హజ్రత్ ఉమర్ (ర) – అసమాన నాయకుడు

దైవభీతి పారాయణతో ధర్మ పరిపాలన చేస్తూ పైగా ఒక దేశానికి నాయకుడై ఉన్నప్పటికీ తన పాలనలో ఉండే ప్రజల బాగోగులు, వారి స్థితిగతులు తెలుసుకోవటానికి రాత్రిళ్లు గస్తీ సైతం తిరుగుతూ వారి కష్టనష్టాలు స్వయంగా పర్యవేక్షిస్తూ.. “నాయకుడు అంటే ప్రజల సేవకుడు” అన్నది ఆచరించి చూపి, నిరాడంబరతతో అతి సామాన్యంగా జీవించి గతించిన గొప్ప నాయకుడే హజ్రత్ ఉమర్ (ర)… “ఉమర్ – ద – గ్రేట్”గా చరిత్రలో నిలిచిపోయారా మహా మనిషి. ఒకరకంగా చెప్పాలంటే ఇస్లామియా బోధలకు నిలువెత్తు రూపం హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (ర) అనటం అతిశయోక్తికాదు.

ప్రజలను పాలించిన నాయకులు చరిత్రలో చాలా మంది గతించారు. కానీ, వారిలో ప్రజలకు “సుపరిపాలన” అందించినవారు అతి కొద్దిమందే. అయితే ప్రజలకు “సుపరిపాలన” ఎలా అందించాలి అన్న విషయంలో ఆదర్శవంతమైన వ్యక్తి (Ideal Person) మరియు అసమాన నాయకుడు హజ్రత్ ఉమర్ (ర) అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన అందించిన పరిపాలన దైవ ఆజ్ఞలకు లోబడి అందించిన ధర్మ పరిపాలన కాబట్టి.

634 – 644 మధ్యకాలంలో అరేబియా ద్వీపకల్ప ఆర్థిక వ్యవస్థ హజ్రత్ ఉమర్ (ర) ఆధ్వర్యంలో ట్రిపోలీ నుండి ఆఫ్ఘనిస్తాన్, అజర్‌బైజాన్ మరియు యెమెన్ వరకు ఎంతో ఉన్నతంగా నిర్వహించబడి ఆయన పాలనలో ఒక స్వర్ణయుగం గడిచిందని చెప్పవచ్చు.

స్వయంగా మహాత్మా గాంధీ- “ఒకవేళ భారతదేశం అభివృద్ధి సాధించాలంటే నిజాయితీ, సత్యసంధత గల హజ్రత్ ఉమర్ (ర) లాంటి వ్యక్తులు పరిపాలన చేపట్టాలి” అని చెప్పటాన్ని బట్టి హజ్రత్ ఉమర్ (ర) పరిపాలన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

హజ్రత్ ఉమర్ (ర) వారు ప్రవక్త ముహమ్మద్ (స) ప్రధాన శిష్యుల్లో ఒకరు. వయసులో ప్రవక్త ముహమ్మద్ (స) కంటే పదమూడు సంవత్సరాలు చిన్నవారైనా ఉమర్ (రజి) ఎటువంటి ఉత్తమోత్తమ నైతిక విలువలు, మహోన్నత వ్యక్తిత్వం కలిగి ఉండేవారంటే.. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) “ఒకవేళ ప్రవక్తల పరంపర కొనసాగితే నా తరువాత ప్రవక్త కాగలిగేంత స్థాయి వ్యక్తి హజ్రత్ ఉమర్ (ర)” అని చెప్పటాన్ని బట్టి ఆయన ఏ స్థాయి వ్యక్తిత్వమున్న వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన “అమిరుల్ మూమినూన్” (విశ్వాసుల నాయకుడు) గా పిలువబడ్డారు.

స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) “అల్-ఫారూఖ్” అనే బిరుదును హజ్రత్ ఉమర్ (ర) వారికి ఇవ్వటమైనది. “అల్-ఫారూఖ్” అంటే.. “సత్యా అసత్యాల మధ్య విచక్షణ చేసేవాడు” అని అర్థం. ఆయన తండ్రి పేరు ఖత్తాబ్. హజ్రత్ అబూబకర్ (ర) తరువాత ఆయన ద్వారానే రెండవ ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు.

పైగా ఆయన అరేబియాలోని ఖురైష్ తెగలలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తి. మార్షల్ ఆర్ట్స్, యుద్ధ వ్యూహాలు తెలిసిన విద్యావంతుడు మరియు అత్యంత ధైర్యశాలి, బలశాలి కూడా. అతిపెద్ద సామ్రాజ్యానికి పాలకుడైనప్పటికీ ఆయన ఎంతో సామాన్య జీవితం గడిపేవారు. మహాత్మ గాంధీ సైతం ఒకానొక సందర్భంలో “హజ్రత్ అబూ బకర్ మరియు ఉమర్ (ర) లు విస్తారమైన సామ్రాజ్యానికి నాయకులైనప్పటికీ వారు పవిత్రమైన, నిరాడంబర జీవితాన్ని గడిపార”ని చెప్పటం జరిగింది.

హజ్రత్ ఉమర్ (ర) తన పాలనలో అనేక ప్రయోజనకర సంస్కరణలు తీసుకువచ్చారు. వాటిలో ముఖ్యంగా జకాత్ ధనాన్ని సేకరించి “బైత్ -ఉల్-మాల్” (ప్రజా ఖజానా) ఏర్పాటు చేసి బీదలు, అవసరార్థుల అగత్యపరుల ఆర్థిక అవసరాలను తీర్చే వ్యవస్థను స్థాపించారు. కేంద్రంలోనే కాక బీదసాదలకు సకాలంలో వారి అవసరాలు తీర్చగలిగేలా జిల్లా స్థాయిలో సైతం “బైత్ -ఉల్-మాల్” (ప్రజా ఖజానా) ఏర్పాటు చేశారు. అలాగే, రేషన్ డిపో వ్యవస్థను ఏర్పాటు చెయ్యటం, సంక్షేమ గృహాలు, అనాథాశ్రమాలు, దేశ రక్షణ కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయాలు స్థాపించటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాక.. ఆయన ఆధ్వర్యంలో సంపూర్ణ నిస్పాక్షిక న్యాయ వ్యవస్థ మరియు పటిష్టమైన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించబడింది. ఎందుకంటే ఇస్లాంలో న్యాయం ముందు పేద, ధనిక, నలుపు, తెలుపు, ముస్లిం, ముస్లిమేతరుడు అన్న బేధభావం లేదు. న్యాయం ముందు అందరూ సమానమే. ఈ న్యాయబద్ధమైన చట్టం ప్రకారమే నూటికి నూరు శాతం ఆయన పాలించారు.

జవాబుదారీతనం…

మంచి పరిపాలన అందించే ఒక నాయకుడికి ఉండాల్సింది “జవాబుదారీతనం”. ఈ విషయంలో హజ్రత్ ఉమర్ (ర) ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అతను తన అధికారుల నియామక సమయంలో సైతం వారితో విలాసవంతమైన ఖర్చుల్లో పాల్గొనవద్దని ప్రమాణం చేయించేవారు మరియు వారి ఆస్తుల రికార్డును సైతం తీసుకునేవారు ఎందుకంటే తరువాతి కాలాల్లో వారి ఆదాయ వనరులతో సరిపోల్చబడటానికి. ఒకవేళ వారు ప్రకటించిన ఆస్తి కంటే మించి ఎక్కువ ఆస్తులుంటే ఆ మిగిలిన భాగాన్ని బైత్-ఉల్-మాల్ (ప్రజా ఖజానా) కు జమ చేయించేవారు. స్వయంగా తనకున్న ఆస్తిపాస్తుల్లో ఎక్కువ భాగాన్ని బైత్-ఉల్-మాల్ కు అప్పగించేశారు. తమ జీవితంలో నిడారంబరత అవలంబించాలని ఆయన ఎల్లప్పుడూ తన అధికారులను కోరేవారు.

రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టటమే కోట్ల కొద్దీ ఆస్తులను వెనకేసుకోవటం అన్న లక్ష్యంగా పనిచేసే అధికారులన్న నేటి తరుణంలో పై విధమైన జవాబుదారీతనంతో పాలించిన హజ్రత్ ఉమర్ (ర) లాంటి పాలకుడు కూడా ఒకప్పుడు గతించాడని ఊహించుకుంటుంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
……………..

కానీ, చిత్రమేమిటంటే.. అంతగొప్ప అసమాన వ్యక్తిత్వమున్న వ్యక్తి అయిన హజ్రత్ ఉమర్ (ర) ఒకానొకప్పుడు ఇస్లాంకు, ప్రవక్త ముహమ్మద్ (స) కు బద్ధ విరోధి.
ఆయన ఇస్లాం స్వీకరించటానికి ముందు వారి పెద్దల ద్వారా పరంపరగా వస్తున్న మత విశ్వాసాలను గట్టిగా నమ్మేవారు. ఎప్పుడైతే ముహమ్మద్ (స) మక్కా లో దేవునిచే ప్రవక్తగా ఎన్నుకోబడి దైవ ధర్మాన్ని బోధించటం ప్రారంభించారో.. అప్పటివరకూ బహుదైవారాధన చేస్తూ ఉన్నవారంతా ఏకదైవారాధకులుగా మారిపోవటం ప్రారంభించారు. ప్రవక్త ముహమ్మద్ (స) బోధిస్తున్న ఇస్లాం ధర్మం క్రమంగా మక్కా నగరంలో వ్యాపిస్తూ పోవటం చూసిన మక్కా సర్దారులు ఇలాగే చూస్తూ ఉరుకుంటే కొన్నాళ్లకు అరేబియాలో ఇస్లాం అధికారిక ధర్మంగా మారిపోతుందన్న భయంతో ఇస్లాం స్వీకరించిన వ్యక్తులను తీవ్రహింసలకు గురిచేసేవారు. ఆ హింసలకు తట్టుకోలేక ఎందరో ప్రాణాలు సైతం కోల్పోయారు.
ఇస్లాం ఖడ్గ బలంతో వ్యాపించిందని విమర్శించే అరకొర జ్ఞానం ఉన్నవారికి ఈ విషయాలేమీ తెలీవు. ఆ విధంగా ఆనాడు ఇస్లాం స్వీకరిస్తున్న విశ్వాసులను హింసించే వారిలో ఒకరు ఉమర్ (ర). ఆయన బలం చూసుకుని అవిశ్వాసులు మరింత రెచ్చిపోయేవారు.
ఒకానొక సందర్భంలో ఉమర్ (ర) సహనం కోల్పోయి తీవ్రమైన ఆగ్రహంతో ఎంతకు తెగించారంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) నే హతమార్చేస్తే ఇక ఈరోజుతో ఇస్లాం ప్రస్తావనే మక్కాలో ఉండదని బహిరంగంగా కత్తి పట్టుకుని బయలుదేరిపోయారు.

కానీ జరిగింది వేరు.. కత్తి పట్టుకుని ప్రవక్త ముహమ్మద్ (స) ను చంపెయ్యటానికి వెళుతున్న దారిలో నోయిమ్ బిన్ అబ్దుల్లాహ్ అనే వ్యక్తి ఉమర్ (ర)ను ఆపి, “ఆ ముహమ్మద్ ను తరువాత చంపుదువు గానీ ముందు నీ ఇంట్లో మీ చెల్లెలు, ఆమె భర్త కూడా ఇస్లాం స్వీకరించారు అది చూడు” అని చెప్పటంతో వారి ఇంటికి కత్తి పట్టుకుని వెళ్లటం.. తీవ్ర ఆగ్రహంతో వారిని రక్తం కారేలా కొట్టినప్పటికీ.. “మేము చచ్చినా ఇస్లాం వదలబోమని” చెప్పటంతో మనుషులను అంతగా ఆకర్షించే విషయం ఖురాన్ లో ఏముందో అని దానిని ఇవ్వమని అడుగుతారు. ఆ తరువాత ఖురాన్ చదివిన ఉమర్ (ర) ఖురాన్ గొప్పతనాన్ని, దానిలోని సత్యతను గ్రహించి.. ఏ కత్తితో అయితే ప్రవక్త ముహమ్మద్ (స) ను చంపటానికి బయలుదేరుతారో ఆ కత్తితోనే ఆయన వద్దకు వెళ్లి దానిని చివరకు ఆయన కాళ్ల వద్దనే పడేసి ఆయన సమక్షంలోనే ఇస్లాం స్వీకరిస్తారు.

ఎవరూ ఊహించని ఈ పరిణామంతో అప్పటికే అనేక హింసలు పొందుతూ, బలహీన స్థితిలో ఉంటూ రహస్యంగా నమాజులు చదువుకుంటూ బిక్కుబిక్కుమని గడిపే విశ్వాసులకు కొండంత బలం వస్తుంది. అప్పటివరకూ అవిశ్వాసులకు బలంగా ఉండే హజ్రత్ ఉమర్ (ర) ఇప్పుడు విశ్వాసుల తరఫున వారికి బలంగా మారిపోయారు. ఎంతగా అంటే బహిరంగంగా ముస్లిములు నమాజ్ చదువుకుంటూ ధైర్యంగా తిరిగే స్థాయికి వచ్చేశారు. హజ్రత్ ఉమర్ (ర) ను దాటుకుని విశ్వాసులపై కాలు దువ్వే దుస్సాహాసం చెయ్యటం ఆనాటి ఏ అవిశ్వాసి వల్లా సాధ్యమయ్యే పని కాదు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లామియా ఉద్యమానికి, ముస్లిములకు హజ్రత్ ఉమర్ (ర) వారి వల్ల బలం చేకూరుతుంది. అక్కడి నుండి మక్కాలో పరిస్థితులు మారిపోయాయి.

“ఉమర్ – ద – గ్రేట్” గా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన హజ్రత్ ఉమర్ (ర) గురించి ప్రవక్త ముహమ్మద్ (స) స్వయంగా చెప్పిన విషయం- “ముస్లిములరా ఈయనే ఉమర్.. నేను అతన్ని నా సహాయకుడుగా, నా సలహాదారునిగా నియమించాను. ఈయన ఎలాంటి వాడంటే తనకు ఎంత భాధ కలిగించే విషయమైనా న్యాయం వైపే నిలబడతాడు. ఉమర్ ను చూసినప్పుడు సాతాను అతని నుండి పారిపోతాడు. పరలోకంలో స్వర్గవాసుల ద్వారా ప్రశంసించబడే వ్యక్తి”

ఆ విధంగా ఇస్లామియా రాజ్యాన్ని స్థాపించి పాలించిన ప్రముఖ ఖలీఫాలైన హజ్రత్ అబూబకర్ (ర), హజ్రత్ ఉత్మన్ (ర), హజ్రత్ అలీ (ర) లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ప్రవక్త ముహమ్మద్ (స) శిష్యులలో రెండవ ఖలీఫాగా ఎన్నుకోబడ్డ ఉమర్ (ర) పూర్తి పేరు… హజ్రత్ ఉమర్ ఫారూఖ్ ఇబ్నె ఖత్తాబ్ (ర)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *