భక్తుని పరిశ్రమ – భగవంతుని సహాయం

Sisyphus metaphore. Silhouette of businessman pushing heavy stone boulder up on hill.

ఈ క్రింది పోస్టులో చెప్పింది నిజంగా భగత్ సింగేనా? లేక ఆయన పేరు మీద ఎవరైనా రాసి సోషల్ మీడియాలో వదిలారా? అన్నది తెలీదు గానీ.. ఒకవేళ ఎవరు చెప్పినా ఈ పోస్టులో చెప్పబడిన విషయం మటుకు పూర్తి అనగాహనా రాహిత్యంతో చెప్పిన విషయం అనే చెప్పాల్సి ఉంటుంది.

“ఎంత భౌతిక పరిశ్రమకు అంతే ఫలితం ఉంటుంది”

ఈ విషయం నూటికి నూరుశాతం నాస్తికులకు తెలీదన్న విషయం ప్రక్కనపెడితే.. చాలా మంది ఆధ్యాత్మికులకు సైతం ఈ విషయం తెలీదనే చెప్పాల్సి ఉంటుంది. నాస్తికులు భావించేదేమిటంటే.. ధార్మిక గ్రంథాలు ఆస్తికులకు కేవలం దేవుణ్ణి నమ్ముకుని, తమ కోరికల పరిపూర్తికై కష్టపడటం మానేసి కేవలం ప్రార్ధించుకుంటూ కూర్చోమంటున్నాయి.. వారిని బద్దకస్తులుగా తయారు చేస్తున్నాయి. అదే నాస్తికత్వమైతే మనిషిని కష్టపడి ప్రయత్నించమని చెబుతుంది. అందుకే నాస్తికులు భౌతిక జీవనంలో విజయం సాధిస్తూ ఉంటారు అన్నది. ఇలా భావించటం నాస్తికుల అవగాహనారాహిత్యమే!

ఎందుకంటే… “ఎంత భౌతిక పరిశ్రమకు అంతే ఫలితం ఉంటుంది” అన్న “భౌతిక దృక్పథం” చెప్పే సూత్రమే “ఆధ్యాత్మిక దృక్పథం” కూడా చెబుతుంది. ఈ విషయాన్ని ఈ క్రింది గీతా, బైబిల్, ఖురాన్ శాస్త్రాల్లో గమనించండి.

గీత:

“తన్ను తానే యుద్ధరించుకోవలెను. తన్ను అధోగతిని బొందించుకొన గూడదు. ఏలయనగా (ఇంద్రియములను జయించినచో) తనకు తానే బంధువున్ను, (జయింపనిచో) తనకుతానే శత్రువున్ను అగును” – 6:5

బైబిల్:

“తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైన దేదియూ లేదు” – ప్రసంగి 3:10

“నరులు అభ్యాసము నొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని” – ప్రసంగి 2:24

ఖురాన్:

“మనిషి శ్రమించిన దానికి మించి అతనికి ఏదీ లభించదు” – ఖురాన్ 90:4

“మేము మానవుణ్ణి కఠోరమైన శ్రమకోసం పుట్టించాము” – ఖురాన్ 53:39

పై గీతా, బైబిల్, ఖురాన్ వాక్యాలు చదివితే.. ధార్మిక గ్రంథాలు ఆస్తికులకు కేవలం దేవుణ్ణి నమ్ముకుని ఫలితం కోసం కష్టపడకుండా ప్రార్ధించుకుంటూ కూర్చోమంటున్నాయి అని ఏదైతే నేడు నాస్తికులు ఊహించుకుంటున్నారో అది ఎంత తప్పో అర్థం చేసుకోగలం.

పైన పేర్కొనబడిన గీతా, బైబిల్, ఖురాన్ వాక్యాలు చెబుతున్న విషయం ఒక్కటే- మనిషి భౌతిక విజయానికి భౌతిక పరిశ్రమ తప్పదు అన్నది.

“ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి” అన్నది గీత చెబుతుంటే.. “మనుషులు అభ్యాసము పొందటానికి దేవుడు వారికి కష్టాలను విధి చేశాడని బైబిల్ చెబుతుంది. ఖురాన్ అయితే ఎంతో స్పష్టంగా మానవుణ్ణి కేవలం “శ్రమ కోసమే పుట్టించాము” అని చెప్పటమే కాక.. “మనిషి శ్రమించిన దానికి మించి అతనికి ఏదీ లభించదు” అని స్పష్టపరుస్తుంది.

దీనిని బట్టి కార్మికుడైనా-కళాకారుడైనా, విధ్యావంతుడైనా-వైజ్ఞానికుడైనా లేక ఏ రంగానికి చెందినవాడైనా సరే అతను ఆ రంగంలో విజయాన్ని సాధించాలంటే.. కఠోరమైన పరిశ్రమ చెయ్యాలి. అతను ఎంత శ్రమపడితే అంతే ఫలితం అతనికి దక్కుతుంది.

ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడని బద్దకం ప్రదర్శిస్తూ చెయ్యాల్సినంత పరిశ్రమ చెయ్యని ఆధ్యాత్మికులైతే తక్షణం వారు అలాంటి అపార్థం నుండి బయటకు రావాలి.

మరి శ్రమను నమ్ముకున్నప్పుడు మరి దైవాన్ని నమ్ముకోవటం, ప్రార్ధించుకోవటం దేనికి? అన్న ప్రశ్న ఒకటి మిగిలి ఉంది. అదెందుకంటే.. మనిషి తాను చెయ్యాల్సిన పరిశ్రమ, ప్రయత్నం అంతా చేశాక దాని నుండి తనకు అనుకూలమైన ఫలితం రావటం కోసమని దైవాన్ని ప్రార్ధించటం తప్పితే.. అసలు ప్రయత్నమే చెయ్యకుండా ఫలితం కోసం ప్రార్ధించటం మూర్ఖత్వమే అవుతుంది.

ఎందుకంటే కొన్ని సార్లు మనిషి తాను చెయ్యాల్సిన ప్రయత్నం పూర్తిగా చేసినా అనుకూలమైన ఫలితం రాకపోవచ్చు. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికుడనబడేవారు రాళ్లూ, రప్పల్నీ, జంతువుల్నీ, బాబాల్నీ, సమాధుల్నీ వగైరా దేన్ని పడితే దాన్ని దైవమని నమ్మేయక.. సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకుని భౌతిక ప్రపంచంలో విజయాన్ని సాధించటానికి తాను చెయ్యాల్సిన ప్రయత్నం అంతా చేశాక అనుకూలమైన ఫలితం కోసం ఆ సృష్టికర్త అయిన దైవాన్ని నమ్ముకుంటాడు. ఒకవేళ అనుకున్న ఫలితం రాకపోయినా నిరాశపడిపోడు.. మరొకసారి ప్రయత్నిస్తాడు. అతని విశ్వాసంలో దృఢత్వం.. అతని ప్రయత్నంలో పారదర్శకత ఉంటే కచ్చితంగా సృష్టికర్త అయిన దైవం అతని శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా ఇస్తాడు.

చివరకు దేవుణ్ణి తెలుసుకోవటం అన్నది సైతం గుడ్డి నమ్మకాల ఆధారంగా కాక, సృష్టిని శాస్త్రీయంగా పరిశీలించి తెలుసుకోమంటున్నాయి. ఆధ్యాత్మికుడనేవాడు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని చెబుతున్నాయి.

ఈ అవగాహన లేకుండా దేవుణ్ణి నమ్ముకుని శ్రమించకుండా కేవలం ప్రార్ధించుకుంటూ కూర్చోవటం ఒక రకంగా ఈ పోస్టులో చెప్పబడినట్టు మానవుని నైతిక పతనమనే చెప్పాల్సి ఉంటుంది. ధార్మిక గ్రంథాలు చెబుతున్నది కూడా అదే. కాబట్టి అనేక కష్టాలను ధైర్యంతో ఎదుర్కోమని చెప్పేది నాస్తికత్వమే కాదు అంతకంటే ముందు ఆస్తికత్వం అంతకంటే దృఢంగా ఈ విషయాన్ని చెబుతుందన్నది గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *