ఇస్లాం మరియు సమకాలీన ముస్లిం సమాజ విశ్వాసాలు

ఇది ఒక రకంగా అతి సున్నితమైన చర్చ అయిన్నప్పటికీ ఇస్లాం పట్ల నేడు కొందరు ముస్లిమేతరుల్లో ఏర్పడి ఉన్న అనేక అపార్థాల నేపథ్యంలో ఈ అంశం చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఎందుకంటే ముస్లిమేతరుల్లో చాలా మందికి ఇస్లాం అంటే ముస్లిం సమాజం! నేటి ముస్లిం సమాజంలో అధికశాతం మంది ముస్లిముల విశ్వాసాలు, వారి పోకడలను కొలమానాలుగా చేసుకుని ఇస్లాంను గురించి మాట్లాడటం లేదా ఇస్లాంను గురించి అంచనా వెయ్యటమే ఇక్కడ అతి పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇదే ముస్లిమేతరుల్లో ఇస్లాం పట్ల అనేక అపార్థాలు ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యింది.

కాస్త వివరంగా చెప్పాలంటే…

దర్గా సంస్కృతి, పీర్ల పండుగ, రొట్టెల పండుగ, మీలాదున్నబీ పేరుతో ఊరేగింపులు, ముహర్రం పండుగ పేరుమీద రోడ్లపై మాతం అనే క్రతువు నిర్వహించి ఒళ్లంతా రక్తాలు కారేలా బ్లేడ్లతో, కత్తులతో కొట్టుకోవటాలు, తాయెత్తులు, పచ్చ జండాలు, సమాధులపై చాదర్ లు వగైరా ఏవీ కూడా ఇస్లాంతో కించిత్తు సంబంధం లేనివన్న విషయం చాలా మంది ముస్లిములకే తెలియనప్పుడు ముస్లిమేతరులకు అవగాహన ఉంటుందని అనుకోవటం పొరపాటే!

కొందరు వలియల్లాల సమాధులపై ఎత్తైన దర్గాలు నిర్మించి వాటిపై అరబ్బీ అక్షరాలు రాసి వాటికి పచ్చరంగు, లైటింగులతో అలంకరించి, సమాధులపై దుప్పట్లు పరచి ఊదోత్తుల సువాసలతో ఖవ్వాలీలతో అక్కడ ఒక రకమైన భక్తి భావన కలిగేలా వాతావరణాన్ని సృష్టించి ఆయా దర్గాల్లో సమాధుల ముందు నిలబడి చాలా మంది ప్రార్ధనలు చెయ్యటం చూసి ముస్లిమేతరుల్లో ఈ తంతును ఇస్లాం బోధిస్తుంది కాబట్టి ముస్లిములు చేస్తున్నారని అపోహ పడుతుంటారు.

వాస్తవానికి అలాంటి దైవేతర ఆరాధనా పద్ధతులను ఇస్లాం ఖండిస్తుంది. నిజంగా ఇస్లాంలో దర్గా సంస్కృతి ఒక భాగమే అయితే ప్రవక్త ముహమ్మద్(స) జన్మ స్థానమైన సౌదీ అరేబియాలో గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఒక్క దర్గా సైతం ఎందుకు నిర్మించబడలేదు? అక్కడ పీర్ల పండుగ, రొట్టెల పండుగ, మీలాదున్నబీ పేరుతో ఊరేగింపులు, మాతం పేరు మీద బ్లేడ్లతో, కత్తులతో కొట్టుకోవటాలు వగైరా క్రతువులు ఎందుకు నిర్వహించబడటం లేదు?

అలాంటి ఆచారాలు, క్రతువులను ఆనాడు ప్రవక్త ముహమ్మద్ (స) ఎందుకు ఆదేశించలేదు? ఆయన శిష్యులు ఎందుకు కొనసాగించ లేదు?

ఈ ప్రశ్నలకు పై విధమైన క్రతువులు నిర్వహిస్తూ, ఖురాన్ ఆదేశించని విశ్వాసాలు కలిగి ఉండే నామ మాత్రా ముస్లిముల వద్ద సమాధానం ఉండదు. కారణం వారికి ఇస్లాం యొక్క సరైన అవగాహన లేకపోవటం.. తమకు తెలిసినదాన్నే ఇస్లాం అని అనుకోవటం! అసలు సమస్య ఏమిటంటే ఈ క్రతువులన్నీ ఇస్లాంలో ఒక భాగమని ముస్లిమేతరులు భావించటం.

వాస్తవమేమిటంటే నేడు సమకాలీన ముస్లిం సమాజంలో అధికులు నిర్వహించే ఇలాంటి క్రతువులను, గుడ్డి నమ్మకాలను ఇస్లాం తీవ్రంగా ఖండిస్తుంది.
*****

ఇస్లామిక్ టెర్రరిజం!

మీడియా ‘ఇస్లామిక్ టెర్రరిజం’ అన్న ఓ దిక్కుమాలిన పదాన్ని కనిపెట్టి ప్రజల మెదళ్లను ఎంతగా ట్యాన్ చేసేసిందంటే.. ఇస్లాం అంటే టెర్రరిజం, జిహాద్ అంటే ఉగ్రవాదం చేసి మారణహోమం సృష్టించటం అనుకునే స్థాయికి చాలా మంది ముస్లిమేతరులు వచ్చేశారు, అంతటితో ఆగక ఇస్లాం, జిహాద్ అంటే టెర్రరిజం అంటూ పుస్తకాలు రాయటం, ఇస్లాంపై ఘోరమైన అపనిందలు వెయ్యటమే కొందరు పనిగా పెట్టుకున్నారు.

మరీ ముఖ్యంగా అల్-ఖైదా, ISIS, లష్కరే తోయిబా, హర్కతుల్ ముజాహిదీన్, జైషే ముహమ్మద్ వగైరా ఉగ్రవాద సంస్థల లక్ష్యం ఇస్లాం రాజ్యం స్థాపించటం అన్న అపార్థం చాలా మంది ముస్లిమేతరుల్లో పెరుకుపోయింది. కారణం ఆయా ఉగ్రవాద సంస్థల్లో ఉండేవారంతా టోపీలు, గెడ్డాలు పెట్టుకుని ఉర్దూ/అరబిక్ పేర్లు తగిలుంచుకుని ‘అల్లాహు అక్బర్’, ‘జిహాద్’ అన్న నినాదాలతో ఉగ్రవాదం చేస్తూ ఉండటమే!

వాల్ల వేషాలు, పోకడలు చూసే ముస్లిమేతరుల్లో “ఇస్లాం బహుశా ఆ విధంగా ఆదేశిస్తుంది కాబట్టే వారలా చేస్తున్నారనే” అపార్థం పేరుకుపోయింది. వాస్తవంలో ఇస్లాం అన్యాయంగా ఏ ప్రాణినైనా అన్యాయంగా హతమార్చటాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.. ఒక మానవుణ్ణి అన్యాయంగా చంపితే సకల మానవాళిని చంపినట్లే అని హెచ్చరిస్తుంది.

ప్రవక్త ముహమ్మద్ (స) అయితే “ఒక మనిషి తన మనస్సులో మెదిలే చెడు ఆలోచనలతో పోరాడటమే ఉత్తమ జిహాద్” అని చెప్పారు. ఇస్లామియా పరిభాషలో ‘జిహాద్’ అంటే సమాజంలో అశాంతిని, చెడును తొలగించి శాంతిని స్థాపించటానికి ప్రయత్నించటం, ప్రజలను ధౌర్జన్యపరుల నుండి కాపాడటం, వారిని బానిస సంకెళ్ల నుండి విడిపించటం అన్న ఉత్తమ అర్థాలు ఉన్నాయి.

కానీ ‘జిహాద్’ అంటే ఉగ్రవాదానికి పర్యాయ పదంగా కొందరు మూర్ఖులు మార్చేయ్యటం ప్రక్కన పెడితే మరి కొందరు మూర్ఖులు ఈ మధ్య కాలంలో ‘లవ్ జిహాద్’ అనే ఓ పనికి మాలిన పదబంధకాన్ని కనిపెట్టి దానిపై చట్టాలు చేసేంత హీన స్థితికి దిగజారిపోయారు.

నిజానికి ఇస్లాం, ముస్లిం సమాజంపై మోపిన బాధ్యత అసలేమిటి? అన్నది గమనిస్తే ఖురాన్ ఎంతో స్పష్టంగా… “ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110 అని చెబుతుంది.

ముస్లిం సమాజ బాధ్యత మంచిని ఆదేశించటం, చెడు నుండి ప్రజలను ఆపటం. ఆ విధంగా నిర్మించబడే సమాజమే ఇస్లామియా సమాజం అవుతుంది. తప్పితే మారణహోమాలు సృష్టించే ఉగ్రవాద సంస్థలు పాటుపడేది ఇస్లాం రాజ్య స్థాపనకు కాదు. నేడు మీడియా చెప్పే అల్-ఖైదా, ISIS వగైరా ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులన్నీ అమెరికా, ఇజ్రాయిల్ వగైరా కూటముకు కొన్ని అల్లరి మూకలను పోగు చేసి ఒకప్పుడు తయారు చేసిన సంస్థలే!

సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాఖ్, పాకిస్తాన్ లాంటి ఓ నాలుగైదు దేశాల్లో జరిగే కొన్ని రాజకీయ పరమైన గొడవలు, అంతర్యుద్ధాలు, అక్కడక్కడా జరిగే సున్నీ-షియాల మధ్య గొడవలకు ఇస్లామిక్ టెర్రరిజం అన్న పేరు తగిలించి అవే వార్తలను పదే పదే మీడియా వండి వార్చుతూ ఉండటం కారణంగా ముస్లిమేతరుల్లో ఇస్లాం, ముస్లిములు అధికంగా ఉండే దేశాల్లో అలాంటి అశాంతి పూర్వక వాతావరణం నెలకొని ఉంటుందన్న అపార్థం సర్వసామాన్యమైపోయింది. నిజానికి ప్రపంచంలో ఇంకా 50 ముస్లిం దేశాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. వాటి ప్రస్తావన మీడియా చెయ్యదు.

నిజానికి ఇస్లాం ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తుంది? అన్న ప్రశ్నకు నేటి మీడియా చూపే సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాఖ్, పాకిస్తాన్ లాంటి దేశాల వైపు కాదు చూడాల్సింది.. 1400 సం.ల క్రితం నైతికత, మానవతా విలువలంటే తెలీని ఓ అనాగరిక సమాజాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) కేవలం 20 సం.లలో ఎలాంటి ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దారో ఆనాటి చరిత్రను చదవాలి.

కాబట్టి పీర్లు, పచ్చ జండాలు, రొట్టెలు, సమాధులు, తాయెత్తులు, సమాధి ఆరాధనలు, మాతం, మీలదున్నబీ పేర్లతో ఊరేగింపులు వగైరా నమ్మకాలు, క్రతువులతో సంబంధంలేని స్వచ్ఛమైన ఇస్లాంను చూడాలంటే… మారణహోమాలు, టెర్రరిజాలతో సంబంధంలేని శాంతియుత ఇస్లాంను చూడాలంటే.. ముస్లిం సమాజాన్ని కాదు చూడాల్సింది.. ఒకటి ఖురాన్ ను రెండు ప్రవక్త ముహమ్మద్ (స) బోధనలను మాత్రమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *