ఇస్లాం కేవలం మంచి పనులు చెయ్యండి అని మాత్రమే చెప్పటం లేదు మంచి పనులు చేసే విషయంలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించ మంటుంది. అంటే ఇతరులు మంచి పనులు చేస్తుంటే ఈర్ష్య (Jealous) పడేకంటే, వారికంటే ఎక్కువగా మంచి పనులు చేసే విషయంలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించాలి.
ఖురాన్ లో అనేక చోట్ల సృష్టికర్త అయిన దేవుడు “విశ్వసించే వారు సాఫల్యం పొందుతారు” అని కాక, “విశ్వసించి మంచి పనులు చేసే వారు సాఫల్యం పొందుతారు” అని చెప్పినట్టు చూడగలం.
అసలు ముస్లిం సమాజంపై ఖురాన్ మోపిన బాధ్యతే “మీరు మంచి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు (3:110)” అన్నది.
తోటి వ్యక్తులతో ప్రేమగా మాట్లాడటం, అణుకువ కలిగి నడవటం, కలిమిలోనూ లేమిలోనూ ప్రజలను ఆదుకోటానికి ఖర్చుపెట్టటం, ఆకలితో ఉన్నవారికి అన్న పెట్టటం, బీదవారిని అవసరార్థులను ఆదుకోవటం వగైరా వన్నీ మంచి పనులే. పైగా ఇలాంటి మంచి పనులు చేసే విషయంలో ఇస్లాం “మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి” అని ఆదేశిస్తుంది.
దైవాన్ని విశ్వసించి, మంచి మనులు చేసేవారికి ఖురాన్ ఒక వాగ్దానం చేస్తుంది. అదేమిటంటే, ఒకటి వారికి భూమిపై నాయకత్వం ప్రసాదించబడుతుంది, రెండు వారి భయ స్థితిని శాంతి భద్రతలతో కూడిన స్థితిగా మార్చబడుతుంది (24:55). “మంచి పనులు చేసేవారికి ఏ విధమైన భయం కానీ, విచారం గానీ కలిగే అవకాశం లేదు (2:62)” అంటుంది ఖురాన్.
పైగా ప్రవక్త ముహమ్మద్ ఉపవాసం దీక్ష పాటించే లక్ష్యం- అన్నపానీయాలు విడనాడటం కాదు, అబద్ధాన్ని విడనాడటం, చెడు పనులు చెయ్యకపోవటం, దుర్భాషలాడకపోవటం” అని చెప్పటం జరిగింది. కాబట్టి పైకి ఎంతగా భక్తి శ్రద్ధలతో జీవితం గడుపుతున్నప్పటికీ, ఆరాధనలూ, ఉపవాసాలు నిష్ఠగా పాటిస్తున్నప్పటీ మంచి పనులు చెయ్యనప్పుడు వారి ఆరాధనలు ఎందుకూ పనికిరావు. కాబట్టే చెడు చెయ్యటం మాని, మంచి పనులు చేసే విషయంలో ఇతరులతో పోటీ పడాలని ఇస్లాం ఆదేశిస్తుంది.
