ఇప్పుడు ఇస్లామోఫోబియాకు అన్ని ద్వారాలు తెరచుకున్నాయి!

అవును ఎప్పుడైతే తాలిబాన్ తిరిగి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకుందో ఇస్లాం పట్ల ఉన్న ధ్వేషంతో కడుపులో ఉన్న మలాన్ని నోటితో కక్కెసే ప్రయత్నాన్ని ఒకప్రక్క మీడియా మొదలెట్టేసింది.

“మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుండి బురఖాల్లో బంధీ అయినంత వరకు”

అంటూ BBC గమ్మత్తైన హెడ్డింగ్ పెట్టి ఈ న్యూస్ రాయటాన్ని బట్టి.. తాలిబాన్లు వచ్చి కొత్తగా బురఖాను కనిపెట్టి అక్కడి స్త్రీలను బురఖాల్లో బంధించేశారు అంతకు ముందు ముస్లిం స్త్రీలంతా చక్కగా మినీ స్కర్టులు వేసుకుని రోడ్లపై నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవారన్నట్టు హాస్యాస్పదంగా ఉంది.

అంటే ఈ న్యూస్ ను బట్టి… స్త్రీలు ‘నిర్భయంగా’ రోడ్డు మీద తిరగాలంటే ‘మినీ స్కర్టులు’ ధరించాలని అర్థమా? లేదంటే మినీ స్కర్టులు ధరించాలన్న ఫార్ములా తెలీక చాలా మంది స్త్రీలు పాపం నిండుగా బట్టలు ధరించటం మూలనా నిర్భయంగా తిరగలేక భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నారని అర్థమా?

70 లలో ఆఫ్ఘనిస్తాన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేదని అప్పట్లో ముస్లిం స్త్రీలంతా ఇలా మినీ స్కర్టులు ధరించి స్వేచ్ఛగా తిరిగేవారని ఆ తరువాత స్వేచ్ఛను కోల్పోయి అక్కడి ముస్లిం మహిళలు బలవంతంగా బురఖాలు ధరించటం మొదలెట్టారన్నది ఈ న్యూస్ ఉద్దేశం. అంటే ముస్లిం మహిళలకు స్వంతంగా ఆలోచించగలిగే బుర్రలు కానీ స్వంత వ్యక్తిత్వం కానీ ఉండవన్నది ఈ న్యూస్ రాయటంలో ఉద్దేశం. నిజానికి ముస్లిం స్త్రీలు హిజాబ్ ధరించే విధానం గత 1400 సం.ల నుండీ ఉంది ప్రపంచంలో అన్ని ముస్లిం దేశాల్లో ఉండే స్త్రీలూ తమ ఇష్టాను సారంగానే హిజాబ్ ధరిస్తున్నారు.

అసలు స్త్రీలు నిండైన వస్త్రాలు ధరిస్తే స్వేచ్ఛ కోల్పోయినట్టు అదే తమ ఇష్టానుసారంగా మినీ స్కర్టుల్లో తిరిగితే స్వేచ్చ లభించినట్టు అన్న ఫార్ములానే చాలా విచిత్రమైనది. నిజానికి ఎంత తక్కువ వస్త్రాలు ధరిస్తే అంత స్వేచ్చ ఉన్నట్టు అనుకుంటే.. అది స్వేచ్చ అవ్వదు అనాగరికత అవుతుంది. స్వేచ్చ అంటే ఎలా పడితే అలా నడుచుకోవటం అని కాదు.. హద్దులు మీరకుండా మనకు నచ్చినట్టు బ్రతకటమేస్వేచ్చ అంటే. ఆ హద్దులు చెరిపేసిన నాడు మనుషులకు పశువులకు పెద్ద తేడా ఉండదు.

నిజానికి ఒక వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటమూ ప్రమాదమే.. అలాగని పూర్తిగా నిర్బంధించటమూ ప్రమాదకరమే! ఇస్లాం ఈ రెండు అతివాదాల మధ్య నిర్బంధంతో కూడిన స్వేచ్ఛను ఇస్తుంది. అతివాదానికీ, మితవాదానికీ, భౌతిక వాదానికీ, ఆధ్యాత్మిక వాదానికీ ఇలా ప్రతీ రంగంలో ఇస్లాం మధ్యే మార్గాన్ని అవలంబించమని చెబుతూ వ్యక్తులకు తమ ఆలోచనల్లో, ఆచరణాల్లో సమతూకాన్ని (Balance) కలిగి ఉండమని చెబుతుంది. కాబట్టి తినే తిండి నుండి కట్టుకునే బట్టల వరకు ప్రతీ విషయంలో ఇస్లాం నిర్బంధంతో కూడిన స్వేచ్ఛను ఇస్తుంది. తద్వారా వ్యక్తులు పూర్తిగా హద్దులు మీరిపోకుండా, పూర్తిగా నిర్బంధించబడకుండా సమతూకం కలిగిన ఆచరణ కలిగి ఉంటారు. ఈ సమతూకం (Balance) దెబ్బతిన్న నాడు మనిషి పశువు కన్నా హీనంగా మారిపోతాడు.

ఈ విషయాన్ని ప్రక్కన పెడితే.. తాలిబాన్లు మతతత్వవాదులు అన్నది కొంతవరకు నిజమే. ఎంతో సులభతరమైన ఇస్లామిక్ షరియాను వారు కఠినంగా మార్చి దాన్ని అమలు చెయ్యటం కారణంగానే ఆఫ్ఘన్ లో వారిపై ముస్లిములే తిరుగుబాటు చేశారన్నది కూడా నిజమే. కానీ ఆఫ్ఘన్ లో ఉన్న ముస్లిం మహిళలు కానీ లేక ప్రపంచంలో ఉన్న సార్వత్రిక ముస్లిం మహిళా సమాజం గానీ “మేము బురఖాలో బంధీ అయిపోయాం ఇందులో నుండి బయటపడవేయండి” అని ఎప్పుడూ నినాదాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నిటిలోనూ స్త్రీలందరూ ఇష్టపూర్వకంగానే హిజాబ్ ధరిస్తుంటారు ఇష్టంలేని ఎందరో ధరించటం లేదు కూడా!

కానీ తాలిబాన్లు ఒకప్పుడు “స్త్రీలు స్కూళ్లకూ, కాలేజీలకు వెళ్లి చదువుకోకూడదు, బయట తిరగకూడదు, టీవీలు చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, స్త్రీలు కంపల్సరీ బురఖా ధరించాలి, పురుషులు కచ్చితంగా గెడ్డాలు పెంచాలి వగైరా చిత్రమైన కఠిన నిబంధనలు పెట్టటం కారణంగా ముస్లిమేతరులెవ్వరికైనా “ఇస్లాం ఇంత కఠినంగా ఉంటుందా?” అనిపించక మానదు.

నిజానికి ఇస్లామిక్ షరియాలో నిర్బంధంతో కూడిన ఇలాంటి నిబంధనలు ఎక్కడా లేవు. ఖురాన్ పురుషులకూ, స్త్రీలకు తమకు నచ్చిన వస్త్రాలు ధరించమని చెబుతుంది. కాకపోతే హద్దులు మీరకండి అని చెబుతూ స్త్రీలకు తలపై నుండి వక్షస్థలం కప్పబడేలా అదనపు వస్త్రం కప్పుకోమని చెబుతుంది. కారణం వారు ఆకర్షించబడి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు అన్న ఉద్దేశంతోనే. తప్పితే స్త్రీలను బురఖాల్లో బంధించేసి ఇళ్లల్లో కూర్చోబెట్టేయాలన్న ఉద్దేశంతో కాదు. పైగా స్త్రీలకు మీరు చచ్చినా బురఖా ధరించాల్సిందే అని ఎక్కడా చెప్పటం లేదు కూడా.

ఇస్లాం ఒక్క వస్త్రాల విషయంలోనే కాదు ఇంకా అనేక నియమ నిబంధనలను నిర్దేశించి “ముస్లిములైన మీరు ఇష్టమున్నా లేకపోయినా కచ్చితంగా ఇస్లాం నియమాలను అనుసరించాల్సిందే అని అక్కడా చెప్పటంలేదు. కానీ..

“ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు విశ్వసించవచ్చు మరియు ఇష్టపడనివారు దీనిని తిరస్కరించవచ్చు” (18:29) “ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు” (2:256) అంటూ మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛను గౌరవిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *