“రజాకార్” – చారిత్రక వక్రీకరణ 

సామాన్య హిందువులపై దౌర్జన్యాలు చేయటానికి మరియు తెలంగాణా సాయుధ పోరాట విప్లవకారుల నుండి తన అధికారాన్ని కాపాడుకోటానికి క్రూరుడైన నిజాం ముస్లిముల సమూహంతో ఏర్పాటు చేసుకున్న ప్రయివేట్ ఆర్మీనే “రజాకార్లు” అంటూ చరిత్రను అతి ఘోరంగా వక్రీకరణ చెయ్యటమే కాక, ఆనాడు రజాకార్లకూ ప్రజలకు మధ్య జరిగిన పోరాటాలను హిందూ-ముస్లిముల పోరాటాలుగా మార్చిపడేసి మతతత్వవాదపు కంపుతో తీసిన మరొక ప్రాపగాండా సినిమానే  “రజాకార్”   

ఇంతకూ రజాకార్లు ఎవరు?

అప్పటి 7 వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండర్ లో ఖాసిం రిజ్వీ ఆధ్వర్యంలో పనిచేసే నిజాం ప్రయివేట్ ఆర్మీ పేరే రజాకార్లు, వారంతా ముస్లిములు మరియు వారు హిందువులపై అనేక దౌర్జన్యాలు చేశారు అన్నది చరిత్ర తెలీని మూర్ఖులు చెప్పే పచ్చి అబద్ధం అని చెప్పటం అతిశయోక్తి కాదు.

చరిత్ర తెలియని కొందరు మూర్ఖులు కల్పించిన ఇలాంటి కట్టు కథల వల్లే రజాకార్లంతా ముస్లిం వర్గం వారని, వారు దౌర్జన్యాలు చేసిన వర్గీయులంతా హిందువులన్న ఓ తప్పుడు అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడిపోవటమే కాదు, ఈ వక్రీకరించబడిన చరిత్ర ఆధారంగా రాజకీయ లబ్ది పొందాలనుకునే కొందరు చిల్లర సినిమాలు తీసి ప్రజలలో మతోన్మాద విష బీజాలు నాటుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు “రజాకార్లు ఎవరు?” ఈనాడు కొందరు ప్రచారం చేస్తున్నట్టు వారు నిజంగానే హిందువులపై దాడులు, దౌర్జన్యాలు చెయ్యటానికి నిజాం నవాబుచే నియమించబడిన ప్రయివేట్ సైన్యమా? ఈ టాపిక్ పై కెప్టెన్ పాండు రంగారావు లాంటి ప్రముఖ చరిత్రకారుల ద్వారా సేకరించబడిన కొన్ని ప్రామాణిక చారిత్రక వాస్తవాలను గమనిద్దాం.

‘రజాకార్’ అన్న పదానికి అర్థం ‘వాలంటీర్’ అన్నది. చాలా మందికి తెలియని ఓ చారిత్రక నిజం ఏమిటంటే… అప్పట్లో రజాకార్లంటే ఒక్కటే గ్రూపు కాదు, మొత్తం 5 రకాల రజాకార్ల గ్రూపులు ఉండేవి. ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసు?

పైగా ఆనాడు ప్రజలపై అనేక దౌర్జన్యాలకు పాల్పడిన 5 రకాల రజాకార్ గ్రూపుల్లో ఒకటి ఖాసిం రిజ్వీ అండర్ లో పనిచేసే గ్రూపు అయితే మిగతా నాలుగు గ్రూపులు అసలు ముస్లిములకు సంబంధించినవే కావు. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ!

***

రజాకార్లంతా ముస్లిములు కారు!

ఆనాడు 5 రకాల రజాకార్ల గ్రూపుల్లో ఒక రజాకార్ గ్రూపు ఖాసిం రిజ్వీ ఆధ్వర్యంలో ఉండేది. మిగతా 4 రజాకార్ గ్రూపులు ఏవంటే…  ‘హిందూ రజాకార్లు’, ‘పోలీస్ రజాకార్లు’, ‘కమ్యూనిస్ట్ రజాకార్లు’, ‘కాంగ్రెస్ రజాకార్లూ’. వీరందరూ రజాకార్ల పేరుతో తెలంగాణ గడ్డపై అనేక అత్యాచారాలకూ, దారుణాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డవారే.

ఇన్ని రజాకార్ల గ్రూపులు ఎందుకు ఏర్పడ్డాయి?

ముందు అసలు అనేక రజాకార్ గ్రూపులు ఎందుకు ఏర్పడ్డాయి? వారు ప్రజలపై అనేక దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడ్డాయన్నది గమనించాలి. అసలు ఈ కథ తెలంగాణాలో హిందూ దేశ్ ముఖ్ లు, జమీందార్లు, భూస్వాములైన దొరల భూముల్ని ఆక్రమించుకోవటం మొదలెట్టిన ప్రక్క రాష్ట్రాల కమ్యూనిస్టుల నుండి ప్రారంభమవుతుంది.

కమ్యూనిస్టుల దౌర్జన్యాల నుండి కాపాడమని అప్పటి తెలంగాణా భూస్వాములు పోలీస్ బలగాలను సహాయం అడిగినప్పుడు వారు ఏమీ చెయ్యలేమని చెట్టులెత్తేయటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వారు అప్పట్లో ఎం.ఐ.ఎం ముస్లిం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఓ ప్రయివేట్ ఆర్మీఫోర్స్ అయిన ‘రజాకార్స్’ సహాయాన్ని కోరతారు. సహాయం చెయ్యటానికి ముందుకొచ్చిన ఖాసిం రిజ్వీ క్రింద పనిచేసే ఈ రజాకార్ల సైన్యానికి అప్పటి హిందూ దేశ్ ముఖ్ లు, హిందూ జమీందార్లు, భూస్వాములైన దొరలు, పటేళ్లు, స్టానిక పెత్తందార్లు ఆయుధాలు సప్లై చెయ్యటమే కాదు, వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ పెంచి పోషిస్తూ రావటం జరుగుతుంది. క్రమంగా వారిని అడ్డం పెట్టుకుని ప్రజలపై అనేక దౌర్జన్యాలు చేయించి భూముల్ని కబ్జాలు చెయ్యటం సైతం మొదలు పెడతారు.

మరోప్రక్క ప్రక్క రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణా భూముల్ని ఆక్రమించుకోవటంలో కమ్యూనిస్టుల ఆగడాలు ఎంతవరకు వెళ్లిపోతాయంటే రజాకార్ల వేషాలు ధరించి తెలంగాణా భూముల్ని దోచుకోవటం మొదలెడతారు. అలా “కమ్యూనిస్ట్ రజాకార్ల” గ్రూపు ఏర్పడుతుంది.

పోలీస్ రజాకార్ల క్రూరమైన కథ..!?

1947 లో భారతదేశానికి స్వతంత్రం లభించి ఇండియా, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడిపోయిన తరువాత హైదారాబాద్ ను హిందూ, ముస్లిములు కలిసి ఉండే విధంగా ప్రత్యేక సెక్యులర్  దేశంగా తయారు చెయ్యాలన్నది నిజాం నవాబు ప్రయత్నం. తప్పితే చరిత్ర అవగాహన లేనోల్లు చెబుతున్నట్టు హైదారాబాద్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చటం అన్నది నిజాం నవాబు ప్రయత్నం ఎంత మాత్రం కాదు. ఈ తీర్మానాన్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకించింది. హైదారాబాద్ ను కూడా భారతదేశంలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా అప్పటి ఇండియన్ గవర్నమెంట్ పన్నిన ఒక కుట్ర ఏమిటంటే- మహారాష్ట్ర అకోలా పోలీసులకు, హోంగార్డులకు ముస్లిం పేర్లూ, గెడ్డాలు పెట్టించి రజాకార్ల వేషం వేయించి తెలంగాణాలో దౌర్జన్యాలు అత్యాచారాలు చేయించటం! ఈ కుట్రను సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర ‘రుస్తుం’ తన పోలీస్ టీం ద్వారా చాలా చాకచక్యంగా నిర్వహిస్తాడు.

ఈ సోకాల్డ్ రజాకార్ల పని కేవలం హైదారాబాద్ లో సామాన్య ప్రజలపై దాడులు చెయ్యటం, అశాంతి అలజడులు అరాచకాలు సృష్టించటం. అలా అలజడులు సృష్టించి ఎలాగైనా ఆర్మీ బలగాల ద్వారా హైదారాబాద్ ను భారతదేశంలో విలీనం చెయ్యాలన్నది అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా నిర్వహించబడ్డదే “పోలీస్ యాక్షన్” లేదా “ఆపరేషన్ పోలో”.

ఇలా నకిలీ రజాకార్లను సృష్టించి అనేక దారుణాలను చేయించటం వెనుక ప్రధాన పాత్ర పోషించిన ‘రుస్తుం’ తన ఆత్మ కథలో… “మహారాష్ట్ర సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ అకోలా జిల్లాలో పనిచేస్తున్నప్పుడు పోలీసులకు ముస్లిము పేర్లతో రజాకార్ల వేషాల్లో హైదరాబాదుకు పంపి అక్కడ శాంతి భద్రతలు నాశనం చేసి, అనేకమంది హిందువులపై దౌర్జన్యాలు చేయించటం ఒక ఇండియన్ పోలీసుకి ఎంతో దౌర్భాగ్యం” అని రాసుకొచ్చాడు.

ఆ విధంగా మహారాష్ట్ర అకోలా పోలీసులకు, హోంగార్డులకు ముస్లిం పేర్లూ, గెడ్డాలు తగిలించి తెలంగాణాలో దౌర్జన్యాలు అత్యాచారాలు చేయించటానికి తయారు చెయ్యబడిన టీం పేరే “పోలీస్ రజాకార్లు”.

*** 

రజాకార్ల పేరుతో నకిలీ రజాకార్లు చేసిన దారుణాలు!

ఈ విధంగా ఆనాడు రజాకార్ల పేరుతో తెలంగాణాలో అనేక నకిలీ రజాకార్ల టీములు పుట్టుకొచ్చాయి. ఒకప్రక్క మహారాష్ట్రా పోలీసులతో తయారైన “పోలీస్ రజాకార్లు” ఇంకా ఆర్య సమాజ్, హిందూ మహాసభకు చెందిన సభ్యులతో కూడిన హిందూ రజాకార్లు, ప్రక్కరాష్ట్రాల కమ్యూనిస్టులతో తయారైన “కమ్యూనిస్టు రజాకార్లు”, అలాగే అచ్యుత్ పట్వర్ధన్ ఆధ్వర్యంలో పనిచేసే ‘పూన పత్రి సర్కార్’ అనే ఆర్గనైజేషన్ తో కలిసి నిజాం నవాబు కు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ రజాకార్ల గ్రూపు కూడా తయారైంది. ఈ ఆర్గనైజేషన్ తరఫున కాంగ్రెస్ రజాకార్లు  హైదారాబాద్ లో చేసిన దాడులు, దౌర్జన్యాలు అంతు లేనివి. స్వామీ రామానంద తీర్థ ఉమ్రీ బ్యాంకును కొల్లగొట్టటం జరిగింది. తెలంగాణాలో అనేక దౌర్జన్యాలకు పాల్పడిన వీరంతా ముస్లిములు కారు కదా?

మొత్తానికి మహారాష్ట్ర నుండి వచ్చిన పోలీస్ రజాకార్లు, తెలంగాణా భూముల్ని దోచుకోటానికి తరలి వచ్చిన కమ్యూనిస్ట్ రజాకార్లు, కాంగ్రెస్ రజాకార్లు, హిందూ రజాకార్లంతా చేసిన అత్యాచారాలు, దౌర్జన్యాలు అంతు లేనివి.  అలాగని ఖాసిం రిజ్వీ సైన్యంలో ఉన్న రజాకార్లు మంచోల్లని కాదు హిందూ దేశ్ ముఖ్ లు, జమీందార్లు, భూస్వాములైన దొరలు, స్టానిక పెత్తందార్ల బలాన్ని చూసుకుని వాళ్లు చేసిన ఆకృత్యాలు కూడా అనేకం ఉన్నాయి.

మొత్తానికి ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే- తెలంగాణాలో అనేక దారుణాలకు పాల్పడింది ఒక్క ఖాసిం రిజ్వీ సైన్యంలో ఉన్న ముస్లిం రజాకార్లు మాత్రమే కాదు, అంతకంటే దారుణంగా నకిలీ రజాకార్లైన ‘పోలీస్ రజాకార్లు’, ‘కమ్యూనిస్ట్ రజాకార్లు’ ‘కాంగ్రెస్ రజాకార్లు’ ‘హిందూ రజాకార్లు’ చేసిన లూటీలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు లెక్కకు మించి ఉన్నాయి.

అయితే అనేక రజాకార్ల గ్రూపులు చేసిన దారుణాలను, అత్యాచారాలను, అలజడులను, లూటీలను అప్పటి వార్తా పత్రికలు “రజాకార్ల అత్యాచారాలు-ఘోరాలు” అన్న హెడ్డింగులతో తరచూ వార్తలు ప్రచురించటం జరిగేది. ఆ విధంగా అనేక నకిలీ రజాకార్లు చేసిన దారుణాలన్నీ ఖాసిం రిజ్వీ రజాకార్ల ఖాతాలోకి వెళ్లిపోయాయి.

ఆనాడు పేపర్లలో వచ్చే హెడ్డింగులనే ఆసరాగా తీసుకుని తరువాతి కాలాల్లో ఆర్.ఎస్.ఎస్ లాంటి హిందుత్వ సంస్థలు ముస్లిం సమాజంపై ప్రజల్లో ద్వేషాన్ని రగిలించటానికి… ‘రజాకార్లు’ అంటే నిజాం తన అధికారం కోసం నియమించుకున్న ప్రయివేట్ ఆర్మీ అని, వారంతా కేవలం ముస్లిములని, హిందువులపై దౌర్జన్యాలు చేసేవారన్న అబద్ధాన్ని చాకచక్యంగా ప్రజల్లో వ్యాప్తి చెయ్యటం మొదలెట్టారు. హిందూ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, పోలీస్ రజాకార్లు చేసిన అనేక దారుణాలను ఖాసిం రిజ్వీ రజాకార్ల ఖాతాలో నెట్టేయటం జరిగింది. ఇంకో అడుగు ముందుకేసి ఆ రజాకార్లంతా “జిహాదీలు” అని పేరుపెట్టేంత వరకూ వెళ్లిపోయారు ఇంకొందరు వాట్స్ యాప్ మేధావులు. ఇప్పుడు ఇవే అబద్ధాలతో ‘రజాకార్’ అనే సినిమా కూడా తీసి హిందూ-ముస్లిముల మధ్య విద్వేషాన్ని రగిలించి పోలిటికల్ మైలేజ్ తీసుకోటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

రజాకార్లకూ, ప్రజలకూ మధ్య జరిగిన అప్పటి తగాదాలను ఇప్పుడు హిందూ-ముస్లిముల మధ్య జరిగిన మత పరమైన పోరాటంగా మలచటానికి కొందరు హిందుత్వ మతోన్మాదులు ప్రయత్నం చేస్తుంటే.. తమకు మరక అంటుకోకుండా చాకచక్యంగా ఇప్పటి కమ్యూనిస్టులు- “భూమికోసం, భుక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి హిందూ-ముస్లిం ఘర్షణగా చూపే మతోన్మాదుల కుట్రను తిప్పికొడదాం” అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ మధ్యలో నిజాంను ఇరికించేసి అతన్ని క్రూరుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అసలు నిజం చెప్పాలంటే 1972 కు ముందు ఎక్కడా ఏ వార్తా పత్రికలోనూ ‘తెలంగాణా సాయుధ పోరాటం’ అనే పదమే ఉనికిలో లేదు.

నిజాం నిజంగా క్రూరుడా?

అప్పటి నిజాం నవాబు కోరుకున్నదల్లా హైదారాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలన్నదే. అందులో ఆయన కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే. తన అధికారాన్ని కాపాడుకోటానికి రజాకార్లకు సహాయం చెయ్యటం కూడా వాస్తవమే, కానీ తరువాత అనేక రజాకార్ల గ్రూపులు చేస్తున్న దౌర్జన్యాల నేపథ్యంలో ఏమీ చెయ్యలేక రజాకార్ల ముందు బలహీనంగా మారిపోయాడు. దానితో తెలంగాణాలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిపోయింది. ఫలితంగా హిందూ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, పోలీస్ రజాకార్ల గ్రూపులు ఉనికిలోకి వచ్చి ప్రజలపై అనేక దౌర్జన్యాలు చేసి దోచుకునే పరిస్థితి వచ్చింది.

కానీ, హిందువుల్ని బలవంతంగా తన ప్రయివేట్ ఆర్మీ ద్వారా ముస్లిములుగా మార్చేసేంత క్రూరత్వంగా వ్యవహరించటానికి నిజాం నవాబులు చేసింది మతపరమైన పాలన మటుకు కాదు. దాదాపు 220 సం.లు హైదారాబాద్ ను పాలించిన నిజాం పాలకుల సంస్థానంలో ఎందరో హిందువులు కూడా పనిచేసేవారు. 

ఆ రోజుల్లోనే ఎస్.సి వర్గం విద్యాభివృద్ధికి కోటి రూపాయలు నియమించటమే కాక, 1953 సం.లో ఔరంగాబాద్ లో  54 ఎకరాల తన స్వంత స్థలాన్ని డా. అంబేడ్కర్ కు కాలేజ్ నిర్మించటానికి విరాళంగా ఇవ్వటం జరుగుతుంది. చివరకు ఈనాడు పనిచేస్తున్న ఆర్.టీ.సీ వ్యవస్థను స్థాపించింది కూడా నిజాం ప్రభూత్వమే. అంతేకాదు, 1965 లో దేశ ఆర్థిక స్థితి దిగజారిపోయి ఉన్న నేపథ్యంలో 5 టన్నుల బంగారాన్ని ఇండియన్ గవర్నమెంట్ కు అలవోకగా విరాళమిచ్చేసిన నిజాం గురించే నేడు కొందరు హిందూ వ్యతిరేకి, క్రూరుడు, దేశద్రోహి, నిరంకుశ పాలకుడని కొందరు వాట్స్ యాప్ కథలు చెప్పుకుంటుంటారు.

సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ ముస్లిమ్స్!

“పోలీస్ యాక్షన్” పై కూడా సినిమా తీయగలరా?

1948 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో “ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ (మొదట్లో దీని పేరు ఆపరేషన్ పోలో గా ఉండేది)” లేదా “పోలీస్ యాక్షన్” పేరుతో ఎంతమంది హైదరాబాదీ ముస్లిములు దారుణంగా చంపబడ్డారో ఈనాడు చాలా మందికి తెలీదు? ఆ రెండ్రోజుల్లో జరిగిన జెనోసైడ్ లో ఒక్క హైదారాబాద్ నేల పైనే దాదాపు 27 వేల ముస్లిములు దారుణంగా చంపబడ్డారు. హైదారాబాద్ ను భారతదేశంలో విలీనం చెయ్యటానికి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ మహారాష్ట్ర నుండి నకిలీ రజాకార్ల ద్వారా అనేక దౌర్జన్యాలు చేయించటమే కాదు, మిలట్రీ దళాలను పంపి “పోలీస్ యాక్షన్” లేదా ఆపరేషన్ పోలో ద్వారా వేల మంది ముస్లిములను టార్గెట్ చేసి చంపటం జరిగింది. 

ఈ చారిత్రక వాస్తవాలు చదవకుండా రజాకార్లంతా ముస్లిములు, నిజాం ఓ క్రూరుడు, వారు దౌర్జన్యాలకు పాల్పడ్డవారంతా హిందువులు అన్నట్టు చరిత్రను వక్రీకరిస్తూ ప్రోపగాండా సినిమాలు తీయటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సోదరుల్లా కలిసి మెలసి బ్రతుకుతున్న హిందూ, ముస్లిముల మధ్య శతృత్వం పెరిగిపోదా?

ఈ పూర్తి ఆర్టికల్ ను వీడియో రూపంలో చూడాలనుకుంటే క్రింద క్లిక్ చేయండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *