సంక్షిప్తంగా “ఆత్మ” ను నిర్వచించాలంటే- మనిషికుండే “నేను (I am) అనబడే స్వీయ-చైతన్యం” ఇంగ్లీష్ లో ‘Self-consciousness’ అంటారు. ఆ “నేను (I am)” అనబడే “స్పృహ” లేక చైతన్యమే ఆత్మ అంటే. ఇక మనిషికి బయట నుండి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలూ కలిగించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అతను ఒంటరిగా ఉన్నప్పుడూ అతనిలో కొన్ని మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలూ విపరీతమైన కోరికలూ నిత్యం కలుగుతూనే ఉంటాయి.
అటువంటి సమయాలలో ఇది మంచి, ఇది చెడు.. ఫలానా పని చేస్తే లాభం, ఫలానా పని చేస్తే నష్టం అన్నది అతను తన విచక్షణా సామర్థ్యం (Power of discrimination) ద్వారా చేస్తాడు. దానినే బుద్ధి (Mind) నుపయోగించటం అంటారు. మనిషులందరికీ నేను అనే చైతన్యం లేక ‘ఆత్మ’ అన్నది ఉన్నప్పటికీ ఈ మంచీ-చెడుల విచక్షణను అందరూ ఒకలా చెయ్యలేరు. కొందరు తమ ఇష్టాని బట్టి మంచిని ఎన్నుకోవచ్చు, కొందరు చెడును ఎన్నుకోవచ్చు. అది వారు తమ బుద్ధిని ఉపయోగించటం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆత్మ అన్నది అతని స్వీయ చైతన్యమైతే అతను మంచీ-చెడుల ఆలోచనల మధ్య విచక్షణ చేసేది అతని బుద్ధి (Mind).
అయితే మనిషి ఫలానా పని చెయ్యటం ద్వారా మంచి/లాభం జరుగుతుంది లేక ఫలానా పని చెయ్యటం ద్వారా చెడు/నష్టం జరుగుతుంది అన్నది తన బుద్ధి (Mind) తో విచక్షణ (Discriminate) చేసిన తరువాత తన ఆలోచనల/కోరికల పరిపూర్తికి శరీరం (Body) అవసరమౌతుంది. ఆ శరీరం (Body) అన్నది సజీవం(Live)గా ఉండటానికి ప్రాణం (Spirit) అవసరమౌతుంది. అంటే ప్రాణం అన్నది కేవలం శరీరానికి ఛార్జింగ్ లాంటిదన్నమాట. కాబట్టి “నేను (I am)” అనబడే ఆత్మకు శరీరం ఒక పరికరం (Tool) లాంటిదని చెప్పవచ్చు. ఇదీ మనిషికీ ఆత్మకూ, అతని బుద్ధికీ, ప్రాణానికీ మధ్య ఉన్న సంబంధం.
అయితే మనిషిలో కలిగే కోరికల పరిపూర్తికి అన్ని ఏర్పాట్లూ ప్రకృతిలో ఏర్పర్చబడి ఉన్నాయి. మనిషిలో కలిగే కోరికల పరిపూర్తికి అతని శరీరం (Body) భౌతిక ప్రపంచంతో 5 రకాలుగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. 1. అది (శరీరం) చూస్తుంది. 2. వింటుంది 3. వాసన చూడగలుగుతుంది 4. రుచి చూస్తుంది 5. ముట్టుకోగలుగుతుంది.
అయితే ఈ “నేను” అనే ఆత్మ పుట్టుకకు ముందు (Before birth) ఏమిటి? పుట్టి చనిపోయాక (after death) ఏమిటి? ఈ మంచీ-చెడు ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయి వగైరా ప్రశ్నలకు సంబంధించిన జ్ఞానాన్ని అందించేవే ధార్మిక గ్రంథాలు (Scriptures) అన్న మాట.
మనిషిలో కలిగే చెడు ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి. వాటి వల్ల కలిగే మానసిక-శారీరక నష్టాలు ఏమిటి? మంచి ఆలోచనలను ఎలా ఆచరణలో పెట్టాలి వాటి వల్ల కలిగే మానసిక-శారీరక లాభాలు ఏమిటి? అన్న సమాచారాన్ని ఈ ధార్మిక శాస్త్రాలు అందిస్తాయి. ఏ పనినైనా బుద్ధి-జ్ఞానాన్ని ఉపయోగించి చెయ్యమని చెబుతాయి. చివరకు దేవుణ్ణి సైతం ఎవరో చెబితే గుడ్డిగా నమ్మేయకుండా తమ బుద్ధిని ఉపయోగించి సృష్టిని పరిశీలించి అప్పుడు ఈ సృష్టికి అతీతంగా ఉన్న సృష్టికర్తను గుర్తించమంటాయి. మనిషి స్వభావం (Nature) అతని ప్రవర్తనను నియంత్రిస్తుంది. కాబట్టి తనలో కలిగే విపరీత కోరికలకు లొంగిపోయి చెడు చేయకుండా ఎలా నియంత్రించుకోవాలో అవి నేర్పుతాయి. తప్పితే ధార్మిక గ్రంథాలంటే నేడు మతవ్యవస్థలో పేరుకుపోయి ఉన్న మూఢ నమ్మకాలను, గుడ్డి విశ్వాసాలనూ నేర్పవు. అవి ప్రతిపాదించే శాస్త్రీయ ధర్మానికీ మతవ్యవస్థలో మూఢ విశ్వాసాలకూ, నమ్మకాలకూ అస్సలు సంబంధం ఉండదు.
మనిషి – ప్రాణమూ – ఆత్మ
