ధ్వేషం తిరిగి ప్రేమగా మార్పు చెందటమన్నది బంధువుల మధ్యనో స్నేహితుల మధ్యనో సాధ్యమేమో గానీ.. ఒకప్పుడు పరాయి మతం పట్ల తీవ్రమైన విధ్వేషాన్ని వెళ్లగక్కుతూ వచ్చినవారు తిరిగి అదే మతాన్ని గాఢంగా ప్రేమించేవారిగా మారిపోవటం అన్నది బహుశా పీడకల్లో సైతం ఊహించటానికి సాధ్యం కాని అసాధారణ పరిణామని చెప్పాలి.
ఇస్లాంను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించే ఈ క్రింది ఏడుగురు కరుడుగట్టిన ఇస్లాం ధ్వేషకుల జీవిత కథలు చదివితే ఎవరైనా ఆశ్చర్యంలో మునిగిపోవలసిందే! ఎందుకంటే ఇక్కడ నేను ప్రస్తావించబోతున్న “ఇస్లాం ధ్వేషకులు” ఏదో సోషల్ మీడియాలో నాలుగ్గోడల మధ్య కూర్చుని ఇస్లాం పట్ల చిల్లర కామెంట్లు పెడుతూ టైంపాస్ చేసే ఆషామాషీ వ్యక్తుల్లాంటి వారు కారు కానీ, ఒకప్పుడు ఇస్లాంను తుడుచిపెట్టేయాలన్నంత తీవ్ర ధ్వేషం వారిది! వారే చివరకు ఇస్లాంను ప్రేమించి, ప్రచారం చేసేవారిగా మారిపోయారు. ఈ పరిణామం నమ్మశక్యమేనా? దానికి కారణం ఏమిటో ప్రతిఒక్కరూ తప్పక చదవాల్సిందే.
1. “జోరమ్ వాన్ క్లావెరెన్ (Joram van Klaveren)”
“జోరమ్ వాన్ క్లావెరెన్ నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, అంతేకాక “ఫార్-రైట్ పార్టీ (PVV)” తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (MP) గా ఎన్నికైన జోరమ్ వాన్ క్లావెరెన్ ఇస్లాంను విపరీతంగా ధ్వేషించే “గీర్ట్ విల్డెర్స్ (Geert Wilder)” ద్వారా స్థాపించబడిన “యాంటీ-ఇస్లామిక్ (Anti-Islamic)” ఉద్యమంలో అతనికి కుడి భుజంగా పనిచేస్తూ వచ్చాడు. డచ్ పార్లమెంట్ లో అయితే ముస్లిములను, నఖాబ్, మస్జిద్ లను నిషేధించాలని ఇస్లాంను బ్యాన్ చెయ్యాలని తీవ్రంగా గళమెత్తాడు! అంతేకాక, ఇస్లాం ఓ అబద్ధ మతమని, ప్రవక్త ముహమ్మద్ ఓ క్రిమినల్, ఖురాన్ ఓ విషపూరిత పుస్తకమని ప్రచారం కూడా చేశాడు! ఇస్లాంకు వ్యతిరేకంగా “ఈవిల్ ఇన్ ఇస్లాం” అన్న పేరుతో పుస్తకం రాయాలని మొదలెట్టిన ప్రయాణంలో ఇస్లాం గురించి లోతైన పరిశీలన చెయ్యటం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర పూర్తిగా చదివాడు. అతని పరిశీలన చివరకు 2015 సం.లో ఇస్లాం స్వీకరించేలా చేసింది. చివరకు “ఫ్రమ్ క్రిస్టియానిటీ టూ ఇస్లాం ఇన్ టైమ్స్ ఆఫ్ సెక్యూలర్ టెర్రర్” అన్న టైటిల్ తో తాను ఇస్లాంలోకి ఎలా మారాడో వివరిస్తూ తన పుస్తకాన్ని పూర్తి చేశాడు.
* * *
2. ఆర్తుర్ వాంగర్ (Artur Wanger)
“గీర్ట్ విల్డెర్స్” స్థాపించిన “ఫార్-రైట్ పార్టీ (PVV) “కి చెందిన మరో సభ్యుడు ఆర్తుర్ వాంగర్ (Artur Wanger). ఇతనో ప్రముఖ రాజకీయ వేత్త, ఒకప్పటి కరుడు కట్టిన ఇస్లాం ధ్వేషి! పుట్టుకతోనే ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు కూడా. జర్మనీలో ఇస్లాం నామరూపాలు లేకుండా చెయ్యాలి, అక్కడి మసీదు కట్టడాలన్నీ ఆపేయ్యాలన్నది ఈ పార్టీ తరఫున ఆర్తుర్ వాంగర్ లక్ష్యం. పైగా ఇస్లాంకు వ్యతిరేకంగా ముస్లిములు అంటే ఉగ్రవాదులని చిత్రీకరిస్తూ అనేక వీడియోలను కూడా ఆర్తుర్ వాంగర్ తీయటం జరిగింది. ఆ సందర్భంలోనే ఖురాన్ చదివే ఓ సందర్భం వచ్చింది. కొన్నాళ్ళకు “ఫార్-రైట్ పార్టీ”కి రాజీనామా చేసిన ఆర్తుర్ వాంగర్ ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు. ప్రస్తుతం అతని పేరు ప్రస్తుతం అహ్మద్.
* * *
3. అర్నౌడ్ వాన్ డూర్న్ (Arnoud van Doorn)
ఇస్లాం వ్యతిరేక సంస్థ అయిన “ఫార్-రైట్ పార్టీ (PVV)” నుండి బయటకు వచ్చి ఇస్లాం స్వీకరించిన మూడవ వ్యక్తి అర్నౌడ్ వాన్ డూర్న్! పాపం ఏ ముహూర్తంలో “గీర్ట్ విల్డెర్స్” ఇస్లాంకు వ్యతిరేకంగా “ఫార్-రైట్ పార్టీ (PVV)” స్థాపించాడో గానీ ఇస్లాంను నామరూపాలు లేకుండా చెయ్యాలని అతను ఎన్నుకున్న వారిలో అతనికి కుడి, ఎడమ భుజాల్లాంటి “జోరమ్ వాన్ క్లావెరెన్” “ఆర్తుర్ వాంగర్” కంటే ముందే “అర్నౌడ్ వాన్ డూర్న్” ఇస్లాం స్వీకరించాడు. దానికి కారణం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇస్లామోఫోబిక్ అయిన “గీర్ట్ విల్డెర్స్” 2008 సం.లో ఓ 17 నిముషాల నివిడితో ఇస్లాం ఉగ్రవాదాన్ని నేర్పుతుందని చెబుతూ “ఫిత్నా (Fitna) అనే లఘు చిత్రాన్ని విడుదల చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆ చిత్రం పట్ల ముస్లిముల తీవ్ర నిరసనలు బయలుదేరాయి. అదే “అర్నౌడ్ వాన్ డూర్న్” కు ఇస్లాం గురించి పరిశీలన వైపుకు అడుగులు వేసేలా చేసింది. చివరకు ఇస్లాం స్వీకరించి ఏప్రిల్ 2012 సం.లో ముస్లిం అయిపోయాడు.
* * *
4. అబ్రాహామ్ కిల్లింగ్టన్ (Abraham Killington)
ఒకప్పటి కరుడుకట్టిన ఇస్లాం ధ్వేషకుడైన “అబ్రహాం కిల్లింటన్ పుట్టుకతో క్రైస్తవుడు. యునైటెడ్ స్టేట్స్ 9/11 దాడులు అతనిలో ఇస్లాం పట్ల తీవ్ర విధ్వేషాన్ని నింపాయి. ఆ సంఘటన తరువాత మీడియా ఇస్లాం గురించి చేస్తూ వచ్చిన ప్రతికూల (Negative) ప్రచారంతో ముస్లిములే ప్రపంచం మొత్తం మీద భయంకరమైన దారుణాలు, ఉగ్రవాదం చేస్తున్నారన్న భావనకు లోనై, తన జీవిత కాలంలో ఎంతమందిని వీలైతే అంతమంది ముస్లిములను చంపటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, దానికోసం ఆర్మీలో చేరటానికి మూడు సార్లు దరఖాస్తులు సైతం పెట్టి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఆర్మీక్యాంపులో ఉండగా ఓ సందర్భంలో టెర్రర్ టాక్ అనే అమెరికన్ గవర్నమెంటు ద్వారా నిర్వహించబడుతున్న ఓ రేడియో కార్యక్రమంలో ప్రవక్త ముహమ్మద్ (స) గురించి వ్యతిరేకంగా చెబుతున్న విషయాలు విన్నాడు. ఆ సందర్భంలోనే అసలు ముస్లిముల మూల విశ్వాసం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని ఓ రోజు ఖురాన్ పేజీలు తిరగేయటం ప్రారంభించాడు. ఒకొక్క అధ్యాయం చదువుతూ పోయే కోద్దీ ఇస్లాం పట్ల అతనికి ఉన్న అపార్థాల మబ్బులన్నీ ఒకొక్కటిగా తొలగిపోవటం ప్రారంభించాయి. ప్రపంచంలో కొందరు ముస్లిం పేర్లు తగిలించుకుని చేస్తున్న ఉగ్రవాదానికి ఖురాన్ ఇస్తున్న సందేశానికి అసలు ఏ మాత్రం పొంతనలేదని తెలుసుకోవటమే కాదు, ఖురాన్ వాస్తవానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నాడా మనిషి. చివరకు ముస్లిములను చంపాలని కంకణం కట్టుకుని బయలుదేరిన అబ్రహాం కిల్లింటన్ ఖురాన్ చదివి ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు.
* * *
5. రిచర్డ్ ఎం.సీ. కిన్నే (Richard M.C. Kinne)
ఇస్లాంను ధ్వేషించే, విమర్శించే వారు ఎంతమంది ఉన్నప్పటికీ.. అమెరికా పశ్చిమ ప్రాంతమైన ఇండియానా రాష్ట్రంలో ‘మున్సీ’ కి చెందిన రిచర్డ్ ఎం.సీ. కిన్నే తో ఎవరూ సరిపోరు. ఎందుకంటే తన చేతులతో శక్తివంతమైన బాంబును తయారుచేసి ముస్లిములను చంపెయ్యాలనుకున్నంత ధ్వేషం ఆ మనిషిది. మిలట్రీ ఉండగా ఇరాక్ తో యుద్ధం చేస్తున్నప్పుడు గాయపడి 25 సం.లకే రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఇస్లాం తన ప్రధాన శత్రువు అన్న నిర్ణయానికి అప్పటికే వచ్చేశాడు. ఇండియానా మున్సీ లో ఉన్న ఇస్లామిక్ సెంటర్ ను బాంబ్ పెట్టి పేల్చేసి కనీసం అక్కడకు రోజూ వచ్చే రెండుమూడొందల మందిని చంపేయ్యాలని పథకం పన్నాడు.
తాను బాంబ్ పెట్టి పేల్చేయ్యాలనుకున్న ఇస్లామిక్ సెంటర్ కే ఓ రోజు వెళ్లాడు. లోపలికి అడుగెట్టగానే అక్కడ అతనికి సాదర ఆహ్వానం లభించింది. అక్కడున్న ఓ ముస్లిం వ్యక్తి రిచర్డ్ ను ఎంతో ఆప్యాయతతో మాట్లాడి ఖురాన్ ను అతని చేతిలో పెట్టాడు. ముస్లిములను చూస్తేనే మండిపోయే ఆ మనిషి ఖురాన్ లోని కొన్ని పేజీలను అటూ ఇటూ తిప్పటం మొదలెట్టాడు. అందులో… “ఒక మానవుణ్ణి అన్యాయంగా చంపిన వాడు సమస్త మానవులను చంపినట్లే ఒక మానవుడి మనిషి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” అన్న వాక్యం కనపడింది. ఈ వాక్యం ఆ రిచర్డును ఆలోచనలో పడవేసింది. టెర్రరిజం చేస్తున్న వారి ప్రకారం అయితే ఖురాన్లో అందర్నీ చంపేస్తే పుణ్యమని ఉండాలి కదా? పైగా ఒకణ్ణి చంపితే మొత్తం మానవులను చంపినంత పాపం అంటుందేమిటీ పుస్తకం? అంటూ అతని మదిలో మెదిలిన ప్రశ్నలే అతనితో పూర్తి ఖురాన్ ను కూర్చోబెట్టి చదివించాయి. ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత విధానం, ఆయన బోధలు అతని ఆలోచనల్లో ఇస్లాం పట్ల ఉన్న ధ్వేషాన్ని ఇష్టంలోకి మార్చేశాయి. నేడు జరుగుతున్న టెర్రరిజానికీ ఇస్లాంకూ కించిత్తు సంబంధం లేదన్న విషయం అతనికి సుస్పష్టమైంది. చివరకు ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు.
* * *
6. బల్బీర్ సింగ్ (Balbir Singh)
1992 సం.లో బాబ్రీ మసీదును కొన్ని వందల సంఖ్యలో కరసేవకులు గుంపుగా వచ్చి కూల్చేసిన సంఘటన తెలియనివారుండరు. ఆ కరసేవకుల్లో ఒకడే బల్బీర్ సింగ్! బాల్ ధాకరే ప్రసంగాలకు ఆకర్షించబడి శివసేనలో సభ్యునిగా చేరాడు. తరువాత RSS భావజాలానికి ప్రేరేపించబడి ఇస్లాంపై ధ్వేషంతో బాబ్రీ మసీదు పడగొట్టటంలో తన పాత్ర నిర్వహించాడు. బాబ్రీ మసీదు కప్పు పైకెక్కి దాని కప్పును కూల్చిన అతి కొద్ది మందిలో బల్బీర్ సింగ్ ప్రముఖుడు. కానీ, ఎందుకో బల్బీర్ సింగ్ లో ఓ ప్రాచీన మసీదును చేతులతో కూల్చినందుకు పశ్చాత్తాపం బయలుదేరింది. అదే అతనికి ఇస్లాం గురించి ఆలోచించేలా చేసింది. చివరకు బల్బీర్ సింగ్ ఇస్లాం వాస్తవికత తెలుసుకుని ముస్లింగా మారిపోయాడు. బాబ్రీ మసీదు కూల్చిన పాపానికి 100 మసీదులు కట్టిస్తానని లక్ష్యంతో బయలుదేరి తన లక్ష్యాన్ని పూర్తి చెయ్యాటమే కాక పిల్లలకు ఇస్లాం పాఠాలు నేర్పటానికి ఓ స్కూల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఒకప్పటి ఈ హిందూ ఇస్లామోఫోబిక్ పేరు ప్రస్తుతం ముహమ్మద్ అమీర్.
* * *
7. స్వామీ లక్ష్మీ శంకరాచార్య (Swamy Lakshmi Sankaracharya)
“స్వామీ లక్ష్మీ శంకరాచార్య” ఒకానొకప్పుడు ఎంతటి కరుడుకట్టిన ఇస్లాం ధ్వేషకుడంటే “ఇస్లాం ఆతంక్ వాద్ కా ఇతిహాస్ (ఇస్లాం ఉగ్రవాద చరిత్ర)” అన్న పేరుతో పుస్తకం రాయగలిగినంత అన్నమాట! ఆ పుస్తకం “హిస్టోరీ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిజం” అన్న పేరుతో ఇంగ్లీష్ లో కూడా అనువాదమయ్యింది.
ఒకానొకప్పుడు ఇస్లాం పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” గారు చేస్తున్న పనికి సులువుగా ఫండ్స్ రావాలంటే ఇస్లాంకు వ్యతిరేకంగా ఒక పుస్తకం రాయమని సలహా ఇచ్చాడో పెద్ద మనిషి. ఆ విధంగా మరొక పెద్ద యాంటీ ఇస్లామిక్ పుస్తకం రాయాలని సంకల్పించుకున్న “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” ముందుగా ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర చదివితే… ఇస్లాం ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందో మరింత సమాచారం దొరికే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన చరిత్ర చదవటం మొదలెట్టారు. కానీ, ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర చదివేకొద్దీ ఆయన ఇస్లాం పట్ల ఆయనకు ఉన్న ధ్వేషం క్రమంగా పటాపంచలవుతూ పోయింది. ఆయన చరిత్రతో పాటు ఖురాన్ ను పూర్తిగా పరిశీలించి చదివితే ఖురాన్ నిజానికి ఉగ్రవాదాన్ని ప్రేరేపించటం లేదు కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందన్న సత్యాన్ని గ్రహించగలిగారు. ఇస్లాం ఉగ్రవాదం ప్రేరేపిస్తుందని యాంటీ ఇస్లామిక్ రచన చెయ్యాలనుకున్న “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” చివరకు ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను, ఖురాన్ ను పరిశీలనగా చదివాక ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేపించటం లేదు కానీ, “ఆదర్శవాదాన్ని” నేర్పుతుందన్న వాస్తవాన్ని గ్రహించి ఒక రచనను ప్రారంభించారు. ఆ పుస్తకమే “ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?” అన్నది.
* * *
పైన ప్రస్తావించబడిన వారంతా పుట్టుకతోనే ఇస్లాం ధ్వేషకులుకు కారు. కేవలం ఇస్లామోఫోబియాను పెంచి పోషించే మీడియా విధ్వేషపూరిత ప్రచార ప్రభావం, కొందరు ముస్లిం పేర్లు తగిలించుకుని ఇస్లాం అవగాహనారాహిత్యంతో చేస్తూ వచ్చిన పనులే వారిలో ఇస్లాం పట్ల ధ్వేషాన్ని ప్రేరేపించింది! అలాంటి ఇస్లాం ధ్వేషకులైన వీరంతా ఏదో మహిమాన్వితంగానో లేక ఒకరి ప్రలోభానికో గురై ఇస్లాంను స్వీకరించలేదు కానీ, ఖురాన్ ను, ఇస్లాంను లోతైన అధ్యయనం చేసిన తరువాతనే ఇస్లాంలోని సత్యతను గ్రహించాక దాని పట్ల వారికున్న ధేషం పటాపంచలై ఇస్లాంకు వారు దగ్గరయ్యారు.
ఇప్పుడు ఇస్లాం పట్ల ఏ మాత్రం ధ్వేషం ఉన్నవారెవరైనా సింపుల్ గా చెయ్యాల్సింది అచ్చం వీరికిలానే ఇస్లాంను గాసిప్పుల్లోనో, మీడియా వార్తల్లోనో కాక ఖురాన్ చదివి చూడాలి. ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర నిస్పక్షపాతంగా చదివి అర్థం చేసుకోవాలి.
ఇస్లాంను ప్రేమించిన కరుడుగట్టిన ఇస్లాం ధ్వేషకులు
