హదీసులను నమ్మాల్సిన అవసరం లేదా!?

“మన విశ్వాసానికి, ఆచరణకు ఖురాన్ చాలు.. హదీసులు కేవలం తరువాతి కాలాల్లో సేకరించి రాయబడిన చరిత్ర మాత్రమే. వాటిలో ఎన్నో మార్పు చేర్పులు చెయ్యబడ్డాయి కాబట్టి హదీసులను నమ్మాల్సిన పని లేదు” అన్నది ఈ మధ్య కొందరు అభినవ ప్రచారకుల ద్వారా క్రొత్తగా వెలుగులోకొచ్చిన వాదన.

ఇది ఎంతవరకు కరెక్టు? అన్నది గమనించే ముందు అవగాహన పరచుకోవలసిన విషయాలు:

‘ధర్మం’ అన్నది మూడు విషయాల కలయిక. అవి… 1) విశ్వాసాలు 2) ఆరాధనలు 3) వ్యవహారాలు. ఈ మూడు మౌలిక భాగాల కలయిక అయిన ధర్మాన్ని ఆచరించటానికి ఒక ముస్లిం కొరకు అందుబాటులో ఉన్న ఆధారాలు మూడు. అవి… ఖురాన్, సున్నత్, హదీస్.

A. ‘ఖురాన్’ సందేశాన్ని గమనిస్తే.. అందులో దేవుని పట్ల కలిగి ఉండాల్సిన విశ్వాసం, ‘షరియత్’ అంటే చట్టం, విధి-నిషేధాల ఆజ్ఞలు, ఆరాధనల తాలూకు ఆదేశాలు, పూర్వగ్రంథాల ధృవీకరణ, కొందరు పూర్వప్రవక్తల తాలూకు బోధలు, వారి తాలూకు చరిత్ర వగైరా అంశాలు ఉంటాయి. ఖురాన్ అవతరణ జరుగుతున్నప్పుడే నమాజ్ లో ఖురాన్ పారాయణం చేయాలన్న నియమం ఉండటం కారణంగా ప్రవక్త ముహమ్మద్ (స) శిష్యులు ఎప్పటికప్పుడు కంఠతా పట్టేసేవారు.

B. ‘సున్నత్’ అంటే ఏమిటి? అంటే.. ప్రవక్త ముహమ్మద్ (స) కు పూర్వ ప్రవక్తల నుండీ పరంపరగా వస్తున్న ‘ఆచరణ (Practice)’ లేదా ‘సాంప్రదాయం’ అన్నమాట. దానినే ప్రవక్త ముహమ్మద్ (స) అనుసరించారు. “సున్నతే రసూల్” అంటే ప్రవక్త ముహమ్మద్ (స) నుండి ఆయన శిష్యుల ద్వారా వారి శిష్యుల ద్వారా పరంపరగా వస్తున్న ఆచరణ లేదా సాంప్రదాయం.

C. ‘హదీస్’ అంటే ఏమిటి? అంటే.. ప్రవక్త ముహమ్మద్ (స) ‘మాట’ల ద్వారా, ‘చేత’ల ద్వారా నేర్పినవి/ప్రబోధించినవి మరియు అనుమతించినవి ఏవైతే ఒక ఉల్లేఖుని ద్వారా అందినవో దానినే ‘హదీస్’ అంటారు. దీనినే ‘అక్బారే అహద్’ అంటారు.

అసలు ఖురాన్, సున్నత్ ఉండగా ఇక హదీస్ అవసరం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే.. ఒక విశ్వాసి వ్యక్తిగత పరిశుద్ధ జీవితం, ఆరాధనా క్రతువులు వాటి నియమాలు, పద్ధతులు. అలాగే శ్రేష్ఠ సామూహిక వ్యవస్థ సంబంధించిన విషయాలతో పాటు, దానికి సంబంధించిన సద్గుణాలు, దుర్గుణాలు, సామాజిక వ్యవహారాల తాలూకు ఎంతో సుందరమైన సమాచారం హదీసులలో దొరుకుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే మానవ నైతిక జీవనానికి సంబంధించిన సంపూర్ణ ఆదేశాలు ఖురాన్ లో ఉంటే.. ఆయా ఆదేశాల “ఆచరణాత్మక అమలు” (Practical Implementation) ఎలా చెయ్యాలన్నది ప్రవక్త ముహమ్మద్ “ఆచరణ (సున్నత్)”లో ఉంటుంది. ఆయన చెప్పిన, నేర్పిన, అనుమతించిన విషయాల తాలూకు సమాచారం హదీస్ లలో రాతపూర్వకంగా లభిస్తుంది.

కాబట్టి ఖురాన్, సున్నత్, హదీస్ అనే మూడు ఆధారాలు ఒక ముస్లింకు తప్పనిసరి. వీటిలో ఏ ఒక్క దాన్ని తిరస్కరించినా ఒక విశ్వాసి సరైన విశ్వాసం నుండి తప్పిపోతాడు. కాబట్టి వాటిని సెంటిమెంటుతో అభిమానించటం కన్నా ప్రతీ ముస్లిం పరిశీలన చేసి తెలుసుకోవాలి.
……………..

“అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి” అని (3:32) ఖురాన్ ప్రకటిస్తుంది.

పై ఆదేశాన్ని బట్టి అల్లాహ్ కు విధేయత చూపటం అంటే.. అల్లాహ్ ఆదేశాలను శిరసావహించటం అన్నమాట.

అలాగే “ప్రవక్త కు విధేయత చూపటం” అంటే ఆయన చెప్పిన “ఆదేశాలు” చూపిన “ఆచరణ”లను అనుసరించటం అన్నమాట. ఈ ప్రక్రియ పరిపూర్ణం అవ్వాలంటే- సున్నత్ (ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించాల్సిందే.

ఇక ప్రవక్త సున్నత్ వివరాలు మరియు ఆయన బోధించిన మానవతా, నైతికతకు సంబంధించిన సుందరమైన ప్రబోధనలు చూడాలనుకునేవారికి హదీసులను సంప్రదించటం తప్ప మరొక మార్గం లేదు అన్నది అత్యంత గమనార్హం.

హదీసులను నమ్మల్సిన పనిలేదని చెప్పే కొందరి వాదన ఏమిటంటే- “హదీస్ సంకలనం అన్నది ప్రవక్త ముహమ్మద్ (స) పరమపదించిన తరువాత దాదాపు 150 సం.ల తరువాత నుండి మొదలైన ప్రక్రియ. ఈ మధ్య కాలంలో వాటిలో ఎన్నో మార్పుచేర్పులు జరిగిపోయాయి.. దాని కారణంగానే ముస్లిం సమాజంలో ఎన్నో అపార్థాలు కూడా ఏర్పడిపోయాయి” అన్నది. ఇదేలాంటిదంటే ఇంటిలో ఎలుకలున్నాయి కాబట్టి ఇంటినే తగలబెట్టటం లాంటి అజ్ఞానపూరిత చర్య అన్నమాట.

హదీసులలో కొంత కల్తీ జరిగిందన్నది వాస్తవం. ఈ కారణంగా మొత్తం హదీసులను కొట్టి పరేయటం కరెక్టా? లేక అప్రామాణికంగా కనపడుతున్న హదీసులను ప్రక్కనపెట్టి, ప్రామాణికంగా కనపడుతున్న హదీసులను తీసుకోవటం కరెక్టా? అలాగే హదీస్ ప్రామాణికతను ఏ కొలమానం ఆధారంగా నిర్ధారించాలి? ఇత్యాదివి ఇక్కడ సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్నలు.

ముస్లిం సమాజంలో హదీసుల ప్రామాణికతను ఏ రకంగా నిర్థారించాలన్న విషయంలో చాలా మందికి ఒక స్పష్టత లేదు. పర్యవసానంగా కొందరు మొత్తానికి హదీసులను కొట్టిపరేస్తే, మరి కొందరు హదీసులను ఖురాన్ కంటే ఎక్కువగానే గౌరవించేవారు కూడా ఉన్నారు. ఈ రెండూ అతివాదాలే. ఈ రెండు విధానాలూ సరైనవి కావు.

ముందుగా హదీసులన్నవి ఎలా సంకలనం చెయ్యబడ్డాయి అంటే.. 1. ప్రవక్త శిష్యులు (సహాబాలు) లిఖిత పూర్వకంగా భద్రపరచిన సంకలనాలు, పుస్తకాలు 2. వారి జ్ఞాపక శక్తి ఆధారంగా ఉల్లేఖన ప్రక్రియ ద్వారా హదీసులన్నవి గ్రంథస్థం చెయ్యబడ్డాయి.

ఇక హదీసుల తాలూకు సమాచారంలో అస్సలు కొద్దిగా కూడా మార్పు చేర్పులు జరగలేదా? అని ప్రశ్నించుకుంటే.. అనేక మంది ఉల్లేఖన కర్తల ద్వారా ప్రామాణిక సమాచారం లభించింది. అలాగే కొంత సందేహాస్పదమైన సమాచారం లభించింది. కొంత అప్రామాణిక సమాచారం కూడా లభించింది, కాబట్టే.. హదీసులను వాటి ప్రామాణికత విషయంలో ముస్లిం పండితులు మౌలికంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు.

1. సహీహ్ అంటే- ప్రామాణికమైనవి (Authentic)
2. హాసన్ అంటే- సహీహ్ హదీసులంత విశ్వసనీయమైనవి కానివి
3. జయీఫ్ అంటే- బలహీనమైనవి లేక అప్రామాణికమైనవని అర్థం.
4. మౌజు అంటే- కల్పితమైన లేక మార్పుచేర్పులకు గురికాబడ్డవని అర్థం.

ఇక ఉల్లేఖన కర్తల యొక్క విశ్వనీయత, వ్యక్తిత్వం, వయస్సు, వారు అందించే సమాచారం యొక్క పరంపర (Chain) వగైరా కోణాలను దృష్టిలో పెట్టుకుని హదీసువేత్తలు సార్వత్రిక ఏకాభిప్రాయం (ఇజ్మా)తో ఆరు రకాల హదీస్ పుస్తకాలను “సిహాసిత్తా” (ఆరు అతిసవ్యమైన హదీసు పుస్తకాలు) గా నిర్థారించటమైంది. వాటిలో 1. సహీహ్ బుఖారీ 2. సహీహ్ ముస్లిం 3. అబూ దావూద్ 4. ఇబ్నె మాజా 5. నసాయి 6. తిర్మజీ.

ఒకవేళ ఈ పుస్తకాలలో సైతం ఏదైనా ఒక హదీస్ ప్రామాణికత విషయంలో, దానిలోని సమాచారం విషయంలో ఏదైనా సందేహం, గందరగోళం ఏర్పడితే.. మొత్తానికి హదీసులను కొట్టిపడెయ్యటం సరైన పద్దతి కాదు. దానికి అవలంబించాల్సిన పద్ధతి- ఆ హదీస్ లో సమాచారాన్ని 1. ఖురాన్ వెలుగులో పరిశీలించాలి 2. సున్నత్” (ప్రవక్త సాంప్రదాయం) వెలుగులో చూడాలి. 3. పూర్తి ఇస్లాం స్వభావం (రుహే ఇస్లాం) వెలుగులో అది హేతుబద్ధంగా అనిపిస్తుందా? లేదా? అన్నది కూడా పరిశీలించాలి.

కాబట్టి కేవలం ఖురాన్ – సున్నత్ లలో ప్రస్తావించినదే ధర్మం. అది తప్ప ఏదీ ధర్మం కాదు. ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పినవి, ఆచరించి చూపినవి, అనుమతించినవి ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు సమాచారమే హదీస్. కాబట్టి ఖురాన్ – సున్నత్ ల పరిధిలో ఎవరైతే ఒక హదీసు ప్రామాణికత విషయంలో సంతృప్తి చెంది దానిని ప్రవక్త ముహమ్మద్ (స) మాటగా, చేతగా, ప్రబోధనంగా లేక అనుమతించిన దానిగా అంగీకరిస్తాడో అలాంటి వ్యక్తికి ఆ హదీసు ఒక ధార్మిక శాసనంగా అయిపోతుంది.

ఈ లోతైన పరిశీలన లేకుండా మిడి మిడి జ్ఞానంతో హదీసులను గుడ్డిగా తిరస్కరించటం మూర్ఖత్వం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *