ఇస్లాం స్వీకరించటం అంటే .. !?

“హిందూ మతం స్వీకరించటం అంటే ఇదేనా?” అన్న శీర్షికతో నేను రాసిన గత టాపిక్ పై చాలా మంది హిందూ సోదరులు ఉత్తమంగానూ కామెంట్లు పెట్టారు. కొందరైతే సహనం కోల్పోయి విమర్శలతో కామెంట్లు సైతం పెట్టారు. వారిలో కొందరు నన్ను అడిగిన ప్రశ్న “ఇస్లాం స్వీకరించటం ఏమిటి? దానికి చెయ్యాల్సింది ఏమిటి?” అని ఇస్లాం స్వీకరించటానికి విగ్రహాలకు పూజలు చేసి పాలాభిషేకాలో క్షీరాభిషేకాలో చెయ్యాల్సిన పని ఉండదు! అలాగే చెరువుల్లోనో కాలవల్లోనో మునకెయ్యాల్సిన పని కూడా లేదు!

అలాగే ఒక వ్యక్తి తమ పేరును రహ్మాన్ అనో అబ్దుల్లా అనో మార్చేసుకున్నంత మాత్రనా ముస్లిమైపోడు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ముస్లింగా పరిగణించబడినప్పటికీ ఇస్లాం ప్రకారం అయితే ఈ సమస్త విశ్వానికీ కేవలం సృష్టికర్త ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన్ని అరబ్బీలో అల్లాహ్ అని పిలిచినా, హెబ్రూ లో యెహోవా అని పిలిచినా, సంస్కృతంలో స్వర్వేశ్వరుడని పిలిచినా ఆయన ఒక్కడే అని ధృఢంగా నమ్మి, ఆయన ద్వారా పంపబడిన మహనీయులైన అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, యేసు వగైరా అనేక మంది ప్రవక్తల నుండి చివరి ప్రవక్త ముహమ్మద్ (స) వరకు వచ్చిన వారంతా దేవుని దాసులే తప్ప దేవుళ్లో, దేవుని అవతారాలో అవతార పురుషులో కారని విశ్వసించి వారిని అనుసరించటం.

ఈ విధమైన విశ్వాసం కలిగి ఉండేవారంతా ఏ దేశానికి ఏ మతానికి, ఏ కులానికి చెందిన వారైనప్పటికీ దేవుని దృష్టిలో ముస్లిములు (దైవదాసులు) గా పరిగణించబడతారు.

ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే… ఒక వ్యక్తి అసలు ఎన్నడూ ఖురాన్ గానీ ఇతర ఏ ధార్మిక గ్రంథంగానీ చదవకుండానే కేవలం ఈ సృష్టినంతటినీ శాస్త్రీయంగా పరిశీలించి దీని వెనుక ఏదో ఒక మహత్తర శక్తి ఉండి నడిపిస్తుందని బలంగా నమ్మి, భూమిపై కంటికి కనపడే వస్తువుల్నీ, జీవాల్నీ ఆరాధించటం మానేసి, ఈ సృష్టిని నడుపుతున్న ఆ మహత్తర శక్తినే సృష్టికర్తగా, నిజ దైవంగా గుర్తించాడు అనుకుందాం.

ఇప్పుడు అతను ఈ రకమైన విశ్వాసాన్ని బట్టి ఏ మతాన్ని స్వీకరించినట్లు? ఈ ప్రశ్నకు సమాధానం- అతను ఇస్లాంనే స్వీకరించాడు అన్నదే! ఈ విధమైన విశ్వాసం కలిగి ఉన్న మరుక్షణమే అతను ముస్లిమైపోయినట్టే! ముస్లిం అంటే సృష్టికర్త అయిన దేవుని దాసుడు అని అర్థం.

కాబట్టి ఇస్లాం స్వీకరించటానికి మంత్రాలు చదివో, చెరువుల్లోనో మునిగో లేక పూజలు, ప్రార్ధనలు చేయించుకునే అవసరం ఉండదు. ఇస్లాం స్వీకరించటం అంటే…

మనిషి శాస్త్రీయంగా ఆలోచించగలగటం…

హేతుబద్దమైన ఆలోచనలు కలిగి ఉండటం…

గుడ్డి నమ్మకాలను, విశ్వాసాలను విడిచి పెట్టటం…

అనేక దైవాల ఆరాధనను వదిలిపెట్టటం…

ఈ విశ్వానికి ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడన్న హేతుబద్ధమైన నమ్మకం కలిగి ఉండటం…

ఈ దృక్పథం నచ్చి ఒకవ్యక్తి .. కరక్టే! ఈ విశ్వమంతటినీ సృష్టించి, అదుపు చేస్తున్న ఏదో ఒక శక్తే అసలు దైవం అవుతుంది తప్పితే… ఇక్క ప్రజలు పూజించే విగ్రహాలూ, రాళ్లు, రప్పలు, మనుషులు, జంతువులన్నీ సృష్టిలో భాగం తప్పితే వాటికి/వారికి సృష్టి నిర్మాణంలో దాన్ని నడపటంలోనూ ఏ విధమైన పాత్రాలేదని నమ్మిన మరు క్షణమే అతను ఇస్లాం స్వీకరించేసినట్లు అవుతుంది. మరి ధార్మిక గ్రంథాలు ఎందుకు అవతరించాయి? వాటి పనేంటి? అంటే…

ఈ విధంగా శాస్త్రీయంగా దైవాన్ని గుర్తించిన వ్యక్తికి ఆ దేవుని గుణగణాలు, శక్తి-సామర్థ్యాల తాలూకు అదనపు సమాచారాన్ని ధార్మిక గ్రంథాలు ఇస్తున్నాయి. అంతేకాక ఆ దేవుని ఆజ్ఞలు ఏమిటి? వాటి ప్రకారం ఎలా జీవించాలి? నిజ దైవాన్ని గుర్తించి ఆయన ఆజ్ఞలు, విధి-నిషేధాల ప్రకారం నడిస్తే కలిగే శాశ్వత లాభాలు, నిజ దైవాన్ని గుర్తించక గుడ్డి నమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు కలిగి బహుదైవాలను ఆరాధిస్తే కలిగే శాశ్వత నష్టాలను ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.

కాబట్టి ఇస్లాం స్వీకరించటం అంటే మనిషి తన విశ్వాసాలను సంస్కరించుకోవటం అంతే. తప్పితే మత మార్పిడి కాదు.

అలాగే ఇస్లాం వదిలి పెట్టేయటం అంతే టోపీ గెడ్డం తీసేసి, అబ్దుల్లా పేరును అప్పారావుగా మార్చేసుకోవటమో, రహీమ్ రాబర్ట్ గా పేరు మార్చేసుకోవటమో కాదు.

సమస్త విశ్వానికీ సృష్టికర్త ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న హేతుబద్ధమైన విశ్వాసాన్ని వదిలి పెట్టేసి, హేతువిరుద్ధమైన బహుదైవాల ఆరాధనను అనుసరించటం. ఇంకా శాస్త్రీయంగా ఆలోచించటం మానేసి గుడ్డి నమ్మకాలను, గుడ్డి విశ్వాసాలను కలిగి ఉండటమే! లేదంటే లాజిగ్గా ఆలోచించటం మానేసి ఈ సృష్టికి ఏ దేవుడూ లేడని అటూ ఇటూ కాకుండా పోవటమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *