ఈద్ మీలాదున్నబి – ఇస్లాం ఆదేశించని ఆచారం

Celebrating Milad-un-Nabi at the Dewatagaha Mosque in Colombo.

రబీవుల్ అవ్వల్ నెల 12 వ తారీఖున “ఈద్ మీలాదున్నబి” అంటే ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు పేరిట ముస్లిం సమాజంలో కొందరు రోడ్లపై ఊరేగింపులతో సంబరాలు జరుపుకుంటూ పండుగ మాదిరిగా నిర్వహించే తంతుకు ఇస్లాంకూ సంబంధం లేకపోవటం ప్రక్కన పెడితే పైగా అది పూర్తిగా ఇస్లాంకు విరుద్ధమైన ఆచారం.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు రబీవుల్ అవ్వల్ 12 వ తారీఖునే ప్రవక్త ముహమ్మద్ (స) జన్మించారనటానికి ఎక్కడా కూడా ఒక్క సరైన ఆధారం లేదు. ఆ విషయంలో ముస్లిం పండితుల మధ్యే బేధాభిప్రాయం ఉంది. గత ప్రవక్తల అనుచరులు తమ ప్రవక్తల పట్ల చూపిన వల్లమాలిన ప్రేమ కొద్దీ వారిని దైవాంశ సంభూతులుగా నిలబెట్టినట్లు భవిష్యత్తులో ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు కూడా ఆయన పుట్టిన రోజుకు కూడా ప్రత్యేకత ఆపాదించుకుని బహుశా ఎక్కడ మార్గం తప్పిపోతారో అని దేవుడు ఆయన పుట్టిన తేదీని మరుగుపరిచాడు కాబోలు.

చరిత్రలో ఎంతో మంది ఆదర్శ పురుషుల ఆదర్శాలను పాటించే అనుచరుల్లో రెండు రకాల వ్యక్తులను మనం చూడగలం. మొదటి రకం వ్యక్తులు- ఆ ఆదర్శ పురుషులు చెప్పిన ఆదేశాలను యదాతథంగా పాటించేవారు. రెండవ రకం వ్యక్తులు- ఆ ఆదర్శ పురుషుల పట్ల వల్లమాలిన అభిమానాన్నీ, గుడ్డి ప్రేమను ప్రదర్శిస్తూ లేనిపోని ఆచారాలు కల్పించుకుని వారు చెప్పిన ఆదేశాలను ప్రక్కన పెట్టేసే వారు. ఇలాంటివారే ప్రస్తుత ముస్లిం సమాజంలో మీలాదున్నబీ నుండి ముహర్రం రోజు మాతంలు, పీర్ల పండుగలు, రొట్టెల పండుగలు, దర్గాల్లో సమాధి ఆరాధనలు వగైరా ఆచారాలన్నీ నిర్వహిస్తున్న అధికశాతం మంది ముస్లిములు.

వీరికి ఎవరన్నా ప్రవక్త ముహమ్మద్ (స) ను కించపరచి మాట్లాడితే చంపేసేంత కోపం వచ్చేస్తుంది. కానీ, స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) తన పట్ల శతృత్వం ప్రదర్శించే వారిని, చివరకు తనను రక్తమొచ్చినట్టు రాళ్లిచ్చుకుని కొట్టినవారిని, తనపై మలినాన్ని పడవేసి హేళన చేసినవారిని సైతం క్షమించేంత ఓర్పు, సహనాలు కలిగి ఉండేవారని వీరికి తెలియదు.

మరీ ముఖ్యంగా నేడు ముస్లిం సమాజంలో అధికులు అలవంబిస్తున్న మీలాదున్నబీ, ముహర్రం, పీర్లు, రొట్టెల పండుగలు, మాతం పేరుతో హింసించుకోవటాలు, దర్గాల్లో సమాధి ఆరాధనలు వగైరా ఆచారాలు ఎక్కడా ప్రవక్త ముహమ్మద్ (స) ఆదేశించినట్టు గానీ, ఆయన శిష్యులు (సహాబాలు) పాటించినట్టుగానీ ఎక్కడా ఒక్క ప్రామాణిక ఆధారం లేదన్న విషయం కూడా వీరికి తెలియదు.
* * *

పైగా ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిందేమిటంటే…

“క్రొత్తగా కల్పించబడే విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. అలాంటి ఆచారాలేమైనా ప్రవేశించినట్లు కనుగొంటే మీరు నా సున్నత్ (సాంప్రదాయాన్ని) ను మరియు సరైన మార్గనిర్దేశనం చేసే నా ఖలీఫా (శిష్యుల) సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలి” – [తిర్మిదీ 2676]

ముఖ్యంగా క్రైస్తవులు యేసు పుట్టిన రోజు పేరు మీద పండుగ జరుపుకుంటారు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టిన రోజు (మిలాదున్నబీ) ను పండుగలా జరుపుకునే వారికి ప్రవక్త ముహమ్మద్ (స) చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే-

“ఎవరైతే ఒక వర్గం ప్రజల ఆచారాలను అనుసరిస్తారో వారు ఆ వర్గంలోని వారిగానే పరిగణించబడతారు [అబూదావూద్ 4031]” అని ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పారు.

కాబట్టి ముస్లిం సమాజంలో అధికశాతం మంది ఏదైనా ఒక ఆచారాన్ని ఫాలో అవటాన్నిబట్టో.. లేదంటే ఎవరో పెద్దాయన చెప్పారు కాబట్టో కరక్టే అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఏ విశ్వాసమైనా, ఏ ఆచారమైనా అది ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా చెప్పబడిందా లేదా? ఆచరించబడిందా లేదా? ఖురాన్ చెబుతున్నదేమిటి? అన్న అనేక కోణాల్లో పరిశీలించి నడుచుకునేవారే బుద్ధీ, జ్ఞానాలతో వ్యవహరించే ముస్లిములు కాబడతారు. “బుద్ధీ, జ్ఞానాలతో వ్యవహంచని వారిపై అల్లాహ్ మలిన్యాన్ని పడవేస్తాడు (ఖురాన్ 10:100)”

నిజానికి ప్రవక్త ముహమ్మద్ (స)ను నూటికి నూరుశాతం ఫాలో అవ్వటమంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యటమే కాదు.. ఆయన చెప్పని వాటిని నూటికి నూరుశాతం ఫాలో కాకుండా జాగ్రత్తపడటం కూడా!
* * *

నా విషయంలో అతిశయించకండి – ప్రవక్త ముహమ్మద్ (స):

“క్రైస్తవులు మేరీ కుమారుడు యేసును అతిశయించినట్లు నన్ను ప్రశంసించటంలో అతిశయించకండి. నేను కేవలం అల్లాహ్ దాసుణ్ణి మాత్రమే మరియు ఆయన ద్వారా పంపబడిన సందేసహరుడిని మాత్రమే” – ప్రవక్త ముహమ్మద్ (స) [సహీహ్ – అల్ బుఖారీ 3445]

క్రైస్తవ సమాజంలో అధికశాతం మంది మార్గం తప్పిపోయింది యేసు పట్ల ప్రేమ లేక కాదు.. ఉండాల్సిన ప్రేమకంటే కూడా ఆయనపై పెంచేసుకున్న వల్లమాలినఅభిమానమే కారణం! ఇది నేడు చాలా మంది ముస్లిముల స్వభావానికి అద్దం పడుతుంది.

కాస్త చరిత్ర గమనిస్తే ఆది నుండీ ఆధ్యాత్మిక రంగంలో ప్రజలు మార్గభ్రష్టాత్వానికి గురవ్వటానికి రెండు కారణాలున్నాయి. ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం మొదటి కారణమైతే.. తమ ప్రవక్తలు చెప్పిన ఆదేశాలు పెడచెవిన పెట్టి వారి పట్ల గుడ్డి అభిమానాన్ని పెంచుకుని లేని పోని విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు కల్పించుకోవటం రెండవ కారణం.

ప్రవక్తల పట్ల ప్రేమా, అభిమానం ఉండాల్సిందే. అది మరీ గుడ్డి ప్రేమగా, వల్ల మాలిన అభిమానంగా మారిపోయి లేనిపోని ఆచారాలు కల్పించుకుని తిరిగి వారినే దైవాలుగా చేసుకుని ప్రార్ధించుకునేంత హద్దులు దాటిపోకూడదు. మెడిసిన్ ఎంత మంచిదైనా మోతాదు మించితే ప్రమాదమే కదా!

కాబట్టి ప్రవక్త ముహమ్మద్(స) పట్ల ఆయన ఆదేశాలను అనుసరించేంత ప్రేమ ఉండాల్సిందే. కానీ దాని మోతాదు.. ఆయన చెప్పని, ఆచరించని వాటిని కల్పించుని ఆయన పట్ల గుడ్డి ప్రేమను ప్రదర్శించేంత ఉన్మాద ప్రేమ ఉండకూడదు.

అసలు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటం ఆచారమే ఇస్లాంలో లేదు. దాన్ని తీసుకొచ్చి డైరెక్టుగా ప్రవక్త ముహమ్మద్(స) పుట్టిన రోజునే పండుగ రోజుగా సెలబ్రేట్ చేసుకోవటానికి మించిన మార్గభ్రష్టత్వం ఇంకేముంటుంది?

పైగా ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా రోడ్లపై పచ్చ జండాలు పట్టుకుని ఊరేగింపులు చెయ్యటం, రాత్రిళ్లు మసీదులను లైట్లతో వెలిగించేసి ఆయన పేరుతో ఖవ్వాలీలు పాడేసి గందరగోళం చెయ్యటం లాంటి పనులు ప్రవక్త ముహమ్మద్(స) కాలంలో ఆయన శిష్యులు (సహాబాలు) ఎప్పుడూ చెయ్యలేదు.

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పని ఆచారాలను కల్పించుకుని పరమ భక్తితో నిర్వహించుకోవటం ఆయనను గౌరవించటం అవుతుందా లేక ఆయనను అగౌరవ పరచటం అవుతుందా? అన్నది విజ్ఞులైన ముస్లిములే ఆలోచించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *