ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్- ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ హస్తగతం చేసేసుకుందన్నది. అంతకంటే ముఖ్యంగా తాలిబాన్ పేరుమీద ఇస్లామోఫోబియా మరోసారి తన పడగ విప్పింది. కరుడుకట్టిన ఇస్లామోఫోబులకు, ఇస్లాం తాలూకు మిడి మిడి జ్ఞానం ఉన్న ఫేస్బుక్ అభ్యుదయవాదులకు ఇస్లాంపై విమర్శలు గుప్పించటానికి, విషం కక్కటానికి తాలిబాన్ చక్కటి వేదికయ్యింది.
తాలిబాన్ ప్రదర్శిస్తున్న మతఛాందసవాదం లేక మతోన్మాదానికి కారణం ఇస్లామేనని, వారు ప్రజలపై మోపుతున్న కఠినమైన చట్టాలు ఇస్లామిక్ షరియా నుండి తీసుకున్నవేనని చెబుతూనే… ఒక ప్రక్క ముస్లిముల మనోభావాలను రెచ్చగొట్టటానికి, మరోప్రక్క హిందూ-ముస్లిముల మధ్య సోదరభావాన్ని పనికట్టుకుని దెబ్బతీయటానికి “ఇస్లామిక్ షరియా కాలం చెల్లిన చట్టాలని, మధ్య యుగాల నాటి ఆటవిక చట్టాలంటూ విమర్శించటమే కాక “చూసారా! ఇస్లాం ఎంత కఠినమైన, క్రూరమైన చట్టాలను కలిగి ఉన్నదో కాబట్టి ఇస్లాం ప్రమాదకరం జాగ్రత్త” అని ఇక్కడి హిందువులని రెచ్చగొట్టే పనిలో ఇస్లాం పట్ల ద్వేషాన్ని పీకల వరకూ నింపుకున్న ఇస్లామోఫోబులు బిజీ అయిపోయారు.
అసలు తాలిబాన్లు మంచివారా? చెడ్డవారా? వారు చేస్తున్నది కరెక్టా? కదా? అన్నది ఇక్కడ నా చర్చ కానేకాదు. కానీ, తాలిబాన్ ను అడ్డం పెట్టుకుని ఇస్లాంపై నేడు కొందరు పనికట్టుకుని చేస్తున్న విమర్శలు ఎంతవరకు సరైనవన్నదే ఇక్కడ నా అసలు చర్చ.
ఎందుకంటే ఇస్లాం అంటే తాలిబానో, అల్ ఖైదానో కాదు. అంతకంటే ముఖ్యంగా ఇస్లామిక్ షరియా అంటే మధ్య యుగాలనాటి అనాగరిక చట్టం కూడా కాదు. కానీ, ఒకనాటి అనాగరిక జాతుల్ని నైతికతకు పట్టుకొమ్మలుగా, క్రూరత్వం, కాఠిన్యంతో నిండి ఉన్న వ్యక్తుల్ని మంచీ-మానవత్వం కల వ్యక్తులుగా తీర్చిదిద్దిన విశాల దృక్పథాలతో కూడిన దైవిక చట్టం.
కాబట్టి టోపీ, గెడ్డాలు పెట్టుకుని ఉర్దూ/అరబిక్ పేర్లు తగిలించుకుని “అల్లాహు అక్బర్” అంటూ కేకలు పెడుతూ తీవ్రవాదం చేస్తునో లేక మతోన్మాదాన్ని ప్రదర్శిస్తూనో.. మేము ఇస్లామియా షరియాను అమలు పరుస్తున్నామని ఎవరైనా అంటే ఇస్లాం విమర్శకులు ముందుగా తెలుసుకోవలసింది- ఇస్లామిక్ షరియా లక్ష్యమే మతోన్మాదాన్ని, అతివాదాన్ని తీవ్రవాదాన్ని ఖండించటం అన్నది.
అయినప్పటికీ తాలిబాన్నో, అల్ ఖైదానో మరొక తీవ్రవాద మతోన్మాద వర్గాన్నో చూసి ఆయా మత వర్గాలు ప్రదర్శించే మతోన్మాదానికి, అతివాదానికి కారణం ఇస్లామే అని ఎవరైనా తీర్మానం చేస్తే అది ఎటువంటిదంటే… గుజరాత్ మారణహోమానికి, జుమా మస్జిద్, ఆజ్మీర్ దర్గా, సంఝోతా ఎక్స్ ప్రెస్ బాంబ్ పేలుళ్లకు పాల్పడిన హిందుత్వ తీవ్రవాదులను బట్టి హిందూత్వం ఉగ్రవాదం నేర్పుతుందని తీర్మానించటం లాంటిదన్నమాట. ఇంకా క్రైస్తవ క్రుసేడ్లకు, మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో కోట్ల మందిని చంపేయటానికి, హిరోషిమా-నాగసాకి పై అణుబాంబులు వేసి లక్షల మందిని చంపేయటానికి, అమెరికా ఇరాఖ్ పై దాడులు చేసి లక్షల మందిని చంపేయటానికి, ఇస్రాయీల్ పాలస్తీనాపై మారణహోమం సాగించి లక్షల మందిని చంపేయటానికి కారణం బైబిల్ తీవ్రవాదాన్ని నేర్పాటమే అని తీర్మానించటం లాంటిదన్న మాట!
కాబట్టి మతోన్మాదాన్ని లేక తీవ్రవాదాన్ని ప్రదర్శించేవారు ప్రతీ మత వర్గంలోనూ ఉంటారు. ఒక్క మతవర్గాల్లోనే కాదు నాస్తిక వర్గాల్లోనూ ఉంటారు. చరిత్రలో కమ్యూనిజం ప్రధానంగా ఉండే నాస్తిక దేశాల్లో జరిగిన జనహననాల్లో కోట్లమంది దారుణంగా చంపబడటమే దానికి సజీవ సాక్ష్యం.
కాబట్టి తాలిబాన్నో లేక అల్ ఖైదానో లేక వేరొక వర్గాలనో చూసి ఇస్లాంను గుడ్డిగా విమర్శించటం కాదు. ఆయా వర్గాలు ప్రదర్శిస్తున్న మతోన్మాదానికి ఇస్లాంకు నిజంగా సంబంధం ఉందా? లేదా? అన్నది చూడాలి.
****
ఇస్లాంలో “బలవంతం” ఉందా?
ఇస్లాం మనిషి స్వేచ్ఛను హరిస్తుంది, కఠిన ఆంక్షలు విధిస్తుంది అన్నది కేవలం గాలి మాటలు మాత్రమే. మనిషికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటమూ ప్రమాదమే అలాగే పూర్తిగా నిర్బంధించినా ప్రమాదమే. కానీ ఇస్లాం ఈ రెండింటికి మధ్య నిర్బంధంతో కూడిన స్వేచ్చను ఇస్తుంది.
ఖురాన్ విధి-నిషేధాలను తెలిపి దైవధర్మం ప్రకారం నడుచుకోమంటుంది తప్పితే “మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇస్లాంను చచ్చినా మీరు బలవంతంగానైనా అనుసరించాల్సిందే అని ఎక్కడా చెప్పటం లేదు సరికదా.. “ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు” అని ఖురాన్ క్రింది విధంగా ఆదేశిస్తుంది.
“ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!” – ఖురాన్ 18:29
ఇస్లాం ఈ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడని ఆయనకు భయపడుతూ భయభక్తులతో నైతికంగా జీవించమని చెబుతుంది తప్పితే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్మాల్సిందే అని ఎక్కడా చెప్పటం లేదు.
స్త్రీ, పురుషుల సంబంధాల విషయంలో ఇస్లాం- పురుషులకు ఇతర స్త్రీల విషయంలో చూపులను కాపాడుకోమని, మర్మాంగాలను రక్షించుకోమని, ఎటువంటి రహస్య అక్రమ సంబంధాలకు పాల్పడవద్దని, వ్యభిచారానికి దూరంగా ఉండమని ఆదేశిస్తుంది.
స్త్రీలకు శరీరభాగాలు కనపడకుండా నిండుగా నచ్చిన వస్త్రాలను ధరించమని చెబుతుంది. తప్పితే హద్దులు మీరవద్దని చెబుతుంది. పరాయి పురుషుల విషయంలో చూపులను కాపాడుకోమని చెబుతుంది.
అలాగే పురుషులు, స్త్రీలను ఎంతో కొంత ధనాన్ని బహుమతిగా ఇచ్చి వివాహం చేసుకోమని చెబుతూ వరకట్నాన్ని నిషేధిస్తుంది.
తలిదండ్రుల, కుటుంబ సభ్యుల, బంధువుల, ఇరుగుపొరువారి హక్కులను కాపాడమని చెబుతుంది. తమ సంపదలో కొంత భాగాన్ని తీసి బీదసాదలకు, అవసరార్ధులకు దానం చెయ్యమని చెబుతుంది. పొరుగువాడు ఆకలిగా ఉండగా కడుపు నిండా తినే వ్యక్తి విశ్వాసి కాదని చెబుతుంది.
ఆహారం విషయంలో పంది మాంసాన్ని నిషేధించి కోరపళ్లు లేని మేసే జంతువుల మాంసాన్ని, పరిశుద్ధమైన పదార్ధాలను తినమంటుంది. దానిలో కూడా హద్దులు మీరవద్దని ఆదేశిస్తుంది.
ఇస్లాం విద్యకు అత్యంత ప్రాధ్యాన్యత ఇస్తుంది. ప్రవక్త ముహమ్మద్(స) – “ఒక పురుషుడు విద్య నేర్చుకుంటే అది ఒక వ్యక్తికి విద్య నేర్చుకున్నట్టు, అదే ఒక స్త్రీ విద్య నేర్చుకుంటే కుటుంబం మొత్తం విద్య నేర్చుకున్నట్టే” అని చెప్పారు. తప్పితే ఆడపిల్లలకు స్కూళ్లకు పంపకూడదని వారు బయటకు తిరక్కూడదని గానీ ఎక్కడా చెప్పబడలేదు. మీరు ఏది చేసినా హద్దులు మీరవద్దని చెబుతుంది ఇస్లాం.
సమాజంలో చెడు తొలగించి శాంతిని స్థాపించటానికి చేసే ప్రయత్నమే జిహాద్. ముఖ్యంగా ఇస్లాం మనిషిని తన చెడు ఆలోచనలతో జిహాద్ చెయ్యమని చెబుతుంది. తప్పితే నేడు కొందరు విమర్శిస్తున్నట్టు జిహాద్ అంటే తీవ్రవాదమో, ఉగ్రవాదమో కానే కాదు.
****
అతివాదులు ముస్లిములు కాగలరా?
అతివాదాన్ని, మతోన్మాదాన్ని ప్రదర్శించేవారు ముస్లిములే కాదు. ముస్లిం సమాజం అన్నది గొప్ప బాధ్యతతో ఎన్నుకోబడ్డ “మధ్యస్థ సమాజం” ఇదే విషయాన్ని ఖురాన్ — “మేము ముస్లిములైన మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము” (2:143) అని చెబుతుంది.
ఇక్కడ మధ్యస్థ సమాజం అంటే- అతివాదానికీ, మితవాదానికీ ఆధ్యాత్మిక వాదానికీ, భౌతిక వాదానికీ ప్రతీ జీవన రంగంలో మధ్యే మార్గాన్ని అవలంబిస్తూ తమ అలోచనల్లో, ఆచరణల్లో సమతూకం కనపరుస్తూ నీతీ, నిజాయితీ, న్యాయం కనపరిచే ఉత్తమ సమాజం అని అర్థం. కాబట్టి ఇస్లాంను అనుసరించేవారు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తే అది ఇస్లాం లోపం కాదు. ఆ మతోన్మాదాన్ని ప్రదర్శించేవారిదే తప్పు వారు ముస్లిం పేర్లు తగిలించుకుని ఎంత పెద్ద గెడ్డాలు పెంచినా సరే. వారి ప్రవర్తన ఇస్లాంతో సంబంధం లేనిది అని అర్థం చేసుకోవాలి.
ఇక ఇస్లామిక్ చట్టాల (ఇస్లామిక్ షరియా) విషయానికొస్తే…
హత్య, వ్యభిచారానికి, మానభంగానికి, దొంగతనానికి వగైరా నేరాలకు తగ్గట్టుగా క్రైమ్ చేయటానికి భయపడే విధంగా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఉండాలి కూడా. కారణం- పటిష్టమైన చట్టం తాలూకు నిబంధనల పట్ల సరైన భయం, బాధ్యతలే వ్యక్తులను నేరాలకు పాల్పడకుండా చేసేది.
చిత్రమేమిటంటే.. అన్యాయంగా ఓ స్త్రీనో, చిన్న పిల్లనో ఎవడైనా దారుణంగా రేప్ చేస్తేనో, రేప్ చేసి చంపేస్తేనో అలాంటివాడిని బహిరంగంగా ఉరితీయాలని, రాళ్లిచ్చుకుని కొట్టి చంపాలని ఆక్రోసాన్ని వెళ్లగక్కేవారు, మనదేశంలో చట్టాలు కఠినంగా లేకపోవటం వల్లే ఇన్నేసి ఘోరాలు జరుగుతున్నాయని నినాదాలు చేసేవారే సరిగ్గా ఇస్లాంను విమర్శించే సందర్భం వచ్చినప్పుడు “ఇస్లాం ఆటవిక చట్టాలు కలిగి ఉంది అయినా రేప్ చేసినోణ్ణి చంపేయటమేమిటండీ! చిత్రం కాకపోతేనూ” అంటుంటారు.
కాబట్టి ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నోళ్లను బట్టి ఇస్లాంను, తెలుగు పేర్లు పెట్టుకున్నోళ్లను బట్టి హిందూత్వాన్ని, ఇంగ్లీషు పేర్లు పెట్టుకున్నోళ్లను బట్టి క్రైస్తవ్యాన్ని అంచనా కట్టకూడదు. ఉదాహరణకు రాజ్యాంగం నిజానికి చాలా గొప్పదే. అలాంటి రాజ్యాంగం ఉన్న దేశంలో నేరస్తులు నేడు పాలకుల స్థానంలో ఉన్నారు. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిమిషానికో రేప్ జరుగుతుంది. దీనిని బట్టి తప్పు రాజ్యాంగానిదని చెప్పాలా? లేక దానిని రాజ్యాంగ దుర్వినియోగం అని చెప్పాలా? అలాగే ఇస్లాం ఎంత గొప్పదైనప్పటికీ… దాని విశాల దృక్పథాలకు భిన్నంగా అతివాదాన్ని, మతోన్మాదాన్ని ప్రదర్శించటం ధార్మిక దుర్వినియోగం అవుతుంది.
కాబట్టి తాలిబాన్లను బట్టో లేక ఇతర మతతత్వవాద వర్గాలను బట్టో కొందరు మూర్ఖుల ప్రవర్తనను బట్టో ఇస్లాంను విమర్శించటం దారుణమైన మూర్ఖత్వం అవుతుంది.
తాలిబాన్ & రియల్ ఇస్లాం
