తలిదండ్రులను విసుక్కోకండి

ఖురాన్ లో అనేక వాక్యాల్లో “మీరు ఒక్క సర్వేశ్వరుడైన దేవుణ్ణి తప్ప ఎవర్నీ ఆరాధించకూడదు” అని ఆదేశిస్తూనే “మీ తలిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి” అన్న రెండవ ఆదేశాన్ని సైతం కలిపి చెబుతునట్టు గమనించగలం. దీనిని బట్టి తలిదండ్రులతో మంచిగా ప్రవర్తించటాన్ని ఇస్లాం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసుకోవచ్చు.

తలిదండ్రులతో ఎంత మంచి తనంతో ప్రవర్తించాలంటే ఒకవేళ వారిలో ఒకరుగాని, ఇద్దరుగాని ముసలివారై ఉంటే వారిని కనీసం ‘ఛీ’ అని సైతం కసురుకోవద్దని’ చెబుతుంది ఖురాన్.

అంతేకాదు, పైగా “నా తలిదండ్రులపై కరుణజూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు” అంటూ వారి కోసం దైవాన్ని ప్రార్ధించమని ఆదేశించటం జరిగింది.

ప్రవక్త ముహమ్మద్ వారైతే తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని చెప్పారు. తండ్రి స్వర్గానికి ద్వారం వంటి వాడని చెప్పారు.  

కానీ, ఈనాడు తలిదండ్రులకు వారి పిల్లలు ఇస్తున్న ప్రాముఖ్యత ఎలా ఉందంటే ఒక వార్తా పత్రికలో ఈ మధ్య చదివిన వార్త ఏమిటంటే ఒక్క తెలంగాణాలోనే 460 పైగా వృద్ధాశ్రమాలు ఉండగా, తమ ముసలి తలిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందంట! ఈ పరిణామాన్ని చూసి బాల్యం నుండే తలిదండ్రుల ప్రాముఖ్యత నేర్పే ప్రత్యేక సిలబస్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు నిపుణులు సూచించటం సైతం జరిగింది. ఒక్క రాష్ట్ర పరిస్థితి ఇదైనప్పుడు  దేశ వ్యాప్తంగా ఎన్ని వేల వృద్ధాశ్రమాల్లో తలిదండ్రులు బాధ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇస్లాం తలిదండ్రులను గౌరవించటాన్ని, వారి కోసం నిత్యం ప్రార్ధించటాన్ని, వారితో సగౌరవంగా మెలగటాన్ని విధి చేసింది.  కనీసం వారిని చికాకుతో ఛీ అని కూడా విసుక్కోవద్దని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *