భిన్న మతాల మధ్య “ఐక్యత” ఎలా సాధ్యపడుతుంది

వ్యక్తుల మధ్య “ఐక్యత” అందరి DNA ఒక్కటే అని చెప్పటాన్ని బట్టో.. అందరి DNA ఒకే విధంగా ఉండటాన్ని బట్టో రాదు. సైంటిఫిగ్గా చూసినా అందరి DNA ఒకలా ఉండదు కూడా! కాబట్టి హిందూ, ముస్లిములు ఇతర మతాల మధ్య ఐక్యత పెంపొందించటం కోసం- “భారత దేశంలో ఉన్న అనేక మతాల ప్రజల DNA ఒక్కటే కాబట్టి అందరూ ఒక్కటే” చెప్పటం అర్థరహితం అవుతుంది.

ఎందుకంటే భారతదేశంలో భిన్న మతాల మధ్య ఏర్పడి ఉన్న అనైక్యతకు కారణం పాపం వాళ్లందరికీ తమ DNA ఒక్కటే అన్న విషయం ఇన్నాళ్లూ తెలియకపోవటం వల్ల కాదు కాదా.

నేడు “అనైక్యత” అన్నది కేవలం భిన్న మతాల మధ్య మాత్రమే చోటు చేసుకుని లేదు.. ఆయా మత ప్రజల్లో కూడా కులాలు, వర్గాలు, వర్ణాల పేరట ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలు ప్రదర్శించే జాఢ్యం చోటు చేసుకుని ఉంది.

మోహన్ భగవత్ చెప్పిన సూత్రం ప్రకారం పోనీ ఒక్క హిందూ సమాజంలో ఉన్నోళ్లందరి DNA ఒకేలా ఉందా? అన్నది గమనిస్తే.. బ్రాహ్మణులకు మాత్రమే ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. మాంసాహారం తినే హిందువులకైనా ఇల్లు అద్దెకివ్వమని బోర్డులు తగిలించేవారు.. సపరేటుగా బ్రాహ్మణ అగ్రహారాలు కట్టుకుని.. హిందువుల్లోనే కొందరిని తక్కువ కులస్తులని జమకట్టి ఉచ్చనీచ భావాలు ప్రదర్శించేవారు.. ఇతర కులపోడి అమ్మాయినో, అబ్బాయినో ప్రేమించించిన సంఘటనల్లో చొక్కాలు చిరిగేలా కొట్టుకుని తలలు బద్దలు కొట్టుకునేవారు.. సపరేటుగా కాపు కాలనీలనీ, చౌదరీల కాలనీలని, రెడ్ల కాలనీలని కట్టుకుని అంతరానితనాన్ని మేన్ టైన్ చేసే వీరంతా పరస్పరం హిందువులే కదా?

పోనీ, ముస్లిం సమాజంలో అందరూ ఐక్యంగా ఉన్నారా? అంటే.. సున్నీలు, షియాలు, సయ్యద్ లు, ఖాన్ లు, ఖురైష్ లు, దూదేకులు వగైరా పేర్లతో భిన్న శాఖలుగా విడిపోయి వర్గతత్వాన్ని, ఉచ్చనీచ భావాలను ప్రదర్శించే జాఢ్యం ముస్లిం సమాజంలోనూ ఉంది.

ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్కులని మాత్రమే కాక, యెహోవా సంఘం, క్రీస్తు సంఘం వగైరా పేర్లతో వెలకొద్దీ డినామినేషన్లుగా విడిపోయి క్రైస్తవంలోనూ విపరీతమైన అనైక్యతను చూడగలం.

మరి ఈ మత ప్రజలందరి DNA ఒక్కటేనా? భిన్న మతాల మధ్య మాత్రమే కాక, ఆయా మత ప్రజల మధ్య సైతం ఐక్యతను పెంపొందించాలంటే.. కేవలం మీ అందరి DNA ఒక్కటే కాబట్టి మీరంతా ఒక్కటే అని చిలకపలుకులు పలికితే ఐక్యత రాదు.
మరేం చెయ్యాలి?

వ్యక్తుల మధ్య పటిష్ట ఐక్యతకు భావ సారూప్యతే అంతిమ పరిష్కారం. “భావ సారూప్యత” అంటే – విభిన్న మత ప్రజల భావాల మధ్య సమానత్వాన్ని (Equality) తీసుకురావటం.

అదెలా సాధ్యం?

అంటే… ఆయా మతస్తులు తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ధార్మిక గ్రంథాలన్నీ మానవుల మధ్య “ఐక్యత”కు ఏకగ్రీవంగా చెప్పే మూడు ప్రధాన సూత్రాలను ఆయా మతస్తులకు అర్థమయ్యేలా వివరించటమే. అందులో..

మొదటి సూత్రం- “మానవులంతా ఒకే జంట సంతానం”
అంటే పుట్టుక రీత్యా ప్రపంచంలో మానవులంతా సమానమే! ఏ ఒక్కరూ తక్కువా కాదు ఎక్కువా కాదు. గొప్పతనం అన్నది మనిషి చేసుకునే మంచి పనుల వల్లే తప్ప అతని కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, వంశాన్ని బట్టో రాదు. గొప్ప వంశంలో పుట్టినప్పటికీ చెడు పనులు చేస్తూ, చిల్లరతనంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడు అథముడుగానే పరిగణించబడతాడు.

రెండవ సూత్రం- “మానవులందరి ధర్మం ఒక్కటే”

ఆది నుండీ అనేక ప్రవక్తలు, రుషులు, అనేల మహనీయుల ద్వారా ఇవ్వబడుతూ వస్తున్న దైవ ధర్మం ఒక్కటే! అదే ఒకప్పుడు వైదిక ధర్మమని, సనాతన ధర్మమని, ఆర్ష ధర్మమని అనేక మహనీయుల ద్వారా పిలువబడింది.. అదే పురాతన ధర్మమని పాతనిబంధనలో అనేక ప్రవక్తల ద్వారా పిలువబడింది.. శాంతి మార్గమని క్రొత్తనిబంధనలో పరిచయమైంది.. ఖురాన్ లో ఇస్లాం అన్న పేరుతో పరిచయమైంది. ముస్లిములు, క్రైస్తవులు, హిందువులు వగైరా వేరు వేరు ఐడెంటిటీలు ఉన్నప్పటికీ.. వారి ధార్మిక గ్రంథాలు వేర్వేరు భాషల్లో ఉన్నప్పటికీ అందరికీ ఇవ్వబడింది ఒక్కటే ధర్మం తప్ప వేరు వేరు ధర్మాలు ఇవ్వబడలేదు.

మూడవ సూత్రం- “మానవులందరి సృష్టికర్తా ఒక్కడే”
హిందువులకు, ముస్లిములకు, క్రైస్తవుకు ఇంకా ఇతర మతస్తులకు వేర్వేరు సృష్టికర్తలు లేరు! ఒక్కో మతం వారిని ఒక్కో సృష్టికర్త తీరిగ్గా కూర్చుని సృష్టించలేదు. సమస్తాన్నీ, సమస్త ప్రజలను ఒక్కడే సృష్టికర్త సృష్టించాడు. ఆయన్ని దేవుడని, గాడ్ అని, భగవాన్ అని, యోహావా అని, అల్లాహ్ అని ఏ భాషలో ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. ఆ ఒక్క దైవాన్నే రాముడు, కృష్ణుడు, అబ్రాహామ్, మోజెస్, జీసస్, ప్రవక్త ముహమ్మద్ వగైరా సకల ప్రవక్తలూ ప్రార్ధించింది, ఆరాధించింది. ఆయన్ని అనేక రూపాల్లో కాక అనేక పేర్లతో పిలవటంలో గుర్తించటంలో తప్పులేదు.

ధార్మిక గ్రంథాలు ప్రతిపాదిస్తున్న ఈ మూడు సూత్రాల ఆధారంగా భావసారూప్యతను తేగలగటమే భిన్న మతస్తుల మధ్య, ఆయా మతస్తుల ప్రజల మధ్య “ఐక్యత” పెంపొందించటానికి జాత్యాహంకారాన్ని తుడిచిపెట్టటానికి అంతమ పరిష్కారం కాగలుగుతుంది. ఇది సాధ్యం కావాలంటే ఆయా మతస్తులు ముందు నుంచీ అనుసరిస్తూ వస్తున్న కొన్ని సెంటిమెంట్లు, నమ్మకాలు ప్రక్కన పెట్టి.. నిస్పక్షపాతమైన ఆలోచనా విధానాన్ని, పరిశీలనా దృష్టిని పెంపొందించుకోవాలి. ఎవరో చెప్పే మూఢ విశ్వాసాలను, నమ్మకాలను గుడ్డిగా నమ్మేయక… తమ వద్ద ఉన్న ధార్మిక గ్రంథాలు చదవటానికి వారంలో కనీసం ఒక సినిమా చూసేంత సమయమైనా కేటాయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *