ముస్లిం సమాజం & ఉర్దూ ప్రసంగాలు

మన భావాలు మాట రూపంలో ఎదుటివారికి అర్థమవ్వటానికి మనం వాడే మాద్యమమే భాష. అది మనకు వచ్చింది మాత్రమే అయ్యుండకూడదు మనం మాట్లాడాలనుకునే భాష ఎదుటి వ్యక్తికి కూడా వచ్చి ఉండాలి. మనం మాట్లాడినా, ప్రసంగించినా, రాసినా అది ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలన్నది కనీస మౌలిక సూత్రం. అలాకాక స్వంత భాషలో మాట్లాడటాన్నే సెంటిమెంటుగా ఫీలవటం స్వంత భాషను గొప్పగా భావించి ఇతర భాషలను చులకనగా చూడటం, ఇతర భాషల్లో మాట్లాడటాన్ని చిన్నతనంగా భావించటం మూర్ఖత్వమే కాదు అనాగరికత కూడా అవుతుంది.

భారతదేశంలో అనేక మతవర్గాలు ప్రత్యేక భాషలను కలిగి ఉన్నట్టే ఈ దేశపు ముస్లిముల ప్రధాన వాడుక భాష ఉర్దూ! అయితే ఉర్దూను వ్యవహారిక భాషగా కలిగి ఉండటం, ఉర్దూ పట్ల ప్రత్యేక భాషాభిమానం కలిగి ఉండటంలో తప్పు లేదు గానీ.. అదేదో దేవదూతల తాలూకు పరిశుద్ధ భాషగా ఫీలవటం, ఉర్దూలో ప్రసంగిస్తేనే దానికి పరిశుద్ధత చేకూరుతుందని భావించటం.. అంతెందుకు ఉర్దూ మాట్లాడటం చేతనైతేనే ముస్లింగా పరిగణించబడతాడని భావించటం ఉత్త అమాయకత్వంతో కూడిన అజ్ఞానమే అవుతుంది.

తెలుగు మాట్లాడే ముస్లిముల్ని దూదేకులు అని నామకరణం చేసి వారిని చులకనగా చూసే.. కొత్తగా ఇస్లాం స్వీకరించి ఉర్దూ మాట్లాడటం రానివారిని హీనంగా అంచనా వేసే.. తెలుగులో మాట్లాడటాన్ని చిన్నతనంగా భావించే కొందరు ప్రబుద్ధులకు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం కొదవలేదు. ఇది నిజంగా బాధాకరమైన విషయం.

మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే.. ప్రతీ ఊళ్లోనూ అక్కడి ప్రాంతీయ ముస్లిములు పాపం ఎంతో కష్టపడి, ఊళ్లు తిరిగి చందాలు వసూలు చేసి లక్షలు ఖర్చుపెట్టి మసీదులు కడుతుంటారు. కానీ, అంత నానా యాతనలు పడి మసీదులు కట్టాక అందులో నుండి వెలువడే ప్రసంగాల విషయంలో ఎందుకు జాగ్రత్త వహించరో అర్థం కాని విషయమే.

పైగా ఎన్నో నగరాల్లో గ్రామాల్లో మసీదులు సైతం ఎంతో చక్కగా ఇళ్ల కాలనీల మధ్య, ప్రధాన కూడళ్లలో, షాపింగ్ కాంప్లెక్షుల మధ్య నిర్మించబడి ఉంటాయి. ఒక్క శుక్రవారం రోజే తెలుగు రాష్ట్రాల మసీదుల్లో గుమిగూడే ముస్లిములు లక్షల్లో ఉంటారు. శుక్రవారంతో పాటు ఎన్నో చక్కటి ప్రసంగాలు భారీ శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్లలో ఎంతో దూరం వినపడుతుంటాయి. ఆయా ప్రసంగాలను ఆయా మసీదుల చుట్టుప్రక్కల కాలనీల్లో, వీధుల్లో ఉన్నోళ్లు, మసీదుల చుట్టూ ఉన్న షాపింగ్ కాంప్లెక్షుల్లో ఉన్నోళ్లు కూడా వింటుంటారు. నిజానికి ఇస్లాం సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లటానికి అదొక బృహత్తర అవకాశం. కానీ ఏమి లాభం? ఆయా మసీదుల నుండి వెలువడే ప్రసంగాలన్నీ ఉర్దూలో జరుగుతుంటాయి. శ్రోతలేమో తెలుగు ప్రజలు వారికి ఆ ఉర్దూ అసలు అర్థం కాదన్నది ప్రక్కన పెడితే .. చివరకు ఆ మసీదులో కూర్చునే చాలా మంది ముస్లిములకు సైతం అక్కడ జరిగే ఉర్దూ ప్రసంగాలు పూర్తిగా అర్థం కాని పరిస్థితి.
ఎందుకంటే వారు మాట్లాడుకునే సాధారణ వ్యవహారిక ఉర్దూ భాషకూ, మసీదుల్లో ఇమాములు వాడే గ్రాంధిక ఉర్దూ భాషకూ చాలా తేడా ఉంటుంది.

అలాగని అన్ని మసీదుల పరిస్థితి ఇలానే ఉందనేది నా ఉద్దేశం కాదు. కానీ దాదాపు అధిక శాతం మసీదుల పరిస్థితి ఇలానే ఉందనేది మటుకు ఒప్పుకుతిరాల్సిన విషయం.
అయినప్పటికీ ఆయా మసీదుల్లో ఉర్దూ ప్రసంగం వింటేనే పుణ్యకార్యంగా భావించే ముస్లిములు.. ఉర్దూ భాషలో చెబితేనే దానికి పరిశుద్దత చేకూరుతుందనే ఇమాముల మేలి కలయికతో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో మసీదుల్లో సాగే ప్రసంగాలన్నీ యాంత్రికంగా సాగిపోతుంటాయి. వారు చెప్పే ఉర్దూ ప్రసంగాలు అర్థం కాని ప్రజల మధ్య అవి ఎడారిలో పొలికేకల్లా మిగిలిపోతుంటాయి.

చిత్రం ఏమిటంటే ఉర్దూ భాష 12 వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పురుడుపోసుకుంది. అరబీ, పెర్షియన్, తుర్కిష్ భాషల ప్రభావంతో రూపుదిద్దుకుంది.
* * *
ఇక ఇస్లాం ధర్మం రెండు విషయాల మేలికలయిక. వాటిలో.. ఒకటి- ‘దైవ హక్కులు’ రెండు- మానవహక్కులు’. మసీదులలో వ్యక్తిగత ఆరాధనలు చేసుకోవటం అన్నది దైవ హక్కులు నిర్వర్తించటమైతే.. దైవ సందేశాన్ని ప్రజలకు చేరవేసి వారి ఇహ-పర లోకాల సాఫల్యానికి మార్గం సుగమం చెయ్యటానికి ప్రయత్నించటం మానవహక్కులు నిర్వర్తించటంలో భాగం అవుతుంది.

“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ఖురాన్ 3:110)” అన్న ఖురాన్ ఆదేశాన్ని బట్టి ముస్లిం సమాజ నియామక లక్ష్యమే- దైవసందేశాన్ని ప్రజలవద్దకు చేరవేసి వారి ఇహ-పర లోకాల సాఫల్యాన్ని కలగజేసే బాధ్యత కలిగి ఉన్నారని తెలుస్తుంది.

ఈ బాధ్యతను గతంలో దేవుడు ప్రవక్తలకు ఇస్తూ వచ్చాడు. వారు అనేక దేశాలకూ, ప్రాంతాలకు పంపబడ్డారు. పైగా ఆయా ప్రవక్తలను పంపినప్పుడు అల్లాహ్ అవలంబించిన విధానం ఏమిటో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో గమనించగలరు.

“మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా, అతను తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు” – 14:4

అంటే పై వాక్యాన్ని బట్టి ఒకవేళ భారతదేశంలో పంపబడ్డ ప్రవక్తలు అప్పటికి వైదిక భాష ఉంటే వైదిక భాషలోనే మాట్లాడి ఉండాలి. ఒకవేళ అప్పటి ప్రజలు తమిళంలోనో, మలయాళంలోనో, తెలుగులోనో మాట్లాడేవారై ఉండి ఉంటే ఆయా భాషల్లోనే మాట్లాడి ఉండి ఉండేవారనే కదా! అలాంటప్పుడు ఆ బాధ్యత మోపబడిన ముస్లిములు ఏ భాషలో దైవసందేశాన్ని అందజేయాలి? తమకు నచ్చే ఉర్దూలోనా? లేక తమ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుకునే భాషల్లోనా?
“అబ్బే నాకీ తెలుగు నహీ ఆతాహై” అని చిలకపలుకులు పలికి తప్పించుకుంటే అవ్వదు! ప్రతీ ముస్లిం ముఖ్యంగా దాయిలు (సందేశ దాతలు) ప్రాంతీయ భాషలపై, సాహిత్యంపై పట్టు పెంపొందించుకోవాలి. అజాన్, నమాజ్ వగైరా ఆరాధనలు అరబ్బీలోనే నిర్ధారించబడి ఉంటాయి వాటిని మార్చే హక్కు లేదు కనుక తాము చెప్పే ప్రసంగాలు, రాసే వ్యాసాలు ప్రజలు మాట్లాడుకునే భాషల్లో వారికి అర్థమయ్యేలా, చదవగలిగేలా ఉండాలి.

మసీదుల్లో ప్రజలకు అర్థమయ్యేలా తెలుగు ప్రసంగాలు మాట్లాడే ఇమాములను, ప్రసంగీకులను ఏర్పాటు చెయ్యాలి. తెలుగు రాష్ట్రాల్లో మదర్శాల్లో తెలుగు ప్రసంగాలు ఇవ్వటాన్ని భాగం చెయ్యాలి. తెలుగు సాహిత్యాన్ని నేర్పాలి. ఖురాన్ ను అచ్చ తెలుగులో అవగతపరిచే తర్ఫీదునివ్వాలి. తద్వారా ఇస్లాం సందేశం ఇక్కడి ప్రాంతీయ ప్రజలకు చేరటం శులభతరం అవుతుంది. ఎక్కడో ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి ఇమాములను దిగుమతి చేసుకుని ముస్లిమేతరులకూ, ముస్లిములకు కూడా అర్థంకాని వారి గ్రాంధిక ఉర్దూ భాషా ప్రసంగాల వల్ల ఎవరికీ కించిత్తు లాభం ఉండదు. వారి ప్రసంగాలు వారి ప్రాంతాల్లో ఎంత అవసరమో ఇక్కడ వారి ప్రసంగాలు అంత అనవసరం.

ఈనాడు ఇస్లాం విమర్శకులను ప్రక్కన పెడితే.. సామాన్య ముస్లిమేతరుల్లో ఇస్లాం పట్ల, ముస్లిముల పట్ల అనేక అపార్థాలు ఏర్పడిపోయి ఉన్నాయంటే.. మరీ ముఖ్యంగా బురఖా, జిహాద్, తలాక్, సున్నతి వగైరా చిన్న చిన్న అంశాల్లో సైతం నేడు అనేక అపార్థాలు ఏర్పడిపోయి ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? వారికి అర్థమయ్యే భాషలో ఇస్లాంను అవగాహన పరచని ముస్లిములది కాదా? వారు అర్థం చేసుకుంటారా? లేదా అన్నది ప్రక్కన పెడితే వారికి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ముస్లిములది కదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *