కఠిన శిక్షలు – భయం, బాధ్యతలు

అభం శుభం ఎరుగని ఆరేళ్ల పాప రేప్ అన్న న్యూస్ నుండి మాటు వేసి భర్తను చితకబాది అతని కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారం అన్న తాజా న్యూస్ వరకూ రెండు వార్తలూ ఈ వారంలో మనం చదివినవే! ఆయా సందర్భాల్లో రేప్ కు గురైన ఆ ఇద్దరూ గురైన భయాందోళనలు గానీ, భరించిన పేయిన్ గానీ .. ఆ రేప్ కు గురైన వారి తలిదండ్రుల ఆవేదన కానీ మాటల్లో వర్ణించలేనిది. ఈ సందర్భంలో ఇలాంటి ఘోరాలకు, నేరాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వెయ్యటానికి సొల్యూషన్ ఎప్పటికైనా ఏదైనా అసలు దొరుకుతుందా? అన్నదే అసలు ప్రశ్న.

ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి తరువాత మాట్లాడుకుందాం.
…………………..

భయం-బాధ్యత

ఈ రెండు అంశాలు మాత్రమే ఒక మనిషిని అతను ఒంటరిగా ఉన్నా లేదా బహిరంగా ఉన్నా ఏదైనా చెడు చెయ్యటం నుండి అతన్ని ఆపగలిగేది. దీనికి సింపుల్ ఉదాహరణ ఏ ఆఫీసులోనో, షాపింగ్ మాల్లోనో ఉన్నప్పుడు “మీరు CC TV పర్యవేక్షణలో ఉన్నారు” అన్న బోర్డు కనపడినప్పుడు వ్యక్తుల ప్రవర్తనకూ.. మమ్మల్ని ఎవరూ చూడటం లేదు ఏది చేసినా చెల్లుతుంది అన్న భావన కలిగి ఉన్న వ్యక్తుల ప్రవర్తనకూ మధ్య ఉన్న తేడానే.

చేతికి దొరికింది జేబులో పెట్టేయ్యాలన్న కోరిక మనసులో బలంగా ఉన్నప్పటికీ “నేను చేసే ప్రతీ పని పర్యవేక్షించబడుతుంది నేను చేసే నేరానికి సమాధానం చెప్పుకోవాలి, పట్టుబడితే కఠినమైన శిక్షా పడవచ్చు అన్న భయమే అతన్ని ఆ పని నుండి నియంత్రించగలిగేది. ఆ భయం బాధ్యతాయుతంగా నడుచుకునేలా అతన్ని నడిపిస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే ప్రతీ దేశంలోనూ క్రైమ్ ను నియంత్రించటానికి క్రిమినల్ చట్టాలు రూపొందించబడ్డాయి అన్నది నిర్వివాదం.

ఎందుకంటే ఏ దేశంలో అయినా మనిషి సైకాలజీలోనే “నన్ను ఎవరూ చూడటం లేదు” అన్న బాధ్యతారహితమైన ఆలోచన వచ్చినప్పుడు అతని మనసు చెడు చెయ్యటం వైపునకే ఎక్కువగా ప్రేరేపిస్తుంది. అతను పైకి బహిరంగ సమాజంలో ఎంత గౌరవ మర్యాదలతో నడుచుకునే వ్యక్తి అయినా ఇంట్లో అన్నయ్యగానో, తండ్రిగానో, తమ్ముడిగానో చలామణీ అవుతున్నప్పటికీ ఏకాంతంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు ప్రక్కనపెట్టి తన పైత్యం కక్కటానికి ప్రయత్నిస్తాడు. అసలు ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో అదే అతని అసలు వ్యక్తిత్వమవుతుంది.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. పరువూ మర్యాదలు పోతాయని భయపడి చిన్న చిన్న వెకిలి వేషాలను మానుకోవటం వేరు. మనసులో దాగున్న తీవ్రమైన కామ వాంఛలనో ఆర్ధికపరమైన కోరికలనో తీర్చుకోవటానికి ఎంతకైనా తెగించటానికి సిద్ధపడటం వేరు. అలాంటి తీవ్రమైన వాంఛలను/కోరికలను తీర్చుకునే సందర్భం ఏర్పడినప్పుడు సైతం “నా తప్పుకు తగినట్టు కఠినమైన తీవ్ర శిక్షను, నష్టాన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది” అన్న భయం ఉన్నప్పుడే అతన్ని కనీసం అలాంటి ఘోరమైన తప్పులకు పాల్పడకుండా నిరోధించగలుగుతుంది.

ఉదాహరణకు ఇస్లామిక్ షరియాలో రేప్ కు బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే కఠినమైన శిక్షను ఇక్కడ తీసుకుందాం. ఇది పైకి చదివి కొందరు ఇది చాలా ఆటవికం, అనాగరికం అని హేళనగా మాట్లాడే వ్యక్తులూ ఉన్నారు. నిర్భయ, ఆసిఫా లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇస్లామిక్ షరియాలో ఉన్నటువంటి కఠిన శిక్షలు లేకపోవటం వల్లనే దేశంలో అనేక ఘోరాలు గంటకొకటి చొప్పున జరుగుతున్నాయని లెక్చర్లిచ్చినోల్లూ ఉన్నారు.

అసలు రేప్ లాంటి ఘోరమైన క్రైమ్ నే తీసుకుంటే ఇస్లాంలో అంత కఠినమైన శిక్ష ఎందుకుంది? అంటే ఖురాన్- “పరాయి స్త్రీల వంక వెకిలి చూపులు చూడవద్దు, వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దు అని చెబుతూనే స్త్రీలకు నిండైన వస్త్రాధారణతో బయటకు వెళ్లాలి అని, పరాయి పురుషుల విషయంలో మీ దృష్టిని కాపాడుకోవాలని చెబుతూనే.. మీరు చేసే ప్రతీ పనీ పర్యవేక్షించబడుతుంది, ఒకరోజు మీరంతా సృష్టికర్త ముందు నిలబడి మీరు చేసే పనులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, మీరు చేసే చెడు పనులకు తగ్గట్టు శాశ్వత శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటూ అనేక కోణాల్లో కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత కూడా ఒకవేళ ఒక ఏ వ్యక్తి అయినా తన బాధ్యతలను మరచి భయం లేకుండా హత్యకో, వ్యభిచారానికో, రేప్ కో పాల్పడితే అలాంటి బరితెగించిన వ్యక్తికి తగిన శిక్ష ఎలాంటిదై ఉండాలి? అతనికి విధించబడే శిక్షను చూసి ఇతరులు కూడా అలాంటి క్రైమ్ కు పాల్పడకుండా ఉండే విధంగా ఉండాలి.

అలాంటప్పుడే సమాజంలో వ్యక్తులు ఒకటి దైవాదేశాలకనుగుణంగా బుద్ధిగా నడుచుకుంటారు లేదా రెండు కనీసం తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి వస్తుందన్న భయం కొద్దీ క్రైమ్ చెయ్యటానికైనా భయపడతారు. అరేబియన్ దేశాల్లో భారతదేశంతో పోల్చుకుంటే అతి తక్కువ క్రైమ్ నమోదుకావటానికి కారణం కూడా అదే.

స్వతంత్రం వచ్చాక 1947 నుండి ఇప్పటి వరకూ భారతదేశంలో 720 మంది ఉరి తీయబడ్డారు. ఈ మధ్యకాలంలో ఉరి విధించేంతటి పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన వారు సైతం కేవలం కొద్ది తేలికపాటి జైలు శిక్షలను అనుభవించో, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకునో, డబ్బు ద్వారా న్యాయాన్ని కొనేసో బయట దర్జగా తిరిగేవారిని లెక్కపెట్టటం కూడా అసంభవం. అలాంటి తేలికపాటి శిక్షలూ, న్యాయాన్ని కొనేసి అన్యాయాన్ని కప్పిపెట్టగలిగే అవకాశం ఉన్న దేశాల్లో నేరాలు నిముషానికొకటి జరుగుతుంటాయి.
మహా లేదంటే భారతదేశంలో 12 సం.ల కంటే చిన్న వయసు పిల్లలను రేప్ చేస్తే ఉరి శిక్ష విధించబడుతుందన్న కొత్త చట్టం ఈ మధ్య తేవటం జరిగింది. అంటే.. దానికంటే పెద్ద వయసున్న స్త్రీలను ఎంత పేయిన్ఫుల్ గా ఘోరంగా రేప్ చేసి చంపేసినా జైల్లో కూర్చోబెట్టి మూడుపుట్లా మేపే శిక్ష విధించబడుతుందన్న మాట.

అయితే మనిషి ఘోరాలకు నేరాకు పాల్పడకుండా అడ్డుకట్ట వెయ్యటానికి అల్టిమేట్ సొల్యూషన్ ఎప్పటికైనా ఏదైనా అసలు దొరుకుతుందా? అని ప్రారంభంలో మనం వేసుకున్న ప్రశ్న దగ్గరకు వద్దాం.

దీనికి సోల్యూషన్.. కొందరు మీడియాలో అభ్యుదయవాదులు చెబుతున్నట్టు పిల్లలకు చిన్నప్పటి నుండే కౌన్సిలింగ్ ఇవ్వాలి, సెక్స్ గురించి పబ్లిగ్గా చర్చించాలి, లైంగిక వేధింపులకూ, మానభంగాలకూ పాల్పడకుండా పురుషులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి వగైరా చిలకపలుకులు వల్లించటం ద్వారా, షుగర్ కోటింగ్ సలహాలు ఇవ్వటం ద్వారా సొసైటీలో మార్పు రాదు.

‘మార్పు’ అనేది ప్రతీ మనిషిలోనూ వ్యక్తిగతంగా కలుగజెయ్యాలి. మనిషి ఒంటరిగా ఉన్నా బహిరంగంగా ఉన్నా తప్పు చెయ్యటానికి వ్యక్తిగతంగా భయపడినప్పుడు, ఆ తప్పును పాల్పడటానికి తగిన చెడు ఆలోచనలు బలవంతపెడుతున్నప్పటికీ వాటిని నియంత్రించుకుని మంచి ఆలోచనలు కలిగి బాధ్యతతో నడుచుకున్నప్పుడే సాధ్యమవుతుంది. దానితో పాటు దేశంలో జరిగే నేరాలకు తీవ్రమైన శిక్షలను నూటికి నూరుశాతం అమలు చెయ్యటం మొదలు పెట్టినప్పుడే సాధ్యమవుతుంది.

భయం-బాధ్యతలతో కూడిన ఉత్తమ నైతిక విలువలను ధార్మిక గ్రంథాలు మాత్రమే చెబుతున్నాయి. అంతర్జాతీయ ఫిలాసఫర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ సైతం చెప్పింది ఇదే.

ఒక్క మాటలో చెప్పాలంటే ధార్మిక గ్రంథాల మౌలిక లక్ష్యం- “మనిషి తన చెడు కోరికలను నియంత్రించుకుంటూ మంచి ఆలోచనలతో ఎలా నైతికంగా జీవించాలి” అన్న ఒకే ఒక్క అంశాన్ని నేర్పటం మాత్రమే.

ఈ సందర్భంలో కొందరు మోరల్ గా ఎలా బ్రతకాలో నేర్పటానికి దైవ గ్రంథాలు అవసరమా? ఏం ఆ మాత్రం మాకు తెలీదా? అని ప్రశ్నించవచ్చు. మంచీ-చెడుల స్పృహను దేవుడు ప్రతీ మనిషిలోనూ పెట్టాడు. కానీ, చెడు కోరికలను/వాంఛలను నియంత్రించుకోవటం ఎలా? అన్న కీలకమైన ప్రశ్నకు సమాధానం ధార్మిక గ్రంథాల్లోనే దొరుకుతుంది. అదే కదా అసలు సమస్య.

దానికి ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సమాధానం- మనిషి ఒంటరిగా బాధ్యతా రాహిత్యంగా వదిలి పెట్టబడలేదు అతను చేసే ప్రతీ మంచీ-చెడులు నమోదు చెయ్యబడుతున్నాయి, వాటి నివేదిక ఒకరోజు దైవ న్యాయస్థానంలో ఉంచబడుతుంది. అతను చేసే ప్రతీ మంచీ-చెడు పనులకు అతను ఒకరోజు ఒంటరిగా నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అతని పనులకు తగ్గట్టు శాశ్వత శిక్షా-బహుమానాలు అతనికి విధించబడతాయన్నది.

ఇలాంటి భయాలు కలిగించటానికే దేవుడూ, ధర్మం తప్ప ధార్మిక గ్రంథాలు ఈ రోజుల్లో పనికి రావని మెదడు తక్కువ మాటలు చాలా మంది మాట్లాడుతుంటారు. నిజానికి ధార్మిగా గ్రంథాల్లో చెప్పబడుతున్న పై దృక్పథం యొక్క లక్ష్యం- మనిషిలో కేవలం భయాన్ని కలిగించటానికే కాదు అతనిలో బాధ్యతను సైతం సృష్టించటం.

సృష్టికర్త నా ప్రతీ పనినీ గమనిస్తున్నాడు, నా పనులకు నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భావన మనిషిలో ‘బాధ్యత’ను కలగజేస్తుంది. నేను చేసే చెడు పనులకు ఈ లోకంలో చట్టాలను బట్టి తప్పించుకున్నప్పటికీ.. పరలోక న్యాయస్థానంలో చట్టాల నుండీ శాశ్వత శిక్ష నుండి తప్పించుకోవటం అసాధ్యం అన్న భావన మనిషిలో ‘భయాన్ని’ కలగజేస్తుంది.

మనిషి తాను చేసే చెడు పనులను ఎవరూ చూడటం లేదు ఎవరూ పట్టుకోరు, ఎవరి ముందూ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తాను చేసే ఘోర నేరాలకు ఎలాంటి శిక్షలూ ఉండవన్నది మనిషిలో బాధ్యతారాహిత్యాన్ని కలుగజేస్తుంది. అతన్నో పశువులా మార్చుతుంది.

కాబట్టి తలిదండ్రులు తమ పిల్లలకు చెయ్యాల్సింది ఏవేవో కౌన్సిలింగులు కావు.. వారికి మోడ్రన్ ఎడ్యుకేషన్ తో పాటు ధార్మిక గ్రంథాల్లో చెప్పబడ్డ మోరల్ వ్యాల్యూస్, వాస్తవ దైవ భావన, మనిషి జీవిత లక్ష్యం ఏమిటి? అన్న విషయాలను నేర్పాలి. స్త్రీ, పురుషులు వ్యక్తిగతంగా, సామాజికంగా ఎలా నడవాలో చెబుతున్న సూత్రాలను వివరించాలి.

ధార్మిక గ్రంథాల్లో చెప్పబడుతున్న “వాస్తవ దైవ భావాన” “మానవ జీవిత లక్ష్యం” “పరలోక భావన” వగైరా విషయాలపై సమాజంలో మాన్యుల నుండి సామాన్యుల వరకూ విస్తృత చర్చ జరగాలి. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవటం ఏవో ముఢా నమ్మకాల గురించి మాట్లాడుకోవటం లాంటిదే అని మైండ్ ట్యూన్ చేయబడ్డ వారు అలాంటి సంకుచిత భావాల నుండి ముందు బయటకు రావాలి.

ధార్మిక గ్రంథాల ధర్మం గురించి మత వ్యవస్థలో ఉన్న మూఢనమ్మకాలకూ తేడా తెలుసుకోవాలి.
ధార్మిక గ్రంథాల్లో మనిషి చెడుకు పాల్పడకుండా అతన్ని నియంత్రించటానికి, మంచి ఆలోచనలతో నడవటానికి చెప్పబడుతున్న విషయాలపై ఆధునిక విద్యావేత్తల్లోనూ క్లాస్ రూమ్ చర్చలు, ఇష్టాగోష్టి కార్యక్రమాలూ జరగాలి. వాటిని సామాన్య ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లగలగాలి. సుందర సమాజం గురించి కలలు కనే నిద్ర నుండి మేల్కొని ఈ పనులను ప్రాక్టికల్ గా చేసి నిజంగానే సుందర సమాజాన్ని నిర్మించటానికి ప్రయత్నించాలి.

సమాజంలో చెడులను నియంత్రించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎలాగూ ఫేయిల్ అయ్యాం. కనుక ఒకసారి ఈ రకమైన ప్రయత్నాన్ని సైతం చెయ్యటంలో తప్పైతే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *