విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాల కలయికే ధర్మం. కాబట్టే ఇస్లాం తోటి వ్యక్తులతో నడిపే వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడటం అంటే ముఖం చిట్లించుకుని గర్వంతో మాట్లాడటం. ఒక వ్యక్తి మనసులో ఎంతో అహంకారం, గర్వం, పొగరు ఉంటే గానీ అలా మాట్లాడటం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తుల్ని సృష్టికర్త అయిన దేవుడే ఇష్ట పడడు.
“సర్వేశ్వరుడైన దేవుడు ఇష్టపడే నిజమైన దాసులు ఎవరంటే నేలపై అణకువతో నడిచేవారు” -25:63 అని ఖురాన్ మరొక చోట చెబుతుంది.
ప్రవక్త ముహమ్మద్ వారైతే… “అహంకారం అన్న బీజం హృదయంలో కలిగి ఉన్నవారు స్వర్గంలో ప్రవేశించలేరు (సహిహ్ ముస్లిం 91)” అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని సార్లు మక్కా తీర్థయాత్రలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఆరాధనలు చేసినా ప్రజలతో గర్వంతో మాట్లాడుతూ, అహంకారంతో భూమిపై విర్రవీగుతూ నడిస్తే అలాంటి వ్యక్తి ఆరాధనలు ఎందుకూ పనికి రాకుండాపోతాయి.
“భూమిపై విర్రవీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చనూ లేరు, పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు” – 17:37 అని ఖురాన్ మరొక చోట హెచ్చరిస్తుంది. అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత ఆర్థిక బలం, అధికార బలం ఉన్నప్పటికీ వాటన్నిటినీ చూసుకుని విర్రవీగుతూ నిక్కుతూ నడవకూడదు.
మనిషి ఎదగాలనుకున్నప్పుడు పట్టుదల ఉండాలి, ఎదిగే క్రమంలో అణకువ ఉండాలి, ఎదిగాక తగ్గి ఉండాలి. కానీ అన్ని విధాలా పైకి ఎదిగాక గర్వపడితే తిరిగి నాశనం అవ్వటానికి ఎంతో కాలం పట్టదు. అందుకే నాశనానికి ముందు గర్వం ఉంటుందన్న ఓ సామెత కూడా ఉంది.
“ప్రజలతో మర్యాదగా మాట్లాడండి” “నేలపై అణకువతో నడవండి” “భూమిపై విర్రవీగుతూ నడవకండి” “ప్రజలతో ముఖం చిట్లించుకుని గర్వంతో మాట్లాడకండి” అంటూ ఖురాన్ ఇస్తున్న ఆదేశాలను బట్టి ఇస్లాం ఒక వ్యక్తిలో ఎలాంటి సానుకూలమైన ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించాలనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
