“రజాకార్”… వాస్తవీకత ఏమిటి?

వినోదాన్ని పంచే సినిమా లాంటి వేదిక సైతం ప్రజల్లో మత విద్వేషాలను నాటే మాద్యమంగా మారిపోతే అలాంటి సమాజం ప్రమాదపు అంచులపై ఉన్నట్టే! కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ కోవలో ఇప్పుడు కొత్తగా అనేక అబద్ధాల అల్లికతో ‘రజాకార్’ అనే సినిమా రాబోతుంది.

ఈ ప్రాపగాండా సినిమాల లక్ష్యం ఒక్కటే- ముస్లిం సమాజంపై సామాన్య హిందూ ప్రజలలో తీవ్ర విద్వేషాన్ని రగిలించటం, వారిని హిందూ వ్యతిరేకులన్నట్టు చిత్రీకరించి వారి ద్వారా హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే భావన కలిగించటం. తద్వారా మా రాజకీయ పార్టీని ఎన్నుకుంటేనే ఫైనల్ గా హిందుత్వం రక్షించబడుతుంది అనే “ఫాల్స్ స్లోగన్” ద్వారా హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవటం.

చారిత్రక వక్రీకరణ!

కొన్నాళ్ల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్యూలో సినిమా డైరెక్టర్ రాజమౌళీ తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ రజాకార్లు ఎవరు? అన్న దానిపై “రజాకార్లంతా ముస్లిములేనని, నిజాం నవాబు వారిని నియమించింది హిందువుల్ని బలవంతంగా ముస్లిములుగా మార్చటం కోసమేనని చెబుతూ రజాకార్లకు ప్రజలకు మధ్య జరిగిన సంఘర్షణను ‘హిందూ-ముస్లిం’ సంఘర్షణ” అని మార్చిపరేసి చరిత్రను అష్ట వంకరలు తిప్పుతూ మాట్లాడటం జరిగింది. దాదాపుగా చాలా మందిలో తిష్టవేసుకున్న ఇలాంటి భావాల ఆధారంగానే చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పుడు ‘రజాకార్’ అనే సినిమా కూడా తీయటం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో అసలు “రజాకార్లు ఎవరు?” ఈనాడు కొందరు ప్రచారం చేస్తున్నట్టు వారు నిజంగానే హిందువులపై దాడులు, దౌర్జన్యాలు చెయ్యటానికి నిజాం నవాబుచే నియమించబడిన ప్రయివేట్ సైన్యమా? ఈ టాపిక్ పై ప్రముఖ చరిత్రకారుల ద్వారా సేకరించబడిన కొన్ని ప్రామాణిక వాస్తవాలను గమనిద్దాం.
****

రజాకార్లు ఎవరు?

ఈ ప్రశ్నకు చరిత్ర అవగాహన లేనోల్లు ఇచ్చే సమాధానం నిజాం అండర్ లో ఖాసిం రిజ్వీ ఆధ్వర్యంలో అప్పటి నిజాం ప్రయివేట్ ఆర్మీ అయిన ముస్లిములందరూ రజాకార్లన్నది! ఇదొక చరిత్ర తెలీని మూర్ఖులు చెప్పే పచ్చి అబద్ధం అని చెప్పటం అతిశయోక్తి కాదు.

అసలు ‘రజాకార్’ అంటే ‘వాలంటీర్’ అని అర్థమైతే.. అప్పట్లో రజాకార్లంటే ఒక్కటి కాదు, మొత్తం 5 రకాల రజాకార్ల గ్రూపులు ఉండేవన్నది చాలా మందికి తెలీని నిజం. పైగా రజాకార్లందరూ ముస్లిములు కారు! ఆ 5 రకాల రజాకార్ల గ్రూపుల్లో ఒక రజాకార్ గ్రూపు ఖాసిం రిజ్వీ ఆధ్వర్యంలో పనిచేసేది. మిగతా 4 రజాకార్ గ్రూపుల్లో ‘హిందూ రజాకార్లు’, ‘పోలీస్ రజాకార్లు’, ‘కమ్యూనిస్ట్ రజాకార్లు’, ‘కాంగ్రెస్ రజాకార్లూ’ ఉండేవారు. వీరందరూ అనేక దారుణాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డవారే.

నకిలీ హిందూ రజాకార్లు అంటే కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్య సమాజ్, హిందూ మహాసభకు చెందిన సభ్యులన్న మాట. వీరంతా అచ్యుత్ పట్వర్ధన్ ఆధ్వర్యంలో పనిచేసే ‘పూన పత్రి సర్కార్’ అనే ఆర్గనైజేషన్ తరఫున పనిచేసేవారు. ఈ హిందూ, కమ్యూనిస్ట్ నకిలీ రజాకార్లంతా హైదారాబాద్ లో చేసిన దాడులు, దౌర్జన్యాలు అంతు లేనివి.

రజాకార్లు ఎవరు? అన్న ప్రశ్నకు “తెలంగాణా సాయుధ పోరాట విప్లవకారుల నుండి తన అధికారాన్ని కాపాడుకోటానికి క్రూరుడైన నిజాం ముస్లిముల సమూహంతో ఏర్పాటుచేసుకున్న ప్రయివేట్ ఆర్మీనే రజాకార్లు” అనే కట్టుకథను తయారుచేసి ప్రచారంలో తెచ్చింది ఎవరో కాదు కమ్యూనిస్టులే!

ఈ కథ తెలంగాణా భూముల్ని ఆక్రమించుకోవటం మొదలెట్టిన ప్రక్క రాష్ట్రాల కమ్యూనిస్టుల నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణాలో ఇప్పటికీ అనేక జిల్లాల్లో కమ్యూనిస్టులు ఆక్రమించుకున్న ఎన్నో భూములే దానికి నిదర్శనం.

కమ్యూనిస్టుల ఆగడాల నుండి కాపాడమని అప్పటి తెలంగాణా భూస్వాములు అప్పటి పోలీస్ బలగాలను సహాయం అడిగినప్పుడు వారు నిరాకరిస్తారు. దానితో వారు అప్పటి ఎం.ఐ.ఎం ముస్లిం ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో పనిచేసే ఓ ప్రయివేట్ ఆర్మీ ఫోర్స్ అయిన ‘రజాకార్స్’ సహాయాన్ని కోరతారు. ఖాసిం రిజ్వీ క్రింద పనిచేసే ఈ రజాకార్ సైన్యానికి ఆయుధాలు సప్లై చేస్తూ, వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ పెంచి పోషించింది ఎవరో కాదు అప్పటి హిందూ దేశ్ ముఖ్ లు, హిందూ జమీందార్లు, భూస్వాములైన దొరలు, స్టానిక పెత్తందార్లే!

మరి రజాకార్లు చేసిన ఘోరాల మాటేమిటి?

హైదరాబాద్ ను ప్రత్యేకంగా హిందువులు, ముస్లిములంతా ఐక్యంగా కలిసి జీవించే స్వతంత్ర దేశంగా చెయ్యాలన్నది నిజాం నవాబు ప్రయత్నం. మరోప్రక్క హైదరాబాద్ ను ఎలాగైనా భారతదేశంలో విలీనం చెయ్యాలన్నది అప్పటి ఇండియన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం. ఈ ప్రాజెక్టులో భాగంగా అప్పటి ఇండియన్ గవర్నమెంట్ పన్నిన కుట్ర ఏమిటంటే ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్ర అకోలా పోలీసులకు, హోంగార్డులకు ముస్లిం పేర్లూ, గెడ్డాలు పెట్టించి రజాకార్ల వేషం వేయించి తెలంగాణాలో దౌర్జన్యాలు అత్యాచారాలు చేయించటం. ఈ కుట్రను సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర ‘రుస్తుం’ తన టీం ద్వారా చాలా చాకచక్యంగా నిర్వహిస్తాడు. ఈ సోకాల్డ్ రజాకార్ల పని కేవలం హైదారాబాద్ లో సామాన్య ప్రజలపై దాడులు చెయ్యటం, అశాంతి అలజడులు అరాచకాలు సృష్టించటం అంతే.

కొన్ని సంవత్సరాల తరువాత నకిలీ రజాకార్లను సృష్టించి అనేక దారుణాలను చేయించటం వెనుక ప్రధాన పాత్ర పోషించిన ‘రుస్తుం’ తన ఆత్మ కథలో… “మహారాష్ట్ర సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ అకోలా జిల్లాలో పనిచేస్తున్నప్పుడు పోలీసులకు ముస్లిము పేర్లతో రజాకార్ల వేషాల్లో హైదరాబాదుకు పంపి అక్కడ శాంతి భద్రతలు నాశనం చేసి అనేకమంది హిందువులపై దౌర్జన్యాలు చేయించటం ఒక ఇండియన్ పోలీసుకి ఎంతో దౌర్భాగ్యం” అని రాసుకొచ్చాడు.

ఒకప్రక్క మహారాష్ట్ర నుండి రజాకార్ల వేషాలు ధరించిన పోలీసులు, మరోప్రక్క ముస్లిం పేర్లతో రజాకార్ల వేషాలు ధరించి హిందూ భాస్వాముల భూముల్ని దోచుకోటానికి ప్రయత్నిస్తున్న ‘కమ్యూనిస్ట్ రజాకార్ల’ ఆకృత్యాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగని ఖాసిం రిజ్వీ సైన్యంలో ఉన్న రజాకార్లు మంచోల్లని కాదు హిందూ దేశ్ ముఖ్ లు, జమీందార్లు, భూస్వాములైన దొరలు, స్టానిక పెత్తందార్ల బలాన్ని చూసుకుని వాళ్లు చేసిన ఆకృత్యాలు కూడా ఉన్నాయి.

మొత్తానికి ఇక్కడ తెలంగాణాలో అనేక దారుణాలకు పాల్పడింది ఒక్క ఖాసిం రిజ్వీ సైన్యంలో ఉన్న ముస్లిం రజాకార్లు మాత్రమే కాదు, అంతకంటే దారుణంగా రజాకార్ల వేషాలు ధరించి మహారాష్ట్ర ‘పోలీసులు, హోంగార్దులు, ‘కమ్యూనిస్టులు’ చేసిన లూటీలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు లెక్కకు మించి ఉన్నాయి.

అయితే ఆ ‘కమ్యూనిస్ట్ రజాకార్’ మరియు మహారాష్ట్ర ‘పోలీస్ రజాకార్’ గ్రూపులు చేసిన దారుణాలను, అత్యాచారాలను, అలజడులను, లూటీలను అప్పటి వార్తా పత్రికలు “రజాకార్ల అత్యాచారాలు-ఘోరాలు” అన్న హెడ్డింగులతో తరచూ వార్తలు ప్రచురించటం జరిగేది.

ఈ హెడ్డింగులనే ఆసరాగా తీసుకుని తరువాతి కాలాల్లో ఆర్.ఎస్.ఎస్ లాంటి హిందుత్వ సంస్థలు ముస్లిం సమాజంపై ప్రజల్లో ద్వేషాన్ని రగిలించటానికి… ‘రజాకార్లు’ అంటే నిజాం తన అధికారం కోసం నియమించుకున్న ప్రయివేట్ ఆర్మీ అని, వారంతా కేవలం ముస్లిములని, హిందువులపై దౌర్జన్యాలు చేసేవారన్న అబద్ధాన్ని చాకచక్యంగా ప్రజల్లో వ్యాప్తి చెయ్యటం మొదలెట్టారు. హిందూ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, పోలీస్ రజాకార్లు చేసిన అనేక దారుణాలను ఖాసిం రిజ్వీ రజాకార్ల ఖాతాలో నెట్టేయటం జరిగింది. ఇంకో అడుగు ముందుకేసి ఆ రజాకార్లంతా “జిహాదీలు” అని పేరుపెట్టేంత వరకూ వెళ్లిపోయారు ఇంకొందరు వాట్స్ యాప్ మేధావులు. ఇప్పుడు ఇవే అబద్ధాలతో ‘రజాకార్’ అనే సినిమా కూడా తీసి హిందూ-ముస్లిముల మధ్య విద్వేషాన్ని రగిలించి పోలిటికల్ మైలేజ్ తీసుకోటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

రజాకార్లకూ, ప్రజలకూ మధ్య జరిగిన అప్పటి తగాదాలను ఇప్పుడు హిందూ-ముస్లిముల మధ్య జరిగిన మత పరమైన పోరాటంగా మలచటానికి కొందరు హిందుత్వ మతోన్మాదులు ప్రయత్నం చేస్తుంటే.. తమకు మరక అంటుకోకుండా చాకచక్యంగా ఇప్పటి కమ్యూనిస్టులు- “భూమికోసం, భుక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి హిందూ-ముస్లిం ఘర్షణగా చూపే మతోన్మాదుల కుట్రను తిప్పికొడదాం” అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి మధ్యలో నిజాంను ఇరికించేసి అతన్ని క్రూరుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అసలు నిజం చెప్పాలంటే 1972 కు ముందు ఎక్కడా ఏ వార్తా పత్రికలోనూ ‘తెలంగాణా సాయుధ పోరాటం’ అనే పదమే ఉనికిలో లేదు.

అప్పటి నిజాం నవాబు కోరుకున్నదల్లా హైదారాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలన్నదే. అందులో ఆయన కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే. ముఖ్యంగా ఏమీ చెయ్యలేక రజాకార్ల ముందు బలహీనంగా మారిపోయాడు. కానీ, హిందువుల్ని బలవంతంగా తన ప్రయివేట్ ఆర్మీ ద్వారా ముస్లిములుగా మార్చేసేంత క్రూరత్వంగా వ్యవహరించటానికి నిజాం నవాబులు చేసింది మతపరమైన పాలన మటుకు కాదు.

1965 లో దేశ ఆర్థిక స్థితి దిగజారిపోయి ఉన్న నేపథ్యంలో 5 టన్నుల బంగారాన్ని ఇండియన్ గవర్నమెంట్ కు అలవోకగా విరాళమిచ్చేసిన నిజాం గురించే నేడు కొందరు హిందూ వ్యతిరేకి, దేశద్రోహి, నిరంకుశ పాలకుడని కట్టు కథలు చెప్పుకుంటుంటారు.
****

“పోలీస్ యాక్షన్” పై కూడా సినిమా తీయగలరా?

1948 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో “ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ (మొదట్లో దీని పేరు ఆపరేషన్ పోలో గా ఉండేది)” లేదా “పోలీస్ యాక్షన్” పేరుతో ఎంతమంది హైదరాబాదీ ముస్లిములు దారుణంగా చంపబడ్డారో ఈనాడు చాలా మందికి తెలీదు? ఆ రెండ్రోజుల్లో జరిగిన జనహననంలో ఒక్క హైదారాబాద్ నేల పైనే దాదాపు 27 వేల ముస్లిములు దారుణంగా చంపబడ్డారు.

ఎప్పుడో జరిగిపోయిన ఈ సంఘటనలను ఇప్పుడు తవ్వి తీసి చరిత్రను అష్ట వంకరలు తిప్పి సినిమాలు తీయటం వల్ల లాభం ఏమిటి? కేవలం హిందూ, ముస్లిం విద్వేషాన్ని రగిలించి మతోన్మాదం ఆధారంగా రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం తప్ప మరొకటి ఉందా?

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *