ముస్లిములు అంటే ఇతర మతాల మాదిరిగా ఒక “మత వర్గం” కాదు అది ఒక “అనుచర సమాజం” అలాగే గొప్ప బాధ్యతతో ఎన్నుకోబడ్డ “మధ్యస్థ సమాజం” అంతేకాక ఒక విప్లవ సమాజం కూడా. ఇదే విషయాన్ని ఖురాన్ తెలుపుతుంది.
“ఈ విధంగా మేము ముస్లిములులైన మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము. మీరు ప్రపంచ ప్రజలకు సాక్షులుగా నిలువాలని మరియు ప్రవక్త మీకు సాక్ష్యంగా నిలువాలని” – 2:143
ఇక్కడ మధ్యస్థ సమాజం అంటే- అతివాదానికీ, మితవాదానికీ ఆధ్యాత్మిక వాదానికీ, భౌతిక వాదానికీ ప్రతీ జీవన రంగంలో మధ్యే మార్గాన్ని అవలంబిస్తూ తమ అలోచనల్లో, ఆచరణల్లో సమతూకం కనపరుస్తూ నీతీ, నిజాయితీ, న్యాయం కనపరిచే ఉత్తమ సమాజం అని అర్థం.
పై వాక్యం ముస్లిం సమాజ నియామక మౌలిక లక్ష్యం తెలుపబడుతుంది. ఇందులో ముస్లిం సమాజం గమనించాల్సిన అతి ప్రధాన విషయం- ప్రవక్త ముహమ్మద్ (స) దేవుని సందేశాన్ని ప్రజలకు అందజేసి ముస్లిం సమాజాన్ని నెలకొల్పారు. తరువాత ఆయన ఆదర్శాన్ని తీసుకుని ముస్లిం సమాజం దేవుని సందేశాన్ని ప్రజలకు అందజెయ్యాల్సి ఉంది. వివరంగా చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ (స) దేవుని ప్రతినిధిగా దైవ సందేశాన్ని ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ప్రజలకు అందజేశానని దేవుని ముందు సాక్ష్యమిస్తారు. దాని తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులుగా ప్రజల గురించి ముస్లిం సమాజం సాక్షులుగా నిలబడవలసి ఉంటుంది.. ఏదైతే ప్రవక్త ముహమ్మద్ (స) తమకు ఒక ఆదర్శవంతమైన జీవన విధానాన్ని తమకు అందజేసి వెళ్ళారో దానిని ఆయన అనుచరులుగా ప్రజలకు అందజేసే విషయంలో మేము ఏ లోటూ చెయ్యలేదని సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఈ పని నిమిత్తమే ఒకప్పుడు మోషే అనుచరులైన యుదులు (ఇశ్రాయేలీయులు) నియమించబడ్డారు. కాలక్రమేణా వారిలో నిర్లక్ష్యం పెరుగుతూ పోయింది. తమకు ఇవ్వబడిన బాధ్యతను విస్మరిస్తూ పోయారు. మేము మోషే అనుచరులం దేవునికి ప్రియమైన వారము దేవుడే మమ్మల్ని కాపాడుకుంటాడు అన్న భ్రమలో మునిగిపోయారు. వారి నిర్లక్ష్యం కారణంగా వారిపై క్రూలైన నాయకులు వారిపై నియమించబడ్డారు. ప్రపంచం లో నిలువ నీడ లేకుండా చెల్లా చెదురైపోయారు. తరువాత ఆ మహత్తర బాధ్యతను ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా ముస్లిం సమాజానికి అప్పజెప్పటం జరిగింది.
ఇప్పుడు ముస్లిములు చెయ్యాల్సింది- ప్రవక్త ముహమ్మద్ (స) చూపిన ఆదర్శం ప్రకారం ఆయన తన కాలం నాటి ప్రజలకు దైవ సందేశాన్ని అందజేసి ఒక ఉత్తమ జీవన వ్యవస్థను ఎలాగైతే స్థాపించారో అదే విధంగా ఈనాడు ప్రజలకు వారికి అర్థమయ్యే భాషలో తమ మాటల ద్వారా, రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఇస్లాం సందేశాన్ని ప్రజలకు తెలియజెయ్యాలి. ఈ బాధ్యతను విస్మరించే ముస్లిములు ఎంత ఐదు పూట్లా నామాజ్ చదివినా, ప్రతీ సంవత్సరం ఉపవాసాలు ఉండి హజ్, ఉమ్రాలు చేసినా అవన్నీ ఎందుకూ ఉపయోగం కాకుండాపోతాయి.
కానీ చాలా మంది ముస్లిములు నమాజ్, రోజా, జకాత్, హజ్ ల గురించి మాత్రమే తీర్పు దినం నాడు ప్రశ్నించటం జరుగుతుంది అన్న భ్రమలో బ్రతుకుతున్నారు. తమ పరిధిలో సులువుగా అయిపోయే నమాజ్, ఉపవాసాలు, హజ్ లు చేస్తూ తమకు ఇవ్వబడిన అసలు బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఆ అల్లాహ్ యే మమ్మల్ని కాపాడుకుంటాడు అన్న ఊహల్లో తేలియాడుతున్నారు. అసలు ఏ మాత్రం జ్ఞానం లేని కొందరు ముస్లిములైతే దర్గాల్లో వలియల్లాలను పట్టుకుని “వశీలా (సిఫారసు)” చేసుకుంటే చాలు వారే తమను కాపాడుకుంటారనే ఊహల్లో నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నారు. అంతే కాక ముస్లిం సమాజం లో తోటి వ్యక్తుల పట్ల తోటి వర్గాల వారిపట్ల వివక్షను చూపటం, వరకట్నాలు లాంటి దురాచారాలు నాటుకుపోయాయి.
అచ్చం ఎలాంటి నిర్లక్ష్యమైతే దురాచారాలైతే ఒకప్పుడు యూదులు కలిగి ఉండేవారో అదే నిర్లక్ష్యం, దురాచారాలు నేడు ముస్లిం సమాజంలో అధిక శాతం మందిలో విపరీతంగా పెరిగిపోయాయి. నైతికత, న్యాయం, దైవభక్తి, ఉన్నత మానవీయ విలువల ప్రాతిపదికన నైతిక విప్లవాన్ని తీసుకురావలసిన ముస్లిం సమాజంలో అధిక శాతం మంది తమ అజ్ఞానం కారణంగా నేడు దారుణమైన నిర్లక్ష్యంలో మునిగిపోయి ఉన్నారు అనటం అతిశయోక్తి కాదు.
ప్రవక్త ముహమ్మద్ (స) ప్రతినిధులుగా దైవ సందేశాన్ని ప్రజలకు అందజేసే బాధ్యత నిర్వర్తిస్తూ నిజ విశ్వాసులుగా ఉన్నంత కాలం
దేవుడు తమ యోగ క్షేమామాలను చుసుకుంటాడని వాగ్దానం చెయ్యబడింది. ఎప్పుడైతే ముస్లిం సమాజం ఆ బాధ్యతను విస్మరిస్తూ పోయిందో వారిలో సమస్యలు కూడా పెరుగుతూపోయాయి. తమ స్వంత పౌరసత్వాన్ని కోల్పోయే దురదృష్టకరమైన పరిస్థితులు దాపురించాయి. రాజకీయంగా, సామాజికంగా అనేక ఇబ్బందుల్లో పడిపోయారు. ఇప్పుడు ఈ సమస్యల వలయం నుండి బయట పడటానికి రాజకీయాల్లోకి చేరి రాజకీయ నాయకులను పట్టుకోవటం లేదా రాజకీయ పార్టీలు స్థాపించి రాజకీయంగా ఎదగటమే అంతిమ మార్గమన్న క్రొత్త భ్రమల్లో తేలియాడుతున్నారు. ఇది ఎలాంటిదంటే క్యాన్సర్ కు అసలైన మందు ఇవ్వటానికి బదులు పై పూతగా కొన్ని ఆయింటుమెంట్లు రాసుకుంటూ కాలం గడిపెయ్యటం లాంటిదన్న మాట.
అలాగని ముస్లిములు రాజకీయాల్లో చేరకూడదనో చేరటం తప్పనో కాదు.. ముస్లిములు అన్ని రంగాల్లోనూ రాణించాలి. రాజకీయాల్లో చేరినా వ్యక్తుల మధ్య సత్సంబంధాలను కలిగి ఉంటూ ఆర్థిక, సామాజిక, నైతిక రంగాల్లో మార్గం చుపేలా ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలి.
ప్రజల మరియు స్వంత వ్యక్తులు సమస్యల విషయంలో అన్యాయానికి వారు గురైనప్పుడు వారి తరఫున పోరాడాలి కుడా. తప్పితే ముస్లిం సమాజం చిక్కుకుపోయిన సమస్యల సుడి గుండం నుండి బయటపడటానికి ఏకైక మార్గం రాజకీయాలు మాత్రమే అన్నట్టుగా మటుకు రాజకీయాల్లో చేరకూడదు. ఎందుకంటే ముస్లిం సమాజంలో వ్యక్తులు వ్యక్తిగతంగా ఎదో ఒక సమస్యలో పడటం అన్నది సాధారణ విషయం. అది దేవుని తరఫున పరీక్ష అనుకోవచ్చు కానీ ఒక జాతి మొత్తం సామూహికంగా విపరితమైన సమస్యల సుగుండంలో పడిపోవటం, ప్రజల నుండి వివక్షను ఎదుర్కోవటం అన్నది మటుకు దేవుని తరఫున పరీక్ష అవ్వదు శిక్షే అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ (స) ధర్మ ప్రచారం మొదలెట్టినప్పుడు సమాజంలో ఆయనా, ఆయన అనుచరులు ఎదుర్కుంటున్న సమస్యల నుండి బయటపడటానికి ఆయన ముందు రాజ్యాధికారాన్ని స్థాపించ లేదు. ఆ అవకాశం ఆనాడు వచ్చినా ఆయన ముందుగా తన బాధ్యత అయిన సమాజ సంస్కరణను ముందు నిర్వర్తించారు. ఆ విధంగా ప్రారంభమైన సంస్కరణోధ్యమం ప్రచార శక్తి తో విస్తరిస్తూ పోయి అధికారంలోకి వచ్చింది.
కాబట్టి సామూహికంగా తమపై వచ్చిపడే సమస్యలకు అసలు పరిష్కారం అలోచించకుండా ఇస్లాం వాస్తవ జ్ఞానాన్ని పెంచుకోకుండా ఇలాగే నిర్లక్ష్యం వహిస్తూపోతే భవిష్యత్తులో ముస్లిం సమాజం మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పటంలో సందేహం లేదు.
ముస్లిముల సమస్యలు దురమవ్వాలంటే ఎలా?
