మాల్కం X – మక్కా యాత్ర

“అబ్రహాం, ముహమ్మద్ మరియు ఎన్నో దైవ గ్రంథాలు అందించిన ఎందరో దైవ ప్రవక్తలు సంచరించిన ఈ ప్రాచీన పవిత్ర భూమిలో అన్ని రంగులు, అన్ని జాతుల ప్రజలు పాటిస్తున్న నిజమైన సోదరభావం, హృదయపూర్వకమైన అతిధి సత్కారం నేను ఎక్కడా చూడలేదు. నా చుట్టూ అన్ని రంగుల ప్రజలుచూపుతున్న దయాభావం చూసి మంత్రముగ్ధుడనై గత వారం రోజులుగా నా నోట మాటలేదు.

నాతో పాటు మక్కా యాత్రకు దాదాపు పదివేల మంది యాత్రికులు ఇక్కడ ఉన్నారు. అందులో అన్ని రంగుల ప్రజలు ఉన్నారు. నీలికళ్లు కలిగిన శ్వేత జాతీయుడు నుండి నల్ల చర్మం కలిగిన నీగ్రోవరకు ఉన్నారు. మేమంతా ఎంతో ఐక్యతతో సోదర స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఒకే వరుసలో నిలబడి ఒకే దైవానికి ఆరాధన చేస్తున్నాము. అమెరికాలో నాకున్న అనుభవాన్ని బట్టి.. తెలుపు, నలుపు రంగుల వ్యక్తుల మధ్య ఇలాంటి పటిష్ట ఐక్యత కూడా ఉంటుందని నమ్మశక్యం కావటం లేదు

అమెరికా ఇస్లాంను అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ ధర్మం ఒక్కటే సమాజంలో జాత్యాహంకారం అన్న జాఢ్యాన్ని తుడిచిపెడుతుంది. ముస్లిం జగత్తులో నేను చేసిన ప్రయాణాలలో నేను ఎందరో వ్యక్తులతో మాట్లాడాను అమెరికన్స్ అయిన తెల్లజాతి ముస్లిములతో కూడా కలిసి తిన్నాను. కానీ వారి హృదయాలలో మేము తెల్లవాళ్లమన్న అహంకారాన్ని ఇస్లాం ఎప్పుడో తుడిచిపెట్టేసింది

వారి రంగుతో సంబంధం లేకుండా అన్ని రంగుల ప్రజలు కలిసి మెలసి యదార్ధమైన సోదరభావాన్ని ప్రదర్శించటం నేను ఎక్కడా చూడలేదు. నా నుండి వస్తున్న ఈ మాటలు బహుశా మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ నా ఈ మక్కా యాత్ర ఇంతకు ముందున్న నా ఆలోచనా విధానాన్ని మార్చివేసింది.

గత పదకొండు రోజులుగా నాతోటి ముస్లిము సోదరులైన ఓ నీలి కళ్ల తెల్ల జాతీయుడు, ఓ నల్ల చర్మమున్న నీగ్రో కలిసి తిన్న కంచం నుండి తింటూ, వారు త్రాగిన గ్లాసు నుండి త్రాగుతూ.. వారితో పాటు ఒకే రగ్గు కప్పుకుని పడుకుంటూ.. అందరం కలిసి ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నాము.

మాటల్లోనూ చేతల్లోనూ ఓ తెల్ల జాతీయుడు కలిగి ఉన్న బాధ్యతలనే నైజీరియా నల్లటి ఆఫ్రికన్ ముస్లిములు, సూడాన్, ఘనా ముస్లిములు కూడా కలిగి ఉన్నారు. ఇక్కడ మేమంతా ఒకే దైవాన్ని ఆరాధించే సోదరులం మాత్రమే. తెల్లవారి ప్రవర్తనలలో మేము తెల్లవాళ్లమన్న అహంకార భావాన్ని దేవుని ఏకత్వ విశ్వాసం ఎప్పుడో తీసివేసింది

ఒకవేళ అమెరికన్ తెల్ల జాతీయులు కూడా దేవుని ఏకత్వాన్ని గనుక అంగీకరించగలిగితే.. వారుకూడా మానవులంతా ఒక్కటే అన్న వాస్తవాన్ని గ్రహించి, ఇతరులను రంగులను బట్టి వివక్ష చూపటాన్ని, హాని చెయ్యటాన్ని మానేస్తారు. నామాత్ర క్రైస్తవం కలిగిన అమెరికా నయం చేయలేని కేన్సర్ లాంటి జాతి వివక్షను కలిగి ఉంది.

ఇక్కడ నేను గౌరవింపబడుతున్నంతగా ఎప్పుడూ గౌరవింపబడలేదు. నేను ఓ అనర్హుడన్న భావన నాకు ఎప్పుడూ కలగలేదు. ఒక అమెరికన్ నీగ్రో పై ఇంతటి ఆశీర్వాదాలు కురవటాన్ని బహుశా ఎవరూ నమ్మరేమో.

కొన్ని రోజుల క్రితం అమెరికన్ శ్వేతాజాతీయుడైన ముస్లిం పైగా ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్త, రాయబారి తన హోటల్ సూట్ లో పైగా తాను పడుకునే మంచంపై నాకు పడుకోవటానికి చోటిచ్చాడు. అలాంటి గౌరవాన్ని సమానతను నేను కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదు – అది అమెరికాలో ఓ శ్వేతాజాతీయుడైన రాజుకు లభించే గౌరవం లాంటిది తప్ప ఓ నీగ్రోకు కాదు..

సకల స్తోత్రాలు ఆ విశ్వప్రభువైన అల్లాహ్ కే”

ఇట్లు మీ…

అల్-హజ్ మాలిక్ ఎల్-షాబాజ్ (మాల్కం X)
***
జాత్యాహంకార భావనను కూకటివేళ్లతో పెకిలించి పరేసిన ఇస్లాం విశాలమైన బోధల పట్ల ప్రభావితుడైన మాల్కం X ఇస్లాంను లోతుగా పరిశీలించిన తరువాత అతను మక్కా యాత్రకు వెళ్లి అక్కడ తన అనుభవాలను పంచుకుంటూ రాసిన లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *