ఉపవాస లక్ష్యం- నైతిక విలువలు అలవర్చుకోవటమే

ధర్మం ఆదేశించే ఆజ్ఞలు, ఆదేశాలు, దృక్పథాలు, క్రతువులలో సామాజిక, భౌతిక ప్రయోజనాలతో పాటు మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు “లంఖణం (ఉపవాసం) పరమౌషధం” అని అటు ప్రాచీన వైద్య శాస్త్రం తెలియజేయటమే కాక ఆధునిక సైన్స్ సైతం ఉపవాసానికి మించిన మందు లేదని కేన్సర్ లాంటి రోగాలను సైతం నివారిస్తుందని పరిశోధించి చెప్పటం జరుగుతుంది. ఇది ఉపవాసం తాలూకు భౌతిక కోణమైతే.. ధర్మంలో ఉపవాసం అసలు లక్ష్యం “భయభక్తులు జనింపజేయటం” అన్నది.

మనిషి స్వభావంలోనే దేవుడు మంచీ-చెడుల స్పృహ అంతర్లీనంగా పెట్టినప్పటికీ.. మనిషి తనలో మెదిలే చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ, మంచి ఆలోచనల ప్రకారం ఎలా జీవనం సాగించాలి? అన్న ప్రక్రియను నేర్పటానికే సృష్టికర్త అయిన దేవుడు ధార్మిక గ్రంధాలను అవతరింపజేయటం జరిగింది. ఈ ప్రక్రియను ఆచరణాత్మకంగా తర్ఫీదునివ్వటానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడిందే రమజాన్ మాసం.

స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు ఇష్టపడే ఈ క్రింది ఏడు గుణాలను అలవర్చుకోవటం ద్వారా మనిషిలో ఉత్తమ నైతిక విలువలు పెంపొందించబడతాయి. అలాంటి నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఆచణాత్మకంగా నిర్మించుకోవటానికే ఉపవాసాలు విధించటం జరిగింది.

1. పశ్చాత్తాపం.
“నిశ్చయంగా దేవుడు పశ్చాత్తాపం పడే వారిని ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 2 : 222

2. పరిశుభ్రత
“దేవుడు పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 2 : 222

3. భయభక్తులు.
“నిశ్చయంగా దేవుడు భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు”- ఖుర్ఆన్ 9 : 4

4. సదాచరణ
“దేవుడు ఇలాంటి సదాచర సంపన్నులనే ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 3 : 134

5. దేవునిపై_నమ్మకం:
“నిశ్చయంగా దేవుడు తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 3 : 159

6. న్యాయం:
“నిస్సందేహంగా దేవుడు న్యాయశీలురను ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 5 : 42

“నిశ్చయంగా సమభావంతో వ్యవహరించే వారిని దేవుడు ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 49 : 9

7. సహనం:
“దేవుడు సహనం వహించే వారిని ప్రేమిస్తాడు”- ఖుర్ఆన్ 3 : 146

సృష్టికర్త అయిన దేవుడు ఇష్టపడే, ప్రేమించే పై ఏడు గుణాలను పెంపొందించుకుని వాటి ప్రకారం మనిషి ఎలా జీవితం గడపాలి అన్నది ఆచరణాత్మకంగా అతనికి శిక్షణ ఇవ్వటానికే రమజాను మాసంలో ఉపవాసాలను విధించటం జరిగింది.

“ఉపవాస లక్ష్యం అన్న పానీయాలు విడనాడటం కాదు, అబద్ధాన్ని విడనాడటం చెడు పనులు చెయ్యకపోవటం దుర్భాషలాడకపోవటం” – ప్రవక్త ముహమ్మద్ (స)

పై ఆదేశాన్ని బట్టి ఉపవాసం ఉండే వ్యక్తి ఉత్తమ నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోకుండా కేవలం అన్న పానీయాలు మానేసి ఎంత నిష్టగా ఉపవాసాలు పాటించినప్పటికీ.. దేవుని దృష్టిలో కేవలం పస్తులుండటంతో సమానం అవుతుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) మరొక హదీసులో ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు..

“ఉపవాస వ్రతం పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకటాన్ని, చెడు పనులు చెయ్యటాన్ని మానివెయ్యని వ్యక్తి ఆకలి దప్పులతో పడి ఉండటం అల్లాహ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *