చెడును కూడా దేవుడే ఎందుకు సృష్టించాడు?

“ఈ ప్రపంచంలో చాలా చెడు వుందికదా? దీన్ని ఎవరు సృష్టించారు? దీన్ని నివారించడానికి దేవుడికి ఇష్టం లేదా…లేక శక్తి లేదా? నిర్ములించాలని ఇష్టం ఉండి, శక్తి ఉండి నివారించకపోతే అతడు దుష్టుడు కాదా… శక్తి లేక నివరించలేకపోతే సర్వేశ్వరుడు (omnipotent) కాకుండాపోడా… చెడ్డ ఉన్నట్లు గుర్తించకపోతే సర్వజ్ఞుడు (omniscient) కాగలడా… జ్ఞానం ఉండీ, ఇష్టం ఉండీ, శక్తి వుండీ జగత్కారణుడయిన దేవుడు సృష్టించకపోతే, ఈ చెడు అంతా ఎక్కడినుండి వచ్చింది? చైతన్యవంతుడయిన కారణకారుడే ఈ చెడ్డoతటికీ కారణమైతే, ఆ ఆదికారణుణ్ణి దుష్టుడనడానికి భయమెందుకు?” -ఎపిక్యురస్‌ (క్రీ పూ 341-270 ) పురాతన గ్రీకు తత్వవేత్త (ఫిలాసఫర్)

సమా:- ప్రపంచంలో చాలా చెడు మాత్రమే కాదు! చాలా మంచి కూడా ఉంది. ఆ మంచికి కూడా కారణం ఆ దేవుడే! ప్రపంచంలో ప్రత్యేకంగా మంచీ-చెడులుండవు. మనిషి మస్తిష్కంలో ఉండే మంచీ-చెడు ఆలోచనలకు ప్రతిరూపమే మనకు ప్రపంచంలో కనపడే మంచీ-చెడు.

ప్రపంచంలో ప్రతీ వస్తువునూ జంటలు (Pairs) గా సృష్టించిన ఆ సృష్టికర్తే ఏ జీవికీ ఇవ్వని మంచీ (Positive)- చెడు (Negative) అనే రెండు ఆలోచనలను మనిషికి ఇచ్చాడు. ఇచ్చి అతనికి రెండు ప్రత్యేక సామర్థ్యాలను కూడా ఇచ్చాడు

1. మంచీ-చెడుల మధ్య విచక్షణ చేసే సామర్థ్యం (Power of Discrimination)

2. వాటిని విచక్షణ చేసి దేన్నైనా ఎన్నుకునే ఎంపిక స్వేచ్చ (Free will and freedom of choice)

పై సామర్థ్యాలను ఇవ్వటమే కాక మంచి ఆలోచనల ప్రకారం నడుచుకుంటే కలిగే మానసిక-శారీరక లాభాలు ఏమిటి? అలాగే చెడు ఆలోచనల ప్రకారం నడుచుకుంటే చేస్తే కలిగే నష్టాలు ఏమిటి? అన్నవి వివరించటానికి ప్రవక్తలను పంపాడు వారికి ధార్మిక గ్రంథాలను ఇచ్చాడు.

వాటిని చదివి అర్థం చేసుకున్న వారు ఉత్తములుగా, నైతిక ప్రవర్తన కలవారిగా రాణించారు. వాటిని పెడచెవిన పెట్టినవారు దుర్మార్గులుగా చెడు పనులు చేసేవారిగా మిగిలిపోయారు.

అంతేకాదు, ఏ జీవికీ ఇవ్వని విచక్షణ చేసే సామర్థ్యం ఇచ్చింది ఏదో ఓ నాలుగురోజులు సుఖభోగాలు అనుభవించి చనిపోటానికి కాదు మీ విచక్షణను ఉపయోగించి చెడుపై అదుపు సాధించి మంచిని ఎన్నుకుని సృష్టికర్త ఆదేశాలను బట్టి మంచి పనులు చేస్తూ జీవించటానికి మాత్రమే అన్న గొప్ప బాధ్యతాయుత దృక్పథాన్ని ఈ ధార్మిక గ్రంథాలలో పొందుపరచటం జరిగింది. ఆ విధంగా మనిషి చేసే మంచీ-చెడు పనులను బట్టి అతనికి మరణానంతరం శిక్షా-బహుమానాలనే రెండు శాశ్వత అవస్థలు కూడా ఉన్నాయనే హెచ్చరికలు-శుభవార్తలు కూడా వాటిలో ఇవ్వబడ్డాయి.

ఇదంతా చదివి ఎవరైనా అసలు మనిషికి చెడు ఆలోచనలు ఎందుకివ్వాలి? ఇస్తే అన్నీ మంచి ఆలోచనలే ఇవ్వొచ్చుగా? ప్రపంచంలో చెడన్నదే లేకుండా పోతుంది కదా? అని ప్రశ్నించవచ్చు. ఇది ఎలాంటి ప్రశ్న అంటే.. అసలు ఎగ్జామ్స్ ఎందుకు డైరెక్టుగా పాస్ మార్కులు ఇచ్చేయ్యొచ్చుగా? ఇంటర్యూలెందుకు డైరెక్టుగా ఉద్యోగాలిచ్చేయవచ్చుగా? అన్న అమాయక ప్రశ్న లాంటిది.

అబ్బే! అలాగేలా అవుతుందడీ… ఎగ్జామినేషన్ అన్నది జరక్కపోతే ఎవరి సామర్థ్యాలు ఏంటో ఎలా తెలుస్తుంది? అని అంటే మరి మనుషులకు ఇచ్చిన సామర్థ్యాలను వారు ఎలా ఉపయోగించుకున్నారో తేలాల్సిన పనిలేదంటారా? అది తేల్చటానికి తయారుచేసిన పరీక్షా గది లాంటిదే ఈ ప్రపంచం. ఇక్కడ మనిషికి అన్ని రకాల క్వశ్చన్స్ ఎదురవుతుంటాయి. చెడు ప్రేరేపించే స్నేహితుడు ఒక క్వశ్చన్, విచ్చలవిడితనంగా బ్రతకమని ప్రేరేపించే వ్యక్తులూ, చెడు ఆలోచనలు క్వశ్చన్స్, అడ్డంగా డబ్బు సంపాదించాలానే ఆలోచన ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ కి మీరు ఎలాంటి ఆన్సర్ రాస్తారనే పరిక్షే ఈ జీవితం. ఈ క్వశ్చన్స్ కు రైట్ ఆన్సర్స్ రాయాలంటే గైడ్ బుక్ కావాలి. అవే ధార్మిక గ్రంథాలు. గైడ్ బుక్ యొక్క గైడెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వటమే జరుగుతుంది.

భౌతిక జీవనంలో ఈ ఎగ్జామ్స్, అందులో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించటం దేనికి? ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవనానికి అంతేకాదా! అదేవిధంగా ఈ జీవితం అనే పరీక్షలో ధార్మిక గ్రంథాలనే గైడ్స్ ద్వారా జీవిస్తే పరలోకంలో సైతం గౌరవప్రదమైన శాశ్వత జీవితం లభిస్తుంది. ఈ సంక్షిప్త సందేశం పేరే దైవధర్మం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *