అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీ వస్తువూ జంటలుగా సృష్టించబడిన ఈ సమస్త సృష్టిలో.. ఒక విశ్వాసి కలిగి ఉండే ‘విశ్వాసం’ సైతం “ఆచరణ” – “ప్రచురణ” అన్న జంట ప్రక్రియల ద్వారానే పరిపూర్ణమవుతుంది.
వివరంగా చెప్పాలంటే.. “ఒక వ్యక్తి ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడని విశ్వసించి ఆయనను మాత్రమే ఆరాధిస్తూ, ఆయన నిర్దేశించిన విధి-నిషేధాలను పాటిస్తూ జీవితం గడపటం వలన ఇహ-పరలోకాలలో శాంతి సౌఖ్యాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని కలిగి ఉంటూ దైవారాధన చేస్తూ భయభక్తులతో జీవితం గడపటం అన్నది అతని వ్యక్తిగత “ఆచరణ” అవుతుంది.
కానీ, అదే విశ్వాసాన్ని అతను కలిగి ఉంటూనే.. ప్రజలలో ఉన్న అపార్థాలను తొలగిస్తూ ఇతరులను సైతం ఆ విశ్వాసంపై నడిచేవారిగా మార్చటానికి ప్రయత్నించటం “ప్రచురణ” అవుతుంది. కాబట్టి కేవలం వ్యక్తిగతంగా సంస్కరించుకుని “ఆచరణ”మాత్రమే చేస్తూ “ప్రచురణ” చెయ్యకపోయినా.. కేవలం “ప్రచురణ” మాత్రమే చేస్తూ “ఆచరణ” గాలికి వదిలేసినా ఒక విశ్వాసి తాలూకు విశ్వాసం పరిపూర్ణం కాదు. ఎందుకంటే ఇస్లాం, ముస్లిం సమాజంపై “వ్యక్తిగత సంస్కరణ”-“సామాజిక సంస్కరణ” అన్న ఈ రెండు బాధ్యతలనూ మోపుతుంది. అసలు ముందుగా ముస్లిం సమాజ నియామక లక్ష్యం ఏమిటన్నది గమనిస్తే..
“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110
దీనిని బట్టి ముస్లిం సమాజ నియామక మౌలిక లక్ష్యమే “సమాజ సంస్కరణ” అని అర్థమవుతుంది. అంటే ముస్లిం సమాజ మౌలిక లక్ష్యం- తమను తాము సంస్కరించుకుంటూ.. భౌతిక జీవనంలో తమ తమ ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు చేసుకుంటూనే ఇస్లాం అవగాహన పూర్తిగా లేని ముస్లిములను, తమ పరిసరాల్లో నివసించే, తమ పొరుగున ఉండే ముస్లిమేతరులను ధార్మిక సందేశాన్ని అన్ని విధాలుగా అందజేస్తూ సంస్కరిస్తూ ఉండటం అన్న మాట.
అయితే నిజానికి ఈ పని చెయ్యటం చెప్పుకున్నంత సులువు కాదు. ఎందుకంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా “ఆచరణ” చెయ్యటం సులువైన పనే.. కానీ, ప్రజలలో ఉన్న అపార్థాలను తొలగిస్తూ వారిని సంస్కరించి నిజ దైవ విశ్వాసులుగా మార్చటానికి ఉన్నత వ్యక్తిత్వం, అచంచలమైన ‘దైవభక్తి’ ‘లోతైన పరిశీలన’ ‘ఆలోచనా శక్తి’ ‘విషయపరిజ్ఞానం’ ‘సహనం’ చక్కగా మాట్లాడగలిగే, రాయగలిగే ‘ప్రావీణ్యతలు’ వగైరా వాటిని పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
ముస్లిం సమాజంపై ఉన్న ఈ సామూహిక బాధ్యతను వారు నిర్వర్తించాలంటే.. ముందుగా ముస్లిం సమాజంలో ప్రతీ ముస్లిం బలమైన విశ్వాసిగా, దైవభక్తి పారాయుణుడిగా, సహాన స్థైర్యాలు కల వ్యక్తిగా, ఖురాన్ అవగాహనపరుడిగా తయారు కావలసి ఉంటుంది. దానికి గానూ కావలసిన ప్రత్యేక శిక్షణనిచ్చే నెలే రమజాన్.
అసలు రమజాన్ నెలంతా ఉపవాసం పాటించమనటం వెనుక ఉన్న మౌలిక లక్ష్యమే- “భయభక్తులు జనించటానికి (2:183)” అన్నది. ఉపవాసంలో ఉన్నంత సమయంలోనూ ఒక విశ్వాసి ఏదీ తినకుండా, త్రాగకుండా గడుపుతాడు. కావాలంటే అతను రహస్యంగా తినవచ్చు కానీ, సృష్టికర్త అయిన దేవుడు తనను గమనిస్తున్నాడన్న ఆలోచన అతని నోటి ద్వారా ఏదీ అతని ఉదరంలోకి దిగనివ్వదు. రహస్యంగా అతను ఇతరుల గురించి చెడుగా ఆలోచన చెయ్యవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడు హృదయాలలో మెదిలే రహాస్యాలను సైతం గమనిస్తున్నాడన్న ఆలోచన అతని మనస్సులోకి ఏ చెడు ఆలోచనకూ చోటివ్వనివ్వదు. చెడు చూపులు చూసే అవకాశం రావచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు తన చూపులను సైతం గమనిస్తున్నాడన్న ఆలోచన అతని చూపులను మార్గం తప్పనివ్వదు. కోపంలో సహనం కోల్పోయి ఇతరులను తిట్టే సందర్భం ఏర్పడవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడు తన నోటి మాటలను సైతం గమనిస్తున్నాడన్న ఆలోచన అతని నోటిని అదుపులో ఉంచి అతన్నో సహనశీలునిగా తయారు చేస్తుంది. ఈ గుణగణాలన్నిటిని రమజాన్ నెలలో ఆచరణాత్మకంగా శిక్షణ పొంది ఆ నెలవరకే పరిమితమవ్వటానికి కాదు మిగతా పదకొండు నెలల్లోనూ అవి ప్రతిబింబించాలి.
ఈ విధంగా రమజాన్ నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెలంతా ఉపవాసముండే ప్రతీ వ్యక్తినీ దైవభక్తి పారాయుణుడిగా, సహనశీలునిగా, ఉన్నత నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వం కల విశ్వాసిగా తయారు చెయ్యటమే. ఈ విషయం అర్థం కావాలంటే ఖురాన్ లోతైన పరిజ్ఞానం అవసరం. అందుకే ఈ నెలలో ఖురాన్ ను ఏదో సెంటిమెంటల్ గా కాకుండా అర్థం చేసుకుంటూ ఎక్కువగా చదవమని ఆదేశించటం జరిగింది. కాబట్టి ఉపవాసాల నెలంటే కేవలం పుణ్యం కొద్దీ ‘సహరీ’ ‘ఇఫ్తార్’ ‘తారావీ’లు నిర్వర్తిస్తూ ఏదో సాంప్రదాయక ఆచరణ చేస్తూ గడిపేసే నెల కాదు. ఖురాన్ లోతైన అవగాహన చేసుకుంటూ భయభక్తులను పెంపొందించుకుంటూ, ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే నెల. తాము పెంపొందించుకునే భయభక్తులను, వ్యక్తిత్వాన్ని మిగతా పదకొండు నెలల్లోనూ ఆచరణ చెయ్యటానికి ప్రత్యేక శిక్షణ పొందే నెల.
ఈ విధంగా ముస్లిం సమాజానికి వారి ‘వ్యక్తిగత సంస్కరణ’ కోసం సంవత్సరంలో ఒక నెల అయిన రమజాన్ ప్రత్యేకించబడటంలో ప్రధాన లక్ష్యం.. ముస్లిం సమాజంలో ప్రతీ ఒక్కరినీ ఉన్నత నైతిక విలువలు కలిగిన వ్యక్తులుగా మార్చటమే కాక వారికివ్వబడిన సామూహిక బాధ్యత అయిన ‘సామాజిక సంస్కరణ’ను సైతం పరిపూర్ణంగా నిర్వర్తించటానికే.
వ్యక్తిగతంగా తమను తాము సంస్కరించుకుని “ఆచరణ” చేస్తూ.. సామాజిక సంస్కరణ కోసం దైవ సందేశాన్ని “ప్రచురణ” చేసేవారు తప్ప మిగతావారందరూ నష్టానికి గురై ఉన్నారన్న విషయాన్ని ఖురానే ఈ క్రింది విధంగా తెలుపుతుంది.
“నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహాన బోధ చేసుకునేవారు తప్ప” – 103: 1-3
రమజాన్ ప్రధాన లక్ష్యం ఏమిటి
Ramadan food, dried dates 