సున్నీ-షియా వర్గతత్వవాదం ఇస్లాం బోధిస్తుందా?

జాత్యాహంకారాన్ని, కుల-వర్గతత్వాన్నీ ఇస్లాం తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు మరి ముస్లిం సమాజంలో సున్నీ-షియాల వర్గతత్వవాదం ఎందుకుంది? ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్, ఖురైష్ వగైరా అంటూ హిందూత్వంలో కులతత్వం మాదిరిగానే ముస్లిం సమాజంలో కూడా అనేక వర్గాలు ఎందుకున్నాయి? పఠానులు, షేకులూ, సయ్యదులు, ఖురైష్ లు, దూదేకులు వగైరా వర్గాల మధ్య ఒకరంటే మరొకరికి చులకన భావం. అలాంటప్పుడు ఇస్లాం మానవులంతా సమానమనే దృక్పథాన్ని నేర్పుతుందన్నది ఎంతవరకు నిజం? దీనిని బట్టి ఇస్లాంలోనూ కుల-వర్గతత్వ వాదం ఉన్నట్టే కదా? ఇస్లాం సైతం జాత్యాహంకారాన్నీ, వర్గతత్వవాదాన్నీ సమర్ధిస్తున్నట్టే కదా?

చాలా సందర్భాల్లో ముస్లిమేతరులు అడిగే ప్రశ్న ఇది! ఒకరకంగా ఈ వాదన ఎటువంటిదంటే.. ఒకతను తప్ప త్రాగి కారు డ్రైవ్ చేసి ఓ గోడను గుద్దేస్తే అక్కడ పోగైన జనం నిజనిజాలు తెలుసుకోకుండా తప్పంతా ఆ కారుదే అని తీర్మానించటం లాంటిదన్న మాట! అయితే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం- ముస్లిం సమాజంలో ఉన్న ఆయా వర్గాల్లో ముస్లిములందరూ వర్గతత్వవాదాన్ని కలిగి ఉన్నారనుకోవటం కూడా తప్పే! ఇస్లాంను లోతుగా అవగాహన చేసుకున్న ఉత్తములు సైతం ఎందరో ఉన్నారు.

ఏదైనా ఒక మతవర్గం తాలూకు ప్రజల నడవడికను బట్టి వారు అలా ప్రవర్తించటానికి కారణం ఆ మతవర్గం కలిగి ఉన్న ధార్మిక గ్రంథమే అయ్యుంటుందని దానిని ఇతర మతవర్గాల వారు విమర్శించటం ప్రస్తుత సమాజంలో చాలా కామనైపోయింది కాబట్టి.. అదే కోవలో ముస్లిం సమాజంలో కొందరి ప్రవర్తనను బట్టి ఇస్లాం సైతం విమర్శించబడుతుందనే చెప్పాలి. నిజానికి సకల ధార్మిక గ్రంథాలూ కుల-వర్గతత్వవాదాన్ని ఖండిస్తున్నాయి. అదే క్రమంలో ఖురాన్ సైతం ఎంతో తీవ్రంగా ఇలాంటి జాఢ్యాలను ఖండిస్తుంది.

ఒక మతవర్గంలో అందరూ మంచోళ్లే ఉంటారు, ఒక మతవర్గంలో అందరూ మూర్ఖులే ఉంటారు అని ఊహించుకోవటమే అసలు మూర్ఖత్వం. ఏ మతవర్గంలోనైనా మంచోళ్లతో పాటు కొందరు చెడ్డోళ్లూ ఉంటారు. ఈ సూత్రానికి ముస్లిం సమాజమేమీ అతీతం కాదు.

నిజానికి ముస్లిం సమాజంలో సున్నీ, షియా, పఠానులు, షేకులు, సయ్యదులు, ఖురైషులు, దూదేకుల వగైరా శాఖల్లో ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలు ప్రదర్శించే వారికీ ఇస్లాంకూ కించిత్తు సంబంధం లేదని చెప్పటం అతిశయోక్తి కాదు! దానికి కారణం ఇస్లాం వ్యక్తులను వర్గం ఆధారంగానో, వారి పుట్టుక ఆధారంగానో వర్గీకరణ చెయ్యక.. “ప్రవర్తన ఆధారిత వర్గీకరణ (Attitude based classification)” మాత్రమే చెయ్యటం! ఆ విషయం ఎలా అన్నది ఈ క్రింది ఖురాన్ వాక్యం చదివితే తెలుస్తుంది.

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13

పై ఖురాన్ వాక్యాన్ని బట్టి అర్థమవుతున్న మూడు విషయాలు:

1. మానవులంతా ఒకే జంట సంతానం. అటువంటప్పుడు కులపరంగా గానో, జాతి పరంగా గానో, వర్గం పరంగానో, రంగు పరంగా గానో ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు..

2. సృష్టికర్త అయిన దేవుడు మానవులను వివిధ ప్రాంతాలు, భాషలు, అలవాట్లను బట్టి జాతులుగా, తెగలుగా సృష్టించింది కేవలం ఒకరికొకరు పరిచయం చేసుకోవటానికి మాత్రమే..

3. దేవుని దృష్టిలో ఎవరైనా గొప్ప వానిగా ఎంచబడేది అతని జాతిని బట్టో, రంగును బట్టో, వంశాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదు, అతని ప్రవర్తన (Attitude) ను బట్టి మాత్రమే..

అలాగే ప్రవక్త ముహమ్మద్ (స) జాత్యాహంకారపు జాఢ్యాన్ని ఏదో నోటి మాటగా ఖండించలేదు కానీ.. నల్లవారిని అంటరాని వారిగా భావిస్తూ వారిని ఎంతో నీచంగా చూస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు అరబ్బులలో అగ్రస్థాయి వంశీయులే నిర్వర్తిస్తూ ఉండే కాబా కప్పు పై నిలబడి అజాన్ (నమాజ్ కై పిలుపు) ఇచ్చే గొప్ప బాధ్యతను హజ్రత్ బిలాల్ (రజి) అనే ఓ నల్ల నీగ్రో బానిసకు అప్పగించి, జాత్యాహంకారపు జాఢ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి పరేశారు . ఆ సంఘటన అప్పట్లో ఓ రకంగా దుమారం రేపింది. ఎందరో జాత్యాహంకారుల నోళ్లు మూయించింది.
*****

ఇస్లాం ఒక వ్యక్తికి ‘ఆధిక్యత (Superiority)’ అన్నది దేని ఆధారంగా ఇస్తుంది?

“అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఎలాంటి అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప”
– ప్రవక్త ముహమ్మద్ (స)

ఈ సందర్భంలో ఎవరైనా మరి ఇస్లాం జాత్యాహంకారాన్ని అంత తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు ముస్లిముల్లో సున్నీలు, షియాలు, షేకులు, ఖాన్, పఠానులు, దూదేకులు వగైరా శాఖలుగా ఎందుకు విడిపోయారు? వారి మధ్య అనైక్యత ఎందుకుంది? అని ప్రశ్నించవచ్చు

దీనికి సంక్షిప్త సమాధానం- ముస్లిం సమాజంలో కొందరు ప్రదర్శించే వర్గతత్వవాదంతో, వారి అనైక్యతతో ఇస్లాంకు సంబంధం లేదు! ప్రవక్త ముహమ్మద్ (స) పరమపదించిన తరువాత ఎన్నో సంవత్సరాల తరువాతే సున్నీ-షియాలన్న ఈ శాఖలు ఉనికిలోకి వచ్చాయి.

నిజానికి ఖురాన్- “మానవుల పట్ల అల్లాహ్ కు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి (2.143)” అని చెబుతుంది. తప్పితే మానవుల్లో ఫలానా మతం, వర్గం వారిపట్ల కరుణ, వాత్సల్యాలు ఉన్నాయని చెప్పటం లేదు. కాబట్టి ఫలానా వర్గం గొప్ప ఫలానా వర్గం తక్కువ అనటానికి అవకాశమే లేదిక్కడ. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ముస్లిం సమాజంలో ఉన్న శాఖల్లో ఒకరి పట్ల ఒకరు మేమే గొప్ప మీరు మాకంటే తక్కువ అన్న భావాలు ప్రదర్శించే వారు కేవలం నామ మాత్ర ముస్లిములని చెప్పాలి.
****

ప్రకృతిలో భిన్న రంగులు, భిన్న రుచులు, భిన్న ఋతువులతో కూడిన “భిన్నత్వం (Diversity)” ఉండటం ఎంత సహజమో.. ప్రతీ మత వర్గంలోనూ ప్రజల వృత్తులను బట్టి, వారు నివసించే ప్రాంతాలను బట్టి, వారి ఆహారపు అలవాట్లను బట్టి, వారి వేష భాషలను బట్టి లేక వారి ఆలోచనలు, విశ్వాసాలూ, సిద్ధాంతాలను బట్టి వారిలో “భిన్నత్వం (Diversity)” ఉండటం సైతం అంతే సహజం! తద్వారా వారిలో శాఖలు, వర్గాలు ఏర్పడటం అసలు సమస్య కాదు.. కానీ, తమ వర్గమే గొప్ప ఇతర వర్గాల వారు అధములు, నీచులు అన్న జాత్యాహంకార భావన ప్రదర్శించటమే అసలు అతి పెద్ద సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి భావాలు ప్రదర్శించేవారు ముస్లిమేతరులైనా ముస్లిములైనా సరే ఇస్లాం అలాంటివారిని అనాగరికులుగా, అజ్ఞానులుగా తీర్మానిస్తుంది.

అలాగే ముస్లిం సమాజంలో సిద్ధాంత పరమైన విభేదాల వల్ల సున్నీ, షియా లన్న వర్గాలు ఏర్పడటం సైతం సమస్య కాదు. అలాగే ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్, ఖురైష్ వగైరా శాఖలు ఉండటం సైతం సమస్య కాదు. కానీ ఆయా వర్గాల వారు ఒకటే ఖురాన్ ను కలిగి ఉంటూనే కొందరు ఒకరిపట్ల ఒకరు ఉచ్చనీచ భావాలు ప్రదర్శించటం ఒకరినొకరు చులకనగా చూడటం, విమర్శించుకోవటం, ఘర్షించుకోవటమే అసలు సమస్య! అలాంటి చర్యలనే ఇస్లాం అనాగరికమని తీర్మానిస్తుంది. అయినప్పటికీ ఇలాంటి కొందరి ప్రవర్తన వల్ల ఇస్లాం విమర్శించబడుతుందన్నది కూడా ఒప్పుకుతీరాల్సిన విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *