న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకటి. ఖురాన్ అవగాహన లేని చాలా మంది తమకున్న అర్థజ్ఞానంతో “ఖురాన్ ముస్లిమేతరులను చంపమని చెబుతుంది, హింసను ప్రేరేపిస్తుంది” “ఇస్లాం ఖడ్గంతో వ్యాపించింది” అన్న అజ్ఞానపు మాటలు చెబుతుంటారు. కానీ, ఖురాన్ ఒక మానవుణ్ణి చంపితే సకల మానవులను చంపినట్టే అని హెచ్చరిస్తుంది.
“న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు” అంటే- ఒక వ్యక్తిని చట్ట బద్దంగా మరణ శిక్ష విధించేటంత తప్పు చేసినప్పుడు తప్ప అన్యాయంగా ఏ వ్యక్తినీ చంపకూడదు. అలాగే ఆహారం కోసం నిర్దేశించబడిన జంతువుల కంఠాన్ని కోసి మాత్రమే వాటి మాంసాన్ని తినాలి. తప్ప ఏ ఉద్దేశమూ లేకుండా ఏ ప్రాణినీ హింసించి చంపకూడదు. చివరకు మొక్కలను, చెట్లను సైతం అకారణంగా నరక వద్దని ఇస్లాం ఆదేశిస్తుంది.
మరి ప్రవక్త ముహమ్మద్ యుద్ధాలు ఎందుకు చేశారు? ఖురాన్ లో యుద్ధం చెయ్యమన్న ఆదేశాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ పట్ల ఆయన శిష్యుల పట్ల శతృత్వం వహించిన వారిలో దౌర్జన్య పరులు ఎప్పుడైతే వారిని చంపటానికి యుద్ధానికి కాలు దువ్వారో అలాంటి సందర్భాల్లో మాత్రమే ప్రవక్త ముహమ్మద్ వారికి ప్రాణ రక్షణ నిమిత్తం యుద్ధం చెయ్యమనే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పైగా దౌర్జన్య పరులు యుద్ధం చెయ్యటం మానుకుంటే మీరు వారిని క్షమించి వదిలి పెట్టండి అని ఆదేశించటం జరిగింది.
దీనిని బట్టి ఒకరకంగా ప్రవక్త ముహమ్మద్ వారు చేసిన యుద్ధాలన్నీ దౌర్జన్య పరుల యుద్ధాలను నివారించటానికి చేసిన యుద్ధాలే తప్ప అన్యాయంగా అమాయకులైన ముస్లిమేతరులపై చేసిన ఉద్దేశపూర్వక యుద్ధాలు కావు. పేదరికం భయంతో మీ సంతానాన్ని హత్య చెయ్యకండి అని ఆదేశించిన ఖురాన్ అన్యాయంగా యుద్ధం చేసి ముస్లిమేతరుల్ని చంపమని చెబుతుందని ఊహించుకొటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉంటుందా?
