“ఇస్లాంలో సమానత్వం ఎక్కడ ఉంది? ఇస్లాంలో వర్గ తత్వం లేకపోవటం ఏమిటి? అటు హిందూ సమాజంలో కుల వివక్ష ఉన్నట్టే ముస్లిం సమాజంలోనూ సున్నీ-షియాలు, సయ్యద్ లు, షేకులు, ఖాన్ లు, ఖురైష్ లు, పఠాన్లు, దూదేకులు వగైరా అనేక వర్గాలూ, వారి మధ్య వర్గ వివక్ష కూడా ఉంది! అలాంటప్పుడు ఇస్లాంలో వర్గతత్వం లేకపోవటం ఏమిటి?” అని ప్రశ్నించే కొందరికి ఇస్లాంను ఏదోలా విమర్శించాలనే ఉబలాటం తప్ప వారికి ఇస్లాం అవగాహన కొద్దిగా కూడా లేదనే చెప్పాలి.
సూటిగా చెప్పాలంటే ముస్లిం సమాజంలోనూ కొందరు ముస్లిముల్లో ఇతర మత వర్గాల వారి మాదిరిగానే వర్గపరమైన వివక్ష ప్రదర్శించే అలవాటు ఉన్నప్పటికీ.. దానికి ఇస్లాంతో సంబంధం లేదు. పైగా ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) బోధల్లో వర్గతత్వం, జాత్యాహంకారం, అంటరానితనం, ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలు లాంటి జాఢ్యాలు తీవ్రంగా ఖండించబడ్డాయి.
నేడు ముస్లిం సమాజంలో ఏర్పడ్డ సున్నీ-షియాలు, సయ్యద్ లు, షేకులు, ఖాన్ లు, పఠాన్లు, దూదేకులు వగైరా వర్గాలన్నీ ప్రవక్త ముహమ్మద్(స) తరువాత చాలా ఏళ్ల తరువాత ఏర్పడ్డవే తప్ప.. ముస్లిం సమాజం ఇన్ని వర్గాలుగా వర్గీకరించబడటానికి కారణం ఇస్లాం కానే కాదు.
ఇస్లాం వ్యక్తులను వర్గం ఆధారంగానో, వారి పుట్టుక ఆధారంగానో వర్గీకరణ చెయ్యక.. “ప్రవర్తన ఆధారిత వర్గీకరణ (Attitude based classification)” మాత్రమే చేస్తుంది. అదెలాగన్నది ఈ క్రింది ఖురాన్ వాక్యం చదివితే తెలుస్తుంది.
“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13
పై ఖురాన్ వాక్యాన్ని బట్టి అర్థమవుతున్న మూడు విషయాలు:
1. మానవులంతా ఒకే జంట సంతానం. అటువంటప్పుడు కులపరంగా గానో, జాతి పరంగా గానో, వర్గం పరంగానో, రంగు పరంగా గానో ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు..
2. సృష్టికర్త అయిన దేవుడు మానవులను వివిధ ప్రాంతాలు, భాషలు, అలవాట్లను బట్టి జాతులుగా, తెగలుగా సృష్టించింది కేవలం ఒకరికొకరు పరిచయం చేసుకోవటానికి మాత్రమే..
3. దేవుని దృష్టిలో ఎవరైనా గొప్ప వానిగా ఎంచబడేది అతని జాతిని బట్టో, రంగును బట్టో, వంశాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదు, అతని ప్రవర్తన (Attitude) ను బట్టి మాత్రమే..
కాకపోతే ముస్లిం సమాజంలో ఎవరి ద్వారా ఏ తప్పు జరిగినా ముందూ వెనుకా చూడకుండా దాన్ని ఇస్లాంకు అంటగట్టేసి ఇస్లాంను విమర్శించేసే దీర్ఘకాలిక జబ్బు చాలా మందికి ఉండటమే ఇక్కడ అసలు సమస్య! ఇస్లాంను అవగాహన పరచుకోవటానికి ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్(స) బోధల్నీ చదవటానికి బదులు ముస్లిం సమాజాన్ని చూడటమే అసలు సమస్య!
ఉదాహరణకు భారతదేశంలో ప్రజల్లో, నాయకుల్లో అధికారుల్లో అనేకమంది నేరాలకు పాల్పడుతుంటారు కాబట్టి ఆ దేశంలో రాయబడ్డ రాజ్యాంగం లోపభూయిష్టమైందని ఎవరైనా అంటే మీ సమాధానం ఏమిటి?
రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పటికీ దానిని అనుసరించేవారు ఉత్తములు కాకపోతే దాని వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని డాII బి.ఆర్ అంబేడ్కర్ గారు చెప్పినట్టు.. ఇస్లాం ఎంత గొప్పదైనప్పటికీ దానిని అనుసరించేవారు ఉత్తములు కాకపోతే ఇస్లాం కచ్చితంగా విమర్శించబడుతుందనే చెప్పాలి.
ప్రాంతాలను బట్టో, వంశాలను బట్టో ప్రజలు అనేక శాఖలు, వర్గాలుగా ఏర్పడటం అసలు సమస్య కాదు.. కానీ, తమ వర్గమే గొప్ప ఇతర వర్గాల వారు అధములు, నీచులు అన్న జాత్యాహంకార భావన ప్రదర్శించటమే అసలు అతి పెద్ద సమస్య.
అలాగని మొత్తం ముస్లిం సమాజంలో వర్గ తత్వం, వివక్ష ఉందన్నది నా వాదన కానే కాదు. ఎందుకంటే ప్రపంచ సార్వత్రిక ముస్లిం సమాజంలో కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో సున్నీ-షియా వర్గాల మధ్య కలహాలున్నాయి తప్పితే మొత్తం ముస్లిం దేశాల్లో సున్నీ-షియాలందరూ పనులన్నీ మానేసుకుని తన్నులాటల్లోనే జీవితం గడుపుతూ ఉండరు. అలాగే సయ్యద్ లు, షేకులు, ఖాన్ లు, పఠాన్లు వగైరా వర్గాలు ముస్లిం సమాజంలో ఉన్నప్పటికీ ఆయా వర్గాల్లో వర్గవివక్షను ఖండించే ఎందరో ఉత్తమ ముస్లిములూ ఉన్నారన్న సత్యాన్ని కూడా ఒప్పుకోక తప్పదు.
అలాగే ఆయా వర్గాల్లో వర్గతత్వాన్నీ, ఉచ్చనీచ భావాల్ని ప్రదర్శించేవారు కూడా లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో దూదేకులను తక్కువ చేసి చూడటం లాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటి విన్యాసాలు ప్రదర్శించేవారు ఎంత టోపీలూ, గెడ్డాలూ పెట్టుకున్నప్పటికీ, ఎంత శ్రావ్యమైన ఉర్దూ మాట్లాడుతున్నప్పటికీ వారికి ఇస్లాంతో సంబంధం లేదనే చెప్పాలి.
ఇంకా చెప్పాలంటే ఉర్దూ మాట్లాడటం రావటానికి ముస్లింగా ఉండటానికి సంబంధం లేదు. ఇస్లాం భాషకో, వేషధారణకో, ప్రాంతానికో సంబంధించినది కాదు. అది సృష్టికర్త అయిన దేవుని పట్ల కలిగి ఉండే విశ్వాసానికి సంబంధించినది.
ఇస్లాం ఒక వ్యక్తికి ‘ఆధిక్యత (Superiority)’ అన్నది దేని ఆధారంగా ఇస్తుంది?
“అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఎలాంటి అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప”
– ప్రవక్త ముహమ్మద్ (స)
ఈ విధంగా ఇస్లాంలో ఒక వ్యక్తి కలిగి ఉండే సత్ప్రవర్తన, భయభక్తుల ఆధారంగా అతనికి ఆధిక్యత ఇవ్వబడుతుంది. ఇస్లాం నల్లవారు-తెల్లవారు, అధికులు-అధములనబడే జాతిపరమైన, వర్గపరమైన వివక్షలను తీవ్రంగా ఖండించటమే కాక, “మానవులంతా ఒకే జంట సంతానమని” చెబుతూ మానుషులంతా కలిపి ఒకే జాతి తప్పితే అందులో అగ్ర జాతులూ, అధమ జాతులనే వర్గీకరణలు లేవని తేల్చి చెబుతుంది.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిముల్లో వర్గపరమైన వివక్ష ప్రదర్శించే వారుంటే చెయ్యాల్సింది- “మానవులంతా ఒకే జంట సంతానమన్న” ఖురాన్ ఆదేశాన్ని బట్టి తమలో ఒకవేళ ఉచ్చనీచ భావాలు ప్రదర్శించే అలవాటు ఉంటే ముందు దాన్ని వదులుకోవాలి.
ముస్లిముల్లో కొందరు ఇస్లాం అవగాహన అంతగాలేని ముస్లిములు ప్రదర్శించే వర్గపరమైన వివక్షను ఇస్లాంకు అంటగట్టేసి విమర్శించే ముస్లిమేతరులు చెయ్యాల్సింది- అలాంటి అజ్ఞానపురితమైన గుడ్డి విమర్శలను చెయ్యటానికి ముందు ఇస్లాం అతి తీవ్రంగా జాత్యాహంకారాన్ని, వర్గపరమైన వివక్షలను ఖండిస్తుందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.
ఇస్లాంలో వర్గపరమైన వివక్ష లేదా?
