పొరుగువారితో ఉదార బుద్ధితో వ్యవహరించాలి

మిత్రులు, పొరుగున ఉన్న బంధువులతోనే కాదు అపరిచితులైన పొరుగువారు అంటే వారు ఏ మతానికి, కులానికి చెందినవారైనా, వారితో మనకు ముందెన్నడూ పరిచయం లేకపోయినా సరే, వారితో ఉదార బుద్ధితో వ్యవహరించాలన్నది ఇస్లాం నేర్పే నైతిక విలువల్లో అతి పెద్ద అంశం.

అంతేకాదు, బాటసారులతో, చివరకు దాస దాసీ జనంతో సైతం ఉచ్చ నీచ భావాలు ప్రదర్శించకుండా ఉదార బుద్ధితో వ్యవహరించాలన్నది ఇస్లాం ఆదేశం.

పొరుగు వాడు ఆకలితో ఉండగా తాను మాత్రం కడుపు నిండా భుజించేవాడు విశ్వాసే కాదన్నారు ప్రవక్త ముహమ్మద్. ఒకానొక హదీసులో ప్రవక్త ముహమ్మద్- “పొరుగున ఉన్న వారితో మంచిగా వ్యవహరించే విషయంలో నా వద్దకు వచ్చే జీబ్రీల్ దూత ఎంతగా వారించటం జరిగేదంటే, నా పొరుగున ఉన్నవారిని బహుశా నా వారసులుగా ప్రకటిస్తారేమో అన్న సందేహం కలిగేది నాకు (సహీహ్ బుఖారి 6015)” అని చెప్పటం జరిగింది.   

“మీరు ఇంట్లో కూర వండుకున్నప్పుడల్లా కాస్త మీ పొరుగున ఉన్న వారిని కూడా గుర్తుంచుకోండి, ఆ కూరలో కాస్త నీళ్లు ఎక్కువ పోసి వండి, మీ పొరుగున ఉన్నవారిని మర్యాదతో పంచండి (ముస్లిం, బిర్ 143)” అని ప్రవక్త ముహమ్మద్  వారే చెప్పటాన్ని బట్టి ఇస్లాం పొరుగువారితో ఎంత సఖ్యతతో వ్యవహరించమంటుందో అర్ధం చేసుకోవచ్చు.

“బంధువుల హక్కులను నెరవేర్చండి (16:90) అని ఆదేశించటమే కాక, బంధుత్వ సంబంధాలను తెంచటం మానుకోండి (4:1) అని హెచ్చరిస్తుంది ఖురాన్. ఇంకా కలిపి ఉంచాల్సిన సంబంధాలను తెంచుకునేవారు దేవుని శాపానికి అర్హులు (13:25) అని కూడా చెబుతుంది ఖురాన్.      ముఖ్యంగా ఇస్లాంను అనుసరించే ముస్లిం సమాజం నా ఇల్లూ, నా కుటుంబం అన్నంత వరకే కాక, బంధువులు, ఇరుగుపొరుగువారిని సైతం కలుపుకుంటూ పోవాలి. ఇరుగుపొరుగువారితో సంబంధం లేనట్టుగా  వ్యవహరించకుండా, తినే ఆహార పదార్థాలు సైతం వారికి పంచుతూ వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *