ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకోవటం అన్నది ఒకవేళ స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా, సంస్కృతి మరియు రాజకీయ పరంగా సాధించిన ప్రగతిని స్మరించుకోవటానికే అయితే.. ఈ ప్రగతి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే అరేబియాలో స్త్రీలకు ఇవ్వబడిందని చెప్పటం అతిశయోక్తి కాదు.
తిరోగమనం వైపునకు ప్రయాణిస్తున్న సమాజాన్ని పురోగమనం వైపునకు.. అనాగరిక సమాజాన్ని నాగరికత వైపునకు.. స్త్రీ అణచివేతకు, వివక్షకు గురౌతున్న సమాజాన్ని స్త్రీ స్వేచ్ఛను, న్యాయపరమైన హక్కులను ప్రసాదిస్తూ, సంకుచిత మనస్కులను విశాల దృక్పథాల వైపునకూ నడుపుతూ అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తి సంస్కరణా ఉద్యమాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే పునః స్థాపించటం జరిగింది. స్త్రీలకు అన్ని రకాలా హక్కులను ప్రసాదించటమే కాక ఎంతో ఉన్నత స్థానాన్ని ఇవ్వటం జరిగింది.
భార్యల పట్ల ఉత్తమ రీతిలో మెలగాలి:
“మీ భార్యలతో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు కానీ, అందులోనే దేవుడు ఎంతో మేలు పెట్టి ఉండవచ్చు” – ఖుర్ఆన్ 4:19
ఇదీ ఇస్లాం భార్యలతో వ్యవహరించమంటున్న ఉత్తమైన వైఖరి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స)…
“స్త్రీల పట్ల దయ కలిగి ఉండండి” – [అల్-బుఖారి 3153]
అని చెప్పటమే కాక… “మీ భార్యలు మీ భాగస్వాములు తప్పితే వారు మీ సేవకులు కారు” అంటూ తమ భార్యల విషయంలో ఏ కోశాన అయినా చిన్నచూపు చూసే అవకాశం లేదంటూ గట్టి నిర్దేశాలు ఇవ్వటం జరిగింది.
ఇస్లాం స్త్రీ-పుషులకు సమాన హక్కులు, సమ న్యాయం నిర్దేశిస్తుంది:
“నిశ్చయంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు” – ప్రవక్త ముఃహమ్మద్ (స) [తిర్మిజి 113]
ముఖ్యంగా ఖురాన్, స్త్రీ-పురుషులిరువురికీ సమాన హక్కులతో పాటు సమ న్యాయం నిర్దేశిస్తుంది. తప్పితే ఎక్కడా వారి విషయంలో ఎలాంటి వివక్షా చూపటం లేదు. ఈ విషయంలో ఖురాన్ చెబుతున్నదేమిటంటే-
“పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉంది” – ఖుర్‌ఆన్ 2:228
“మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.” – ఖుర్‌ఆన్-2: 178
వారే ఉత్తములు:
“మీ స్త్రీల విషయంలో ఉత్తమంగా వ్యవహరించేవారే మీలో ఉత్తములు” – ప్రవక్త ముహమ్మద్ (స) [సునన్ ఇబ్నె మజ 1978]
***
ఈ విధంగా ఇస్లాం పురుషులకు ఎంతో ఉత్తమరీతిలో, సద్భావంతో మెలగమని చెప్పటంతో పాటు ఇతర స్త్రీల విషయంలో ఎంత ఉన్నతమైన మర్యాదతో మెలగమని నిర్దేశిస్తున్న వైనాన్ని గమనించగలం.
“ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండీ అని చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి” – 24:30
అలాగే స్త్రీలకు పరాయి పురుషుల విషయంలో తమ చూపులను కాపాడుకోండి అని చెప్పటంతో పాటు… స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోమని చెప్పమని ఆదేశించటం జరిగింది.
ఇక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది నిర్ణయించటానికి అతను స్త్రీలతో వ్యవహరించే వైఖరినే ఒక కొలమానం (Measure) గా ప్రవక్త ముహమ్మద్ (స) పేర్కొంటున్న వైనాన్ని ఈ క్రింది గమనించగలం.
“మీలో గౌరవనీయుడైన వ్యక్తే స్త్రీల పట్ల గౌరవంతో నిజాయితీతో వ్యవహరిస్తాడు. మీలో నీచుడు, నీతీ నిజాయితీ లేనివాడే తమ స్త్రీల విషయంలో అవమానపరుస్తూ వారిని అగౌరవపరుస్తూ వ్యవహరిస్తాడు” అని ప్రవక్త ముహమ్మద్ (స) ప్రకటించటం జరిగింది.
చివరిగా ఇస్లాం ఏ విధమైన స్త్రీ సాధికారత, స్త్రీ హక్కులను ఇవ్వటం జరిగింది అన్న విషయంలో ముస్లిమేర చరిత్ర కారుల అభిప్రాయం గమనిస్తే… “స్త్రీ హక్కులను సాధించిన గొప్ప విజేతగా ముహమ్మద్ తప్ప బహుశా ప్రపంచం ఎవరినీ చూడలేదు” – Pierre Crabites (1877-1943)
