చరిత్రలో మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసిన మహోన్నత ఉపాధ్యాయుడు ఎవరు?

అన్న ప్రశ్నకు నిస్సందేహంగా ప్రవక్త ముహమ్మద్ (స) అనే చెప్పాలి. నిస్పక్షపాతంగా మానవజాతి చరిత్రను పరిశీలించిన వారు సైతం చెప్పింది ఇదే.

ఉదాహరణకు ‘మెకాయిల్‌ హెచ్‌.హార్డ్‌’ అనే ఓ స్పేస్‌ సైంటిస్ట్‌ చరిత్రలో మానవాళిని తమ మాటల ద్వారా, చేతల ద్వారా అత్యంత ప్రభావితం చేసిన మహామహులైన వ్యక్తుల తాలూకు చరిత్రను సేకరించి లోతైన పరిశీలన చేసి రచించిన గ్రంథమే ‘The 100 A Ranking of the Most Influential Persons in History’. అంటే “చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు” అని అర్థం.

ఈ వంద మంది వ్యక్తుల జాబితాలో మానవాళిని తమ బోధల ద్వారా, మాటల ద్వారా అత్యంత ప్రభావితం చేసిన మహావీరుడు నుండి ప్లాటో, కార్ల్ మార్క్స్, జూలియస్ సీజర్, జొహన్నాస్ కెప్లర్, సిగ్మండ్ ఫ్రాయిడ్, అశోకుడు,సెయింట్ ఆగస్టీన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, అలెగ్జాండర్ గ్రాహంబెల్, థామస్ ఎడిసిన్, మార్టిన్ లూథర్, లెనిన్, స్టాలిన్, జాన్ ఎఫ్. కెన్నెడీ, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, అరిస్టాటిల్, గౌతమ బుద్ధుడు, సెయింట్ పాల్, జీసస్ వరకు ఎందరో మహామహులున్నారు.

ఈ వందమంది తమ మాటల/చేతల ద్వారా మానవ జాతిని ఏ విధంగా ఏ యే రంగాలలో ఎంత ధృఢంగా ప్రభావితం చేశారు, దానిలో వారు ఎంత మేరకు విజయాన్ని సాధించారు అన్న కొలమానాన్ని తీసుకుని వారికి వివిధ స్థానాలను సైతం ఇవ్వటం జరిగింది.

ఆ విధంగా చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన వంద మందిని ఎన్నుకుని వారందరిలో కెల్లా మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా మొట్టమొదటి స్థానం ఇవ్వబడింది ప్రవక్త ముహమ్మద్ (స) వారికి.

ఆ జాబితాలో గౌతమ బుద్ధుడికి 4 వ స్థానం ఇవ్వబడితే, జీసస్ కు 3 వ స్థానం ఇవ్వబడినట్లు చూడగలం. ఆ విధంగా ఎందరెందరో మహానుభావులకు వివిధ స్థానాలు ఇవ్వబడినప్పటికీ వారందరిలో 1 వ స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్‌(స) కు ఇవ్వటానికి గల కారణమేమిటో ‘మెకాయిల్‌ హెచ్‌.హార్డ్‌’ ఈ క్రింది విధంగా వివరించటమైంది.

”చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన వందమంది జాబితాలో మొట్ట మొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్‌కు ఇవ్వటం అన్న నా ఎంపిక చాలా మందికి ఆశ్చర్యానికి గురిచెయ్యవచ్చు కానీ ఆయన మాత్రమే చరిత్రలో ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ గొప్ప విజయం సాధించిన ఏకైక వ్యక్తి”

ప్రవక్త ముహమ్మద్ (స) మానవజాతిని అంతగా ప్రభావితం చేసిన విషయం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే.. నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి, నైతికత, మానవత్వాల విషయంలో అధఃపాతాళానికి పడిపోయి, అజ్ఞానంధకారంలో కొట్టిమిట్టాడే ఒకనాటి అనాగరిక జాతిని కేవలం 23 ఏడేళ్లలో ప్రపంచానికి నైతికతను మానవత్వాన్ని నేర్పేవారిగా, ఆధ్యాత్మికను బోధించేవారిగా, విజ్ఞానానికి నాగరికతకు ధ్వజవాహకులుగా మార్చివేయటమే ప్రవక్త ముహమ్మద్ (స) చేసింది.
ముఢాచారాలను బహిరంగంగా ఖండించి హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పాడాయన.

దేవుని అస్తిత్వాన్ని గుడ్డి నమ్మకాల ద్వారా కాక, సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి దైవ అస్తిత్వాన్ని గుర్తించటాన్ని నేర్పాడాయన.

అతివాదానికి, మితవాదానికి ఆధ్యాత్మిక వాదానికి, భౌతికవాదానికి మద్యేమార్గాన్ని నేర్పాడాయన.

ఆధ్యాత్మికతను కలిగి ఉంటూనే భౌతిక జీవన రంగంలో ఎలా విజయవంతమవ్వాలో నేర్పాడాయన.

తోటి మానవులపట్ల కారుణ్యాన్ని కలిగి ఉండటాన్ని జీవులపట్ల దయను కలిగి ఉండటాన్ని నేర్పాడాయన.

అన్యాయం స్వంత వ్యక్తుల వైపున ఉన్నప్పటికీ న్యాయం చివరకు శత్రువు వైపు ఉన్నప్పటికీ న్యాయం వైపే నిలబడటం నేర్పాడాయన.

పొరుగువాడు ఆకలిగా ఉండగా కడుపు నిండా తినటాన్ని నిషేధించి ముందు పొరుగువాని ఆకలి తీర్చి తినటాన్ని నేర్పాడాయన.

పేదవారికి, అవసరార్థులకు, బాటసారులకు ఆర్థికంగా ఆదుకోవటాన్ని నేర్పాడాయన.

తాము జరుపుకునే పండుగల్లో బీదసాదలను, అన్నార్తులను, ఇరుగుపొరుగు వారిని భాగస్వాములుగా చేసుకోవటాన్ని నేర్పాడాయన.

స్త్రీలకు నిండైన వస్త్రాధారణను, పురుషులకు స్త్రీల పట్ల ఉత్తమోత్తమ గౌరవమివ్వటాన్ని వారి హక్కులను న్యాయంగా చెల్లించటాన్ని నేర్పాడాయన.

కష్టానష్టాల్లో క్రుంగిపోకుండా దైవాన్ని మాత్రమే నమ్ముకుని ధైర్యంగా ఎలా బ్రతకగలగాలో ఆచరణాత్మకంగా చూపాడాయన.

ఒక వ్యక్తి మానవజాతిపై తన బోధల ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా బలమైన ప్రభావాన్ని వేసి వారి ప్రవర్తనను మార్చగలగటం.. తాను గతించినప్పటికీ తన బోధల తాలూకు ప్రభావాన్ని తరతరాలుగా మానవాళి పై చూపుతూ వారిలో పరివర్తన తీసుకురావటం అన్నది ఆషామాషీ విషయం కాదు. అది తన ఉద్యమం పట్ల ఎంతో నిబద్ధత, సత్యసంధత, ఉత్తమోత్తమ నైతిక విలువలు కలిగిన మహా వ్యక్తిత్వం కలిగిన మనిషికే సాధ్యమవుతుంది.

ఈ కొలమాన్ని దృష్టిలో పెట్టుకుంటే 1400 వందల సం.ల క్రితం ప్రవక్తగా అరేబియా జాతి వద్దకు పంపబడిన ముహమ్మద్‌(స) తన ప్రభావాన్ని మానవాళిపై ఎంత బలంగా చూపగలిగారంటే.. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచ జనాభాలో మూడొంతుల్లో ఒక వంతు ప్రజలను తన అనుచరులుగా మర్చుకోగలిగినంత!

మహాత్మాగాంధీ ప్రకారం – “మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దలేని బోధన ఎంతమాత్రం విలువ లేనిది”.. ఐ.ఐ.టీ రామయ్య ప్రకారం ఉపాధ్యాయుడు అంటే “సమాజ నిర్మాత, ఒక సామాజిక వైద్యుడు”.. అలాగే “నిజమైన బోధన అంతిమ లక్ష్యం జ్ఞానాన్ని పెంచటం, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటం” అని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పటం జరిగింది.

ఆ ప్రకారంగా చూస్తే శాస్త్రీయ ఆలోచనను, హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని, జ్ఞానాన్ని నేర్పాటమే కాక ఉత్తమోత్తమ నైతిక విలువల ప్రకారం ఆచరణాత్మకంగా ఎలా జీవించాలో నేర్పిన ప్రవక్త ముహమ్మద్ (స) మానవజాతిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అనటంలో సందేహమే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *