మీ సంతానాన్ని హత్య చేయకండి  

ప్రస్తుత సమకాలీన సమాజంలో తమ తలిదండ్రులను నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేసే సంతానంతో పాటు, పేదరికానికి భయపడి తమ సంతానాన్ని చంపేసే తలిదండ్రులకు సైతం కొదవలేదు.  

అందుకే ఇస్లాం ఒకప్రక్క “మీ తలిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి” అని వారి సంతానాన్ని ఆదేశిస్తూనే… తలిదండ్రులకు “పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి” అని సైతం హెచ్చరించటం జరిగింది (ఖురాన్ 6:151). ఈ విధంగా సమాజంలో సమాంతరంగా జరుగుతున్న ఈ రెండు నేరాలనూ ఇస్లాం తీవ్రంగా ఖండిస్తుంది.

“పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి” అని చెప్పటమే కాక, అదే వాక్యంలో “మేము మీకూ ఉపాధినిస్తున్నాము. వారికీ ఉపాధి ఇస్తాము” అని దైవం తరఫున ఒక భరోసా ఇవ్వబడుతుంది.    

పేదరికంలో ఉండేవారు తమ సంతానాన్ని హత్య చెయ్యటానికి రెండవ కారణం- ‘పుట్టింది ఒకవేళ ఆడ పిల్ల అయితే పెద్దయ్యాక లక్షల కొద్దీ కట్న కానుకలు ఇస్తే గానీ పెళ్లవదు’ అన్న ఓ దుర్మార్గపు ఆచారం సమాజంలో వేళ్లూనుకుపోయి ఉండటం వల్ల అత్యధికంగా హత్య చెయ్యబడున్న శిశువుల్లో నేడు ఆడపిల్లలు ఉంటున్నారు. ఈ దుర్మార్గపు విధానం వల్ల ప్రభూత్వాలు సైతం “ఆడ శిశువుల హత్యలకు పాల్పడవద్దని, అది చట్టరీత్యా నేరమని” హాస్పిటళ్లలో బోర్డులు తగిలించే వరకు వచ్చింది.

ఆ విధంగా శిశు హత్యలకు పాల్పడే దుర్మార్గుల గురించి ఖురాన్ ఇలా  ప్రస్తావిస్తుంది: “వారిలో ఎవడికైనా కూతురు పుట్టిందన్న శుభవార్త అందజేస్తే అతడి ముఖంపై నల్లటి ఛాయలు ఆవహిస్తాయి, అవమానంగా భావిస్తూ కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలా లేక ఆమెను మట్టిలో పాతి పెట్టాలా? అని ఆలోచిస్తుంటాడు” – 16:58,59

అందుకే ఖురాన్ “సజీవంగా పాతిపెట్టబడిన బాలికలను నీవు ఏ తప్పు వల్ల హత్య చెయ్యబడ్డావని అడగబడినప్పుడు (81:8-9)” ఆమెను అన్యాయంగా హత్యచేసిన వారు ఘోరంగా శిక్షించబడతారని హెచ్చరించటం జరిగింది.

మీ సంతానం మీకోరకు పరీక్ష (ఖురాన్ 64:15).అని ఖురాన్ చెబుతుంది. అంటే దేవుడు మీకు సంతానం ఇచ్చి వారిని ఏ మార్గంలో పెంచుతారో, ఎంతటి సహనంతో పెంచి పోషిస్తారో, వారి పోషనభారంతో దైవాన్నే మర్చిపోతారో లేదో పరీక్షించి చూస్తున్నాడు.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *