ఒక్క మాటలో చెప్పాలంటే “మనిషి చెడు తలంపులతో పోరాడటం, చెడు నిర్మూలనకు చేసే ప్రయత్నమే “ఇస్లామిక్ జిహాద్”. పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” లేదా “తీవ్రవాదం” అన్న అర్థాలలో వాడబడలేదు. ఆ నాలుగు వాక్యాలు:-
1. “అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో పరిశ్రమించటం కంటే మీకు ఏదీ ప్రియం కాకూడదు” – 9:24
2. “కనుక ప్రవక్తా! అవిశ్వాసుల మాట ఎంతమాత్రం నమ్మకు ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం (జిహాదన్ కబీరా) జరుపు” – 25:52
3. “అల్లాహ్ మార్గంలో పరిశ్రమించండి. పరిశ్రమించవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు” – 22:78
4. “విశ్వసించిన ప్రజలారా! మీరు గనుక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నత పొందటానికి బయలుదేరినప్పుడు నాకూ మీకూ శత్రువులైన వారితో స్నేహం చెయ్యకండి” – 60:1
దైవ మార్గంలో పరిశ్రమించటాన్ని, ఖురాన్ ద్వారా సందేశం ఇవ్వటాన్ని, అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి తప్ప ఎక్కడా అన్యాయంగా దౌర్జన్యం చెయ్యమని గానీ, ఉగ్రవాదం చేసి అమాయకులను హాని తలపెట్టమని గానీ ఎక్కడా చెప్పలేదు. ముఖ్యంగా చాలా మంది విమర్శిస్తున్నట్టు ముస్లిమేతరులను అన్యాయంగా చంపటం జిహాద్ కాదు. అలాంటి విమర్శలు చేసేవారిదంతా “గాసిప్ జ్ఞానమే” తప్ప “ఇస్లాం జ్ఞానం” కాదు.
మీడియా కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డ వారిలో మటుకు “జిహాద్” అంటే “టెర్రరిజం” అన్న అపార్థమే బలంగా నాటుకుపోయి ఉంది. నిజానికి “జిహాద్” అన్న అరబీ భాషా పదానికి ధాతువు జ.హ.దా. అంటే దానర్థం- “శ్రమించటం (To struggle)” “కృషి చెయ్యటం (To strive)” అంతే. తప్పితే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అన్యాయంగా చంపటం అనో, తీవ్రవాదం చెయ్యటం అనో కాదు.
‘జిహాద్’ లక్ష్యం (Objective of Jihad)’ నిర్మాణం కొరకే తప్ప.. విచ్చిన్నానికి కాదు!
ఓ విద్యార్థి తన సామర్థ్యాలను పెంపొందించుకోవటం కోసం శ్రమించటం జిహాద్..
కఠిన సమయాల్లో నవ్వగలగటం, కష్టాల్లో సహనంగా ఉండగలటం జిహాద్..
హృదయంలో మెదిలే చెడులతో పోరాడటం జిహాద్..
వృద్ధ తలిదండ్రులను అప్యాయతతో చూసుకోవటం జిహాద్..
ప్రజలను నిజాయితీతో పాలించటం జిహాద్..
చెడు రూపుమాపి శాంతిస్థాపనకు కృషి చెయ్యటం జిహాద్..
జాతి జనుల కోసం అవసరమైతే ఆత్మబలిదానం ఇవ్వటం జిహాద్..
మరి కొందరు ఉగ్రవాదులు “జిహాద్” అని పలుకుతూనే “టెర్రరిజం” చెయ్యటం లేదా? అని ఎవరన్నా ప్రశ్నించవచ్చు. చెయ్యటం నిజమే కానీ.. దానిని “జిహాద్” పదం యొక్క “దుర్వినియోగం (Misuse)” అని చెప్పాలి. ఉదాహరణకు: “జై శ్రీరాం” అని నోటితో పలకమంటూ ఎందరో ముస్లిముల పై దాడులు చేసిన హిందుత్వ తీవ్రవాదుల తాలూకు వార్తలు చదివి ఉన్నాం. దానర్థం శ్రీరాముడు అలా తీవ్రవాదం చెయ్యమన్నాడని కాదు కదా? ఏ మతంలో అయినా మంచి వాళ్లే కాదు కొందరు చెడ్డవాళ్లు, ఉన్మాదులూ, తీవ్రవాదులూ ఉంటారు. అలాంటి వారు తమ మతవిశ్వాసాలనో, ధార్మిక ధృక్పథాలనో “దుర్వినియోగం (Misuse)” చేసినంత మాత్రానా ఆయా మతాలను వేలెత్తి చూపటం.. ఆయా మత వర్గం వారందరినీ ఆ కొందరు ఉన్మాదులు చేసే తీవ్రవాదానికి బాధ్యులుగా చెయ్యటం అవివేకం అనిపించుకుంటుంది.
కాబట్టి ప్రతీ మనిషీ తన జీవితంలో ప్రతీ క్షణం చెయ్యాల్సిన నిత్య ప్రక్రియ జిహాద్. దాని అసలు లక్ష్యం “నిర్మాణమే (Construction)” తప్ప “విచ్చిన్నం (Destruction)” ఎంతమాత్రం కాదు.
ముఖ్యంగా ఖురాన్ చెడును “మారణాయుధాలతో తొలగించమనటం లేదు” కానీ… “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని చెబుతుంది.
ప్రవక్త ముహమ్మద్ (స) చెయ్యమంటున్న ఉత్తమ ‘జిహాద్’ ఏమిటో ఒకసారి చదవండి.
“ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862
****
“జీహాద్” కు వ్యతిరేకపదం “టెర్రరిజం!”
“టెర్రరిజం (Terrorism)” అన్న పదాన్ని అరబ్బీలో “జిహాద్” అనరు “ఇర్హాబ్ (إرهاب) అంటారు. అంటే ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటం (Terrorize) అన్న మాట! అలాగే “టెర్రరిస్ట్ లేక ఉగ్రవాది (Terrorist)” అన్న పదాన్ని అరబ్బీలో “జిహాదీ” అనరు కానీ.. “ఇర్హాబి” (إرهابي) అంటారు. మీడియా తాలూకు గాసిప్ జ్ఞానం తప్ప ఇలాంటి విషయాలు అరబీ భాషా పరిజ్ఞానం లేనోల్లకు తెలియవు. కాబట్టి “జిహాద్” అన్న పదానికి అర్థం “ఉగ్రవాదం” కాదు కదా కనీసం సమాంతర పదం (Synonym) కూడా కాదు. “జీహాద్” అన్న పదానికి వ్యతిరేక పదం అరబ్బీలో “ఇర్హాబ్”! దీనిని బట్టి “జీహాద్” అన్నది హింసతో కూడిన ప్రక్రియను సూచించే ప్రతికూల పదం కానే కాదని అర్థమయ్యింది.
ముస్లిం సమాజ నియామక లక్ష్యం?
ముస్లిముల అసలు నియామక లక్ష్యం- సోషల్ మీడియాలో నిత్యం వేర్పాటువాదాన్ని కోరుకునే కొందరు మతతత్వవాదులు విమర్శిస్తున్నట్లు తీవ్రవాదం చెయ్యటం కాదు.. కానీ…
“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110
అన్యాయంగా ఏ జీవి ప్రాణాన్నైనా తీసే అనుమతి ఖురాన్ ఇస్తుందా?
“న్యాయ బద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణినీ హతమార్చకండి” – ఖురాన్ 6:151
అన్యాయంగా మనిషిని చంపితే అది ఖురాన్ ఎంతపెద్ద ఘోరమైన పాపంగా పరిగణిస్తుందో ఈ క్రింది గమనించగలరు.
“హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32
ముస్లిమేతరుల పట్ల ప్రవక్త ముహమ్మద్ (స) దౌర్జన్యం చెయ్యమని చెబుతున్నారా?
“జాగ్రత్త! ఎవరైతే ముస్లిమేతరుల పట్ల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తారో వారి హక్కులను కాజేస్తారో వారిపై అధిక భారం మోపుతారో వారిని దోచుకుంటారో అలాంటి వారి గురించి ప్రళయ దినాన నేనే స్వయంగా దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాను” – ప్రవక్త ముహమ్మద్ (స)
ఇదీ ముస్లిమేతరుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) ఇచ్చిన ఆదేశం! వాస్తవం ఇదైనప్పుడు.. ముస్లిం వేషాలు ధరించి, ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నంత మాత్రనా మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు లేక ముస్లిములూ కాలేరు అలాగే కాషాయం ధరించి హిందూ పేర్లు పెట్టుకుని మారణహోమం సృష్టించేవారు నిజ హిందువులూ కాలేరు… క్రైస్తవ పేర్లు పెట్టుకుని మారణహోమం సృష్టించేవారు నిజ క్రైస్తవులూ కాలేరు. ఎందుకంటే ఏ మతమూ ఉగ్రవాదాన్ని నేర్పదు ఉగ్రవాదం వాదం చేసే ఉన్మాదులకు ఏ మతంతోనూ సంబంధం ఉండదు.
దే “ఇస్లామిక్ జిహాద్” అంటే…
