కాబాలో జరిగేది విగ్రహారాధనా.. !?

సోషల్ మీడియా, వాట్స్ యాపుల్లో తిరిగే గాలి వార్తల్ని పట్టుకుని ఇస్లాంను విమర్శించే ఏ ఒక్కరికీ ఇస్లాం అవగాహన కాదు కదా కనీస లోకజ్ఞానం సైతం ఉండదు.

దానికి గొప్ప ఉదాహరణ: “ముస్లిములు మక్కాలో ఉన్న కాబాను ప్రార్ధించటం, దాని చుట్టూ ప్రదీక్షణలు చెయ్యటం విగ్రహారాధన కాదా? కాబాలో ఆ నల్ల రాయిని మ్రొక్కుతూ మీరు విగ్రహారాధన చెయ్యటం లేదా?” అంటూ అమాయకంగా ప్రశ్నించటమే!

మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి “కాబా మసీదులో ఓ మూల అమర్చబడిన ఆ నల్లరాయి శివలింగమే! ముస్లిములు శివలింగానికి పూజలు చేస్తుంటారు” అని పగటి కలల్లో ఊహించుకున్న వాటినే అక్కడకు వెళ్లి చూసొచ్చినట్టు చెప్పేస్తుంటారు.
* * *

ఒక్క మాటలో చెప్పాలంటే అరేబియా దేశంలో మక్కా నగరంలో ఉన్న “కాబా” అన్నది ముస్లిములు నమాజ్ చేసుకునే అనేక మసీదుల్లో ఒకటి అంతే తప్ప మరేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ఎలాగైతే అనేక మసీదుల్లో సామూహికంగా సృష్టికర్త అయిన దైవానికి నమాజ్ (ప్రార్ధన) చేస్తుంటారో.. అచ్చం అలానే కాబా మసీదులో సైతం ముస్లిములు ఆ దైవానికి సామూహిక ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు.


కాకపోతే ఇతర మసీదుల్లో ముస్లిములు కాబా దిక్కువైపు అభిముఖంగా నిలబడి నమాజ్ చదువుతారంతే తేడా.

అయితే అతి ప్రాచీనమైన కాబా మసీదును ప్రవక్త ఇబ్రాహీం మరియు ప్రవక్త ఇస్మాయిల్ (అలై) వేల సంవత్సరాలకు పూర్వం ఆ అరేబియా ఎడారిలో తమ స్వహస్తాలతో నిర్మించి, సృష్టికర్త అయిన దైవాన్ని ఏ విగ్రహమూ పెట్టకుండా ప్రార్ధించే విధానాన్ని (నమాజ్ ను) అక్కడ పునః స్థాపించటం, ఖురాన్ లో కాబా దిక్కువైపు తిరిగి నమాజ్ చెయ్యాల్సిందిగా ప్రపంచవ్యాప్త ముస్లిములకు ఆదేశించటం, కాబా మసీదును సందర్శించి వచ్చే “హజ్” ప్రక్రియను నిర్దేశించటం వల్ల ఆ కాబా మసీదుకు మిగతా మసీదుల కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తప్పితే ఏ ముస్లిమూ కాబా గృహాన్ని ప్రార్ధించటం గానీ, దానికి దైవత్వం ఉంటుందని విశ్వసించటం గానీ చెయ్యడు. పైగా స్వయంగా ఖురాన్..

“ఈ (కాబా) “యొక్క” ప్రభువునే ఆరాధించాలి” – ఖురాన్ 106:3

అని ఆదేశిస్తుంది తప్పితే కాబాను ఆరాధించండి అని చెప్పటం లేదు.

నమాజ్ లో “ఖిబ్లా (దిక్కు)” దేనికి?

ఏ విగ్రహం లేకుండా దైవాన్ని ప్రార్ధించే విధానమే నమాజ్. పేద-ధనిక, నలుపు-తెలుపు అన్న బేధభావాలు లేకుండా సామూహికంగా అందరూ ఐక్యంగా కలసి వరుసలుగా నిలబడి కాబా దిక్కు వైపు అభిముఖంగా రోజులో ఐదు పుట్లా నమాజ్ చేసే ఆదేశం ప్రపంచవ్యాప్త ముస్లిములకు ఖురాన్ లో ఇవ్వబడింది.

ఎందుకు? అంటే- సామూహికంగా అందరూ కలిసి ఒకే వరుసలో నిలబడి ఒకే సమయంలో ఒకే దైవాన్ని ప్రార్ధించేటప్పుడు క్రమశిక్షణ (Discipline) సైతం అవసరం అవుతుంది. కాబట్టి ఒకే వరుసలో నిలబడి ఒకే విధంగా నమాజ్ చదివేటప్పుడు అందరూ ఏదో ఒక ప్రత్యేక దిక్కు (Direction) వైపు నిలబడటం సైతం తప్పని సరి అవుతుందన్నది నిర్వివాదం.

ఉదాహరణకు మిలట్రీలోని సైనికుల సామూహిక కవాతునే తీసుకుంటే అందులో సైనికులంతా ఒకే విధంగా ఒకే సమయంలో ఒకే క్రమంలో ఒకే దిశలో నడవటం, శాల్యూట్ చెయ్యటం వగైరా విన్యాసాలు చేస్తుంటారు. అప్పుడే ఒక క్రమశిక్షణ, ఐక్యత (Unity) అన్నవి ఏర్పడతాయి. తప్పితే ఎవరికి వారు ఎటుపడితే అటు తిరుగుతూ ఇష్టమొచ్చినట్టు సైనిక కవాతు చెయ్యరు.

అచ్చం అలాగే ప్రపంచంలో ఉన్న మసీదులన్నిటిలో వరుసలు వరుసలుగా నిలబడి సామూహికంగా నమాజ్ ఆచరించే ముస్లిములందరికీ, కాబా మసీదు దిక్కు (Direction)ను అభిముఖంగా చేసుకుని ఒకే క్రమంలో ఒకే విధంగా ప్రార్ధన చేసే విధానం నిర్దేశించబడింది. దీని వలన క్రమశిక్షణ, ఐక్యత (Discipline and Unity) అన్నవి ఏర్పడతాయి. ఇది కాబా దిక్కు వైపు నిలబడి ప్రార్ధన చెయ్యమని ఆదేశించటం వెనుక అసలు ఉద్దేశం.

మరి ఆ కాబాలో ఉన్న నల్ల రాయి సంగతి ఏమిటి?

కాబాలో ఉన్న నల్ల రాయి చాలా మందికి అదో మిస్టరీ! నిజానికి చతురస్రాకారంలో ఉండే కాబా మసీదు నాలుగు మూలల్లో ఒక మూల దాన్ని “కార్నర్ స్టోన్” మాదిరిగా ఎప్పుడో ప్రవక్త ఇబ్రాహీం (అలై) కాలంలోనే అమర్చి నిర్మించటం జరిగింది. అది ఆదమ్ (అలై) ప్రవక్త కాలం నుండే ఉండేదని చరిత్ర కూడా ఉంది.

సామూహికంగా నమాజ్ ను క్రమశిక్షణతో చదవటానికి కచ్చితంగా ఏదో ఒక దిక్కు (Direction) ఉండాలని పైన మనం చెప్పుకున్నాం. ప్రాచీన కాలంలో కాబా మసీదు కట్టక పూర్వం ఆనాటి ఆ ఎడారి ప్రాంతంలో నమాజ్ చదివేటప్పుడు ఒక దిక్కు (Direction) కోసం మరియు అది ప్రార్ధనా ప్రదేశం అన్న దానికి చిహ్నంగా ఆ రాయిని ఉపయోగించేవారు.

ఈనాడు సైతం చాలా మంది ఒంటరిగా నమాజ్ ఆచరించేవారిని గమనిస్తే వారు తమకు ఎదురుగా ఒక రాయినో, కర్రనో లేక ఏదొక వస్తువునో పెట్టుకుని నమాజ్ చెయ్యటం చూడగలం. దానినే “సుత్ర” అంటారు. అది ఎందుకంటే అటు ఇటు తిరిగే వారికి ఇది నమాజ్ చదవబడుతున్న ప్రదేశము అని, ఆ వస్తువు వరకు వదిలిపెట్టి వెళ్లండి అని సూచించటానికి మాత్రమే. సరిగ్గా ఆ కాబాలో ఉన్న రాయి ఇదే విధంగా ఒకప్పుడు ఉపయోగించబడేది.

తరువాత ఆ ప్రదేశంలోనే మసీదు కట్టి అక్కడ సృష్టికర్త అయిన దైవాన్ని ప్రార్ధించటం, దైవాన్ని స్మరిస్తూ ఆ మసీదు చుట్టూ ప్రదక్షిణ (తవ్వాఫ్) చెయ్యటం అనే విధానాలు నిర్దేశించబడ్డాక.. ప్రవక్త ఇబ్రాహీం (అలై) ఆ రాయినే చతురస్రాకారం (Square shape) లో కట్టబడ్డ ఆ కాబా మసీదు నాలుగు మూలల్లో ఓ మూల అమర్చి ఆ మసీదును నిర్మించటం జరిగింది.

దానికి కారణం ఆ కాబా మసీదు చుట్టూ ప్రదిక్షణ చేసేటప్పుడు ప్రారంభం, ముగింపు గుర్తు (Starting and ending point) ఒకటి ఉండాలి కాబట్టి ఒకేలా చతురస్రాకారంలో ఉండే ఆ మసీదు నాలుగు మూలల్లో ఒక గోడలో దాన్ని అమర్చి కట్టటం జరిగింది. ఇక ఆ కాబా మసీదు చుట్టూ దైవ నామస్మరణ చేస్తూ ప్రదీక్షణలు చెయ్యటం సైతం దైవారాధనలో భాగంగా నిర్దేశించబడిండే తప్ప ఆ కాబా మసీదును ప్రార్ధించే ఉద్దేశంతో నిర్దేశించబడింది కాదు.

ఇదే అసలు ఆ రాయి కాబా మసీదు గోడలో అమర్చటం వెనుక ఉన్న అసలు కారణం. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో సైతం కాబా మసీదు పునర్నిర్మించినప్పుడు ఆ ప్రాచీన రాయిని మసీదు నాలుగు మూలల్లో ఒక మూల గోడలో అమర్చబడి కట్టటం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రలో భాగంగా కాబా మసీదు చుట్టూ ప్రదీక్షణలు (తవ్వాఫ్) చేసే ముస్లిములకు ప్రారంభం, ముగింపుకు ఒక గుర్తు (Symbol) గా ఉండటానికి. సరిగ్గా రాయిని అమర్చబడిన ప్రదేశం నుండే ముస్లిములు ప్రదిక్షణలు మొదలెట్టి పరిపూర్తి చేస్తుంటారు. అంతకు మించి ఆ రాయి వల్ల అక్కడ ఏ ఉపయోగమూ లేదు.

ఈ వాస్తవాలు తెలీని కొందరు అర్థ మెదడు మేధావులు ముస్లిములంతా కలిసి ఆ కాబా మసీదు చుట్టూ ప్రదీక్షణ చేస్తూ అక్కడున్న రాయికి ప్రార్ధన చేస్తుంటారని భ్రమ పడుటూ ప్రచారాలు చేస్తుంటారు.

అయితే హజ్, ఉమ్రాలకు వెళ్లే వారు ఆ ప్రాచీన రాయిని ముట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటంతో అది డ్యామేజ్ అవుతున్న కారణంగా అక్కడి అరబ్ గవర్నమెంటు దాన్ని కాబా గోడకు ఒక గాజు గదిలా తయారు చేసి అందులో భద్రపరచటం జరిగింది. దానిని అక్కడకు వెళ్లే ముస్లిములు మ్యూజియంలో వస్తువు మాదిరిగా చూడటమే తప్ప పూజించరు.

కొసమెరుపు ఏమిటంటే.. ముహమ్మద్ (స) ప్రవక్తగా ఎన్నుకోబడక పూర్వం కాబా మసీదులో అప్పటి అనాగరిక అరబ్బులు 360 విగ్రహాలు పెట్టి పూజలు చేసే సందర్భంలో సైతం ఎవరూ ఆ రాయిని పూజించేవారు కాదు. ఎందుకంటే దాన్ని వారు ఓ ప్రాచీన వస్తువుగానే చూసేవారే తప్ప దానికి దైవత్వం ఉందని ఆనాటి అనాగరిక అరబ్బులు సైతం భావించేవారు కాదు. తరువాతి కాలంలో ప్రవక్త ముహమ్మద్ (స) కాబాలో ఉన్న 360 విగ్రహాలనూ ధ్వంసం చేయించి విగ్రహారాధనను సమూలంగా తుడిచిపెట్టేశారు. హజ్రత్ ఉమర్ (రజి) “అది కేవలం ఒక రాయి తప్ప దానికి ఎటువంటి విశిష్టతా లేదు” అని ఓ సందర్భంలో ప్రకటించటం జరిగింది.

ఈ వాస్తవాలన్నీ చదివాక కూడా ఎవరైనా… అబ్బే లేదండీ మాకు వాట్స్ యాప్ జ్ఞానమే వేదం, కాబాలో జరిగేది విగ్రహారాధన అని ఊహించుకోవటంలోనే పైశాచికానందం లభిస్తుందంటే చేసేదేమీ లేదు.

ఊహించుకునేవారు అసంబద్ధమైన అవాస్తవాలను ఎన్నైనా ఊహించుకుని తృప్తి పొందవచ్చు. ఉదాహరణకు: హిట్లర్ తాజ్ మహల్ ను కట్టించాడని, ఏయిర్ పోర్టుల్లో రైళ్లు తిరుగుతుంటాయని, పక్షులు నీటిలో ఈదుతుంటాయని, కాబాలో విగ్రహారాధన జరుగుతుంటుందని.. వగైరా ఎన్ని అవాస్తవాలనైనా హ్యాపీగా ఊహించుకుని ఆనందపడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *