ముఖ్యంగా ఈ అంశం ముస్లిం, క్రైస్తవులే కాక, హైందవ సోదరులు కూడా పరిశీలనగా చదవాలని కోరుకుంటున్నాను.
ఖురాన్ మరియు బైబిల్ మౌలిక సందేశం పట్ల మిడి మిడి జ్ఞానమున్న కొందరు క్రైస్తవులు చెప్పే మాటే “బైబిల్ నుండి ఖురాన్ కాపీ కొట్టి రాసేసుకున్నారన్నది”. ప్రవక్త ముహమ్మద్ (స) కు హెబ్రూ భాష రాదు ఆయన పరమపదించిన మూడొందల సం.ల తరువాతే బైబిల్ అరబీలో అనువాదం చెయ్యబడిందన్న వాస్తవం తెలీని చాలా మంది క్రైస్తవుల్లో ఈ రకమైన అపార్థం ఏర్పడటానికి కారణం- బైబిల్ మరియు ఖురాన్ ల మౌలిక సందేశం ఒక్కటే అయి ఉండటం.. అలాగే ఈ రెండు గ్రంథాల్లోనూ అనేక మంది ప్రవక్తల తాలూకు చరిత్ర, వారి పేర్ల మధ్య సారూప్యత (Similarity) కలిగి ఉండటంతో.. ఖురాన్ ను కించపరిచే ఉద్దేశమున్న కొందరు క్రైస్తవ బోధకులు మా బైబిల్ నే కాపీ కొట్టి ప్రవక్త ముహమ్మద్ ఖురాన్ ను రాసేసుకున్నారని అర్థ జ్ఞానంతో అలవోకగా మాట్లాడేస్తుంటారు.
ఒకవేళ ఈ కారణాల వల్ల ఎవరైనా ఖురాన్, బైబిల్ నుండి కాపీ కొట్టబడిందని భావిస్తే.. అంతకు ముందు బైబిల్, వేదోపనిషత్తుల నుండి కాపీ కొట్టబడి రాయబడిందని చెప్పాల్సి ఉంటుంది! అదెలా?
“దేవుడు అద్వితీయుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేదు” అన్న వాక్య భాగం ఏ క్రైస్తవుడు చదివినా.. ఇది మా బైబిల్లో “ప్రధాన ఆజ్ఞ” అనే చెబుతాడు.. నిజానికి ఇది ‘చందోగ్యఉపనిషత్ 6:2:1’ లోని మంత్రం!
“దేవుడు మనకు అదృశ్యుడు. ఆయనను ఎవరూ చూడలేరు” అన్న వాక్యం చదివినా ఇది బైబిల్లో వాక్యమే కదా అనిపించవచ్చు. కానీ ఇది ‘శ్వేతాశ్వతరోపనిషత్ 4:20” మంత్రం. “దేవుడు పరిశుద్ధుడు. ఆయన మానవుడు కాడు” అన్న వాక్యం బైబిల్లోని వాక్యంలా ఉన్నా అది.. యజుర్వేదం 40:8 వ మంత్రం!
ఈ విధంగా వేదోపనిషత్తుల్లో దేవుని అస్తిత్వం, ఆయన గుణగణాలకు సంబంధించిన కొన్ని వందల శ్లోకాలూ, మంత్రాలూ అచ్చం బైబిల్లో చెప్పబడినట్లే ఉంటాయి. కాబట్టి ఆయా శ్లోకాల, వాక్యాల సారూప్యతను బట్టి బైబిల్, వేదోపనిషత్తుల నుండి కాపీ కొట్టబడిందని చెప్పటం ఎంత మూర్ఖత్వమో.. బైబిల్ నుండి ఖురాన్ కాపీ కొట్టబడిందని చెప్పటం కూడా అంతే మూర్ఖత్వమవుతుంది.
* * *
ఖురాన్ ఛాలెంజ్
ఎలా అయితే ఈనాటి కొందరు మిడి మిడి జ్ఞానమున్న క్రైస్తవ బోధకులు “బైబిల్ నుండి కాపీ కొట్టి ఖురాన్ రాసేసుకున్నారని విమర్శిస్తున్నారో అచ్చం అలాంటి విమర్శే ప్రవక్త ముహమ్మద్ (స) సమక్షంలో ఆనాటి మక్కా అవిశ్వాసులు కూడా చేసేవారు. అలాంటి వారందరి నోళ్లు మూయించటానికి ఖురాన్ చేస్తున్నదే ఈ క్రింది ఛాలెంజ్.
“ప్రవక్తయే ఖురాన్ ను స్వయంగా రచించాడని ఈ ప్రజలు అంటున్నారా ఏమిటి? ఇలా అను: “మీరు గనుక మీ ఆరోపణలో సత్యవంతులే అయితే ఇటువంటి సూరా (అధ్యాయం) ఒక దానిని రచించి తీసుకురండి. ఒక్క దైవాన్ని తప్ప సహాయం కొరకు మీరు ఎవరెవరిని పిలుచుంటారో పిలవండి” – 10:38
ఈ ఛాలెంజ్ చెయ్యబడింది ఎక్కడో కాదు.. స్వయంగా అరబ్బీ మాట్లాడే ప్రజల మధ్య పైగా అప్పటికే అరబ్బీ సాహిత్యకారులు, పండితులు, కవులతో నిండి ఉన్న అరేబియా సమాజం మధ్య బహిరంగంగా చెయ్యబడింది. ఈ ఛాలెంజ్ తరువాత అప్పట్లో అరేబియాలో పెద్ద పెద్ద అరబ్బీ పండితులందరూ కలిసి రాత్రింబవళ్లు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసినా ఖురాన్ సాహిత్యంతో సరితూగే ఒక్క వచనాన్ని ఆనాడు రచించి తీసుకురాలేక పోయారు.
అప్పటి సంగతి ప్రక్కన పెడితే.. స్వయంగా పుట్టుకతో అరబ్బులైన క్రైస్తవులు అరబ్ దేశాల్లో మిలియన్ల కొద్దీ నివసిస్తున్నారు. అక్కడి చర్చిల్లో పైగా బైబిల్ అరబ్బీలో చదవబడుతుంది. నిజంగా ఖురాన్, బైబిల్ నుండి కాపీ కొట్టబడి రాయబడి ఉంటే.. ఈ 1400 సం.లలో ఏ ఒక్క అరబిక్ క్రైస్తవ పండితుడైనా ఖురాన్ లాంటి ఒక్క అరబీ వచనాన్ని ఎందుకు రచించలేక పోయాడు?
పోనీ.. ఖురాన్, బైబిల్ నుండి కాపీ కొట్టి రాసేసి ఉంటే.. అరబిక్ అనువాద బైబిల్ నుండి ఏవో కొన్ని వాక్యాలు తెచ్చి ఖురాన్ వాక్యాలతో పోల్చి “చూసారా! మేము ఖురాన్ తో సరితూగే వచనాలను తేగలిగామని” ఖురాన్ విసురుతున్న ఛాలెంజ్ లో నెగ్గి చూపవచ్చుగా? అలాగైనా ఎందుకు చెయ్యలేకపోయారు? ఆనాడే కాదు ఈనాటికీ ఏ ఒక్కరూ స్వీకరించగలగ లేని ఏకైక ఛాలెంజ్ “ఖురాన్ లోని ఒక అధ్యాయం వంటి లేదా కనీసం ఒక వాక్యం వంటి దానినైనా రచించి తీసుకురావటమే”.
* * *
నేటి కొందరు క్రైస్తవ బోధకులు ఊహించుకుంటున్నట్టు ఖురాన్ బైబిల్ నుండి కాపీకొట్టబడితే.. ఖురాన్ ప్రస్తావిస్తున్న ఈ క్రింది శాస్త్రీయ విషయాలు బైబిల్లో ఎందుకు లేవో చెప్పాలి.
1. విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీ వస్తువూ “జంటలు (Pairs)” గా సృష్టించబడి ఉన్నాయన్నదే సైన్స్ పరిభాషలో ‘Pairs theory (జంటల సిద్ధాంతం). ఈ విషయం “పాల్ డిరాక్” (1902-1984) అనే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త కనిపెట్టటం జరిగింది. ఇదే విషయం ఖురాన్ “ప్రతీ వస్తువూ జంటలుగా సృష్టించబడి ఉన్నాయని” (51:49) చెబుతుంది. బైబిల్లో ఎంత వెతికినా ఈ విషయం కనపడదు. మరి ప్రవక్త ముహమ్మద్ (స) బైబిల్లో లేని, పైగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ విషయాన్ని ఎలా కాపీకొట్టి ఉంటారు?
2. కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ మరియు ప్రముఖ పిండోత్పత్తి శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ ఎల్. కీత్ మూర్ స్త్రీ గర్భంలో పిండం “మూడు దశల్లో” మరియు “మూడు చీకటి తెరల్లో” రూపుదిద్దుకుంటుందని నిర్ధారించటం జరిగింది. ఈ విషయాన్ని ఖురాన్ స్పష్టంగా “తల్లుల గర్భాలలో ‘మూడేసి చీకటి తెరల’లో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు” (39:6) అని ప్రస్తావిస్తుంది. ఇది బైబిల్లో ఎంత వెతికినా దొరకదు. మరి ప్రవక్త ముహమ్మద్ (స) బైబిల్లో లేని, పైగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ విషయాన్ని ఎలా కాపీకొట్టి ఉంటారు?
3. 1790 లో ‘క్రిస్టియన్ కొన్రాడ్ స్ప్రెంజెల్’ అనే జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త (naturalist) ఆడ-మగ అన్న జంటలు (Pairs) మొక్కల్లో కూడా ఉంటాయని, వాటి మధ్య పరాపరాగ సంపర్కం జరుగుతుందన్న విషయాన్ని చెప్పేవరకు మానవులు, జంతువుల్లో మాత్రమే ఆడ-మగ జంటలు (Pairs) ఉంటాయని అనుకునేవారు. కానీ, ఆధునిక వృక్షశాస్త్రం (Botanical Science) చెబుతున్న ఈ విషయాన్ని 1400 సం.లకు పూర్వమే ఖురాన్ – “ఆయనే అన్ని రకాల ఫలాలను రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు” (13:3) అని ప్రకటించింది. ఈ విషయం బైబిల్లో ఎంత వెతికినా దొరకదు. మరి ప్రవక్త ముహమ్మద్ (స) బైబిల్లో లేని, పైగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ విషయాన్ని ఎలా కాపీకొట్టి ఉంటారు?
4. 1609 లో జొన్నస్ కెప్లర్ సోలార్ సిస్టమ్ లో కేవలం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందనే కాక, సూర్యచంద్రులతో సహా ఇతర గ్రహాలన్నీ తమ తమ కక్ష్యల్లో ఉంటూ తామంతట తాము తిరుగుతున్నాయని కనిపెట్టాడు. ఈ విషయం 1400 సం.లకు పూర్వమే ఖురాన్ – “ఆయనే సూర్యచంద్రులను పుట్టించినవాడు. అవన్నీ తమ తమ కక్ష్యల్లో ఉంటూ తిగుతున్నాయి” – 21:33 అని చెబుతుంది. ఈ విషయం బైబిల్లో ఎంత వెతికినా దొరకదు. మరి ప్రవక్త ముహమ్మద్ (స) బైబిల్లో లేని, పైగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ విషయాన్ని ఎలా కాపీకొట్టి ఉంటారు?
5. ‘జార్జ్ లామాటైర్’ 1920 లో “బిగ్ బ్యాంగ్” థియరీని ప్రతిపాదించాడు. 13 వందల కోట్ల సం.ల క్రితం శూన్యంలో ఒకే స్థానం నుండి పదార్థం (Matter), శక్తి (Energy) నుండి “ప్రైమరీ నెబ్యూలా” ఏర్పడి దాని నుండి నక్షత్రాలూ, గ్రహాలుగా వేర్పాడ్డాయని సైన్స్ అనేక పరోశోధనలు చేసి చెబుతుంది. కానీ 1400 సం.లకు పూర్వమే ఖురాన్- “ఆకాశాలూ, భూమీ పరస్పరం కలిసి ఉండేవానీ, తరువాత అవి వేర్పాడ్డాయని” (21:30) ప్రకటిస్తుంది. ఈ విషయం బైబిల్లో ఎంత వెతికినా దొరకదు. మరి ప్రవక్త ముహమ్మద్ (స) బైబిల్లో లేని, పైగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ విషయాన్ని ఎలా కాపీకొట్టి ఉంటారు?
6. ప్రముఖ భూభౌతిక శాస్త్రవేత్త ‘ఫ్రాంక్ ప్రెస్’ రాసిన ‘ఎర్త్ (Earth)’ అనే గ్రంథంలో పర్వతాలు భూమి లోపల మేకుల మాదిరిగా పాతబడి ఉన్నాయని.. ఉదాహరణకు ఎవరెస్ట్ శిఖరం భూమిపైకి 9 కిలోమీటర్లు ఉంటే భూమి లోపల 125 కిలోమీటర్ల లోతు వరకు దాని పునాది ఉందని రాసుకొచ్చాడు. ఇదే విషయం ఖురాన్ లో “పర్వతాలు భూమిలో మేకుల మాదిరిగా పాతబడ్డాయని” (78:6) చూడగలం. అంతేకాదు, మోడ్రన్ ప్లేట్ టెక్నోటిక్స్ థియరీ ప్రకారం పర్వతాలు భూమిని స్థిరంగా బ్యాలన్స్ చేస్తూ ఉంచుతున్నాయని చెబుతుంది. ఈ విషయం సైతం ఖురాన్ “ఆయన భూమిలో పర్వతాలను మేకుల మాదిరిగా పాతాడు, భూమి మిమ్మల్ని తీసుకుని దొర్లిపోకుండా ఉండాలని” (16:15) అని చెబుతుంది. ఈ విషయాలు బైబిల్లో ఎంత వెతికినా దొరకవు. మరి ప్రవక్త ముహమ్మద్ (స) బైబిల్లో లేని, పైగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ విషయాన్ని ఎలా కాపీకొట్టి ఉంటారు?
7. ఖురాన్- “సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడు ఆయనే” (10:5) అని చెప్పి ఒక్క సూర్యుడు నుండి మాత్రమే కాంతిని వస్తుంది.. చంద్రుడు దాని వెలుగుతో మెరుస్తున్నాడు అన్న విషయాన్ని తెలియజేసింది. అంతేకాదు ఖురాన్ లో “ఆకాశాలలో ఒక దీపాన్ని (సూర్యుణ్ణి) ఒక మెరిసే చంద్రున్ని వెలిగించినవాడు ఎంతో శుభపద్రుడు” (25:61) అని ఉంటే.. బైబిల్లో “దేవుడు రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను (ఆది 1:16)” అని ఉంటుంది. బైబిల్ చంద్రుడు సైతం స్వయం ప్రకాశితం అని చెబుతుంది. నిజంగా బైబిల్ నుండి ఖురాన్ కాపీ కొట్టి ఉంటే ప్రవక్త ముహమ్మద్ (స) ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టు ఎందుకు కాపీ చెయ్యలేకపోయారు?
8. బైబిల్లో సృష్టి క్రమాన్ని గమనిస్తే.. ఆదికాండం 1:3-5 వాక్యాల్లో ముందే (1వ రోజున) వెలుగును, చీకటిని సృష్టించబడినట్టు.. ఆ తరువాత (4వ రోజు) సూర్యుడు, చంద్రుడు సృష్టించబడినట్టు ఆది 14-15 వాక్యాల్లో చూడగలం. కానీ, ఖురాన్లో అలా ఉండదు. దేవుడు, భూమీ, ఆకాశాలను ఏక కాలంలో సృష్టించినట్లు మాత్రమే చూడగలం (21:30, 41:9-12).
9. మత్తయి 19:9 ప్రకారం ఒక్క వ్యభిచారం నిమిత్తం తప్ప మరే కారణం వల్లనైనా ఒక పురుషుడు తన భార్యకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారంగా పరిగణించబడుతుంది. అలాగే స్త్రీ ఏ కారణం వల్లనైనా భర్తకు విడాకులిచ్చి, వేరే పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే మార్కు 10:12 ప్రకారం అది కూడా వ్యభిచారంగానే పరిగణించబడుతుంది. ఇంత అందమైన చట్టం ఖురాన్ లో ఎందుకు కాపీ కొట్టబడలేదు? నిజానికి స్త్రీ, పురుషులు విడాకులు పొందటానికి అనేక అంతర్గత కారణాలుండవచ్చు. ఇస్లాం విడాకులు తీసుకోవటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నప్పటికీ.. ఖురాన్, స్త్రీకి తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే తన భర్త నుండి విడాకులు పొంది వేరే పురుషుణ్ణి వివాహమాడే హక్కును కల్పించింది (2:232). తప్పితే ఖురాన్ స్త్రీ, పురుషులు విడాకులు పొంది వేరే పెళ్లి చేసుకుంటే “వ్యభిచారంగా” పరిగణించటం లేదు.
ఈ విధంగా 20 వ శతాబ్దంలో సైన్స్ ద్వారా నిరూపితమైన ఎన్నో శాస్త్రీయ విషయాలు ఖురాన్ లో ప్రస్తావించబడ్డాయి. పైగా అవన్నీ నేటి ఆధునిక సైన్స్ చెబుతున్న దానికి సరిగ్గా సరిపోతున్నాయి. నిజంగా నేటి క్రైస్తవ బోధకులు ఊహించుకుంటున్నట్టు ఖురాన్, బైబిల్ ను కాపీ కొట్టే రాసి ఉంటే.. బైబిల్లో ఖురాన్ ప్రస్తావిస్తున్న అనేక సైంటిఫిక్ విషయాలు ఎందుకు లేవు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
ఈ సందర్భంలో “మరి బైబిల్, ఖురాన్ లు ఒకే దేవుని వద్ద నుండి వచ్చిన గ్రంథాలే అయితే వాటి మౌలిక సందేశం కూడా ఒక్కటే అయినప్పుడు ఖురాన్ తో పోల్చితే బైబిల్లో చాలా విషయాలు తేడాగా ఎందుకు ఉన్నాయి? అని కొందరు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం ఈ టాపిక్ కు కొనసాగింపుగా రెండవ భాగంలో తెసుకుందాం.
ఖురాన్, బైబిల్ నుండి కాపీ కొట్టబడిందా?
