తాము అహేతుక ఆచారాలను, అణచివేతను ప్రశ్నించటానికి బయలుదేరిన అభ్యుదయవాదులమన్నట్టు ఫీలయ్యే కొందరు సోకాల్డ్ అభ్యుదయ వాదులు ఈ మధ్యకాలంలో ఫెస్బుక్ లో హిజాబ్ అంశంపై నానా రభస చేస్తూ లేవనెతున్న ప్రశ్నలు ఇలా ఉన్నాయి:
ప్రశ్నలు/సమాధానాలు:
1. “మతవిశ్వాసాల సమర్ధనతో చేసే ఏ అణచివేతను బట్టైనా ఆ మొత్తం మతాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు? అణచివేత ఏ స్థాయిలో ఉన్నా ప్రశించవచ్చు”
ఎందుకు ప్రశ్నించకూడదు ప్రశ్నించవచ్చు. కానీ ఏ వర్గంలో అయినా కొందరు చేసే తప్పును మొత్తం వర్గాన్ని బాధ్యులుగా చెయ్యవచ్చని ఏ చట్టం చెబుతుంది? అంతకంటే ముందు అణచివేతకు గురికాబడుతున్నారని ఎవరి గురించైతే చెబుతున్నారో వారు నిజంగా మతవిశ్వాసాల సమర్ధనతో వివక్షకు గురౌతున్న బాధితులా? వారు ఏ మేరకు ఎంతకాలం నుండి అణచివేతకు గురికాబడుతున్నారు? అన్న విషయాలపై బాధితులనే స్వయంగా అడిగి ఓ సర్వే నిర్వహించాలి. నిజంగా వారంతా “అవును మేము తరతరాలుగా అణచి వెయ్యబడుతున్నాం” అని చెబితే కచ్చితంగా వారితరఫున వకాల్తా పుచ్చుకుని ప్రశ్నించటంలో తప్పులేదు. కానీ ఫలానా విశ్వాసాన్ని వారు మసస్పూర్తిగా ఆచరిస్తున్నప్పటికీ తమ సోకాల్డ్ అభ్యుదయవాదం కొద్దీ దానిని వివక్ష/అణచివేత అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. మరీ ముఖ్యంగా అతి ప్రధానంగా తెలుసుకోవలసింది- “బలవంతంగా ఏ విశ్వాసాన్నైనా సామూహికంగా అనుసరిపజేయటం అసాధ్యం. తమను అణచివేతకు గురిచేసే ఎటువంటి విశ్వాసాన్నైనా ప్రజలు తరతరాలుగా అనుసరించటం మరింత అసాధ్యం” అలాంటి విశ్వాసం ఒక తరంతోనే అంతమొందుతుంది
***
2. “ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి మతాన్నైనా విమర్శించే, లోపాలను ఎత్తి చూపే హక్కు వుంటుంది. అదే లేదంటే ఈ సమాజంలో మతం పేరిట జరుగుతున్న అమానుషకాండకు వ్యతిరేకంగా సదరు పీడితులే పోరాడాల్సి వుంటుంది”
ముస్లిం సమాజంలో స్త్రీలు తమపై హిజాబ్ పేరుతో జరుగుతున్న వివక్ష, అణచివేతను భరిస్తూ కుక్కిన పేనుల్లా ఏమీ మాట్లాడలేక పడి ఉన్నారా? ప్రపంచ ముస్లిం మహిళలంతా కలసి గత 1400 సం.లుగా హిజాబ్ ధరించటాన్ని ఇష్టంగా ఆచరిస్తూ.. “వరల్డ్ హిజాబ్ డే (World Hijab day)” అని ఒక రోజును సెలబ్రషన్ గా చేసుకుంటున్న నేపథ్యంలో దానిని అమానుషకాండ అని ఏ బేసిస్ మీద తేల్చటం సాధ్యమవుతుంది? అది నిజంగా అణచివేత, అమానుష చర్యే అయితే చరిత్రలో గొప్ప గొప్ప ఉధ్యమాల నుండి షాహిన్ బాగ్ ఉద్యమం వరకు పోరాటాలు చేసిన ముస్లిం మహిళలు తమపై జరుగుతున్న పీడనకు, వివక్షకు, అణచివేతకు నేటి సోకాల్డ్ అభ్యుదవాదుల కంటే ముందే గత 1400 ఏళ్ల సుదీర్గ కాలంలో పోరాటం లేవనెత్తేవారు కాదా? నేడు గొప్ప పదవులో ఉన్నత స్థానాల్లో ఉన్న ముస్లిం మహిళలు తమ బాధ్యతలను హిజాబ్ లో ఉంటూనే నిర్వహించటం లేదా?
***
3. “లింగ వివక్ష గురించి స్త్రీలే మాట్లాడాలా? లింగ వివక్ష లేదని పురుషులు సర్టిఫై చెయ్యవచ్చా?”
పోనీ, లింగ వివక్ష ఉందని పురుషులు సర్టిఫై చెయ్యవచ్చా? నిజంగా ముస్లిం స్త్రీలే లింగ వివక్షకు గురై ఉంటే’ అందరికంటే వారే ఎప్పుడో మాట్లాడేవారు కదా? “పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి” “మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది” అని స్వయంగా ఖురానే చెబుతున్నప్పుడు… ఈ నాలెడ్జ్ లేకుండా రివర్స్ లో మూఢ విశ్వాసాల జాబితాలో హిజాబ్ ను చేర్చి దానిని అమానుష చర్య, ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందన్నప్పుడు ధార్మిక గ్రంథాల విశాల దృక్పథాల అవగాహన ఉన్న ఏ ముస్లిం స్త్రీ/పురుషుడైనా ఎందుకు మాట్లాడకూడదు?
***
4. “అణచివేయబడుతున్న, హింసించబడుతున్న స్త్రీల సమస్యల పట్ల స్త్రీలే పోరాడతారు మధ్యలో ఎవరూ మాట్లడకూడదంటే ఎలా?”
కచ్చితంగా మాటలాడవచ్చు. ముందు ఎవరైతే అణచివేతకు గురౌతున్నారని చెబుతున్నారో వారు కనీసం ఎప్పుడైనా గొంతెత్తి ఉండాలి కదా? లేదా నిజంగా హిజాబ్ కారణంగా అణచివేతకు గురౌతుంటే వారితో కనీసం డైరెక్టుగా మాట్లాడి అందులో ఎంత శాతం ముస్లిం స్త్రీలు తాము వివక్షకు, అణచివేతకు గురౌతున్నామని చెప్పారో ఓ సర్వే రిపోర్ట్ తయారు చేసి అప్పుడు వారి తరఫున మాట్లాడటం సబబు అవుతుంది. ఇస్లామోఫోబియా తాలూకు సాహిత్యంలో స్త్రీల వివక్ష, అణచివేత గురించి రాయబడ్డ గాసిప్ సమాచారంపై ఆధారపడి నేటి సోకాల్డ్ అభ్యుదవాదులు హిజాబ్ ముస్లిం స్త్రీల సమస్య, అణచివేత అన్నట్టు ప్రొజెక్ట్ చెయ్యటం అసలు అమానుషం అవుతుంది. పైగా ముస్లిం స్త్రీలు హిజాబ్ పేరుతో అణచివేతకు గురౌతున్నారని చెప్పటం ముస్లిం పురుషులను అణచివేతకు గురిచేసే క్రూరులని నిందించటమే అవుతుంది. ఇది మరింత అమానుషం
***
5. “మీ గ్రంథంలో నీతిని గురించి క్లైమ్ చేసుకునేటప్పుడు అదే గ్రంథంలో వివక్షా/అణచివేతను సమర్థించే భాగాన్ని తీసివేసి మీ గ్రంథంలో ఉన్న లోపాన్ని సరిచేసుకోండి”
ఇలా మాట్లాడేవారికి ఒకప్పుడు మూఢ మత విశ్వాసాల కారణంగా స్త్రీలపై జరిగే అమానుష కాండ నుండి ఖురాన్/ఇస్లాం విముక్తి కలిగించి వారిని అణచివేత నుండి బయటపడవేసిందన్న విషయం తెలియనప్పుడు ఒక్క హిజాబే కాదు ఉపవాసం, నమాజ్, హజ్ ఇలా ప్రతీ క్రతువును అణచివేతగానే కనపడినా ఆశ్చర్యపడనక్కర్లేదు. నిజంగా ఖురాన్ గ్రంథంలో అణచివేతకు గురిచేసే ఒక భాగం ఉందనుకుంటే నేడు ప్రాశ్చాత్య దేశాల్లో ఇస్లాం పట్ల ఆకర్షితులౌతున్న ఎందరో మేధావులు, శాత్రవేత్తలు, పరిశోధకులైన గొప్ప గొప్ప విధ్యావేత్తల్లో ముస్లిమేతర స్త్రీలే ఉన్నారు కదా.
***
6. “మీరు ఇతర మతాలలో ఉన్న లోపాల గురించి సమస్యల గురించి మాట్లాడతారు మేము మీ మతంలో ఉన్న లోపం గురించి మాట్లాడితే తప్పా?”
ఏ బేసిస్ మీద లోపం అని నిర్ణయిస్తారు? ధార్మిక గ్రంథాల ఆధారంగానా? వాటిని మీరు నమ్మరు? పోనీ మీరేమన్నా సర్వే చేశారా? లేదు. కాబట్టి మీరు గడ్డితినగా లేనిది మేము తినటంలో అన్నచందంగా ఉండకూడదు కదా వాదన అంటే. నిజంగా హిజాబ్ మీరు గొంతు చించుకునేంత లోపమైనదైతే అది ముస్లిముల సమస్య అయి ఉంటే.. ప్రపంచంలో 1.8 బిలియన్ల ముస్లిం జనాభాలో కోట్ల కొద్దీ స్త్రీలు ఎప్పుడో తమపై అణచివేతకు గురిచేసే ముఢాచారం పట్ల గొంతు లేవనెత్తేవారు. కాలగర్భంలో ఎప్పుడో అనేక దురాచారాలు సమసిపోయినట్టే హిజాబ్ అన్నది ఎప్పుడో కనుమరుగయ్యేది. కాబట్టి హిజాబ్ ఆచారాన్ని పాటించటంలో వారికి లేని నొప్పిని తాము అనుభవిస్తూ.. వారికి లేని సమస్యను తాము సృష్టించుకుని తమ సోకాల్డ్ అభ్యుదవాదాన్ని ప్రూవ్ చేసుకోవటాన్ని బట్టి వారి అభ్యుదయవాదంలో డొల్లతనం ఏమిటో బయటపడుతుంది
చివరిమాట…
మేము అనేక దేశ సమస్యలపై పోరాడేటప్పుడు హిజాబ్ పై చర్చిస్తే తప్పేంటి? అని ప్రశ్నించే అభ్యుదయవాదులు తెలుసుకోవలసింది ఇదేమీ దేశ సమస్యా కాదు. హిజాబ్ ను ధరించేవారు దానిని ఓ సమస్యగానూ భావించటం లేదు.
ధార్మిక గ్రంథాలైన వేదోపనిషత్తులు, గీతా, బైబిల్, ఖురాన్ శాస్త్రాల విశాల దృక్పథాలను పరిశీలిస్తే నేటి సమాజంలో ఉన్న మతవ్యవస్థలో ముఢాచారాలకు, శాస్త్రాల ధర్మానికీ పొంతన ఉండదన్నది తేలిపోతుంది. కాబట్టి ఆస్తికుల్లో ఏదైనా లోపం కనపడినప్పుడు ధార్మిక గ్రంథాల ఆధారంగా సంస్కరింటం సాధ్యమవుతుంది. కానీ, సమస్య ఏమిటంటే ఆ గ్రంథాలను నమ్మని నాస్తికులు మతవ్యవస్థపై విమర్శలు లేవనెత్తినప్పుడు వారికి ధార్మిక గ్రంథాల ఆధారంగా చెబితే వాటిని మూఢ గ్రంథాలుగా, వాటి ఆధారంగా మాట్లాడేవారిని “మతఛాందసవాదులు”గా పరిగణిస్తుంటారు. కాబట్టి ధార్మిక గ్రంథాల అంశాలపై నాస్తికులు వాదించటం ఎలాంటిదంటే ‘అనాటమీ’ సబ్జెక్ట్ మీద ‘బోటనీ’ స్టూడెంట్ వాదించటం లాంటిదన్నమాట. అతనికి ఆ సబ్జెక్ట్ తెలీదు చెప్పినా బుర్రకెక్కదు. ఇప్పుడు హిజాబ్ పై ఖురాన్ అవగాహన ఉన్న ముస్లిములకు, నాస్తికులకు మధ్య అచ్చం అలాంటి వాదనే జరుగుతుంది
సోకాల్డ్ అభ్యుదయవాదుల బురఖాపై రభస
