ముస్లిం – జీవితకాల ఉపవాసి

రమజాన్ ‘ఘనంగా వీడ్కోలు’ పలకాల్సిన నెలా? లేక ‘ఘనంగా ఆహ్వానం పలకాల్సిన’ నెలా? రమజాన్ నెల ఉపవాసాలైపోగానే చాలా మంది ఘనంగా వీడ్కోలు పలికేస్తుంటారు. రమజాన్ నెలలో ఉపవాసాలు నేర్దేశించబడింది ఆ నెలను ఘనంగా వీడ్కోలు పలికేసి తిరిగి సాధారణ జీవితంలో మునిగిపోవటానికి కాదు… రమజాన్ తరువాత కూడా ప్రతీ ముస్లిం తన జీవితకాలం ఉపవాసి మాదిరిగా ఉత్తమ నైతిక విలువలతో జీవితం కొనసాగించాలి. అదే రమజాన్ నెల నిర్దేశించబడటంలోని లక్ష్యం

అసలు ముస్లిం అంటే ఎలా ఉంటాడు? ఎలాంటి ఆచరణ కలిగి ఉంటాడు? అన్నది తెలియజేసే, శిక్షణ ఇచ్చే నెలే రమజాన్ మాసం. కాబట్టి ఎలా అయితే రమజాన్ నెలంతా నిష్ఠతో పరిశుద్ధ నైతిక జీవితం గడుపుతాడో అదే విధంగా జీవితాంతం ఉపవాసి లాంటి నైతిక విలువలతో కూడిన జీవితం గడిపేవాడే ముస్లిం అంటే.

………………………….

“ఉపవాసికి సంతోషం లభించే రెండు సందర్భాలున్నాయి. ఒకటి అతను ఉపవాసం విరమణ (ఇఫ్తార్) చేసినప్పుడు, రెండు- ప్రళయదినాన అతని ఉపవాసానికి బహుమానంగా తన ప్రభువును కలుసుకున్నప్పుడు” – ప్రవక్త ముహమ్మద్ (స) [సహీహ్ ముస్లిమ్ 1151]

ఈ హదీస్ ను బట్టి ‘ఉపవాసం’ మరియు ‘ఇఫ్తార్’ అనే రెండు సందర్భాలు అతి ప్రాముఖ్యమైన విషయాలను సూచిస్తున్నాయి. మొదటిది- ‘ఉపవాస సమయం (Fasting period)’ మనిషి పూర్తి జీవితాన్ని సూచిస్తే… రెండవది- ఇఫ్తార్ సమయం (Iftar Period) అన్నది పరలోకంలో లభించే ‘బహుమానాన్ని’ సూచిస్తుంది.

ఎలా అయితే ఒక విశ్వాసి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేసినప్పుడు ఎలాంటి గొప్ప ఆనందానుభూతి పొందుతాడో అలాగే… మనిషి రమజాన్ నెలలో ఉపవాసం తాలూకు ‘నిష్ఠ’తో మిగతా నెలల్లోనూ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపి పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందినప్పుడు సరిగ్గా అలాంటి ఆనందానుభూతినే పొందుతాడు. అందుకే పై హదీసులో ‘ఉపవాసికి రెండు సంతోషకర సందర్భాలున్నాయ’ని చెప్పటం జరిగింది

………………………….

ఒక ప్రక్క ప్రపంచంలో సృష్టికర్త అయిన దేవుడు మనిషి కోరికలకు తగ్గట్టు సకల ఏర్పాట్లూ చేసీ … మరో ప్రక్క మనిషికి మంచీ-చెడులలో వేటినైనా ఎన్నుకునే స్వేచ్ఛ (Free will and freedom of choice) ను ఇచ్చాడు. ఈ విధమైన ప్రపంచంలో ప్రతీ విశ్వాసీ ఒక ‘ఉపవాసి’ మాదిరిగా జీవితం గడుపుతాడా? లేదా? అన్నదే దేవుడు మనిషికి పెట్టిన పరీక్ష

‘ఉపవాసి’గా జీవితం గడపటం అంటే:-

చెడు పనులపై ఉపవాసం ఉండటం…
చెడు ఆలోచనలపై ఉపవాసం ఉండటం…
అతని విపరీత కోరికలపై ఉపవాసం ఉండటం…
తనకు ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగపరచటం నుండి ఉపవాసం ఉండటం…

మరొక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (స) – “ఉపవాస స్థితిలో ఉండగా ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే.. నేను ఉపవాసంలో ఉన్నాను అని చెప్పండి” అని చెబుతారు. దీనిని బట్టి ఉపవాసం అంటే- ఒక ముస్లిం కేవలం భోజన పానీయాల నుండి తన్నుతాను దూరంగా పెట్టటం మాత్రమే కాదు…

ఇతరుల పట్ల ప్రతికూలంగా ఆలోచించకపోవటం ఉపవాసం…
ఇతరులను దూషించకపోవటం ఉపవాసం…
ఇతరుల పట్ల చెడు ఆలోచించకపోవటం ఉపవాసం…

ఈ విధంగా రమజాన్ ఉపవాసాల నెల అన్నది మనిషి పూర్తి జీవితాన్ని నైతికంగా నియంత్రించే శిక్షణా కాలం (Training period) లాంటిది.

కాబట్టి ఉపవాసం అన్నది ప్రతీ సంవత్సరానికోసారి వచ్చి ఈ ప్రపంచం ఎలాంటిది? ఎలాంటి ప్రపంచంలో మీరు ఉన్నారు? అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో సకల చెడుల నుండి తన్ను తాను నియంత్రించుకుంటూ జీవితం ఎలా గడపాలో నేర్పి వెళుతూ ఉంటుంది.

కాబట్టి రంజాన్ అన్నది ఒక విశ్వాసిని భౌతికంగా అన్న పానీయాలకు దూరంగా ఉంచటంతో పాటు చెడు విషయాల నుండి కూడా దూరంగా ఉంచి అతనికి నైతికంగా జీవించటానికి ప్రత్యేక శిక్షణ (Training) ఇచ్చే నెల అయితే… ఆ శిక్షణను పొంది రాబోయే నెలల్లో ప్రతీ చెడు నుండి దూరంగా ఉంటూ జీవిత కాల ఉపవాసి మాదిరిగా అతను మారిపోవాలి.

రమజాన్ నెలలో అన్నపానీయాలతో పాటు చెడు ఆలోచనలు, చెడు పనులకు ఎలా అయితే దూరంగా ఉంటాడో మిగతా నెలల్లో ఆహారపానీయాలు సేవిస్తూ ఉన్నప్పటీ చెడు ఆలోచనలు, చెడు పనులను దూరంగా ఉంచే ప్రక్రియను మటుకు జీవిత కాలం కొనసాగించాలి.

కాబట్టి ముస్లిం అంటే కేవలం ఒక్క రమజాన్ నెల ఉపవాసిగా ఉండే వ్యక్తి కాదు కానీ, జీవిత కాల ఉపవాసిగా మారి ఉత్తమ నైతిక విలువలతో కూడిన జీవితం గడపే వ్యక్తే ముస్లిం అంటే. అలాంటి ఆచరణ లేనప్పుడు అతను రమజాన్ నెలలో ఉండే ఉపవాసాలకు అర్థం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *