కుల-వర్గ తత్వాలను ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయా?

ముస్లిముల్లో ‘సున్నీ-షియాల, వర్గతత్వానికి కారణం ఖురాన్ బోధలే అన్నది హిందువుల-క్రైస్తవుల భావన! అలాగే హిందువుల్లో కొందరు చూపే కులవివక్ష, ఉచ్చనీచ భావాలకు కారణం హిందూ శాస్త్రాలే అన్నది ముస్లిముల, క్రైస్తవుల భావన! క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు కలిగి ఉండే వర్గతత్వానికి బైబిల్ బోధలే కారణమన్నది హిందువుల, ముస్లిముల భావన!

ఈ మూడు భావాలూ నిజానికి తప్పే! ఎందుకంటే నేడు హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గపు ప్రజల్లో ఏర్పడి ఉన్న కుల-వర్గ తత్వాలకూ ఆయా మత వర్గాలు కలిగి ఉన్న ధార్మిక గ్రంథాల బోధలకూ ఏ మాత్రం సంబంధం లేకపోవటమే!
*****

సున్నీలు-షియాలు:

అసలు సున్నీ-షియా వర్గాలు ఏర్పడటానికి ఖురాన్ బోధలకూ కించిత్తు సంబంధం లేదు. కేవలం ప్రవక్త ముహమ్మద్ (స) పరమపదించిన తరువాత ఆయన అనంతరం ఖలీఫాగా ఎవరు ఉండాలన్న రాజకీయ గొడవలే సున్నీ-షియా వర్గాలు ఏర్పడటానికి కారణం. నిజానికి ఇస్లాం వ్యక్తులను వర్గం ఆధారంగానో, వారి పుట్టుక ఆధారంగానో వర్గీకరణ చెయ్యక.. “ప్రవర్తన ఆధారిత వర్గీకరణ (Attitude based classification)” మాత్రమే చేస్తుంది.

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13

ఈ విధంగా ఖురాన్- మానవులంతా ఒకే జంట సంతానం, కాబట్టి పుట్టుకను బట్టో, కులాన్ని బట్టో, జాతీ-వర్గాన్ని బట్టో, వంశం-రంగును బట్టో ఏ ఒకరూ ఎక్కువా కాదు ఏ ఒకరు తక్కువా కాదని తీర్మానిస్తుంది. దీనిని బట్టి నేడు ముస్లిం సమాజంలో కొందరు ప్రదర్శించే సున్నీ-షియాల వర్గతత్వానికీ మరియు వర్గతత్వాన్ని ఖండిస్తున్న ఇస్లాంకూ కించిత్తు సంబంధం లేదన్నది సుస్పష్టమవుతుంది.
*****

చాతుర్వర్ణ వ్యవస్థ:

స్పష్టంగా చెప్పాలంటే.. నేడు కొందరు హిందూ పండితులు “చాతుర్వర్ణ” వ్యవస్థ గురించి చేసే వ్యాఖ్యానానికీ.. వేదాలు ప్రతిపాదించే చాతుర్వర్ణ వ్యవస్థకూ పొంతన లేదని చెప్పాలి. “మానవులు పుట్టుకతోనే అధికులు-ఆథములు” అన్నది కొందరు హిందూ పండితులు చేసే వ్యాఖ్యానం.

నిజానికి వేదంలో కనపడే “చాతుర్వర్ణ వ్యవస్థ”ను గమనిస్తే.. వ్యక్తుల సామర్థ్యాలు, వారు చేసే పనుల ఆధారంగా వారిని వేదం బ్రాహ్మణులని, వైశ్యులని, క్షత్రియులని, శూద్రులని వర్గీకరిస్తుంది. ఈ వర్గీకరణ నిజానికి ఆయా వ్యక్తుల పుట్టుకను బట్టో, కులాన్ని బట్టో చేసింది ఎంతమాత్రం కాదు. ఈ విషయం చాలా మంది సామాన్య హిందూ ప్రజానికి తెలీదు.

ఒక సమాజం విజయవంతంగా, ఆరోగ్యవంతంగా మనగలగాలంటే అందులో 1. విద్యావేత్తలూ, శాస్త్రవేత్తలు 2. ఆర్ధికవేత్తలూ, వ్యాపారవేత్తలూ 3. రక్షణ-సైనిక దళం 4. శ్రామికవర్గం అనే నాలుగు రకాల తరగతుల వ్యక్తులు ఉండి, వారంతా ఎంతో సమన్వయంతో పని చేసినప్పుడే సాధ్యం అవుతుంది. వేదం ప్రకారం “బ్రాహ్మణులు” అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవారని కాదు. జ్ఞానం సంపాదించినవారని అర్థం. బ్రాహ్మణ గుణాలు వేరు, బ్రాహ్మణ కులం వేరు..
ఆ ప్రాకారం చూస్తే.. ఒక వ్యక్తి ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా అతను గొప్ప విద్యావేత్తగానో, శాస్త్రవేత్తగానో రాణిస్తే అతని ఆ సామర్థ్యాన్ని బట్టి అతను “బ్రాహ్మణునిగా” పరిగణించబడతాడు.. అలాగే ఒక వ్యక్తి ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా అతను గొప్ప విధ్యా వేత్తగా రాణిస్తే అతను “వైశ్యుని”గా పరిగణించబడతాడు.. అలాగే ఒక వ్యక్తి ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా అతను మంచి కండపుష్టి కలిగి ఏ సైనికుడిగానో రక్షకభటుడిగానో రాణిస్తే అతను క్షత్రియుడిగా పరిగణించబడతాడు.. అలాగే ఒక వ్యక్తి ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా అతనిలో పరిశ్రమించే గుణం ఉండి ఓ శ్రామికుడిగా మారితే అతను శూద్రుడిగా పరిగణించబడతాడు.

ఈ నాలుగు రకాల సామర్థ్యాలు కల వ్యక్తులు ఉండటం సమాజ మనుగడకు అత్యంత అవశ్యకం. వేదం ప్రకారం ఈ నాలుగు తరగతుల వ్యక్తులు వారి వారి సామర్థ్యాల పరంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలుగా వర్గీకరించబడ్డారు తప్పితే వారు పుట్టుక ఆధారంగానో కుటుంబం ఆధారంగానో వర్గీకరించబడలేదు. అయినప్పటికీ ఆత్మగౌరవపరంగా ఈ నాలుగు వర్గాల వ్యక్తులూ సమానమే. ఏ ఒక్కరూ తక్కువా ఏ ఒక్కరూ ఎక్కువా కాదు. ఈ విషయాన్ని వేదమే ఈ క్రింది విధంగా చెబుతుంది.

“అజ్వేష్ఠాసః ఆకనిష్ఠాసః ఏతే భాతరః” = “కొందరు పెద్దలు లేరు, కొందరు చిన్నలు లేరు. వీరందరూ పరస్పరం సోదరులే” – ఋగ్వేదం 5:60:5

అలాగే మానవులంతా సమానమే అని వేదం చెప్పటమే కాక, మనుషులందరినీ సమానంగా చూడాలనీ ఏ ఒక్కరి పట్లా వివక్షా, ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలు ఎంత మాత్రం ప్రదర్శించకూడదని గీతాశాస్త్రం బోధిస్తుంది.

“విద్య, వినయం గలిగియున్న బ్రాహ్మణునియందును, గోవు నందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసము వండుకు తినే చండాలుని యందును సమదృష్టి గలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు” – గీత 5:18

పై శ్లోకాలను బట్టి హిందూ సమాజంలో ఫలానా కులం వారని తక్కువ చూపు చూసేవారు ఆజ్ఞానులు అని అర్థమవుతుంది. అయితే వేదంలో చెప్పబడిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థ తరువాతి కాలాల్లో అది వ్యక్తుల పుట్టుక, కులం ఆధారంగా చేయబడిన వర్గీకరణ అన్నట్టుగా అపార్థానికి గురైంది.

కాబట్టి హిందూ సమాజంలో కొందరు ప్రదర్శించే కుల తత్వానికీ హిందూ శాస్త్రాల బోధలకు సంబంధం లేదని అర్థమవుతుంది.
*****

ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు:

క్రైస్తవ సమాజంలో ఏర్పడిన ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు అనే రెండు వర్గాల విభజనకూ బైబిల్ బోధలకూ సంబంధం లేదు. ఇవి రెండే కాక క్రైస్తవ సమాజంలో ఇంకా వేల కొద్దీ సంఘాలు ఏర్పడి వాటి మధ్య అనైక్యత అలుముకుంది. రోమన్ క్యాథలిక్ సంఘం ప్రతిపాదించే కొన్ని సిద్ధాంతాలు నచ్చక 1517 సం.లో మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో ప్రారంభమైండే ప్రొటెస్టెంట్ ఉద్యమం. నిజానికి బైబిల్ సైతం మానవులంతా ఒకే జంట సంతానమనే దృక్పథమే చెబుతుంది. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు? ఎంత మనోహరము?” – కీర్తనలు 133:1 అని బైబిల్ బోధిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే కుల-వర్గతత్వం హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గ ప్రజల్లో ఉంది తప్పితే వారు కలిగి ఉన్న ధార్మిక గ్రంథాల్లో లేదు.

సరే, ధార్మిక గ్రంథాలు కుల-వర్గ తత్వాలను ఖండిస్తున్న నేపథ్యంలో చెయ్యాల్సింది ఏమిటి? అంటే.. ఏ ధార్మిక గ్రంథాల ఆధారంగా అయితే కొందరు కుల-వర్గ తత్వాలను పెంచి పోషిస్తున్నారో అవే ధార్మిక గ్రంథాల ఆధారంగా కుల-వర్గ తత్వాన్నిఅంతం చెయ్యాటమే అంతిమ పరిష్కారం. అప్పటివరకూ ఈ కుల-వర్గ తత్వపు భూతం బ్రతికే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *