జిహాద్ – టెర్రరిజం – ఇస్లామిక్ స్టేట్

అల్–ఖైదా, ISIS, లష్కరే తోయిబా, జైషే ముహమ్మద్, తాలిబాన్ వగైరా సంస్థల మౌలిక లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు ఇస్లామోఫోబియాను పెంచిపోషించే మీడియా ప్రభావానికి గురైన ఏ ముస్లిమేతరుడైనా ఆయా సంస్థల లక్ష్యం ‘జిహాద్’ చేసి (అంటే వారి ఉద్దేశంలో టెర్రరిజం చేసి) ఇస్లామిక్ స్టేట్ ను స్థాపించటమే అని అలవోకగా చెబుతారు.

సామాన్య ప్రజల్లో ఇస్లాం పట్ల ద్వేషాన్ని పెంచటమే పనిగా పెట్టుకునే ఇస్లామోఫోబులైతే ఆయా సంస్థల్లో ఉన్నోల్లందరూ ముస్లిములే.. పైగా వారు ‘జిహాద్’ ‘అల్లాహు అక్బర్’ అంటూనే టెర్రరిజం చేస్తున్నారు. కాబట్టి ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని నిస్సిగ్గుగా, నిరభ్యంతరంగా మాట్లాడేస్తుంటారు.

అలా మాట్లాడేవారు పిసరంత ఇస్లాం జ్ఞానం కూడా లేని కరుడుగట్టిన ఆజ్ఞానులు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. నిజంగా ఇస్లాం లక్ష్యం ఉగ్రవాదాన్ని ప్రేరేపించటం అయితే.. జిహాద్ లక్ష్యం సమాజంలో దౌర్జన్యాన్ని సృష్టించటం అయితే ప్రాథమికంగా గమనించాల్సింది- భారత స్వతంత్ర పోరాటంలో లక్షల కొద్దీ ముస్లిములు బ్రిటిష్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పొరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించేసి ఉండేవారు కాదు. కానీ, అలా దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన లక్షల కొద్దీ ముస్లింల ప్రాణత్యాగాల తాలూకు చరిత్ర మరుగునపడిపోవటంతో నేటి అభినవ ఇస్లాం విమర్శకుల కళ్లకు పై ఉగ్రవాద సంస్థలు చేసే పనికిమాలిన దిగజారుడు పనులే కనపడుతుంటాయి. వాటిని బట్టే ఇస్లాంపై గుడ్డి విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.

ఇక అల్–ఖైదా, ISIS, లష్కరే తోయిబా, జైషే ముహమ్మద్, తాలిబాన్ వగైరా సంస్థలు చేస్తున్నది ‘జిహాద్’ కానే కాదు ఇస్లామియా రాజ్యస్థాపన అంతకంటే కాదు. వారు చేస్తున్నది ‘జిహాద్’ పేరుతో కేవలం ముస్లిం వేషాలు ధరించి ఇస్లాం గౌరవాన్ని మంటకలపటం.

ఈ తీవ్రవాద సంస్థల లక్ష్యం- ‘ఇస్లామిక్ రాజ్యం’ స్థాపించటం అని చెప్పటానికి మించిన అజ్ఞానం మరొకటి ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవలసింది ఈ సంస్థలు ఖురాన్-హదీస్ చదివి, ఇస్లాంను స్టడీ చేసి తయారైనవి కావు. వీరికంటూ స్వతహాగా నిర్ణయం తీసుకునే సామర్థ్యమూ లేదు స్వంత వ్యక్తిత్వమూ లేదు. కేవలం అమెరికా-పాశ్చాత్య దేశాల కూటమికి కట్టుబానిసలన్నమాట! ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కేవలం అమెరికా-పాశ్చాత్య కూటమి యొక్క సృష్టి మాత్రమే. ఈ సంస్థలను పెంచిపోషించేదీ, వారి ద్వారా ఒక చేత్తో ముస్లిం దేశాల్లో అంతర్యుద్ధాలను ప్రోత్సహించేదీ రెండో చేత్తో వారికి ఆయుధాలు అమ్మేదీ, తిరిగి వారు చేసే తీవ్రవాదాన్ని ‘ఇస్లామిక్ టెర్రరిజం’ అన్న పేరుతో మీడియాలో ప్రచారం చేసేదీ చివరకు ఈ సంస్థలపై యుద్ధాలు ప్రకటించేది కూడా అమెరికా-పాశ్చాత్య దేశాల కూటములే. ఎందుకంటే ఇస్లాం-ముస్లింల వినాశనం అమెరికా-పాశ్చాత్య దేశాల కూటమి ప్రధాన లక్ష్యం. ఈ అంతర్జాతీయ కుట్రలో భాగంగానే అల్-ఖైదాను, ISIS వగైరా ఉగ్రవాద గ్రూపులను సృష్టించిన అమెరికానే చివర్లో బిన్ లాడెన్ ను హతమార్చింది.. ఇరవై సంవత్సరాలు అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడి బాధ్యత కలిగిన ఎందరో మేధావుల్ని హతమార్చి చివరిగా ఆఫ్ఘన్ ను డొల్లగా మార్చిపరేసి వదిలిపెట్టి వెళ్ళిపోయింది.

ఈ వాస్తవాన్ని గ్రహించటంలో చాలా మంది ముస్లిములు వెనుకబడి ఉన్నారు అన్నది ఒప్పుకుతీరాల్సిన విషయం. దానికి గొప్ప ఆధారం నేడు మీడియాలో తాలిబాన్లను అడ్డం పెట్టుకుని ఇస్లామిక్ షరియా ప్రకారం వారు చేస్తున్నది రాక్షస పాలన అని ఒక ప్రక్క ఇస్లాంను ఒక బూచిగా చూపే ప్రయత్నం చేస్తుంటే మరోప్రక్క కొందరు ముస్లిం మేధావులు ఇస్లాం పట్ల మీడియా రేకెత్తించే విమర్శలకు సమాధానం ఇవ్వటం మానేసి తాలిబాన్ గొప్పతనం గురించి, దాని చరిత్ర గురించి చెప్పుకొస్తున్నారు. మరోప్రక్క చేపక్రింద నీరులా ఇస్లాంను మీడియా ఎంతగా అభాసుపాలు చెయ్యాలో అంతా సైలెంటుగా చేసుకుంటూ వెళ్లిపోతుంది.

అసలు ఆయుధాలు చేతపట్టి దౌర్జన్యాన్ని ప్రధానంగా చేసుకుని ఈ సంస్థలు ప్రదర్శించే మతోన్మాదానికి, అతివాదానికి, తీవ్రవాదానికీ ఖురాన్ బోధించే ఇస్లాంకు సంబంధమే లేనే లేదు. ఈ విషయం ముస్లిమేతరులందరూ స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయం.

ఇదంతా ప్రక్కన పెడితే అన్నిటికంటే ముఖ్యంగా ఖురాన్, ముస్లిం సమాజంపై మోపిన బాధ్యత ఇస్లామిక్ రాజ్య స్థాపన చెయ్యటం కానే కాదు! కేవలం “మంచిని బోధించటం, సమాజంలో చెడును తొలగించటానికి ప్రయత్నించటం”. దీనికి ఆధారమే ఈ క్రింది ఖురాన్ వాక్యం.

ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110

ఈ విధంగా సమాజ, వ్యక్తి సంస్కరణకు ఒక ముస్లిం చేసే తీవ్రమైన కృషి మరియు ప్రయత్నమే “జిహాద్” అంటే. మరి టెర్రరిజం సంగతి ఏమిటి?

“జిహాద్” కు వ్యతిరేకపదం ఉగ్రవాదం” లేదా “టెర్రరిజం!”

“జిహాద్” అన్న అరబీ భాషా పదానికి ధాతువు జ.హ.దా. అంటే దానర్థం- “శ్రమించటం (To struggle)” “కృషి చెయ్యటం (To strive)” మాత్రమే! “టెర్రరిజం (Terrorism)” అన్న పదాన్ని అరబ్బీలో “జిహాద్” అనరు “ఇర్హాబ్ (إرهاب) అంటారు. అంటే ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటం (Terrorize) అన్న మాట! అలాగే “టెర్రరిస్ట్ లేక ఉగ్రవాది (Terrorist)” అన్న పదాన్ని అరబ్బీలో “జిహాదీ” అనరు కానీ.. “ఇర్హాబి” (إرهابي) అంటారు. ప్రవక్త ముహమ్మద్ (స) చెయ్యమంటున్న ఉత్తమ ‘జిహాద్’ ఏమిటో ఒకసారి చదవండి.

“ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862

మరి ఈ ఉగ్రవాద సంస్థల్లో ముస్లిం వేషాల్లో ఉంటూనే “జిహాద్” అని పలుకుతూనే “టెర్రరిజం” చెయ్యటం లేదా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నిజమే కానీ.. దానిని “జిహాద్” దృక్పథం యొక్క “దుర్వినియోగం (Misuse)” అని చెప్పాలి.

ఖురాన్ హెచ్చరిక- కల్లోలం సృష్టించేవారిని అల్లాహ్ ప్రేమించడు
“భూమిపై కల్లోలాన్ని సృష్టించే ప్రయత్నం చెయ్యకు. అల్లాహ్ కల్లోలం సృష్టించేవారిని ప్రేమించడు” – ఖురాన్ 28:77

మరి ఖురాన్ లో ఇంత స్పష్టంగా కల్లోల్లాన్ని సృష్టించవద్దని, ఒక మానవుణ్ణి చంపితే సకల మానవులను చంపినట్టే అని రాసి ఉన్నప్పటికీ కూడా ఈ ఉగ్రవాద సంస్థల్లో ఉన్నోల్లు ఎప్పుడూ ఖురాన్ చదవలేదా? చదివి అర్థం చేసుకోలేదా? అన్న మరొక అమాయక ప్రశ్న కూడా కొందరు అడగవచ్చు.

ఇది ఎలాంటిదంటే.. ఎంతో గొప్ప రాజ్యాంగం ఉన్నప్పటికీ దాని ప్రకారం ప్రభుత్వాన్ని నడపాల్సిన పాలకుల్లోనే ఎందరో అన్యాయానికీ, నేరాలకు, ఘోరాలకు, కోట్లరూపాయల దుర్వినియోగానికి ఎలా పాల్పడగలుగుతున్నారు? అని ప్రశ్నించటం లాంటిదన్న మాట! అలాంటి కొందరు దుర్మార్గ పాలకులను బట్టి రాజ్యాంగాన్నీ తప్పు పట్టకూడదు.. కొందరు మతోన్మాదులను బట్టి వారి సంకుచితత్వాన్ని బట్టి ఇస్లాంనూ విమర్శించకూడదు.

ముఖ్యంగా గమనించాల్సింది…

అసలు నిజానికి చెడును రూపుమాపి, మంచిని పెంచి సమాజాన్ని ఎలా ప్రక్షాళన చెయ్యాలి? అన్న దానికి 1400 సం.ల క్రితం ప్రవక్త ముహమ్మద్(స) చూపిన విధానమే నిజమైన ఆదర్శం. కాబట్టి ‘రియల్ ఇస్లాం’ ను అర్థం చేసుకోవాలనుకునేవారు ప్రవక్త ముహమ్మద్ (స) బోధనల్ని, ఆయన జీవిత చరిత్రను, ఆయన ఒకనాటి అనాగరిక సమాజాన్ని నాగరికతకు పట్టుకొమ్మగా మార్చేసిన వైనాన్ని, ఖురాన్ ను పరిశీలించాలి తప్పితే.. నేడు కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థలను బట్టో లేక గాసిప్పుల్లో లభించే గాలి మాటలను బట్టో లేక వాట్స్ యాపుల్లో ఇస్లామోఫోబులు ప్రచార చేసే పిట్ట కథల్ని బట్టో ఇస్లాంను అంచనా వెయ్యకూడదు. విమర్సా చెయ్యకూడదు.
అలా చేస్తే అది పరమ అజ్ఞానం, మూర్ఖత్వం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *