ఖురాన్ కేవలం ముస్లిమేరులు చేసే బహుదైవారాధనను ఖండిస్తుందా? లేక ఏ బహుదైవాల ఆరాధననైనా ఖండిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం రెండవదే అయితే మనం ఆరాధించేవారు/ఆరాధించేవి మన స్వంత వర్గానికి చెందినవైనప్పటికీ నిషిద్ధం కావా?
ముస్లిం సమాజంలో అధికశాతం ఇస్లాం కనీస మౌలిక జ్ఞానం లేని అమాయక ముస్లిముల ఇళ్లల్లో ఖురాన్ ను అల్మరాలో పడేసి.. వాటి ప్రక్కనే స్త్రీ ముఖం తగిలించిన గుర్రం బొమ్మల ఫోటోలు, దర్గాల ముందు గడ్డంతో దీనంగా కూర్చున్న బాబాల ఫోటోలు, సింహం బొమ్మల ఫోటోలూ వగైరా ఏవేవో తగిలించుకుని వాటిపై ప్రతిరోజూ సాంబ్రాణీ పొగ కొట్టుకుని పరమ పవిత్రంగా కళ్లకు అత్తుకుంటూ వింత విన్యాసాలు చేస్తుంటారు.
ఇలాంటి ఫోటోలు అమ్మేవారు సైతం వాటిని ఆ అమాయక ముస్లిముల చేత కొనిపించటానికి భలే వింత టెక్నిక్ లు ఉపయోగిస్తుంటారు అవేమిటంటే ఆ ఫోటోలపై కొన్ని అరబ్బీ అక్షరాలు రాసి పరేసి, పచ్చటి రంగులతో దర్గా బొమ్మలు, దాని ముందు తెల్లటి గెడ్డం ఉన్న వలీ బాబా బొమ్మలను అతికించేసేటప్పటికీ అరబ్బీ అక్షరాలు రాసి ఉన్న ఫోటోలంటే ఆ అమాయక ముస్లిములకు పవిత్రం, పచ్చరంగు, దర్గా బొమ్మలు, తెల్ల గెడ్డం ఉన్న వలీ బాబాలుంటే పరమ పవిత్రం! అలాంటి ఫోటోలు ఇంట్లో ఉంటే అంతా శుభమే అని చెప్పి వాటికి కొద్దిగా గంధం పూసి చేతిలో పెట్టేసేటప్పటికీ ఇంకేముంది ఇస్లాం, ఖురాన్, ఈమాన్, లాజికల్ థింకింగ్ అన్నీ ప్రక్కకుపోతాయి. ఖురాన్ ప్రకారం సృష్టికర్త అయిన అల్లాహ్ తో పాటు దేని/ఎవరి ద్వారానైనా నాకు లాభం చేకూరుతుంది అని భావించటమే బహుదైవారాధన అవుతుందన్న విషయం వీరికి తెలియదు.
అయినా మేమేమైనా హిందూ, క్రైస్తవ దేవుళ్ల ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నామా ఏంటి? మా వలీ బాబాల వారి ఫోటోలనే కదా పెట్టుకుంది! బిస్మిల్లా, అల్లాహుక్బర్ అని మా అరబ్బీ భాష పదాలు రాసున్న దర్గా ఫోటోలనే కదా మేము పెట్టుకుంది. అందులో తప్పేముంది? అన్నది ఈ అమాయక ముస్లిములు ఉపయోగించే గమ్మతైన లాజిక్కు! నిజానికి ఇది కొత్త లాజిక్కేమీ కాదు అటు క్రైస్తవుల్లో విగ్రహారాధన చేసేవారు, ఇటు హిందువుల్లో బహుదైవారాధన చేసేవారు సైతం మేము పూజించే విగ్రహాలూ, మహనీయులు మాకు సంబంధించిన వారే కదా? అన్న ప్రశ్నలనే అగుతూ ఉంటారు.
*****
నిజానికి ఏ ధార్మిక గ్రంథమైన ఒక్క సృష్టికర్తను తప్ప ఎవరికైనా/వేటికైనా దైవత్వం ఉన్నవారిగా/ఉన్న వాటిగా భావించి ఆరాధించటాన్ని నిక్కచ్చిగా ఖండిస్తున్నాయి. ఖురాన్ అయితే ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనకు ఎవరూ అర్హులు కారని, మీ ప్రార్ధనలూ వేడుకోళ్లూ అన్నీ ఒక్క అల్లాహ్ కు మాత్రమే చెయ్యమని, ఆయన మీ కంఠ రక్తనాళం కంటే అతి దగ్గరగా ఉన్నాడనీ, మీ ప్రతీ మాటా ఆయన వింటున్నాడనీ, మీ ప్రార్ధనలు ఆలకిస్తున్నాడని చెబుతూ ఉంటే.. ముస్లిం సమాజంలో కొందరు పిచ్చిమాలోకాలు ఇలాంటి విషయాలను చదవి అర్థం చేసుకోవటానికి బదులు ఖురాన్ ను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుందని దానికి ముక్మల్ గుడ్డలో చుట్టేసి, అత్తరు పూసి అల్మరాలో పెట్టి రోజూ దూరం నుండి దాన్ని కళ్లకు అత్తుకుని వేళ్లకు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు అదేంటో మరి.
నిజానికి ఖురాన్ సర్వమానవాళి కోసం వచ్చిందే తప్ప ఖురాన్ కాపీ రైట్స్ ను అల్లాహ్ ముస్లిం సమాజానికేమీ ప్రత్యేకంగా రాసివ్వలేదు! అది చదివి అర్థం చేసుకోవటానికీ.. ముస్లిమేతరులకు ఇచ్చి చవించటానికన్న విషయాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్న ముస్లిములే నేటి ముస్లిం సమాజంలో అధికంగా ఉన్నారనటం అతిశయోక్తి కాదు.
నిజానికి ఇలాంటి గుర్రం బొమ్మలున్న ఫోటోలూ, దర్గాలు, బాబాలున్న ఫోటోల వల్ల వెంట్రుక మీద ధూళి రేణువంత లాభం కూడా చేకూరదు. ఇలాంటి ఫోటోలు పెట్టుకోవటం, వాటికి గంధం పూసి సాంబ్రాణి పొగ కొట్టుకుంటూ ప్రార్ధించుకుంటూ ఉంటే మంచి జరుగుద్దన్న గుడ్డి నమ్మకాలను ప్రవక్త ముహమ్మద్ (స) గానీ ఆయన శిష్యులు గానీ ఏనాడూ కలిగి ఉండ లేదు. పైగా ఎంతో ఉన్నతమైన విశ్వాసాలు, అర్థవంతమైన క్రతువులను నిర్దేశించే ఇస్లాం ఇలాంటి చిల్లర చవకబారు పనులు చెయ్యమని అస్సలు చెప్పదు.
ప్రస్తుతం ఖురాన్ అనేక అనువాదాల్లో లభించటమే కాక మొబైల్ యాపుల్లో సైతం ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సులువుగా డౌన్ లోడ్ అయిపోయి మన చేతుల్లోకి మన జేబుల్లోకి వచ్చేసింది. కాబట్టి ముస్లిం సమాజంలో ఇలాంటి వాటి పట్ల గుడ్డి నమ్మకాలు కలిగి ఉండేవారు ఖురాన్ ను చదివి అర్థం చేసుకుని హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని పెంపొందింపజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చేయకుండా ఇలాంటి బొమ్మలు/ఫోటోల పట్ల గుడ్డి విశ్వాసాలు కలిగి ఉండటం ఇస్లాంను అగౌరవపరచటమే అవుతుంది.
‘బహుదైవారాధన’ మనదైతే… మంచిదేనా?
