స్వేచ్ఛ – నిర్బంధం మరియు ఇస్లాం

మతం మనిషిని కొన్ని ఆచారాలు, పరిమితులు, కట్టుబాట్ల పేరుతో నిర్బంధించి అతని స్వేచ్ఛను హరిస్తుందన్నది అభినవ నాస్తికుల వాదన అయితే.. ఆశ్చర్యంగా చాలా మంది ముస్లిమేతర ఆస్తికులు మరియు నాస్తికులైతే ఇస్లాం పట్ల ఈ విమర్శ మరింత అధికంగానే చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ గొడవతో సోషల్ మీడియాలో ఇస్లాం కఠిన నియమాలు, చట్టాలను బలవంతంగా విధిస్తుందని కొన్ని హద్దుల్లో పెట్టి వ్యక్తి స్వేచ్చను హరిస్తుందన్న వాదనలు, విమర్శలు జోరందుకున్నాయి.

దానికి కారణం ముస్లిం సమాజంలో కొందరు అనవగాహనా పరులైన ముస్లిములు ప్రదర్శించే పోకడలన్నిటినీ ఇస్లామే నేర్పుతుందన్న అతి పెద్ద అపోహను బుర్రకెక్కించుకోవటమే! యదార్థం ఏమిటంటే నేడు ముస్లిం సమాజంలో అధికశాతం మంది అవలంబించే విధానాలకు ఇస్లాంకు కించిత్తు సంబంధం లేదన్నది. ఈ విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే..

“వ్యక్తి స్వేచ్చ”ను గురించి మాట్లాడేవారు అసలు ‘స్వేచ్చ’ అన్న పదాన్ని ముందుగా నిర్వచించాల్సి ఉంటుంది.

‘వ్యక్తి స్వేచ్ఛ’ అంటే..

ఉదాహరణకు మనసు వ్యభిచారాన్నో, హోమోసెక్సువాలిటీనో కోరుకుంటుంది కాబట్టి ఏ మాత్రం మంచీ-చెడు అన్నవి చూడకుండా ఆయా కోరికలు స్వేచ్ఛగా తీర్చేసుకోవటమనా?

మనసు ఫుల్లుగా మందు కొట్టేయాలనో, ఏ గంజాయి, హెరాయిన్నో సేవించి మత్తులో తూగాలనో కోరుకుంటుంది కాబట్టి ముందు వెనుక ఏ మాత్రం ఆలోచించకుండా ఆయా కోరికలను స్వేచ్ఛగా తీర్చేసుకోవటమనా? లేక మనసు నగ్నత్వాన్ని కోరుకుంటే సభ్యత, సిగ్గు అన్న వాటిని ప్రక్కన పెట్టి స్వేచ్ఛగా అశ్లీలాన్ని ప్రోత్సహించటమనా?

‘వ్యక్తి స్వేచ్ఛ’ అంటే.. మనసు కోరే విపరీతమైన దిగజారుడు కోరికలను తీర్చేసుకోవటం కాదు. సభ్యత, సంస్కారాలును కలిగి, కొన్ని హద్దులకు లోబడి ఉంటూనే మనిషి తనకు నచ్చినట్టు బ్రతకటం అని ఎవరైనా చెబితే.. ఇస్లాం నేర్పుతుంది కూడా అదే అన్నది తెలుసుకోవాలి.

దాని కంటే ముందు గమనించాల్సింది మనిషిని పూర్తిగా కఠిన నియమాల క్రింద నిర్బంధించటం ఎంత ప్రమాదమో మనిషికి పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వటం కూడా అంతే ప్రమాదం. పూర్తి స్వేచ్చ లభించినప్పుడు మనిషి పశువుకంటే హీనంగా మారిపోతాడు. సభ్యత, సంస్కారాలు మరచిపోయి తల్లీ, చెల్లి అనే బేధాలు చూడకుండా చెలరేగిపోతాడు. తన స్వార్థం కోసం తలిదండ్రులను, స్వంత సోదరీ సోదరులనే కడతేర్చటానికి వెనుకాడడు.

అలాగే కొన్ని కఠిన నియమాలతో నిర్బంధించటమూ ప్రమాదమే! అతని మెదడు విశాలమైన ఆలోచనలకు బదులు సంకుచిత ఆలోచనలు, సంకుచిత భావాలతో నిండిపోతుంది. అలాంటి వ్యక్తులు సమాజ అభివృద్ధికి పనికి రాకుండాపోతారు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ రాణించలేరు.

కానీ ఇస్లాం ‘పూర్తి స్వేచ్చ’ ‘పూర్తి నిర్బంధం’ అనే ఈ రెండు విపరీత ధోరణులకు మధ్య మనిషికి ‘నిర్బంధంతో కూడిన స్వేచ్ఛ’ను నిర్దేశిస్తుంది.

‘నిర్బంధంతో కూడిన స్వేచ్ఛ’ అంటే..

ఇస్లాం మీ ఇష్టమొచ్చిన పరిశుభ్రమైన ఆహారపదార్థాలన్నిటినీ తినమంటుంది కానీ అందులో హద్దులు మీరవద్దని చెబుతుంది. అంటే ఆరోగ్యానికి హానిచేసే చనిపోయిన జంతు మాంసాన్నీ, రక్తాన్నీ, పంది మాంసాన్ని తినవద్దని చెబుతుంది. కోరపళ్లు ఉన్న మృగాలను కాక ఆరోగ్యకరమైన మేసే చతుష్పాద జంతువుల మాంసాన్ని తినమంటుంది. మత్తు కలిగించే పదార్థాలను నిషేధిస్తుంది. ఈ నియమాలను పాటించటం వెనుక ఆరోగ్యపరమైన లాభాలున్నాయి.

ఇస్లాం మీకిష్టమొచ్చిన దుస్తులు ధరించమని చెబుతుంది కానీ అందులో హద్దులు మీరవద్దని చెబుతుంది. శరీరం పూర్తిగా కప్పడేలా నిండైన హుందాగా ఉండే వస్త్రాలు ధరించమని చెబుతుంది. అందులో వెర్రి పోకడలు అవలంబించవద్దని చెబుతుంది. స్త్రీలకైతే తల మీద నుండి ముఖం, శరీరం కప్పబడేలా అదనపు వస్త్రం ధరించమని చెబుతుంది. పురుషులకైతే పరాయి స్త్రీల విషయంలో తమ చూపులను కాపాడుకోవాలని వారిస్తుంది అలాగే స్త్రీలకు కూడా పరాయి పురుషుల విషయంలో ఇదే నియమాన్ని విధిస్తుంది.

అలాగే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధిస్తుంది చివరకు వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని చెప్పి వివాహ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. వరకట్న దురాచారానికి బదులు పురుషులే స్త్రీలకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి ఎటువంటి ఆడంబరాలూ లేకుండా వివాహం చేసుకోమని చెప్పి వివాహ వ్యవస్థను సులభతరం చేస్తుంది. ఈ నియమాలను పాటించట వలన ఎన్నో వ్యక్తిగత మరియు సామాజిక ప్రయోజనాలున్నాయి.

ఇస్లాం నిర్దేశిస్తున్న పై నియమాలన్నిటినీ గమనిస్తే… ఇస్లాం మనిషికి కొన్ని హద్దులను నిర్దేశిస్తూ నిర్బంధంతో కూడిన స్వేచ్ఛను నిర్దేశిస్తుందే తప్ప మనిషి పశువులా మారే విధంగా అతన్ని పూర్తి స్వేచ్చతో వదిలిపెట్టటం లేదన్న విషయం అర్థమవుతుంది.
ఈ విధంగా ప్రతీ రంగంలో ఇస్లాం మనిషికి మధ్యే మార్గాన్ని అవలంబించమని చెబుతూ వ్యక్తులకు తమ ఆలోచనల్లో, ఆచరణాల్లో సమతూకాన్ని (Balance) కలిగి ఉండమని చెబుతుంది. కాబట్టి తినే తిండి నుండి కట్టుకునే బట్టల వరకు ప్రతీ విషయంలో ఇస్లాం నిర్బంధంతో కూడిన స్వేచ్ఛను ఇస్తుంది. తద్వారా వ్యక్తులు పూర్తిగా హద్దులు మీరిపోకుండా, పూర్తిగా నిర్బంధించబడకుండా సమతూకం కలిగిన ఆచరణ కలిగి ఉంటారు. ఈ సమతూకం (Balance) దెబ్బతిన్న నాడు మనిషి పశువు కన్నా హీనంగా మారిపోతాడు.

కాబట్టి ధర్మాన్ని అసహ్యించుకుంటూ స్వేచ్చ కావాలని గొంతెత్తేవారు గమనించాల్సింది- స్వేచ్ఛ అంటే మనిషి ఎలా పడితే అలా నడుచుకోవటం అని కాదు.. హద్దులు మీరకుండా తనకు నచ్చినట్టు బ్రతకటమేస్వేచ్చ అంటే. ఇదే ఇస్లాం నిర్దేశిస్తున్ననిబంధంతో కూడిన స్వేచ్ఛ.
తప్పితే ఇస్లాం స్త్రీలు స్కూళ్లకూ, కాలేజీలకు వెళ్లి చదువుకోకూడదు, బయట తిరగకూడదు, టీవీలు చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు వగైరా నియమాలను విధించటం లేదు.

అన్నిటికంటే ముఖ్యంగా పై నియమ నిబంధనలను నిర్దేశించాక ఇస్లాం చెబుతుందేమిటంటే.. “ఈ ధర్మాన్ని ఇష్టపడిన వారు విశ్వసించవచ్చు మరియు ఇష్టపడనివారు దీనిని తిరస్కరించవచ్చు” (18:29) “ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు” (2:256) అంటూ ధర్మాన్ని పాటించటం పాటించకపోవటం అన్నది మనిషి ఇష్టానికే వదిలిపెట్టేసింది.

కాబట్టి ఇస్లాం మనిషికి ‘స్వేచ్ఛను (Freedom)’ ఇవ్వటం లేదన్నది ఎంత పెద్ద అభాండమో… ఇస్లాం మనిషికి ‘ఎంపిక స్వేచ్ఛను (Freedom of choice) ను నిర్దేశిస్తుంది అన్నది కూడా అంతే వాస్తవం.
‘ఎంపిక స్వేచ్ఛ (Freedom of choice)’ అంటే మనిషి తమ మనసు కోరుకుంటున్నట్లు చెడు ఆలోచనల ప్రకారమైనా ప్రవర్తించవచ్చు లేదా చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ మంచిని కూడా అవలంబించవచ్చు. ఈ రెండు మార్గాల్లో దేన్నైనా ఎన్నుకుని దాని ప్రకారం నడుచుకునే స్వేచ్ఛను ఇస్లాం నిర్దేశిస్తుంది.

ఈ కనీస సమాచారం (Basic information) లేకుండా నేడు ఇస్లాం పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్న వారంతా ఇస్లాం గురించి అస్సలు అవగాహన లేనివారే.

*****

“ధర్మం ఎంతో సులువైనది. ఎవరైతే దానిని బరువు చేసుకుంటాడో అతను ధర్మంలో కొనసాగలేడు. కాబట్టి మీరు ధర్మం విషయంలో అతిశయించకండి” – ప్రవక్త ముహమ్మద్ (స)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *