి” అని ఖురాన్ అనుమతిస్తుంది తప్ప ఇది ఆజ్ఞ కాదు.
ఆ కాలంలో యుద్ధాల్లో భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి పిల్లలకు రక్షణ (Shelter) కల్పించే ఉద్దేశంతో ఇచ్చిన ఆజ్ఞ ఇది. దానికి కూడా కండీషన్ “వారితో న్యాయంగా వ్యవహరించగలిగే భరోసా ఉంటేనే” అన్నది. ఆ భరోసా లేకపోతే “ఒకామెనే పెళ్లి చేసుకోండి” అని ఖురాన్ ఆదేశిస్తుంది. ఇలా చెబుతూనే “భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ శక్తికి మించిన పని (4:129)” అని స్వయంగా చెబుతూనే ఖురాన్ ఒక స్త్రీనే వివాహమాడటానికి ప్రోత్సహిస్తుంది.
కాబట్టి ఖురాన్ ముస్లిం పురుషులందరికీ నలుగురేసి స్త్రీలను పెళ్లి చేసుకోమన్నది ఆయా స్త్రీల అనాథ పిల్లలను ఆదుకోటానికి, పోషించటానికి తప్పితే పురుషుల కామ కోరికలను దృష్టిలో పెట్టుకుని కనపడ్డ ప్రతీ స్త్రీ అందానికి దాసోహమైపోయి కామకోరికలతో రెచ్చిపోయి పెళ్లిళ్లు చేసుకుంటూ పోయి చెలరేగిపోటానికి కాదు.
ఈ ఆజ్ఞ ఒక్క పురుషులకు మాత్రమే ఇవ్వటం వెనుక ఉద్దేశం సమాజంలో స్త్రీ, పురుషుల స్వభావాలు, శరీరాకృతులు, ఆలోచనా విధానాలు గమనిస్తే స్త్రీ కోమలత్వం కలిగి ఉంటుంది. పురుషుడు ధృఢత్వాన్ని కలిగి ఉంటాడు. పురుషుడు స్వాభావికంగా కష్టపడి పని చేసి స్త్రీని పెంచి పోషించే, ఆమెకు రక్షణ కల్పించే బాధ్యత కలిగి ఉంటాడు. స్త్రీ స్వాభావికంగా పురుషుని ద్వారా భద్రత, ఆలనా పాలనా కోరుకుంటుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని రక్షణ, పోషణా బాధ్యతల దృష్ట్యా పురుషునికి ఒకరి కంటే మించి నాలుగు వివాహాల వరకు చేసుకోటానికి అనుమతినివ్వటం జరిగింది.
ఈ వాస్తవాలు చదివాక కూడా “ముస్లిం పురుషులకు నలుగురు, స్త్రీలకు మటుకు ఒక వివాహం చేసుకోటానికి అనుమతి ఇవ్వటం ఎంత అన్యాయం” అని ఎవరైనా వాదిస్తే ఈ ఆదర్శాన్ని వారు తమ నుండే మొదలెట్టి చూపాలి. ఇక వివాహ బంధంలో ఒకరినొకరికి పొసగనప్పుడు విడాకులు తీసుకునే హక్కును ఇస్లాం అటు పురుషునికి, ఇటు స్త్రీకి కూడా కల్పించింది. “పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయని (2:228) .. “మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది” (2: 178) అని ఖురానే చెబుతుంది. ఆ విధంగా ఖురాన్ స్థాయి పరంగా స్త్రీ, పురుషులను సమానంగా చూస్తుందే తప్ప, ఒకరిని తక్కువ, ఎక్కువ అన్న బేధాభావం ఎక్కడా చూపటం లేదు.
