ముస్లిమేతరుల పట్ల ఖురాన్ వైఖరి ఏమిటి?

“ముస్లిమేతరులందరినీ ఖురాన్ కాఫీర్లుగా పరిగణిస్తుంది”.. “ముస్లిములు కాని కాఫిర్లందరినీ ఖురాన్ నిర్దాక్షణీయంగా హతమార్చమంటుంది.. ఈ ఖురాన్ ఆదేశాలే ఉగ్రవాదానికి ప్రధాన కారణం”.. అన్నవి ఖురాన్ అవగాహన ఏమాత్రం లేని ఇస్లాం ధ్వేషకులు సోషల్ మీడియాలో చేసే కొన్ని అజ్ఞానపు విమర్శలు!
ఇలాంటి ఆజ్ఞాన విమర్శలు ఒక ఎత్తైతే, ఇస్లాం అవగాహన లేని కొందరు మూర్ఖులు ముస్లిం పేర్లతో, వేషధారణలో తీవ్రవాదం చెయ్యటం.. మీడియా దానికి “ఇస్లామిక్ ఉగ్రవాదం” అని పేరు పెట్టి, ముస్లిమేతరుల్లో తీవ్రవాద చర్యలను ఆయా మతస్తులు చేసే ఉగ్రవాదంగా చెప్పక, ఉగ్రవాదం చేసేది ఒక్క ముస్లిములు మాత్రమే అన్న విధంగా ఫోకస్ చెయ్యటం వెరసి.. ఖురాన్ అవగాహన లేని సామాన్య ప్రజలు సైతం “ముస్లిమేతరుల విషయంలో బహుశా ఖురాన్ అలానే ఆదేశిస్తుంది కాబోలు” అని భ్రమపడుతూ ఉంటారు.

ఇస్లాం, ముస్లిమేతరుల పట్ల ఎలాంటి వైఖరిని అవలంబించమంటుంది?

నిజానికి ముస్లిములతో కలిసిమెలిసి జీవనం సాగిస్తూ తమ మానాన తాము జీవించే ముస్లిమేతరులు వారు విగ్రహారాధకులైనా లేక అవిశ్వాసులైనా వారి పట్ల ఇస్లాం ఎంతో న్యాయంగా, మంచితనంగా వ్యవహరిస్తూ వారితో ఐక్యతతో కలిసిమెలసి ఉండమంటుంది.
ఇక ముస్లిమేతరుల విషయంలో ముస్లిములకు ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన గట్టి ఆదేశం ఏమిటంటే- “జాగ్రత్త! ఎవరైనా ఒక ముస్లిమేతరుని పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే అతని హక్కు కాజేస్తే, లేదా అతని శక్తికి మించి పని చెయ్యటానికి అతన్ని బలవంత పెడితే లేదా అతని అంగీకారం లేకుండా అతని నుండి ఏదైనా లాక్కుంటే అలాంటి వ్యక్తి పట్ల నేను తీర్పుదినం రోజున అతనికి వ్యతిరేకంగా నిలబడతాను”.

మరొక సందర్భంలో: “ఎవరైతే అన్యాయంగా ఒక ముస్లిమేతరుణ్ణి చంపుతారో అలాంటివారు కనీసం స్వర్గపు సువాసనలను సైతం ఆస్వాదించలేరు” అని హెచ్చరించటం జరిగింది. ఇక ఖురాన్ అయితే..

“ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే, ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32

“న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏప్రాణినీ హతమార్చకండి” – ఖురాన్ 6:151

అని చెబుతుంది. మరి ముస్లిమేతరుల పట్ల ఇస్లాం ఇంత న్యాయంగా వ్యవహరించమంటున్నప్పుడు ఖురాన్ లో జిహాద్ చెయ్యమని, అవిశ్వాసులను చంపేయమన్న ఆజ్ఞలు ఎందుకున్నాయి? అన్న ప్రశ్నలు మన ముందుకొస్తాయి.
*****

ఖురాన్ “జిహాద్” చెయ్యమని ఎందుకు ఆజ్ఞాపిస్తుంది?

ఖురాన్ చెయ్యమంటున్న “జిహాద్” ముస్లిమేతరులపై దౌర్జన్యం చెయ్యటం కోసం కాదు! నిజానికి “జిహాద్” అన్న పదానికి “కఠోరంగా, నిరంతరాయంగా పరిశ్రమించటం” అని అర్థం. అంటే సమాజంలో “సత్యం, న్యాయం, ధర్మం” స్థాపనకు కఠోరంగా శ్రమించటం.. పైగా దేవుని ప్రసన్నత పొందటమే “జిహాద్” కు ప్రాతిపదికగా ఉండాలి తప్పితే.. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలు పొందటం అన్నది ప్రాతిపదికగా ఉండకూడదు. ఈ రకమైన స్వచ్చమైన “జిహాద్” నే ఖురాన్ ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా ఇస్లాం రెండు రకాల జిహాద్ లను చెయ్యమని ఆదేశిస్తుంది. ఒకటి: “వ్యక్తిగత జీవన రంగములో చెయ్యవలసిన జిహాద్”. రెండు: “సామూహిక జీవన రంగములో చేయవలసిన జిహాద్”

“వ్యక్తిగత జీవన రంగములో చెయ్యవలసిన జిహాద్” అంటే మనిషి తనలో మెదిలే చెడు ఆలోచనలు, తలంపుల నుండి నిరంతరం పోరాడటం. ఆ విధంగా చేసే “ఆత్మప్రక్షాళన” ప్రక్రియనే “అంతరంగ జిహాద్ (Internal Jihad)” అని చెప్పవచ్చు. రెండవది: “సామూహిక జీవన రంగములో చేయవలసిన జిహాద్”. దీని గురించే మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే మనిషిలో మంచి-చెడు ఆలోచనలు ఉన్నట్లే సమాజంలోనూ మంచీ-మానవత్వం కలిగిన వ్యక్తులతో పాటు రాక్షసత్వం, వ్యక్తిగత స్వార్థం కలిగిన రెండు రకాల మనుషులు ఉంటారు.

ఈ రెండవ రకం వారు ఎలాంటి వారంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ‘మానవత్వం’ అన్నదాన్ని ప్రక్కన పెట్టి బీదసాదలను, సామాన్య అమాయక ప్రజలను పీడిస్తూ వారిని తమ గుప్పెట్లో పెట్టుకుని తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని చలాయిస్తుంటారు.
అలాంటి దుర్మార్గుల క్రింద నలిగిపోతున్న సామాన్య పీడిత ప్రజలను కాపాడటానికి మరియు తమ మానాన తాము ధార్మికంగా జీవనం సాగిస్తున్న సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేసి, ధర్మాన్ని అణగద్రొక్కాలన్న కుట్రతో యుద్ధానికి కాలు దువ్వే దుర్మార్గులకు వ్యతిరేకంగా ‘బహిరంగ జిహాద్ (External Jihad)’ చెయ్యాల్సిందిగా ఖురాన్ ఆజ్ఞాపించటం జరిగింది.

కేవలం ఈ రెండే రెండు సందర్భాల్లో మాత్రమే ఖురాన్ దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా ‘యుద్ధం’ చెయ్యమని ఆజ్ఞాపించినట్టు చూడగలం. కానీ, ఆయా సందర్భాలను తప్పించి “ఖురాన్ ముస్లిమేతరులందనీ అవిశ్వాసులుగా లేక కాఫీర్లుగా పరిగణించి చంపేయమంటుందని” ఇస్లాం విమర్శకులు బుర్ర తక్కువ వాదనలు చేస్తుంటారు.
*****

“మీకు (ముస్లిములకు) ఏమయింది, ఈ బలహీనులైన పురుషులు, స్త్రీలు, పిల్లల కోసం దైవ మార్గంలో ఎందుకు యుద్ధం చెయ్యరు? వారు “మా ప్రభూ! మమ్మల్ని ఈ జనావాసం నుండి విముక్తి కలిగించు ఇక్కడి జనం మహా దుర్మార్గులు, మా కోసం నీ పక్షాన ఎవరినైనా సమర్ధకులను, సహాయకులను పంపించు అని వేడుకున్నారే” – ఖురాన్ 4:75

పై వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. మహా దుర్మార్గులైన నాయకుల పీడన నుండి, వారి దౌర్జన్యాల నుండి పీడితులైన పురుషులు, స్త్రీలు “మమ్మల్ని కాపాడమని విముక్తి కలిగించమని” మొర పెట్టుకున్న ప్పుడు పీడితులను ఆదుకోవటానికి ఖురాన్ వారి తరఫున పోరాడమని విశ్వాసులకు ఆజ్ఞాపిస్తున్న వైనాన్ని గమనించగలం. ఇప్పుడు ఖురాన్ యుద్ధం చెయ్యమని విశ్వాసులకు ఆజ్ఞాపిస్తున్న రెండవ సందర్భాన్ని గమనిస్తే..

“మీతో పోరాడే వారితో మీరూ పోరాడండి” (2:190). “వారు యుద్ధం చెయ్యనంతవరకు మీరూ వారితో యుద్ధం చెయ్యకండి, కానీ వారే యుద్ధానికి కాలు దువ్వితే మీరూ వారిని చంపటానికి వెనుదీయకండి” (2:191)

“పీడన అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడేంత వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు యుద్ధాన్ని మానుకుంటే దౌర్జన్య పరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు” – ఖురాన్ 2:193

“ఎవరిపై యుద్ధం రుద్దబడిందో వారికి యుద్ధం చేసే అనుమతి ఇవ్వబడుతుంది. ఎందుకంటే వారికి అన్యాయం, అత్యాచారం జరిగింది.. ఈ జనులు నిరపరాధులు, అన్యాయంగా తమ ఇళ్ల నుండి గెంటివేయబడ్డారు” – ఖురాన్ 33:39,40

“ప్రవక్తా! శత్రువు గనుక సంధీ శాంతుల వైపు మొగ్గు చూపితే, నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాహ్పైభారంవెయ్యి” – 8:61

కనీసం చదవటం వచ్చే ఎవరైనా పై ఖురాన్ వాక్యాలు చదివితే.. ధర్మాన్ని అణచివెయ్యాలన్న ఉద్దేశంతో విశ్వాసులపై అన్యాయంగా దౌర్జన్యం చేసే దుర్మార్గులతో మాత్రమే ఖురాన్ పోరాడమని ఆజ్ఞాపిస్తుందన్న విషయాన్ని గమనించగలరు. అదే శత్రువులు గనుక సంధీ శాంతుల వైపు మొగ్గు చూపితే వారితో పోరాడకుండా వారితో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని కలిసిమెలిసి ఉండమంటుంది.
కానీ, ఈ శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత కూడా సమాజంలో శాంతి భద్రతలను భంగం కలిగించాలన్న ఉద్దేశంతో ఇంకా విశ్వాసులకు నష్టం చేకూర్చటం కోసం కుట్రపూరితంగా శత్రువులకు సహాయం చేసే దుర్మార్గుల పట్ల అతి కఠినంగా ప్రవర్తించమని ఖురాన్ ఈ క్రింది విధంగా ఆదేశిస్తుంది.

“ప్రవక్తా! సత్యతిరస్కారులకు అత్యంత కఠిన శిక్ష పడుతుందనే వార్తను వినిపించు. అయితే మీతో ఒడంబడిక చేసుకుని దాన్ని పాటించటంలో ఎలాంటి కొరతా చేయకపోవటమే కాక, మీకు వ్యతిరేకంగా మరెవరికీ ఎలాంటి సహాయం చేయని బహుదైవారాధకులకు ఈ హెచ్చరిక వర్తించదు” – ఖురాన్ 9:4

పై ఖురాన్ వాక్యం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఈ వాక్యం శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత కూడా వాటిని అతిక్రమించి విశ్వాసులకు నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతో కుట్రాపూరితంగా శతృవర్గాలకు సహాయం చెయ్యటం వంటి దుర్మార్గానికి పాల్పడే అవిశ్వాసుల గురించే అని అర్థమవుతుంది. అలాంటి దుర్మార్గులైన అవిశ్వాసులను.. “ఎక్కడ కనపడితే అక్కడ చంపండి, ఇంకా వారిని పట్టుకోండి, ప్రతి మాటువద్ద వారి కొరకు పొంచి కూర్చోండి” – ఖురాన్ 9:5

అన్న కఠిన ఆదేశాన్ని ఖురాన్ లో ఆదేశించటం జరిగింది. దీనికి పూర్తి భిన్నంగా ఏ అవిశ్వాసులైతే విశ్వాసులను ఇళ్ల నుండి వెళ్లగొట్టకుండా వారి పట్ల దౌర్జన్యం చెయ్యకుండా వారితో కలిసిమెలిసి తమ మానాన తాము బ్రతుకుతుంటారో అలాంటి అవిశ్వాసుల పట్ల మంచితనంతో న్యాయంతో వ్యవహరించమని ఖురాన్ ఆదేశిస్తుంది.

“ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్లగొట్టలేదో, వారి పట్ల మంచితనంతో, న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిరోధించడు” – ఖురాన్ 60:8

ఈ విధంగా ఇస్లాం ముస్లిమేతరులతో ఐక్యత కలిగి, వారితో న్యాయంగా మంచితనంతో వ్యవహరించమంటుంది. దీనికి భిన్నంగా విశ్వాసులపై దౌర్జన్యం చేసి వారిని హతమార్చి, ధర్మాన్ని అణగద్రొక్కాలన్న ఉద్దేశంతో యుద్ధానికి కాలు దువ్విన దుర్మార్గులకు వ్యతిరేకంగా పీడిత విశ్వాసులకు మాత్రమే వారితో యుద్ధం చెయ్యమని, వారు మిమ్మల్ని చంపాటానికి వస్తే మీరు వారిని చంపటానికి వెనుకాడవద్దని ఆదేశించటం జరిగింది తప్ప నేడు కొందరు ఇస్లాం ధ్వేషకులు విమర్శిస్తున్నట్లు.. ఖురాన్ ముస్లిమేతరుల్లో సామాన్యులను, దౌర్జన్య పరులను ఒకే గాటన కట్టేసి అందరినీ చంపేయమనే అన్యాయపు ఆదేశాలు ఎక్కడా ఇవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *