పూర్వ ప్రవక్తల నుండీ అనాదిగా పరంపరగా వచ్చిన సాంప్రదాయాన్నే “సున్నత్” అంటారు. దానినే ప్రవక్త ముహమ్మద్(స) అనుసరించారు. “సున్నతే రసూల్” అంటే ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క సాంప్రదాయం. దానిని ఆయన అనుచరులైన ముస్లిములు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.
ప్రవక్త ముహమ్మద్ (స) సున్నత్ ను అనుసరిస్తున్నాను ఏ ముస్లిమైతే ప్రకటిస్తాడో అతను ప్రాథమికంగా నిర్వర్తించాల్సిన బాధ్యత- బాహ్య స్వరూపాన్ని మార్చుకోవటం కాదు, ఇస్లాంను విజ్ఞతతో అర్థం చేసుకుని ధర్మ ప్రచారం మొదలెట్టటం.
అంటే ముందు తన ఇంటివారికీ, బంధువులకూ, ఇరుగుపొరుగు వారికీ, స్నేహితులకూ, ప్రజలకు తన మాట ద్వారా, రాతల ద్వారా ఈ సమస్త సృష్టికి ఒక్కడే కర్త ఉన్నాడని, ఆయన్ని ప్రజలు ఏ భాషల్లో ఏయే పేర్లతో పిలుచుకున్నప్పటికీ ఆయన అస్తిత్వం ఒక్కటే అని, ఆయనకు తప్ప సృష్టిలో దేనికీ దైవత్వం లేదు, ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడన్న సత్యాన్ని అవగాహన పరచాలి. అసలు ఈ సందేశాన్ని ప్రజలకు చేరవెయ్యటానికే పూర్వం నుండీ లక్షల కొద్దీ ప్రవక్తలు దైవం ద్వారా పంపబడ్డారు. ఆది నుండీ పరంపరగా ప్రవక్తల ద్వారా నిర్వర్తించబడ్డ ఈ సాంప్రదాయాన్నే ప్రవక్త ముహమ్మద్ (స) కొనసాగించారు.
ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ముస్లిం సమాజానిది. కాబట్టి “నేను ఇస్లాంను అంగీకరించి ప్రవక్త ముహమ్మద్ (స) సున్నత్ ను పాటిస్తున్నాను” అని ప్రకటించే వ్యక్తి ప్రాథమికంగా చెయ్యాల్సిన ఐదు మౌలిక పనుల క్రమాన్ని గమనిస్తే..
వాటిలో మొట్టమొదటిది- “ఒక్క సృష్టికర్త తప్ప ఏ దేవుడూ లేడు. ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన ప్రవక్త” అని సాక్ష్యం స్వయంగా నోటితో పలికి చేతులు దులిపేసుకోకుండా ఈ సాక్ష్యాన్ని మానవాళి సమక్షంలో ఇవ్వాలి. అంటే పైన చెప్పినట్టు అతను ప్రజలకు ధర్మ అవగాహనను కల్పించే పని మొదలెట్టాలి.
రెండు- సృష్టికర్త అయిన దైవాన్ని ఐదు పుట్లా ఆరాధించటం (నమాజ్ చెయ్యటం). మూడు- తమ ఆస్తిపాస్తులు, ధనం నుండి కొంత భాగాన్ని తీసి ప్రతీ సంవత్సరం జకాత్ ఇవ్వటం. నాలుగు- ప్రతీ సంవత్సరం నిష్టతో రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండటం. ఐదు- స్తోమత ఉంటే హజ్ చెయ్యటం. వీటినే ఇస్లాం ఐదు ముల స్థంబాలని అంటారు. ఈ ఐదు పనులను నిర్వర్తించటమే ప్రవక్త ముహమ్మద్ (స) సంపూర్ణంగా అనుసరించటం అవుతుంది.
ఈ ఐదు పనుల క్రమంలో మొట్టమొదట చెయ్యాల్సిన పని- సాక్ష్యం ఇవ్వటం. అంటే స్వతహాగా ఒక్క సృష్టికర్త తప్ప ఏ దేవుడూ లేడు అన్న విషయాన్ని దృఢంగా నమ్మాలి. ఆ నమ్మకం నా ప్రార్థనలను ఆయన వినలేడేమో అన్న అనుమానంతో వలియల్లాల సమాధుల ముందో కొందరు బాబాల ఫోటోల ముందో ప్రార్ధన కోసం చేతులెత్తేంత బలహీనంగా ఉండకూడదు.
తరువాత తాను నమ్మే దేవుని ఏకత్వ సిద్ధాంతాన్ని (తౌహీద్) ప్రజలకు అవగాహన పరచి సామాజిక ప్రక్షాళన చెయ్యాలి. ముహమ్మద్(స) కు ప్రవక్త పదవి లభించిన వెంటనే ఆయన మొదలెట్టిన మొట్టమొదటి పని ఇదే! నేడు సార్వత్రిక ముస్లిం సమాజంలో అధిక శాతం మంది వదిలేసిన పని కూడా ఇదే! ఒకనాటి యూదులు దేవుని శాపాన్ని చేతులారా కొని తెచ్చుకోవటానికి వారు నిర్లక్ష్యం వహించిన పని కూడా ఇదే!
కాబట్టి నేను ప్రవక్త ముహమ్మద్ (స) సున్నత్ ను పాటిస్తున్నాను అని చెప్పుకునే ప్రతీ ముస్లిం తాను ముందు నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యత అయిన ధర్మ ప్రచారం అనే పనిని ఇంతవరకూ మొదలెట్టానా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. ఈ బాధ్యత గాలికి వదిలేసి.. ఎంత కుర్తా పైజామాలు తొడుక్కుని సెంట్లు, సుర్మాలు కొట్టుకున్నా.. టోపీ గెడ్డాలు పెంచుకుని, టైమ్ దొరికినప్పుడల్లా నమాజులు చదువుకుంటూ కాలం గడిపేసినా లాభం ఉండదు.
ప్రవక్త ముహమ్మద్(స) సున్నత్ లో గోళ్లు కత్తిరించుకోవటం నుండి, నమాజ్ పద్ధతులు, వ్యక్తిగత శుభ్రత, బాహ్య స్వరూపానికి సంబంధించిన ఎన్నో ఆదేశాల అనుసరణ పాటించటం ఎంత తప్పనిసరైనా ముందు ఆయన నిర్వర్తించిన ధార్మిక ప్రచార బాధ్యత నిర్వహణ తరువాతే వీటన్నిటికీ దైవం దృష్టిలో విలువ ఉంటుంది.
ప్రవక్త ముహమ్మద్(స) సున్నత్ ను పాటిస్తున్నామని చెప్పేవారు కేవలం టోపీ గెడ్డం పెంచేసి నమాజుల్లో గడిపేస్తే సరిపోదు.. వారు ముందు చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ధర్మప్రచారం ఎలా ఎక్కడి నుండి ఏ విధంగా ప్రారంభించాలి అన్నదే. ఆ తరువాతే మిగతావన్నీ! దానికోసం ఎవరికి వారు కాస్త లాజిక్ తో ఖురాన్, హదీసులను చదవాలి. ఖురాన్ సందేశ విధానాన్ని బుర్ర పెట్టి లోతుగా అర్థం చేసుకోవాలి. ముస్లిమేతరులు అనుసరించే ధార్మిక గ్రంథాల అవగాహన కూడా పెంపొందించుకోవాలి. దానితో తరువాత సహజమైన పద్ధతిలో ప్రజలకు దేవుని ఏకత్వాన్నీ, దైవ సందేశాన్ని వారికి అవగాహన పరచాలి.
తప్పితే నమాజ్ విధానాల గురించి, నామాజ్ లో చేతులు పైకి కట్టలా క్రిందకు కట్టుకోవాలా, ఉర్దూ మాట్లాడటం తప్పనిసరా కాదా, గెడ్డం పొడుగ్గా పెంచాలా తీసేయ్యాలా, టోపీ పెట్టుకోవాలా అవసరం లేదా.. వగైరా అంశాలపై అనవసర డిస్కషన్లు, డిబేట్లు చేసుకోవటంలో తమ పాడిత్య ప్రదర్శనకు అత్యుత్సాహం చూపటం, ఈ విషయాలపై ఒకరినొకరు దూషించుకోవటం, హేళన వ్యంగ వెటకారాలతో కూడిన మాటలు మాట్లాడుకోవటం వగైరావన్నీ ఎందుకూ పనికి రాని వ్యవహారాలు మాత్రమే.
“అల్లాహ్ మీ ముఖాలను సంపదలను చూడడు, మీ సంకల్పాలను, మీ ఆచరణలను చూస్తాడు” అన్న హదీసును బట్టి ముస్లిములు ప్రాథమిక బాధ్యత అయిన దైవ సందేశ ప్రచార పనిని మొదలెట్టాలి. దానితో పాటు నమాజ్, జకాత్, ఉపవాసాలు నిర్వర్తించి అవకాశం ఉంటే హజ్ చెయ్యాలి. తరువాతే మిగతావన్నీ కూడా.
ముస్లిములకు స్వర్గం లభించేది వారి ఉర్దూ భాషను బట్టో, సెంటు సుర్మాలను బట్టో, గెడ్డం సైజులను బట్టో, కట్టుకునే బట్టలను బట్టో కాదు.. వారిపై మోపబడిన ధర్మ ప్రచార బాధ్యతను చెయ్యటం-చెయ్యకపోవటాన్ని బట్టి, సదాచారణను చెయ్యటం-చెయ్యకపోవటం బట్టి మాత్రమే అన్నది ముందు అర్థం చేసుకోవాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజంలో అధికులు అసలైన ధర్మ ప్రచార బాధ్యతను నిర్లక్ష్యం చెయ్యటం. ఈ నిర్లక్ష్యమే ఒకనాటి యూదుల్ని దైవశాపానికి గురి చేసిందన్న విషయాన్ని నేటి ముస్లిములు పెద్దగా పట్టించుకోకపోవటం.
