ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?

ఈ పుస్తకం టైటిల్ వినగానే ఇది ఎవరో ముస్లిం పండితుడు తన ఇస్లాం గురించి తాను గొప్పగా చెప్పుకోటానికి రాసిన పుస్తకం అయ్యుండవచ్చు అనిపిస్తుంది కదూ! కానీ, “ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?” పుస్తక రచయిత ప్రఖ్యాత హిందూ పండితుడైన “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” వారు అన్నది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” ఇస్లాం గురించి ప్రవక్త ముహమ్మద్ (స) గురించి, ఖురాన్ బోధలను అనాలసిస్ చేస్తూ ఆయన ఇచ్చే లెక్చర్స్ వింటే ఏవో సాధారణ స్పీచుల్లా ఉండవు మౌల్వీల బోధల కంటే కూడా ఎంతో లోతైన వివరణలతో కూడి ఉంటాయి.

పోనీ, ఈ స్వామీజీకి ఇస్లాం అంటే ముందు నుండి ఏదో ప్రేమ ఉండటం వల్లో.. ఇస్లాం పట్ల అభిమానం కొద్దో ఆ పుస్తకం రాసుంటారని అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” ఒకానొకప్పుడు ఎంతటి కరుడుకట్టిన ఇస్లాం ధ్వేషకుడు అంటే “ఇస్లాం ఆతంక్ వాద్ కా ఇతిహాస్ (ఇస్లాం ఉగ్రవాద చరిత్ర)” అన్న పేరుతో పుస్తకం రాయగలిగినంత అన్నమాట! ఆ పుస్తకం “హిస్టోరీ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిజం” అన్న పేరుతో ఇంగ్లీష్ లో కూడా అనువాదమయ్యింది.

ఈ పుస్తకం రాయటానికి కారణం ‘దైనిక్ జాగరణ్’ అనే ఒకానొక పత్రికలో “ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతుంటాయి?” అన్న శీర్షికన ఒక వ్యాసం ప్రింటయ్యింది. అదో యాంటీ-ఇస్లామిక్ వ్యాసం. అందులో కొన్ని ఖురాన్ వాక్యాలు కోట్ చేస్తూ నేడు అనేక మంది ద్వారా ఉగ్రవాదులుగా మారటానికి కారణం ఫలానా ఖురాన్ వాక్యాలే అంటూ రాయటం జరిగింది. ఆ వాక్యాలన్నీ నోట్ చేసుకున్న స్వామీజీ స్వయంగా అహ్మదాబాద్ లో ఓ హిందీ ట్రాన్స్లేషన్ ఖురాన్ కొని చూస్తే.. అచ్చం ఆ పేపర్లో రాసినట్టుగానే ఆ వాక్యాలన్నీ యుద్ధాన్ని ప్రేరేపించినట్టుగానే ఆయనకు అనిపించాయి. అదే ఆయన చేత- “ఇస్లాం ఆతంక్ వాద్ కా ఇతిహాస్ (ఇస్లాం ఉగ్రవాద చరిత్ర)” అన్న పుస్తకం రాయించింది.

మరి అలాంటి కరుడుకట్టిన ఇస్లాం ధ్వేషకుడు “ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?” అన్న పుస్తకం రాసి, ఇస్లాం పట్ల అంత అనుకూలంగా మారిపోటానికి ఏ విషయం కారణమయ్యింది? అన్నది పరిశీలిస్తే నేటి ఇస్లాం విమర్శకులు ఎంత అవగాహనా రాహిత్యంతో విమర్శిస్తున్నారో తెలుస్తుంది.

ఒకానొకప్పుడు ఇస్లాం పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” గారు చేస్తున్న పనికి సులువుగా ఫండ్స్ రావాలంటే ఇస్లాంకు వ్యతిరేకంగా ఒక పుస్తకం రాయమని సలహా ఇచ్చాడో పెద్ద మనిషి. పైగా ఇస్లాం అంటే ఎలాగూ అమెరికాకు శతృత్వం కూడా ఉంది. ఆ యాంటీ ఇస్లామిక్ పుస్తకం ఇంగ్లీష్ లో ప్రింటైతే అక్కడి నుండి రాయల్టీ పొందే అవకాశం కూడా లభిస్తుంది మీ పని సులువవుతుందని చెప్పాడు.

ఆ విధంగా మరొక పెద్ద యాంటీ ఇస్లామిక్ పుస్తకం రాయాలని సంకల్పించుకున్న “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” ముందుగా ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర చదివితే… ఇస్లాం ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందో మరింత సమాచారం దొరికే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన చరిత్ర చదవటం మొదలెట్టారు.

కానీ, ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర తన ఆలోచనలను సమూలంగా మార్చేస్తుందని బహుశా ఆయన కల్లో కూడా ఊహించి ఉండరు. చివరకు జరిగింది అదే! ఆయన చరిత్ర, ప్రవక్త ముహమ్మద్ (స) శాంతి, సహనాలతో కూడిన బోధలు అన్నీ చదివాక ఒకప్పుడు ఏ ఖురాన్ వాక్యాలైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయని భావించారో.. ఆ వాక్యాల సందర్భాన్ని మరోసారి ఖురాన్ తెరచి పూర్తిగా చదివితే అవి నిజానికి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాక్యాలు కావు.. అవి ఉగ్రవాదాన్ని నిర్మూలించటానికి, అవి ఉగ్రవాదులకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవతరించిన వాక్యాలన్న విషయాన్ని గమనించినప్పుడు ఆయన ఎంత పెద్ద పొరపాటు చేశారో అర్థమయ్యింది.

నిజానికి ఒకప్పుడు స్వామీజీ చేసిన పొరపాటు ఈనాడు చాలా మంది చేసేదే! అదేమిటంటే ఖురాన్ వాక్యాల సందర్భాన్ని చూడకుండా అపార్థం చేసుకోవటం. కానీ, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదివాక ఆయన ఉన్నత వ్యక్తిత్వం, శత్రువుల మధ్య సంధి కుదిర్చే విధానం, మక్కాపై విజయం సాధించినప్పుడు ఒకప్పుడు తననూ, తన అనుచరులను తీవ్ర హింసలకు గురిచేసిన ఆయన శత్రువుల పట్ల ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండీ కూడా తన శత్రువులను క్షమించివేసిన విధానం, శాంతీ-సహనంతో కూడిన ఆయన అత్యుత్తమ బోధలు, తోటి మానవుల పట్ల ఆయన చూపిన కారుణ్యం, తన శత్రువును సైతం ప్రేమించగలిగే ఆయన మానవత్వం, చెడును మంచి ద్వారా తొలగించి సమాజంలో మంచినీ, నీతీ న్యాయాలను స్థాపించిన ఆయన విధానం, అనాగరిక సమాజాన్ని ఉత్తమ మానవతా విలువలతో కూడిన ఆదర్శవంతమైన సమాజంగా మలచిన విధానం.. ఇస్లాం పట్ల “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” వారి ఆలోచనలను సమూలంగా మార్చేశాయి.

ఈసారి ఖురాన్ తెరచి ఏ వాక్యాలైతే యుద్ధం చెయ్యమని ప్రేరేపిస్తున్నట్లు కనపడుతున్నాయో.. వాస్తవానికి అవి అప్పట్లో ధర్మాన్ని అంతం చెయ్యటానికి విశ్వాసుల పట్ల యుద్ధానికి కాలు దువ్విన దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమని అవతరించిన వాక్యాలే తప్ప అమయకులను అన్యాయంగా చంపటానికి ఉగ్రవాదం చెయ్యమని అవతరించిన వాక్యాలు కానే కావు. నిజానికి ఖురాన్ ఏ జీవినైనా అన్యాయంగా అధర్మంగా చంపటాన్ని ఎంత ఘోరపాపంగా, నేరంగా పరిగణిస్తుందో అన్న విషయాన్ని ఆయన ఖురాన్ మొత్తం చదివి గ్రహించగలిగారు.

కానీ ఈసారి జరిగిందేమిటంటే- ఇస్లాం ఉగ్రవాదం ప్రేరేపిస్తుందని ఏ యాంటీ ఇస్లామిక్ రచన చెయ్యాలని “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” తన ప్రయత్నాన్ని మొదలెట్టారో అది కాస్తా.. ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను, ఖురాన్ ను పరిశీలనగా చదివాక ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేపించటం లేదు కానీ, “ఆదర్శవాదాన్ని” నేర్పుతుందన్న వాస్తవాన్ని గ్రహించి ఒక రచనను ప్రారంభించారు. ఆ పుస్తకమే “ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?” అన్నది.

ఇస్లాం పట్ల అపార్థాలేర్పర్చుకున్న ముస్లిమేతరులకు “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” చెప్పిందేమిటంటే-

ఖురాన్ వాక్యాల అర్థాన్నీ, సందర్భాన్నీ చూడకుండా పై పై చదివి ఇస్లాంను అపార్థం చేసుకోవద్దు. ఖురాన్ మూలం యొక్క సరైన అనువాదాన్ని అర్థం చేసుకుని, వాక్యాలను అవి అవతరించిన సందర్భంతో సహా పరిశీలించి చదవండి అన్నది. ఈ విషయాన్ని వివరిస్తూ “స్వామీ లక్ష్మీ శంకరాచార్య” – ‘Islam an art of living (ఖురాన్ జీనేకీ కళా)’ అన్న పేరుమీద మరొక పుస్తకం కూడా రాయటం జరిగింది.

“స్వామీ లక్ష్మీ శంకరాచార్య” పూర్తి స్పీచ్ ను ఈ క్రింది యూట్యాబ్ లింక్ ద్వారా వినగలరు:

https://www.youtube.com/watch?v=gAwis-kFd_Q

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *